సాహితి

విశ్వనాథది పాషాణపాకం కాదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘‘నిష్ఠా వర్షదుదార మేఘ పటలీనిర్గచ్ఛ దుద్యోతిత
స్పేష్ఠే రమ్మద మాలికాయుగపదుజృంభన్మహా ఘోర బం
హిష్ఠ స్ఫూర్జ ధుషండ మండల రవాహీన క్రియా ప్రౌఢి ద్రా
ఘిష్ఠంబై యొకరావ మంతట నెసంగెన్ వాకిటల్ ఘోరమై’’
ఇటువంటి కొద్ది పద్యాల శైలిని బట్టి జరుక్ శాస్త్రో, మరొకరో తమాషాకి, చమత్కరానికి ‘పాషాణ పాకశైలి’ అన్నారు. ఇంకేముంది? విశ్వనాథ వ్యతిరేకులకి ఇదొక సాధనమైంది. అప్పుడప్పుడు ‘పాషాణ పాక ప్రభువు’ అని పలుకుతూ ఉంటారు. ‘తిక్కలేని వాడు తెలుగువాడెటులౌను’ అన్న నార్లవారి మాట మన సాహిత్యకారులకి చక్కగా అన్వయిస్తుంది. అధ్యయనం లేకుండా అలవోకగా వ్యాఖ్యానించడం మనవాళ్లకి అలవాటే ననడానికి ఇదొక నిదర్శనం.
పద్యరచనా శిల్పం, సందర్భౌచిత్యం, రస పోషణ, పాత్ర సన్నివేశం...వంటివి తెలిస్తే పద్య సౌందర్యం తెలుస్తుంది. పద్యశైలి ‘పిడుక్కీ బియ్యానికీ ఒకే మంత్రం’ లా ఉండదు. దీనినే శ్రీనాథుడు ‘రసాభ్యుచిత పదబంధం’ అన్నాడు. పై పద్యంలో ‘ఉద్దండ లీల’ ఉంది. వేములవాడ భీమకవి కవితా గుణమిది. విశ్వనాథ వారి రామాయణంలో శివధనుర్భంగ ఘట్టంలోనిది ఈ పద్యం. ఇందులోని పద గుంఢనం ధనుస్సు విరిగిన మహా నాదానికి అనుగుణంగా ఉంది. దీనిని ఓజో గుణాత్మక శైలి అంటారు. ఆ శివుని విల్లు అల్లాటప్పా విల్లు కాదు. అపూర్వమైన శక్తి కలది. లేకపోతే పరీక్ష పెట్టడం ఎందుకు?
నన్నయ, తిక్కన, ఎఱ్ఱన, శ్రీనాథ, పోతన...వంటి ప్రాచీన కవుల కవిత్వాన్ని పరికిస్తే ఉద్ధండ శైలిగల పద్యాలూ ఉంటాయి. మాధుర్య గుణంగల పద్యాలూ ఉంటాయి. నవరసాలకు అనుగుణంగా శైలి ఉంటుంది. సాహిత్య విమర్శకులకి ఇది ప్రాథమిక పాఠం. శ్రీశ్రీ మహాప్రస్థానంలోని కొన్ని గేయాలు కఠినంగా, ఓజోగుణంగా (పాషాణపాకంగా అనవచ్చు) ఉన్నాయి. భిక్షు వర్షీయసి, సంధ్యా సమస్యలు, నీడలు వంటి వాటిలో సరళమైన శైలి ఉంది. అది వస్తువును బట్టి రసాన్ని బట్టి అందగిస్తుంది. విశ్వనాథ వారి కవిత్వంలో ‘ఉద్దండ లీల’ వంటి శైలిమాత్రమే కాదు-సరళమైన శైలి వుంది. సహజమైన తెలుగు పలుకుబడి ఉంది. విశ్వనాథ అంటేనే తెలుగుతనం! ఆంధ్ర ప్రశస్తి, కినె్నరసాని, పంచశతి వంటివే కాదు రామాయణంలోనూ తెలుగుదనం పరిమళిస్తుంది.
‘‘ఇమ్ముగ కాకుళమ్ము మొదలీవఱకుంగల యాంధ్రపూర్వ రా
జ్యమ్ముల పేరు చెప్పిన హృదంతరమేలొ చలించిపోవు నా
ర్ధ్రమ్మగు చిత్తవృత్తులపురాభవ నిర్ణయమే నినెన్ని జ
న్మమ్ములుగాగనీ తనువునన్ ప్రవహించునొ యాంధ్ర రక్తముల్!
ఇదీ విశ్వనాథ తెలుగుదనం! ఇంతకంటే సాక్ష్యం ఏం కావాలి? విశ్వనాధ వారి రామాయణంలోనే ద్రాక్షాపాక, కదళీపాక శైలిగల పద్యాలు కొల్లలు. తెలుగు నుడికారాన్ని కుప్పలుగా పోశారు విశ్వనాథ.
