సాహితి

అక్షర సేద్యంలో అలుపెరుగని కృషీవలుడు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సంక్లిష్టమైన రాజకీయ వ్యవస్థ రాజ్యమేలుతున్న దేశంలో కులాలు, మతాలు, వర్గాలు, జాతుల మధ్య నిత్య సంఘర్షణ జరిగే సమాజంలో లౌకికవాదం పేరుతో అరాచకవాదం పెచ్చుమీరిన రాజ్యంలో నిశ్చలంగా, నిర్భయంగా జాతీయ వాదానికి కట్టుబడి నిన్నటికీ, రేపటికీ సమతూకం వేస్తూ, దినపత్రిక సంపాదకత్వంతోపాటు, భాష, సాహిత్య, చరిత్ర పరిశోధనారంగాల్లో విశేషంగా అలుపెరుగని అక్షర పోరు సల్పుతున్న బహుముఖీన ప్రజ్ఞావంతులు ఎంవిఆర్ శాస్ర్తీ. తాను ఎంచుకున్న ఏ అంశాన్నైనా సునిశితంగా పరిశీలించి, పరిశోధించి నిక్కచ్చిగా, నిర్మొహమాటంగా అభివ్యక్తీకరించటం కత్తుల వంతెనమీది ప్రయాణం. దాదాపు నాలుగు దశాబ్దాల పాత్రికేయ ప్రస్థానంలో సంపాదకుడి నుంచి భారత దేశ చరిత్రపై సాధికారత ఉన్న వ్యక్తిగా ఆయన చేసిన కృషికి అప్పాజోస్యుల విష్ణ్భుట్ల కందాళం ఫౌండేషన్ జీవిత కాల సాధన పురస్కారాన్ని ఆదివారం (8జనవరి, 2017) విశాఖపట్నం జిల్లా పాయకరావుపేట వేదికగా అందించింది. ఈ సందర్భంగా ఎంవిఆర్ రచించిన పదమూడు గ్రంథాలు, వృత్తి పరంగా చేసిన కృషిపై నిర్వహించిన సమాలోచన సదస్సు ఆయన వ్యక్తిత్వాన్ని, ప్రతిభను సంపూర్ణంగా ఆవిష్కరించింది. ఈ సదస్సుకు ప్రఖ్యాత సాహిత్యవేత్త డాక్టర్ ఓలేటి పార్వతీశం అధ్యక్షత వహించటం మరింత శోభను చేకూర్చింది. తీరిక లేని సంపాదకత్వ వేళల్లో కూడా సమయాన్ని కొంతవరకైనా కుదుర్చుకుని రచనలు చేయటం సామాన్యమైన విషయం కాదు. అది కూడా భారతదేశ చరిత్రకు సంబంధించిన అనేక అంశాలను కూలంకషంగా పరిశోధించి, లోతుగా అధ్యయనం చేసి పూర్తి సాధికారికంగా నిష్కర్షగా అభివ్యక్తం చేయగలిగిన సామర్థ్యం ఉండటం అనేది అనేకమందికి స్ఫూర్తిదాయకమైందంటూ పార్వతీశం చేసిన వ్యాఖ్యానం ఎంతైనా సబబైనది. ఈసదస్సులో విస్తారంగా ప్రస్తావనకు వచ్చిన అంశం ఆయన భాష, శైలి. ఎంత తీవ్రమైన అంశాన్నైనా తనదైన చమత్కారంతో, చురకలు అంటిస్తూ, వ్యంగ్యోక్తులు విసురుతూ రాయడం తెలుగు పాత్రికేయుల్లో అరుదైన విషయమనటంలో సందేహం లేదు. ఈ విషయానే్న రచయిత్రి హైమా భార్గవ్ విశే్లషించారు. కాలమిస్టుగా ఎంవిఆర్ శాస్ర్తీ విశిష్టతను ఆమె పరిపూర్ణంగా ఆవిష్కరించారు. ఉన్నమాట, వీక్‌పాయింట్ కాలమ్‌లు దేనికదే సాటి అని, ఆయన కాలమ్స్ చదివే పాఠకులు లక్షల్లో ఉన్నారని ఆమె వివరించిన తీరులో ఎంతమాత్రం అతిశయోక్తి లేదు. వీటికి ఉన్న పాఠకాదరణ అసాధారణమైందనటంలో అత్యుక్తి లేదు.
