సాహితి

విషబీజాల మూలాల్ని వెతికి పట్టుకోవాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సాహిత్యం సమాజంలో తలెత్తిన సమస్త వైరుధ్యాల్ని, వైవిధ్యాల్ని సంక్లిష్టతలను, పట్టుకోగలుగుతుందా? సామాన్య జనం ఆనందంగా, సరళంగా జీవితాన్ని అనుభవించే తీరుతెన్నులందిస్తుందా? బహుళ తాత్త్విక దృష్టితో, సాహిత్యం నిర్మలమైన అకలుషితమైన ఆలోచనలనిస్తూ, పెట్టుబడిదారీ దోపిడీ విధానాలను ఎత్తిచూపుతూ ఎండగట్టే ప్రయత్నం చేస్తుందా? సామాన్యుల హదృయ స్పందనలు, ఆక్రోశాలు నమోదు చేయగలుగుతుందా? సాహితీవేత్తలంతా ఆలోచించాల్సిన తరుణం.

నేటి ఆధునికత ‘సిగ్నంట్ బౌమన్’ సూచించినట్లు ద్రవస్థితిలో లేదు. వడి వడి మార్పే తీర్పుగా, ఊహతీత లక్ష్యాలతో వాయుస్థితిని సంతరించుకొంటూంది. లౌకిక, అలౌకిక భావాలు వినిర్మాణ దారుల్లో ఒదిగేందుకు వీలుగా క్షణంలో ప్రపంచ వ్యాప్తం కావాలనే ఆకాంక్షతో ఆధునికత వాయుస్థితిలోకి మారిపోతుంది. ప్రపంచమంతటా ఒక నూతన దర్శనంగా వాయువేగంతో వ్యాపిస్తూ అమితాశ్చర్యకర స్ఫూర్తితో మానవాళిని ముంచెత్తుతుంది. ఊహాతీతంగా మనుషులు అల్లుకపోవడం, అంతలోనే తెగిపోవడం, గాఢత లేని బంధాలు, నిగూఢతో కూడిన అంతరంగాలు, స్పష్టత లేని భావాలు, పాలిపోతున్న సిద్ధాంతాలు, కూలిపోతున్న సామ్యవాదాలు, సామ్రాజ్యాలు. సామ్రాజ్యవాదుల కనుసన్నల్లో వున్న ప్రజాస్వామ్యం వృద్ధాప్యంలోకి ప్రవేశించినా యింకా ఉగ్గుపాలు తాగుతూనే వుంది. కార్పొరేటెడ్ వ్యవస్థల కాళ్ళ ఊతంతోనే నడక సాగిస్తుంది. మార్కెట్ మాయలో మగ్గిపోతుంది. ప్రపంచమంతా అశాంతి నిలయమై దోపిడీ దొరతనంగా చెలామణి అవుతూంది. సృజనాత్మకత శూన్యమై అనుకరణ ఆయువుపట్టుగా భ్రమించే రోజులు దాపురించిన సందర్భంలో ద్రవ వేగంతో, బహుళ సంస్కృతి కట్టలు తెంచుక ప్రవహించడం బదులుగా, వాయువ్యాప్తమై ప్రపంచాన్ని ముంచెత్తుతుంది. ఏదీ బయటకు కనపడదు. అన్నీ నిగూఢంగానే, నిశ్శబ్దంగానే; అహేతుకంగానే; స్వార్థానికి జతపడాలనే ఆలోచనలతో, విచ్ఛిన్నతకు విజ్ఞానాన్ని జోడిస్తూ జ్ఞానబోధలు చేస్తుంటారు సామ్రాజ్యవాదులు.
