సాహితి

కథల కోహినూర్ చాసో

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అర్థోక్తి, అర్థయుక్తి గల శీర్షికలు తమ కథలకు పెట్టడంలో తెలుగు రచయితలు విలక్షణ ప్రతిభ కలిగి ఉన్నారు. గురజాడ, శ్రీపాద వంటి వారికి ఈ శక్తి ఉన్నది. తన తొలి తెలుగు కథకు ‘దిద్దుబాటు’ అని పేరు పెట్టిన గురజాడ, ఆ ఎనిమిది వందల మాటలలోపు చిన్న రచనలో చేసిన దిద్దుబాట్లు కథన రీతిలోనూ, అలాగే కథ ద్వారానూ కూడా. తన భాషకు గ్రాంధిక ఛాయలు ఉంటే, ఆధునిక కథకు అవి సరిపోవు అన్న ఎరుకతో, తాను కథను వ్యవహారిక భాషలోకి మారుస్తూ చేసిన దిద్దుబాట్లు, గురజాడ, రెండుసార్లు రాసిన ఈ కథలో కనిపిస్తాయి. అలాగే, కమలిని, పై తిరుగుళ్ళకు తరలుతున్న భర్త గోపాలరావు ప్రవర్తనలో తెచ్చిన కోర్స్ కరెక్షన్ కూడా ఒక దిద్దుబాటు. ఇలాగే, శ్రీపాద తన కథకు ‘తాపీ మేస్ర్తి రామదీక్షితులు బి.య్యే’ అని పేరు పెట్టడంలో ఒక సమాజ స్థితిగతులను క్లుప్తీకరించి ఒక పేరుగా మార్చారు. అవటానికి అగ్ర కులస్తుడు, ఛాందస ఆచారపరుడు కాదు, చదువుకున్నవాడు. అయినా ఉద్యోగం లేదు. అందువల్ల, తాపీ మేస్ర్తి పనిచేస్తున్నాడు అన్న సామాజిక దశ అంతా ఒక్క శీర్షికలో వచ్చేలా కథకు పేరుపెట్టడం శ్రీపాదవారి ప్రతిభ. తెలుగు కథలకు బెంగాలీ పేర్లు కూడా ‘శుభకే శిర్ అరోహ’ వంటివి శ్రీపాద స్థిరపరిచారు. వారి కథ ‘గులాబీ అత్తరు’ వాసన, ఇప్పటికీ పెద్దాపురం కోట దరిదాపుల్లో, గుప్పుమంటూ ఉంటుంది అని అత్తరు సాయిబు ఎంతకీ ప్రభువు దర్శనం దొరకక, తాను వారికి సమర్పిద్దామని తెచ్చిన శ్రేష్టమైన అత్తరు బుడ్డీ. ఆ కోట గోడలకు వేసి కొట్టి తన నిరసన తెలిపిన సంగతి, ఒకనాటి సుమతీ శతకకారుడి సుప్రసిద్ధ చరణ శాసనం ‘అధికార బధిరాంధిక శవములు’ అన్న నిరసనను సమానంగా గుర్తుచేస్తుంది.
జనవరి 17న 102వ పుట్టినరోజు, విజయనగరంలో, తన కుమార్తె, సాహితీవేత్త డా. చాగంటి తులసి, రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చిన 11 లక్షల మ్యాచింగ్ గ్రాంట్‌తో, మొత్తం ముప్ఫై మూడు లక్షల ఖర్చుతో కొత్తగా, జిల్లా గ్రంథాలయం మొదటి అంతస్తులో సుమారు రెండువేల చదరపు అడుగుల మీటింగ్ హాల్‌లో జరుగుతోంది. ఈ కీర్తికాయుడు చాసో తన కథలను వజ్ర సమానంగా చెక్కాడు. వజ్రాలు ఎప్పటికీ నిలిచే ఉంటాయి. ఈ వజ్రపు పనివాడు అమర్చిన, జీవస్పందనలు కలిగిన కహానీల కోహినూర్లు పదుల సంఖ్యలో ఉన్నాయి. ప్రతి కథా ఒక డిజైనర్ ప్రొడక్ట్. మళ్లీ అటువంటిది దొరకదు. ఒక్కటే నేస్తారు మరి. చాసో కూడా, తన కథలలోని సంభాషణా శకలాలను తన కథలకు పేర్లుగా ఉంచాడు. ఇది తన కాలానికి లేని ఒక కొత్తదనం. ఈ కథా శీర్షికలు, కథను తమ గుప్పిట్లో మూసి ఉంచుతాయి. ఆ కథ చదవడం అంటే ఆ గుప్పిట్లోకి మనం వెళ్లడమే చాసో కథలు లోగొంతులో పిలిచే రసాల గూళ్ళు.
