సాహితి

అవధాన స్రష్ట మాచిరాజు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘‘అవధాన ప్రతిభాసముద్రుడవు అన్నా! మాచిరాజాన్వయా!
శివరామాభిధ! రాజగౌరవనిభా! శ్రేష్ఠావధానీ! కవీ!
భవదీయాద్భుత సాహితీవిభవ సంభ్రాంతోరు గాధావళుల్
సవన ప్రజ్వలితాగ్ని కీలలయి ఆశాంతంబు పర్వెన్ జుమీ!’’

2011 అక్టోబరులో ‘‘అవధాన తరంగిణి’’ పేర తన 109 అష్టావధానాలలో 102 అవధానాల విశేషాలను సంకలనం గావించి ప్రథమ ముద్రణగా పాఠక లోకానికి అందించినపుడు ‘‘అవధాని భూషణ’’ మాచిరాజు శివరామరాజును ప్రశంసిస్తూ చెప్పిన పద్యం యిది. రాజు తిరుపతి ప్రాచ్యకళాశాల విద్వాన్ విద్యార్థి. అక్కడే అవధాన కళాప్రదర్శనకు ధ్వజారోహణం చేశాడు. ఆయనకు ఉన్న భగవతీ, భగవత్ ప్రసాద మందా ‘పాండిత్య ప్రతిభ; వైయాకరణీయ వైదుష్యాలు.’ నారాయణ, బ్రహ్మాస్త్రాలతోనే 109 అవధానాలలోనూ విజయలక్ష్మి తనను వరించేలా చేసికొన్నాడూ అంటే, నిజంగానూ యిది పరమాద్భుతం.
‘‘దోషమ్ము గమనింప ధూర్జటినైనను
అంగీకరించని దతని ప్రతిభ’’ అంటాడు మా మిత్రుడు, మాచిరాజు శిష్యుడు, అవధానీ, ఇటీవలే 100వ అవధానంతో తన ప్రదర్శనలకు విశ్రాంతి యిచ్చిన మద్దూరి రామమూర్తి. రాజుది ఉభయ భాషల్లోనూ తల స్పర్శి వ్యాకరణశేముషి. సంస్కృత భాషా పదప్రయోగంలో దోషం చూసెనా ‘సూరి సూత్రాలతోనూ’ కవిని నిలబెట్టేసే ధీరధీ అతనిది.
రాజుది ‘అలౌకిక పాండిత్య ప్రతిభ’. అవధానంలో ఒక్కోమారు రెండుమూడు పాదాలవరకూ దీర్ఘ సమాస రచన చేయటం ఆయనొక్కడిలోనే గమనించాను. ఆయన గురువు సి.వి.సుబ్బన్న కూడా గేజేయప్రౌఢ శబ్ద సమాస బంధాల్ని వాడినా సుదీర్ఘ సమాస బంధాలుంచాడు. ఒక పాదంలో ముగించే విధానం. రాజు గురువును మించిన శిష్యుడు. మరొకటి అంత పొడవాటి సమాస బంధాలనీ ధారణ పెట్టుకొని మరీ అప్పచెప్పడం.
సామాన్యంగా అవధాన కవులు కావ్య రచయితలు కావటం అరుదు లేరని కాదు, సకృత్తు. మాచిరాజు కూడా ఇటీవలనే ‘ఆర్యసమాజ స్థాపకుడైన బ్రహ్మర్షి దయానందసరస్వతి జీవితాన్ని ఇతివృత్తంగా తీసుకొని ‘దయానంద ప్రబంధం’ అనే కావ్యం రచించాడు. గడియారం వారి సాహితీ పురస్కారాన్నీ అందుకున్నాడు. కర్నూలులోనూ, నంద్యాలలోనూ ఘనంగా ఆవిష్కరణోత్సవము వైభవంగా జరిపించుకున్నాడు. జనవరి 12వ తేదీన తన శిష్యుని నూరవ, చివరి అవధానంలో పృచ్ఛకునిగా పాల్గొని దీవెనలందించినాడు కూడా. తెల్లవారితే జనవరి 13వ తారీఖు. భోగిపండుగ, పండుగ కొడుకు కోడలు మనుమలతో స్వగ్రామంలో స్వగృహంలో ఆనందంగా జరుపుకోవాలని రాత్రికి రాత్రే స్వగ్రా మం చాగలమర్రీ చేరుకొన్నాడు. కాని విధిమరొకటి తలచింది. అతి కఠినంగా వ్యవహరించింది. దుర్విధిగామారి మృత్యురూపం ధరించి అతి క్రూరంగా రాజుపై దాడి చేసింది. సాహిత్య నీలాకాశం నుండి ఒక తార రాలిపోయింది. రాయలసీమ ఒక అసమాన సాహితీమూర్తిని కోల్పోయింది.

- జి.సుబ్రహ్మణ్యశాస్ర్తీ