సమాజంలో సాహిత్యం ఒక రహస్యయానం చేస్తుంది. ఏ దృష్టిని, దృక్పథాన్ని, ఏ వాదాన్ని తలకెత్తుకునే స్థితినుంచి జారిపోతుంది. ఆధునికత అంటే లక్షణాలైనా, అలక్షణాలైనా, విలక్షణంగా స్వార్థంతో జతకూడి చరించాలనే తపన కనిపిస్తుంది. ఆధ్యాత్మికత, వేదాంతం, ముసుగులో దైవభావన, కర్మ సిద్ధాంతాలు మానసిక మరుగుజ్జుతనాన్ని ప్రేరేపిస్తున్నాయి. ఆలోచనాజ్ఞానాన్ని చంపుతున్నాయి. గతకాలపు విశిష్టతలో సేదతీరే విధంగా వర్తమాన సమాజాన్ని ప్రోత్సహిస్తూ, కొత్తచూపు ఉదయించకుండా కనురెప్పల మూతల మాటున కాల్పనిక ప్రపంచాన్ని నిలబెడుతున్నాయి. మహాకథనాలు కనికట్టు విద్యగా కనపడుతున్నాయ్. సరిహద్దు రేఖలు తెగిన విశృంఖలత యువతను పట్టిపీడిస్తూంది. మనిషిలో తిష్టవేసిన భోగావేశాలు, వస్తు వ్యామోహిత ఆశలు, పాశ్చాత్య సంస్కృతి సంప్రదాయాలను అక్కున చేర్చుకుంటున్నాయి. ప్రపంచీకరణ మాయలో ప్రపంచమంతా చిక్కి, సంపద, ఉత్పత్తి వినియోగాల మధ్య, ఊగిసలాడుతూ, ఉత్పత్తి సామూహికమైన, ప్రతిఫలం వ్యక్తిగతం కావడాన్ని భరిస్తూంది. ఈ వైవిధ్యాన్ని వైకల్యాలను, విలువలు పునాదిగా గల వ్యవస్థ మాత్రమే రూపుమాపగలదు. కాని, బహుళ జాతీయమైన పెట్టుబడిదారి కేంద్ర స్థానాలు ఉత్పత్తిదారుల ఐక్యతను ముడివడనీయకుండా జాగ్రత్తపడుతున్నాయి. ఆర్థిక సరళీకరణ విధానాలను ఎరగా చూపి బడుగు బలహీన వర్గ దేశాలను లొంగతీసుకుంటూ వ్యాపార సంస్థలను నెలకొల్పి హాయిగా దోపిడీ చేస్తున్నాయి. శ్రామిక వర్గం భోగలాలస విధానాలను తెలుకుంటుంది కాని దోపిడీని నివారించేందుకు సంఘటితం కాలేకపోతుంది. నేడు కార్పొరేటెడ్ వ్యవస్థలు పాలనా వ్యవస్థను శాసించేదశకు ఎదిగాయి. ఈ పెట్టుబడిదారీ వ్యవస్థ ఎంతో ఐకమత్యంగా జీవిస్తూ ప్రజాస్వామ్యాన్ని కీలుబొమ్మను చేసి ఆడిస్తూంది.
సాహిత్యం సమాజంలో తలెత్తిన సమస్త వైరుధ్యాల్ని, వైవిధ్యాల్ని సంక్లిష్టతలను, పట్టుకోగలుగుతుందా? సామాన్య జనం ఆనందంగా, సరళంగా జీవితాన్ని అనుభవించే తీరుతెన్నులందిస్తుందా? బహుళ తాత్త్విక దృష్టితో, సాహిత్యం నిర్మలమైన అకలుషితమైన ఆలోచనలనిస్తూ, పెట్టుబడిదారీ దోపిడీ విధానాలను ఎత్తిచూపుతూ ఎండగట్టే ప్రయత్నం చేస్తుందా? సామాన్యుల హదృయ స్పందనలు, ఆక్రోశాలు నమోదు చేయగలుగుతుందా? సాహితీవేత్తలంతా ఆలోచించాల్సిన తరుణం. ఆధునికత వాయుస్థితి వడిని గమనించాల్సిన కాలం.
దేశంలో ఎటునుంచి ఎటువెళ్లినా రైతు సమస్యలు, చేతివృత్తుల, కార్మికుల సమస్యలు, స్ర్తి, పురుషుల సంబంధాలు, వస్తు సంస్కృతి ఒకటిగానే కనిపిస్తున్నాయి. స్వీయానుభవాలతో ఆత్మానే్వషణతో పరాయికరణతో కూడిన వివిధ అంశాలను సరికొత్తగా నడుస్తున్న సమాజంతో ముడిపెడుతూ సాహిత్యం వెలువడాల్సి వుంది. ఈ రోజు ‘డోనాల్డ్ ట్రంప్’ అమెరికా అధ్యక్షునిగా ప్రమాణ స్వీకారం చేసి చేయకముందే యావత్తు ప్రపంచం విస్మయంతో భయకంపితులు కావడం చూస్తుంటే ఆధునికత ఆలోచనలు ఎంత తీవ్రంగా ప్రపంచాన్ని వాయువేగంతో చుట్టివచ్చాయో గమనించవచ్చును. బడుగు బలహీన వర్గ దేశాల మేధో సంతృప్తిని అమెరికా ఎంత వడిగా ప్రపంచీకరణ పేరుతో కైవసం చేసుకుందో, తన అభివృద్ధికి దోహదపడిన దేశాలను ఏ విధంగా కాలరాసిందో సాహిత్యం తగిన విధంగా సరైన కాలంలో విప్పి చెప్పలేకపోయింది.
కొన్ని దేశాలు విద్యా విధానాన్ని మార్చుకొని, అమెరికాకు తమ విద్యావంతులను పంపే విద్యనే అమలు పరచుకొనడం, ఆధునికత ముసుగులో పెట్టుబడిదారి వర్గాలు తమ భావజాలాన్ని వాయు, మనోవేగాలతో ప్రచారం చేసుకున్నాయనే చెప్పొచ్చు. వివిధ దేశాల్లో పాలకులు తమ దేశ భవిష్యత్తును కాంక్షించే నెపంతో సామ్రాజ్యవాదులు, పెట్టుబడివర్గాలకు అనుకూలంగానే వారి విధానాల్ని తలకెత్తుకోవడం చూస్తునే ఉన్నాం. ఏదో కొంతకు కొంత సాహిత్యం ప్రపంచీకరణను వ్యతిరేకిస్తూ వెలువడినప్పటికి, కాపిటలిస్ట్ దృక్పథంలో ఉన్న వినాశకర వైఖరిని బాహాటంగా ఎత్తిచూపి, మన పాలకులను ప్రజలను నమ్మించలేకపోయింది. అమెరికాలో ప్రెసిడెంట్ ఎలక్షన్స్ పాలకులను ప్రజలను నమ్మించలేకపోయింది. అమెరికాలో ప్రెసిడెంట్ ఎలక్షన్స్ జరుగుతుంటే ప్రక్క దేశాలకు వారి స్నేహ పాత్రత వహించిన దేశాలకు కంటిమీద కునుకు లేకుండాపోయింది. అయినా జరుగకూడనిది జరిగింది. ట్రంప్ విజయం సాధించాడు.