విశ్వనాథవారి తెలుగు పలుకుబడికి కొన్ని ఉదాహరణలు-
‘ఎవడురావాడు?’- ‘నీ వటోరుూ’- ‘అవునిల్లలుకంగ పండుగ కాదు’- ‘ఎంతలేసి’- ‘అవునో కాదో’- ఉన్నదయ్యో’- ‘మీదుకట్టి’- ‘వార్వీరని పిల్వగా’
-ఇవన్నీ శ్రీమద్రామాయణ కల్పవృక్షంలోనివే. విశ్వనాథ వారికి ఎంత పాండిత్యం ఉన్నా వ్యావహారిక భాషా పరిజ్ఞానం అంతే వుందనిపిస్తుంది. కౌసల్య బాల రాముల సంభాషణ గల ఈ పద్యమే దీనికి సాక్ష్యం- బాల భాష పట్టు తెలిసిన కవి అని తెలుస్తుంది.
‘‘తానో లాములు, తండ్రి పేరెవరయా? దాచా తమాలాలునౌ
లే, నా పేరన ‘నమ్మగాల’ నగనోలిందల్లి కౌసల్య తండ్రీ
నాగా ననబోయి రాక కనులన్ నీర్వెట్ట కౌసల్యనౌ
గానే, కానులె, యమ్మనేయని ప్రభున్ కౌసల్య ముద్దాడినన్’’
‘ఆంధ్ర ప్రశస్తి’లోని ఈ పలుకుబడులు కదళీ పాకమే!...
‘‘అయయో ఇదేమిటయా?’’/‘‘నోచుకోము గదా’’
‘‘బొడ్డు కోయని కూన’’/‘‘చటుక్కున దూసి’’
‘‘నీ చేతి మీదనె కానిమ్మదె పోవుచుంటి’’/‘‘అసలది కాదు’’
‘‘రండోసి రండు’’, ‘‘చిందులాడి’’
లంకాదహనం చేసిన హనుమంతుడ్ని రావణుడు శిక్షించబోతాడు. అప్పుడు విభీషణుడు రావణుడితో పలికిన పద్య శిల్పం చూడండి.
‘‘తాననినట్టి మాటలవి తానని నట్టివి కావు నెవ్వడో
వీనిని పంచె వానివని వీనిని వానికి శిక్ష చేతయ
స్థాన నిపాతి తంబగు తానత డెవ్వడు పంచెవీనినిన్
వానిని శిక్ష చేయవలె వాడనుమన్నవి ఈతడన్నవే’’
ఇది పాషాణ పాకమా? పోతన అంత,ఇంత అని పద్యమంతా ఎలారాశాడో వాని, వీని మాటలు ప్రయోగించి అర్ధ గాంభీర్యం తీసుకువచ్చాడు. ఎవరో అన్నట్టు పైకి గజిబిజిగా కనిపించి రావణుడ్ని అయోమయ స్థితిలో పడేసిన పద్యమిది.
‘ఇది మెచ్చెదరో మెచ్చరో?/యిది యునుజది వెదరుజదవరేలా నాక/య్యది? నాన యెద మీతోరా/చెదనద్దానికి ఫలంబు జెందించు శివా?’’
ఇదెంత మాధుర్యంగా ఉంది? చేరా గొప్పగా మెచ్చుకున్న ‘అంధ భిక్షువు’ ఖండికను మర్చిపోవడమో, ఉపేక్షించడమో అనుచితమే!
‘అతడు రైలులోనే బోయినప్పుడెల్ల/ నెక్కడో ఒకచోట దానెక్కు -వాని/అతని కూతురు నడిపించుచనుసరించు’’
ఎంత చక్కటి తెలుగు ఇది!!
విశ్వనాథ వారి కవిత్వ కళ ప్రత్యేకమైనది. అనితర సాధ్యమైనది. ‘పాషాణపాక శైలి’ ఎవరూ అనడానికి వీలులేని శాసనం ఈ పద్యం.
‘‘ఒకసారి నాలోన నూహించి యేమియో
స్ర్తివోలె సిగ్గు పొందెదను నేను
ఒకసారి యెద పొంగి యూగించిన కవివోలె
మృదుకంఠమెత్తి పాడెదను నేను
ఒకసారి హృదయమూరక బాధపడి కంటి
తుదలందు నీరు జార్చెదను నేను
ఒకసారి వీతహేతుకముగా సౌఖ్యమ్ము
విరసి పడ్డట్లు నవ్వెదను నేను.........’’
గురువైన చెళ్లపిళ్ల అన్నట్టు విశ్వనాథ కవితామార్గం విశ్వనాథ కవితామార్గమే తప్ప ఎవరిదీ కాదు. తెలుగు దనానికి, తెలుగు భాషకి, తెలుగు పద్యానికి కొత్త సొగసులద్దిన సాహితీ సార్వభౌముడు విశ్వనాథ సత్యనారాయణ!

- ద్వా.నా.శాస్ర్తీ, 9849293376