సాహితి

పిట్టని దేవులాడిన గూడు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇతనా బడా షహీన్ షహర్‌ల ఇల్లేమీ లేనివాణ్ని
అడ్రస్ అంటూ లేనివాణ్ని
కాందిశీకున్ని.. శరణార్థిని
నిత్య యాత్రికుడ్ని.. నిరంతర సంచారిని

యుగాల క్రిందటెపుడో
నాకూ ఓ గుహ ఉండేది
తొలినాటి నా ఊహలని చిత్రించి
బలహీనతలని దాచుకోవడానికి
భయాలని రాళ్ళకింద పాతిపెట్టి
వాన, చలి, ఎండ నుంచి కాపాడుకోవడానికి
మనిషి - మృగంనుంచి పారిపోయి
నా ఉనికికి చిగుళ్ళు తొడగడానికి
నాకూ ఒక గుహ ఉండేది

శతాబ్దాల క్రితమెపుడో
నాకూ ఓ గూడు ఉండేది
గోడు చెప్పుకోడానికి
‘దిగుడు’లో దిగుళ్ళ దీపం వెలిగించి
చిలక్కొయ్యకు కన్నీళ్ళ అంగీని ఆరేయడానికి
‘సూరు’లో చిరునవ్వుల విస్తరాకు చెక్కి
పొయ్యి కింద కట్టెల్లో బతుకు మెతుకులను రాజేయడానికి
నా అస్తిత్వానికి గుడి కట్టడానికి
నాకూ ఓ గుడిసుండేది

దశాబ్దాల క్రిందటెపుడో
నాకూ ఓ ఇల్లుండేది
క్యాలెండర్ ఉద్వేగాలని వేళ్ళడదీసి
బీరువాలో ఉత్సాహాలని భద్రపరచడానికి
టీపాయ్ మీద ఉత్తేజాలని ఫ్లవర్‌వాజ్‌లా పరచి
గోడ రంగుల్లో అనుబంధాలను అద్దడానికి
నా ఆత్మగౌరవానికి రెక్కలు తొడగడానికి
నాకూ ఓ ఇల్లుండేది

ఇపుడదంతా ఓ యాది.. ఓ జ్ఞాపకం.. ఓ నాస్టాల్జియా
నాలుకకి - నాభికీ మధ్య నిరంతర వలస
మొదటి అక్షరానికీ - చివరి వాక్యానికీ మధ్య అలుపులేని ప్రయాణం
ఇపుడేమో -
గుహ మతిలొ లేకుండ పోయి
ఆదిమ పేగుబంధం తెగినట్లయింది
గుడిసెను యాది మర్సి
గుండెను పాతాళంల పాతిపెట్టినట్లయింది
ఇల్లు కళ్ళలోంచి కరిగిపోయి
మట్టివాసన మచ్చుకైనా లేకుండా మాయమయింది

పుస్తకాల రెక్కలు కట్టుకొని
ఊరు దాటి ఎగిరి వచ్చినంక
జిందగీల కొత్త ఆట షురువైంది
ఉరుకులాట.. పెనుగులాట.
దేవులాట తన్లాటలే ఇప్పటి ఆటలు

కనీ, ఎగిలివారంగ
సడక్ ఎక్కి, ఎడ్లబండెక్కి- ఎర్రబస్సెక్కి
రైలుబండెక్కి- ఆటోరిచ్చ ఎక్కి
పట్టపగటియాళ్ళకి
పట్నంల నేను పనే్జసే ఆఫీసుకు
నాయ్నా, నువ్వచ్చినవ్ సూడు
అప్పుడు -
మన ఇల్లు ఇల్లే
నా దగ్గరికి నడ్సి వచ్చినట్టనిపిచ్చె..
ఎగిరిపోయిన పిట్టని ఎనుకులాడుకుంట
గూడే కదిలివచ్చినట్టనిపిచ్చె..

- మామిడి హరికృష్ణ, 9908844222