భారతీయ చరిత్రకు సంబంధించిన అంశాలను ఒక స్పష్టమైన లక్ష్యంతో రచించి, ఈ దేశానికి అసలు చరిత్రే లేదన్నవారి వాదనలన్నీ తన కలంపోటుతో తుత్తునియలు చేసిన శాస్ర్తీగారి రచనాశైలిపై మరో సాహిత్యవేత్త అంబటి మురళీకృష్ణ చేసిన వ్యాఖ్యానం, శాస్ర్తీగారి చరిత్ర శోధనలోని విభిన్న కోణాలను విశే్లషించిన విధానం అద్భుతం. దేశంలో ఏ జాతీయవాద చరిత్రకారుడూ చేయని పనిని ఎంవిఆర్ శాస్ర్తీ చేశారు. ఆయన చారిత్రక రచనలను విశే్లషించటం ఎవరికైనా అంత తేలికైన పని కాదు. నిజంగా ఇలా జరిగిందా అన్నరీతిలో అరుదైన ఆధారాలను వెతికి పట్టుకుని, దేనికీ వెరవకుండా వాటిని పాఠకుల ముందు నిర్భీతిగా ఉంచిన మేధ ఆయనదని మురళీకృష్ణ అభిప్రాయం. ఏది చరిత్ర, ఇదీ చరిత్ర, మన మహాత్ముడు వంటి రచనలను సాధికారికంగా వెలువరించిన తీరును మురళీకృష్ణ వివరించారు. అప్పటివరకూ చెలరేగిపోయిన కుహనా లౌకికవాదుల వాదనలను పూర్తిగా తిప్పికొట్టి, తాను రాసిందే నిజమని ఎంవిఆర్ శాస్ర్తీ కుండబద్దలు కొట్టారని మురళీకృష్ణ వ్యాఖ్యానించారు. సీనియర్ పాత్రికేయుడు, తెలంగాణ విశ్వవిద్యాలయం కమ్యూనికేషన్ల శాఖాధిపతి డాక్టర్ కంకటి రాజారాం ఎంవిఆర్ విలక్షణత్వాన్ని వివరించారు. వామపక్ష భావజాలం మాత్రమే సరైనదని నమ్మే కాలంలో జాతీయ భావాన్ని ఎలుగెత్తి చాటి, రైటిజమే రైట్ అని చెప్పి అదే తన ‘రైట్’ అని విస్పష్టంగా చెప్పినవాడు ఎంవిఆర్ అని రాజారాం పేర్కొన్నారు. కుహనా లౌకికవాదాన్ని తూర్పారబట్టి దేశభక్తి, ధర్మాన్ని కాపాడేందుకు పోరాటం చేయటం సామాన్యమైన విషయమేం కాదు. జాతీయవాదం గురించి మాట్లాడటం ఛాందసవాదం ఎంతమాత్రం కాదని తేల్చిచెప్పిన జర్నలిస్టు ఎవరైనా ఉన్నారా అంటే ఆయన ఎంవిఆర్ మాత్రమేనన్నది రాజారాం ప్రసంగంలోని ప్రధానాంశం. దాదాపు అరవై గ్రంథాలను అధ్యయనం చేశాక కానీ ఆయన రచన ‘ఆంధ్రుల చరిత్ర’ పుస్తకరూపంలోకి రాలేదు. ఈ అంశాన్ని సాహిత్యవేత్త పన్యాల అంజిరెడ్డి వివరించిన తీరు తెలుగువారిలో ఎంవిఆర్ ప్రేరణకు దర్పణం పడుతుంది. ఎంతో లోతైన వివేచనతో