సాహితి

వలస కూలీల జీవన పోరాటం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘‘కుంభమేళా’’, ‘‘అస్తిత్వానికి అటూ ఇటూ....’’అనే రెండు కథా సంపుటాల ద్వారా పాఠకుల, విమర్శకుల ప్రశంసలనందుకున్న మధురాంతకం నరేంద్రను ఇవ్వాళ కొత్తగా మంచి రచయితగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఎప్పటికప్పుడు కొత్త కథాకథనాలతో వస్తుపరంగా, శిల్పపరంగా వైవిధ్యభరితమైన కథలు రాయడం ఆయన ప్రత్యేకత. వీరి కథలు ఎక్కువగా అస్తిత్వవాద ధోరణిలో తాత్త్విక ధోరణిని సంతరించుకుని వుంటాయి. వీటికి భిన్నంగా సామాజిక సమస్యగా మారిన వలస కూలీల దుర్భర జీవితాలను చిత్రిస్తూ ‘‘రెండేళ్ళు పద్నాలుగు’’అనే కథల సంపుటిని వెలువరించారు.
ఇవన్నీ కూలీలు, పనివాళ్ళ కథలు. ముఖ్యంగా వలస వచ్చిన కూలీల కథలు. వీళ్ళంతా ఉన్న ఊర్లో బతకలేక పట్నం వచ్చి ఏదో ఒక పని చేసుకుని బతకడానికి వచ్చినవారే. రియల్ ఎస్టేట్ రంగం పుణ్యమా అని భవన నిర్మాణాలు పుంజుకోవడంవల్ల వలసొచ్చిన వారికి ఏదో ఒక రకంగా పని దొరుకుతుంది. ముఖ్యంగా రాయలసీమ కరువుబాధితులకు ముందుగా కనిపించేది తిరుపతి. రాయలసీమలో తిరుపతి ముఖ్యపట్టణంగా విస్తరించడం, తమ ఊళ్ళకు అందుబాటులో ఉండటంవల్ల వారి చూపంతా తిరుపతి మీదే వుంటుంది.
ఊళ్ళలో వర్షాలు లేక, వ్యవసాయం సాగక చాలామంది కూలీ పనులకోసం తిరుపతికి వస్తుంటారు. కొత్తగా వలస వచ్చిన వాళ్ళకు ప్రభుత్వ స్థలాల్లో గుడిసెలు వేసి అద్దెకివ్వడం, భవిష్యత్తులో ఆ స్థలం ఇప్పిస్తామని చెప్పి రాజకీయ సభలకు వాళ్ళను తోలుకుపోవడం, ఒకవేళ ఆ స్థలం వాళ్ళకు వస్తే ఏలాగూ స్వాధీనం చేసుకోక తప్పదు. ఈ గేమ్‌లో రాజకీయ పార్టీల మధ్యవున్న వైరం, తగాదాలకు దారితీయడం మామూలే. పనివాళ్ళను తమ కబ్జాలో ఉంచుకోవడానికి మేస్ర్తిల మధ్యవున్న పోటీని ‘హరేరామ హరేకృష్ణ రోడ్డు’లో చూడవచ్చు. పల్లెల్లో వ్యవసాయం గిట్టుబాటుకాక పెద్ద రైతులు కూడా దగ్గరనున్న పట్నానికి వచ్చేస్తున్నారు. అలా తిరుపతికి వచ్చి ట్రాక్టర్లను బాడుగకు తిప్పుకుంటూ, పోటీల మధ్య బతికేస్తున్నారు. వీరమరెడ్డి కానీ, విశ్వనాథనాయుడు కానీ అలా పల్లెల్లోనుంచి బ్రతకడానికి వచ్చినవారే. ఎప్పటికప్పుడు పనులకోసం వెతుక్కుంటూ, ఆ పోటీల్లో నిలదొక్కుకోవడానికి పడరాని పాట్లు పడతారు. అయినా వారి కులాహంకారం ఎక్కడకుబోదు. లేని గొప్పలకుపోయి, పంతాలు పెంచుకుని డబ్బు పోగొట్టుకుని ఏడ్వటమొక్కటే ‘‘ప్రత్యర్థి’’లో మిగులుతుంది. వానలు లేక పొలాలు వదిలేసి మగాళ్ళు కూలీ పనులకు వచ్చేస్తున్నారు. ఆడవాళ్ళు ఉద్యోగాల పేరిట వ్యభిచారంచేసి ఇంటికి డబ్బు పంపిస్తున్నారు. ఉద్యోగస్తులైన స్ర్తిపురుషులు చాలీచాలని జీతాలతో ఇంటికి డబ్బు పంపించలేక, తమ బాగోగులు చూసుకోలేక సతమతమైపోతుంటారు. అలాంటి బాధితుల్లో ఒకరైన శేషాద్రి, సులోచనలు ఒక రాత్రి గడపడానికి వ్యభిచార కొంపకు వచ్చి పోలీసులకు దొరికిపోతారు. పదిహేను ఎకరాల రైతు అన్నీ పోగొట్టుకుని పిల్లలందరూ రెక్కలొచ్చి ఎగిరిపోతే, అన్నీ మరిచి భార్య నడిపే వ్యభిచార గృహానికొచ్చి ఆమె నీడలో వుండాల్సి రావడం మరింత విషాదం. ఈ విషాదం ‘‘హింస రచన’’లో కనిపించి హృదయాన్ని కదిలిస్తుంది.