చాసో రాసిన దాదాపు అర వంద కథలు, ఒక జీవితకాలపు ఉత్పత్తి. దాదాపు నలభై ఏళ్ళ సాహిత్య జీవితంలో చాసో యాభై కథలు మాత్రమే రాసిన వాస్తవం చూస్తే, నాణ్యత, నవ్యత, క్లుప్తత వంటి విషయాల్లో రాజీ పడని వర్క్‌షాప్ ఈయన మనఃకార్మిక శాల. 1943 మేలో రాసిన ఒక కథ పేరు - ‘ఏలూరెళ్లాలి’. ఇది ఆ కథలో ఒక పాత్ర స్వగతం. ఎక్కడ ఈ పాత్ర ఇలా తలపోస్తుంది అంటే ఏలూరు స్టేషన్‌లోనే. ఏలూరు స్టేషన్‌లో నిలబడి, ఏలూరెళ్లాలి అనుకోవడం ఏమిటి? తెలియాలంటే, మనం ఈ కథ చదవాలి. చదివితేనే, అదీ జాగ్రత్తగా చదివితేనే, కథ, నిడదవోలు జంక్షన్‌లో ఒక రైలు బోగీలో మొదలైందనీ, కథ ఏలూరు స్టేషన్‌కు బండి రాగానే ముగిసిందనీ తెలుస్తుంది. బహుశా చాసో రాసిన కథల్లో తక్కువ కథాకాలం గల కథ ఇదే. సంభాషణలు కూడా కత్తిపదును (రేజర్ షార్ప్ అంటారు ఆంగ్లంలో)తో ఉంటాయి. పరిచయమైన రెండు పాత్ర లు ఒకరు స్ర్తి, మరొకరు మగవాడు. ఆమె ప్రశ్న- ఎంద రు పిల్లలు? ఇద్దరు అంటాడు తాను. మీ ఆవిడకు ఇద్ద రు, నీకు ముగ్గురు అంటుంది స్ర్తి పాత్ర. ఎలా ఈ కథ చదవకుండా వదలగలం? అందుకే అది చాసో కథ.
‘చెప్పకు చెప్పకు’ (సెప్టెంబర్ 1978లో రాసినది) మరో కథకు చాసో పెట్టిన పేరు. ఇదొక నీతిమంతుడి ఆక్రోశం. అవినీతిగా, అవకాశాల దారిలో సుఖ భోగాలిచ్చే జీవితాలకు అలవాటుపడ్డ, తన కుటుంబ సభ్యు లు ఎవరో కాదు, తల్లీ, తమ్ముడూ, చెల్లీ, తాము నడుస్తున్న దారి మానుకోమని ఈ పెద్ద కొడుకు ఎంత చెప్పినా వినకుండా, తమ దారిన పయనిస్తూ, ఒక ఐశ్వర్యం నుంచి మరొక ఐశ్వర్యానికి, ముందర తల్లీ, ఇప్పుడు చెల్లీ, ఒకే మగవానితో ఉంటూ పొందుతున్న సంపదల గురించి, తాము కొత్తగా మారిన ఇల్లు చిరునామా ఆ తమ్ముడు చెప్పబోగా, ఆపుతున్న అన్నయ్య ఆక్రోశం ఇది ‘చెప్పకు, చెప్పకు’. కథకుడు ఎవరి పక్షాన ఈ కథ చెప్తున్నదీ మనకు స్పష్టమే.
1944 మేలో చాసో రాసిన కథకు పేరుకు ‘ఎందుకు పారేస్తాను నాన్నా’, ఇది మరొక లీడింగ్ శీర్షిక. చదువు ల్లో మంచి మార్కులు వస్తున్న ఎనిమిదో తరగతి కొడుకును ఇకపై చదువులకు తాము తూగలేము అని చదువు మాన్పించి చుట్టలు కొనుక్కు రమ్మని తండ్రి కొంత డబ్బు ఇచ్చి పంపిస్తాడు. ఆ పిల్లవాడు, ఆ బడ్డీ షాపుకు వెళ్లకుండా, స్కూల్ ఎదుట నిలబడి ఉంటాడు. పరీక్ష పాస్ అయి, కొత్త సంవత్సరం చదువులకు స్కూల్ కు పోతున్న తన నేస్తాలయిన పిల్లలతో మాటా మంతీ కలిపి, కొత్త పుస్తకాలలో ఏం ఉన్నదీ తెలుసుకుం టూ ఉంటాడు. తాను స్కూల్‌కు రాలేనని, తండ్రి చదువులు మాన్పిస్తున్నాడని చెప్పలేక, అక్కడే గుడ్ల నీరు కుక్కుకుని నిలబడతాడు. ఎంతకీ రాని ఈ కొడుకు ఎక్కడికి పోయాడో అని వెతుక్కుంటూ వచ్చిన తండ్రికి స్కూల్ ముందర కనిపిస్తాడు కొడుకు. చదువులంటే వాడికి గల ఇష్టం, శ్రద్ధ గమనించిన తండ్రి, తాను చుట్టలు మానేస్తే, పిల్లవాడిని చదివించవచ్చు గదా, అని తలిచి, ఎలాగైనా స్కూల్‌కు వెళ్తాను అంటున్న వాడిని బుజ్జగిస్తూ అడుగుతాడు. ఇందాక చుట్టలకని ఇచ్చిన డబ్బులు ఉన్నాయా? అని. అప్పుడు కొడుకు జవాబు ‘ఎందుకు పారేస్తాను నాన్నా?’.