తెలుగువారి చరిత్రలోని కీలక ఘట్టాలను ఈ రచనలో ఆయన ఆవిష్కరించారు. రెండు రాష్ట్రాల తెలుగువారిని ఇది ప్రభావితం చేసే గ్రంథం అని, ప్రతి తెలుగువాడూ ఈ గ్రంథాన్ని చదివి తీరాలని అంజిరెడ్డి పేర్కొన్నారు. ముఖ్యంగా ఎంవిఆర్ రచనాశైలి అసాధారణమైనది, చదవడం మొదలెడితే సెలయేటి ప్రవాహంలా అలా సాగిపోతూనే ఉంటుంది. తాను చెప్పాల్సిన విషయాలను నిర్భీతిగా చెప్పటం ద్వారా కొన్ని తరాల వరకూ జర్నలిస్టులకు స్ఫూర్తిదాయకంగా నిలిచిన వ్యక్తి ఆయన. శాస్ర్తీగారి సాంస్కృతిక దృక్పథం జాతీయవాదులందరికీ ఆచరణీయమన్నది దర్శనం పత్రిక సంపాదకులు ఎం.వెంకటరమణ శర్మ అభిప్రాయం. తాను చెప్పదలచుకున్నది తన రచనల ద్వారా వ్యక్తం చేయటం తప్ప సన్మానాలు, సత్కారాలకు, పురస్కారాలకు ఇష్టపడని శాస్ర్తీకి ధార్మికవరేణ్య బిరుదు సార్థకమైనదని వెంకటరమణ శర్మ అన్నారు. సీనియర్ పాత్రికేయులు పివి రమణారావు తన స్వీయ అనుభవాల ద్వారా ఎంవిఆర్ వ్యక్తిత్వాన్ని ఈ సదస్సులో ఆవిష్కరించారు. ఒక రచయితగా, పాత్రికేయుడిగా, సంపాదకుడిగా క్రమశిక్షణతో కూడిన ఆయన జీవితాన్ని సభికుల ముందుంచారు. వృత్తిపరంగా ఎదురయ్యే సమస్యలను ఎంవిఆర్ పరిష్కరించే తీరును ఆయన కళ్లకు కట్టారు. రెండు తెలుగు రాష్ట్రాల నుంచి వచ్చిన ఆరుగురు ప్రముఖులు ఎంవిఆర్ కృషిపై వివిధ కోణాల్లో సమాలోచన చేశారు. అజోవిభో కందాళం ఫౌండేషన్ 24వ సాహితీ సాంస్కృతిక సదస్సు ఎంవిఆర్ శాస్ర్తీ ప్రతిభావ్యుత్పత్తులను ఆవిష్కరించింది. సమగ్రమైన అధ్యయనం, నిబద్ధతతో కూడిన వక్తలు చేసిన ప్రసంగాలు ఈ సదస్సును గుర్తుండిపోయే జ్ఞాపకంగా నిలబెట్టాయి.

చిత్రం..విశాఖపట్నం జిల్లా పాయకరావుపేటలో ఆదివారం జరిగిన ‘ఆంధ్రభూమి సంపాదకులు ఎంవిఆర్ శాస్ర్తి కృషి సమాలోచన సదస్సు’లో ప్రసంగిస్తున్న ప్రఖ్యాత సాహిత్యవేత్త డాక్టర్ ఓలేటి పార్వతీశం. చిత్రంలో హైమా భార్గవ్, పి.వి. రమణారావు, ఎం.వి.ఆర్.శర్మ, పన్యాల అంజిరెడ్డి, కె. రాజారాం, అంబటి మురళీకృష్ణ.

- జి. బాలశ్రీనివాస మూర్తి 9866917227