గృహ నిర్మాణ రంగం పుంజుకోవడంతో పనివాళ్ళ కొరత ఏర్పడింది. మేస్ర్తిలు, వడ్రంగులు, ఫ్లంబర్లు, ఎలక్ట్రీషియన్లకు డిమాండ్ ఎక్కువ కావడంతో, వాళ్ళు ఒకేసారి ఎక్కువ పనులకు ఒప్పుకుంటారు. ఒకేసారి నాలుగయిదు ఇళ్ళ పని చేపట్టడంతో ఏ ఒక్కదానికి సరియైన న్యాయం చేయలేకపోతారు. ఎవరు వచ్చి ఒత్తిడిచేస్తే వారి పనే ముందుచేసి మిగతా వారితో తిట్లు తినాల్సి వస్తుంది. వీరి చుట్టూ తిరిగి వీరిని పట్టుకోలేక, వీరితో సరిగా పనిచేయించుకోలేక ఇళ్ళుకట్టించుకునేవారు పడే బాధలు వేరు. ఇబ్బంది పెడుతున్నారని వీళ్ళను తీసివేసి కొత్తవాళ్ళను పెట్టుకుందామంటే, ఒకరు మొదలుపెట్టి వదిలేసిన పని ఇంకొకడు చేపట్టడు. అదొక కట్టుబాటు. దాంతో చచ్చినట్టు ఆ పాత పనివాడినే పట్టుకుని వాడితో పనిచేయించుకోవాలి. ఇలా పనివారు వేసే వేషాలు, మోసాలు వారి అవకాశవాదాలను రచయిత చక్కగా పట్టుకోగలిగారు. ‘‘అబద్దం’’కథలో, పనికి ఒప్పుకుని డబ్బులన్నీ ముందే లాక్కుని పనిచేయకుండా ఇంటి యజమానులను తమ చుట్టూ తిప్పుకోవడం, అబద్దాలు చెప్తూ పనులెగ్గొట్టడం, కుటుంబ సంబంధాలలో కూడా ఇలా అడ్డదిడ్డంగా వ్యవహరించి అబద్దాలు చెప్పడం, మోసాలుచేయడం ఎలా మామూలయిపోతుందో వివరించారు. ‘‘నిషా’’కథలో చెక్కపని బాగాచేసే పరమేశాచారి పని చేయక, డబ్బులు మింగేసి యజమానులకు దొరక్కుండా తిరుగుతుంటాడు. పోలీసులనుండి కూడా తప్పించుకుని, ఇక ఆ వూర్లో వుండలేమని గ్రహించి, ఆ రాత్రికిరాత్రే ఇళ్ళు ఖాళీచేసి కదిరికి వెళ్ళిపోతాడు. వీడు, వీని కింద పనిచేసే వాళ్ళంతా దొంగలేనని యజమానుల అభిప్రాయం. దొంగ వేషాలు, దబాయింపులు, తాగుడు వీళ్ళ నిత్యకృత్యాలుగా మారిపోతాయి. అందుకే ఇళ్ళ యజమానులకు పనివాళ్ళంతా దొంగలన్న అభిప్రాయం స్థిరపడిపోతుంది. ఉత్తరాదినుంచి వచ్చిన వాళ్ళు ఒళ్ళొంచి పనిచేస్తారని మేస్ర్తి రంగులెయ్యడానికి నలుగురు కుర్రాళ్ళని పెడతాడు. అందులో ఒకడు కనిపించకపోతే ఇల్లుగలవాళ్ళు వాడు ఏమెత్తుకుపోయాడోనని గలభా చేస్తారు. తీరా వాడ్ని వెతికి పట్టుకుని చూసేసరికి ఖాళీ రంగుడబ్బా వాడి