సాహితి

భూమండలంపై ప్రవాసి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రచన:
డా. వి.ఆర్.రాసాని
ప్రచురణ:
విశాలాంధ్ర పబ్లిషింగ్
హౌస్, విజయవాడ
పేజీలు: 212,
వెల: రూ.160/-
**
మనిషి ఎక్కడివాడో, ఎక్కడికెళ్లాలని నిర్దేశించుకున్నాడు యితమిత్థంగా చెప్పలేం. తాత్త్వికం అనుకోకపోతే, అతడు భూమండలాన్ని తన ప్రవాస స్థలం చేసుకుని, జీవితానుభవాలను పోగుచేసుకుంటున్నాడు. జన్మపరంపరలకు లోనయిపోయి చివరకు తన సాధనసారం అంతా చేర్చుకుని, కూర్చుకుని మరో ప్రవాస స్థలానికి వెళ్లిపోతున్నాడు. అలా వెళ్లడానికి ముందుగా, శాఖాచంక్రమణం చేసుకుంటూ తన స్వస్థలానికి స్వగ్రామానికి చేరుకున్న ‘మంగిరి నాగయ్య’గారి యథార్థ, వ్యథార్థ జీవన చిత్రణం ‘వలస’ అనే నవల.
స్వస్థలం అన్నా, సృజనం అన్నా మనిషికి ఎంతో ప్రేమ, అనురాగం. ఈ లక్షణాలను యితరులు పరివర్తించకపోయినా అతని అనురక్తి మాత్రం యేమాత్రం కొరవడదు. వ్యవసాయాన్ని నమ్ముకున్న కుటుంబానికి చెందిన ఆసామీ, తన భూమిని అమ్ముకోవలసిన విపత్కర పరిస్థితి సంక్రమించి, తుంగభద్ర తీరానికి చేరుకుంటాడు. ‘్భద్రావతనయ’ అనే మారుపేరు సంపాదించుకుంటాడు. జీవితంలో అన్నదమ్ములు, అల్లుళ్లు అనుకున్న వాళ్లతో యెన్నో గందరగోళాలలో చిక్కుకుపోయి జీవితంలో కరుడుగట్టుకుపోతాడు. ఎక్కడకు వెళ్లినా జీవితం మటుకు అతనికి ‘ఉదయ రవిచంద్రిక’ కాదు. కష్టాలు, నష్టాలు, వెంటబడి తరుముతూనే వుంటాయి. వీటన్నిటినుంచి తనకు విముక్తి ఎప్పుడు దొరుకుతుందా అనుకుంటూనే పాత పరిచయాలను పునరావృత్తం చేసుకుందుకు ప్రయత్నిస్తాడు. ‘అన్ని బంధాలను తెంచుకుని, సువిశాల ప్రపంచంలోకి అగుడులు’వేస్తారు వృద్ధ దంపతులు.
బాల్యంనుంచి వృద్ధాప్యం వరకు ఒక జంట యొక్క సహవాసాన్ని, సహజీవనాన్ని యెటువంటి అరమరికలు లేకుండా సాఫీగా వున్నదివున్నట్లుగా- చిత్రించినట్లు కాకుండా- చిత్రపటం గీసి చూపుతున్నట్టుగా రచించారు రాసాని రుూ నవలను.
సమకాలీన జీవిత గమనం, సామాజిక స్థితిగతులలో వచ్చే మార్పులు- వాటివల్ల వ్యక్తుల జీవితాలలో రూపుకట్టుకునే తీర్పులు, అతి సహజంగా అక్షరబద్ధం చేశారు. రాయలసీమ జీవనస్థాయిని బహుజన విదితం అయ్యేట్లుగా తీర్చిదిద్దారు.
‘నామాట’గా ముందు చేర్చిన అవతారిక, ముగింపు మాటలుగా చేర్చిన విశ్వమానవ చరిత్ర శకలాలు, ఈ నవలకు అవసరం అయిన- దోహదం చేసిన తాత్త్విక దర్శనాన్ని ఎత్తిచూపుతాయి.
ఈమధ్య కాలంలో వచ్చిన నవలలో యిది ‘తలమానికం’అనటానికి ఎటువంటి ఆక్షేపణ అవసరం లేదు. తెలుగు ప్రజలందరూ తప్పనిసరిగా చదవవలసిన నవల యిది. జీవన విధానాలను అర్థం చేసుకుందుకు, తగు మాత్రంగా మార్చుకుందుకు ఉపకరించే దీప కళిక.

- ‘శ్రీవిరించి’