పైన చెప్పినవే కాక బబ్బబ్బా (1943), పోనీ తిను (తేదీ లేదు, అచ్చైంది ప్రభవలో), లేడీ కరుణాకరం (1945), ఆ హా హా (1969), ఊళ్ళో వాన లేదు (1978) - ఈ కథల పేర్లన్నీ, కథలలో వచ్చిన మాటల దొంతరలే. తన కథల మీద సరైన విమర్శ రాలేదు అన్నారు చాసో. స్ర్తిలు కట్టుబాట్లు దాటి స్వేచ్ఛగా ప్రవర్తించిన కథలు రాసిన చాసోను ఆ కథలలో గల స్ర్తి విశృంఖలత గురించి అడగగా, ఆ కథలు ఆ ఉద్దేశంతో రాయలేదు అని జవాబిచ్చారు. తనకు నచ్చిన కథకుల పేర్లు చెప్పమన్నప్పుడు చాసో చేసిన ఎంపిక, ఆయన ఎంత తీరైన కథల కాపరో మనకు తెలుపుతుంది. ఆయన 1985లో ఒక ముఖాముఖిలో చెప్పినవి ఇవి. చాసో టక్కున చెప్పిన ఓ డజను గొప్ప తెలుగు కథలు - ‘గురజాడవి మూడు, శ్రీపాదవి రెండు, చలానివి నాలుగు, కుటుంబరావు, కరుణకుమార రెండేసి, పద్మరాజు, బుచ్చిబాబు, రావిశాస్ర్తీ, కాళీపట్నం, సి.రామచంద్రరావు, పూసపాటి కృష్ణంరాజు, ఒక్కొక్కటి.’’ రచయితగా తన మీద తన అంచనా. ‘‘నాకు నేనే విమర్శకుడ్ని. నచ్చకపోతే చించి పారేయటం ఈనాటికీ అలవాటు. సంపూర్ణమైన ఆత్మవిశ్వాసం గల రచయితని’. అందుకే ఇరవయ్యో శతాబ్దపు తెలుగు కథావికాసంలో చాసో ఒక గంట స్తంభం. తెలుగు కథ గౌరవార్థం విజయనగరంలో చాసో సాహి తీ వేదిక వద్ద, కోట కూడలిలో రాష్ట్ర ప్రభుత్వం చాసో విగ్రహం ఏర్పాటుచేయడం సముచితం.
సుమారు యాభైఏళ్ల ముందర చాసో కథలు రెండవ కూర్పుకు 1968 ఆగస్టులో ముందుమాట రాసిన సుశర్మ ఇలా అన్నారు. ‘చాసోకి కీర్తి కాంక్ష లేదు. తనని, తన కథలని పొగడాలనే కోరికా లేదు. ఈ విడ్డూరమైన పరిస్థితి సాహితీపరులలో ఉండనే ఉండదు. అనేక పత్రికలలో ప్రచురించిన కథలు ఆయా పత్రికలలో విడిచిపెట్టి, పుస్తక రూపంలో ప్రజల ముందు పెట్టక ఉదాసీనతతో విడిచిపెట్టేశారు. వారిదగ్గర వ్రాత ప్రతులు లేవు. ఏ కథ ఏ పత్రికలో ఎన్నడు అచ్చు అయిందో ఆయనకే తెలియదు. అందుకు వారు క్షంతవ్యులు కారు. అదీకాక పుష్కరమై రచనా ఆపుచేశారు. అది కూడా క్షమింపదగ్గ పని కాదు’’. ఇంకా ఒక పరిశీలన వెలిబుచ్చారు చివరన. అష్టోత్తర శత కథానికా రచయితలలో చాసో సమానులు ముగ్గురుండటం దుర్లభం. ఈ సుశర్మ ఎవరో కాదు, ప్రఖ్యాత కథా రచయిత, విఖ్యాత సంపాదకులు పురాణం సుబ్రహ్మణ్య శర్మ.
చాసోకి గల విశాల ప్రతిభలో ఇక్కడ మనం ప్రస్తావించుకున్న వారి నూతన సంవిధాన కథా శీర్షికలు, ముందరి తరాల కథా సృజనకారులకు మార్గశీర్షికలు.
*

- రామతీర్థ, 9849200385