సామాన్లలో వుంటుంది. అదికూడా వదులుకోవడానికి ఆ ఇంటి వాళ్ళు ఇష్టపడరు. అలా ఇల్లుగలవాళ్ళ అతి జాగ్రత్తను, లోభాన్ని ‘దొంగతనం’ కథ చిత్రీకరిస్తుంది. ఎక్కడో ఉత్తరాది నుండి బతుకుతెరువుకు వచ్చిన పనివాళ్ళకు ఎప్పుడూ వాళ్ళ ఊరు, ఆ పరిసరాలు జ్ఞాపకం వస్తుంటాయి. నాలుగు డబ్బులు చేతిలో పడగానే ఊరికి వెళ్ళాలని తెగ తాపత్రయపడుతుంటారు. వాళ్ళను ఎవరూ ఆపలేరు. ఆపాలని ప్రయత్నిస్తే చంపడానికి కూడా వెనుతీయరని ‘మెరెగావ్‌కో జానా’ కథ తెలియజేస్తుంది.
పెయింటర్ దగ్గర పనిచేసే ఏకాంబరం మంచి పనివాడే కాని మేధకుడు కట్టెలకని ఫారెస్టుకుపోయి తిరిగిరాకపోతే పులి ఎత్తుకుపోయిందని బాధపడిన భార్య కిట్టమ్మ, మేస్ర్తి బాబాసామి ఇది ఫారెస్టోల్లకు, పోలీసులకు తెలిస్తే కేసవుతుందని భాయపడతారు. బాబాసామి తనకు తెలిసిన ఒక పోలీసోడిని పిలిపిస్తే వాడు వీళ్ళనే అనుమానించి రకరకాలుగా విసిగిస్తాడు. చివరకు వాడి చావుకు నష్టపరిహారం వస్తుందని చెప్పడంతో బోలెడన్ని ఆశలతో, కోరికలతో ఇంటికిపోయి చూసేసరికి హాయిగా ఏకాంబరం తన పని తాను చేసుకోవడం చూసి బిత్తరపోతారు. అన్నింటికి ‘మూల కారణం’ డబ్బేనని అన్యాపదేశంగా ఈ కథ ద్వారా తెలియజేస్తారు. ఊళ్ళో తక్కువ కులంగా చూడటం ఇష్టంలేక పంచరత్న భర్తను తీసుకుని తిరుపతికి వస్తుంది. భర్త రాజయ్య ముందు వైరింగు పని, తర్వాత మేస్ర్తిదగ్గర కూలీ పనిచేసి, చివరకు వాచ్‌మెన్‌గా కుదురుతాడు. ఆ కొత్త ఇంటివాళ్ళ ఆధిపత్యాన్ని నిరసించిన పంచరత్న వాళ్ళ పని వదిలేసి కొత్త పనికి మొగుడితో కలిసి బయలుదేరుతుంది. ఇందులో పంచరత్న ధైర్యంగల స్ర్తి. ఊళ్ళో రెడ్డి చేయి పట్టుకుంటే వా కర్రతోనే వాడి ఒళ్ళు వాయగొడుతుంది. ఆ ఊళ్ళో చులకనగా వుండలేక చాకలి వృత్తిని వదిలేసి భర్త రాజయ్యతో తిరుపతికి వస్తుంది. మొగుడు వాచ్‌మెన్‌గా పనిచేస్తున్నా ఎక్కడా తన అభిజాత్యాన్ని పోగొట్టుకోదు. పిల్లలకోసం తెగించి పామును చంపడంలోనే ఆమె ధైర్యం, ఆత్మవిశ్వాసం కనబడతాయి. ‘న్యాయం’కోసం చేసే ఆమె పోరాట పటిమ పాఠకులను ఆశ్చర్యానికి లోనుచేస్తుంది.