నేడు ఆధునికత ఒక రూపురేఖలతో, వ్యవస్థాగతమైన నియమ, నిష్ఠలను సంతరించుకునే దశకు చేరుకోలేకపోతుంది. అనూహ్యమైన మార్పులు వాయువేగంతో, ఆధునికతకు రంగు, రుచి, వాసన లేకుండా చేస్తున్నాయి. పెట్టుబడిదారి దోపిడీ వ్యవస్థ భావజాలాలు ఏ విధంగా అట్టడుగు వర్గాల్లోకి విస్తృతిస్తున్నాయో సాహిత్యం పట్టుకోలేకపోతోంది. రోబో లాంటి యాంత్రిక యువత, భావోద్వేగాలు లేకుండా, పొట్టకూటి చదువులే పరమావధిగా భావిస్తూ, వాయువేగంతో మారుతున్న ఆధునికతను అర్థం చేసుకోలేకపోతుంది. అట్లే సాహితివేత్తలూ ఆధునికత, వెర్రి వాలకాన్ని పసిగట్టకుండా, ఆశించిన ఆదర్శ వ్యవస్థను వాస్తవ దృష్టితో గమనించకుండా, అంధ విశ్వాసాల నిర్మూలన జరుగుతుందీ లేనిదీ తెలిసికోకుండా, కొత్త ప్రయోగాలతో పన్నాగాలతో ప్రపంచ వ్యాప్తవౌతున్న పెట్టుబడిదార్ల వ్యాపార సరళిని సమర్థించడం లేదా వౌనంగా చూస్తూ కలం కదపకపోవడం ఒకరకంగా సాహిత్య ద్రోహమే అవుతుంది. ఈ రోజు సమన్యాయం కావాలంటూ, రాజ్యాధికారం చేపట్టాలంటూ కుల, మత, ప్రాంతీయ ఉద్యమాలు తలలెత్తుతున్నాయి. వాటిని సమర్థిస్తూ ఎన్నో కలాలు కదులుతున్నాయి.
అణగారిన కులాలు, అగ్ర కుల రాజకీయాలకు ప్రత్యామ్నాయంగా జట్టుకడుతున్నాయి. మంచిదే! ఎక్కడైనా పోరాటం దోపిడీ వ్యవస్థకు దోపిడీకి గురౌతున్న వ్యయస్థకు మధ్య ఉండాల్సింది, కులాలమధ్య మతాలమధ్య, వర్గాలమధ్య ఉండే విధంగా విషపూరిత వాతావరణాన్ని సృష్టించింది సోకాల్డ్ ఆధునికత ముసుగులో ప్రపంచీకరణకు మూలమైన పెట్టుబడిదారి వర్గ భావజాలమే! పేరేది పెట్టినా, ధర్మయుద్ధమన్నా, వర్గీకరణ పోరాటమన్నా, ఉపకులాల విముక్తి పోరాటాలన్నా, అధికార హస్తగతానికి మహాజన సమాజం ఏకీకృత పోరాటాలన్నా, సమాజంలోని అన్ని కులాల మతాల్లోని బడుగు బలహీన వర్గాలు ఏకతాటిమీద నడవండి, మార్క్సిస్ట్ భావజాలాన్ని అర్థం చేసుకుని పోరాటం చేయండి, వేయితలల విషపు నాగైన కార్పొరేటెడ్ వ్యవస్థ పన్నాగాలను పసిగట్టి తుదముట్టించలేమనేది మొదట సాహితవేత్తలు గ్రహించాల్సి వుంది. వారి రచనల్లో ఈ నిగూఢ సత్యాన్ని విప్పి చెప్పలేకపోతే నేడు వాయుగతంగా వ్యాప్తినొందుతున్న ఆధునిక సామ్రాజ్యవాదుల ఎత్తుగడను విఫలం చేయలేమనేది సాహితీవేత్తలు ఒప్పుకుతీరాలి. వేగవంతమైన ఆధునికత వ్యాప్తిని గమనించి దాని విషబీజాల మూలాల్ని వెతికి పట్టుకోవాల్సిన బాధ్యత సాహితివేత్తలమీద వుంది అనేది నగ్నసత్యం.

- కొండ్రెడ్డి వెంకటేశ్వరరెడ్డి, 9948774243