ఈ కథల్లోని జీవితాలన్నీ రాయలసీమ వలస కూలీలవిగా రచయిత చిత్రీకరించినా, ఇలాంటి జీవితాలు అన్ని ప్రధాన నగరాలను ఆశ్రయించుకుని కనిపిస్తాయి. దారిద్య్రం, కరువు మనుషులను పల్లెల్లోనుండి తరిమేస్తే, దగ్గర్లోవున్న పట్టణాలకు వలసపోక తప్పదు. చేతివనరు వున్నవాడు ఎలాగో బతికేస్తే, అదిలేనివారు దినసరి కూలీలుగా అడ్డాలను ఆశ్రయించుకుని బతకాలి. దినసరి కూలీలకు దొరికినరోజు పని. లేనివాడు పస్తే. పని రెగ్యులర్‌గా దొరుకుతుందని ముఠామేస్ర్తిల అండన చేరితే, వాడు వేరుపురుగులా తొలుస్తునే వుంటాడు. డబ్బున్న వాళ్ళు, అగ్రవర్ణాలవారే కాకుండా మధ్యతరగతి వాళ్ళకు కూడా వీళ్లు బిచ్చగాళ్ళు, దొంగలుగానే కనిపించడం విచిత్రం.
పల్లెల్లో కనిపించేంత కులాహంకారం పట్టణాలకు కనిపించదు. ఒకప్పుడు ఊళ్ళలో మోతుబర్లుగా వెలిగిన వీరమరెడ్డి, విశ్వనాథనాయుడు బతకడంకోసం పట్టణానికి వస్తారు. అక్కడ వాళ్ళ కులాధిపత్యం చెల్లకుండాపోయిందే అని బాధపడతారు. ఊళ్ళో కుల ధాష్టికం భరించలేని చాకలి పంచరత్న ఆపాటి చాకిరి పట్టణంలో చేసుకుని హాయిగా బతకవచ్చని మొగుడ్ని తీసుకుని పట్టణం వచ్చేస్తుంది. పట్టణాలలో కులాన్ని ఎవడు పట్టించుకుంటాడు. పని ముఖ్యంకదా! శివారు ప్రాంతాలన్నీ పట్టణాలలో కలిసిపోతుంటే, పంట పొలాలన్నీ ప్లాట్లుగా మారిపోతున్నాయి. అక్కడ ఇల్లుకట్టుకునే వాళ్ళు పురుగుపుట్రా భయంతో రక్షణకోసం యానాది వాళ్ళను వాచ్‌మెన్‌లుగా పెట్టుకుంటున్నారు. ఇక్కడ పనికి కులం అడ్డురాలేదు. ఈ కథలన్నీ ఒక ఎత్తు. ‘‘ప్రార్థన’’ కథ మరో ఎత్తు. మతం మారిన క్రైస్తవులలో అడుగడుగునా కనిపించే కుల స్పృహను వ్యంగ్యంగా, అత్యంత ప్రతిభావంతంగా ఈ కథలో చిత్రీకరించారు.
పల్లెలలోనుండి పట్టణాలకు వలస వచ్చినవారు, పట్టణాలలో వాళ్ళు ఎదుర్కొనే ఇబ్బందులను, ఆ ఇబ్బందులు వాళ్ళ అస్తిత్వాన్ని అతలాకుతలం చేస్తున్న తీరును, కుటుంబ సంబంధాలలోనే కాదు- మానవ సంబంధాలలో అవి తెస్తున్న మార్పును ఈ కథలు వివరిస్తాయి. ఇందులో వున్న పాత్రలన్నీ సజీవంగా, అత్యంత సహజంగా చిత్రీకరించబడ్డాయి. ఆ పాత్రల మానసిక చిత్రణ ఈ కథలలో ప్రధానంగా కనిపిస్తుంది. తాము, తమ స్వార్థం తప్ప మిగతావేవీ పట్టించుకోని మనస్తత్వాన్ని ‘‘క్లోజ్ ది డోర్స్’’ వాయిస్ నేపథ్యంలో చిత్రీకరించిన ‘‘చిత్రలేఖ’’ కథ శిల్పపరంగా ఎన్నదగినది. మనముందే వున్నా మనం పట్టించుకోని, మనకు తెలియని వలస కూలీల జీవన పోరాటాన్ని ఈ కథలు తెలియజేస్తాయి. ఈ కథలు చదివిన పాఠకులు వలస కూలీల గురించి ఆలోచిస్తారనీ, వారి పట్ల సానుభూతిని- మానవత్వాన్ని కనబరుస్తారని ఆశిద్దాం.

- కె.పి.అశోక్‌కుమార్, 9700000948