సాహితి

పాత్రలు జీవించిన కథలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పల్లె పూలవాన (బాల్యం బతుకు కథలు)
రచన:
బెల్లంకొండ సంపత్‌కుమార్
పేజీలు:85, వెల:రూ.50/-
తెలంగాణ బాల సాహిత్య పరిషత్ ప్రచురణ
ప్రతులకు:రచయిత-9908519151
**
అనుభవం, కల్పనల మిశ్రమమే కథా సాహిత్యం. పాత్రల నడక, సన్నివేశాల రూపకల్పనలోని చాతుర్యమే కథలను పండిస్తుంది. అయినా చెప్పే కథల్లో జీవం ఉంటే రాసే కథల్లో ఆసక్తి ఉంటుంది. ‘పల్లె పూలవాన’లోని బెల్లంకొండ సంపత్‌కుమార్ కథలు చెబితే వినే రకానికి చెందినవే. రచయిత తన అనుభవంలోకి వచ్చిన సంఘటనల్ని తనకు తెలిసిన రీతిలో, చిన్న గొంతులో, సావధానంగా పక్కవారికి చెబుతున్నట్లుంటాయి. వినేవారికి తామెక్కడా చదువని విషయాలు కొత్తగా తెలుస్తున్నట్లనిపిస్తుంది. ఇదీ ‘పల్లె పూలవాన’ సొగసు.
కల్పన కన్నా వాస్తవం భయంకరంగా ఉంటుంది అంటాడు సుప్రసిద్ధ హిందీ రచయిత ప్రేంచంద్. ఆయన రచనల్లోని సజీవ పాత్రల ద్వారా ఆ మాటను నిరూపించాడు. సమాజాన్ని తరచి చూసేవాళ్లను, జీవితాల్లోకి తొంగి చూసేవాళ్లను పాత్రలు వెంటాడి కుదిపేస్తుంటాయి. మాటగానో, పాటగానో నిలబెడితే తప్ప అవి శాంతపడవు. అలాంటి అశాంతియే బెల్లకొండ కథలకు మూలం. ఉపాధ్యాయ వృత్తిలో కొనసాగుతున్న రచయిత విద్యార్థుల వెతలను వారి జీవన వైచిత్రిని, వారిలో వయసుకు మించిన పరిణిని గమనించి, అబ్బురపడి బాల్యం బతుకు కథలను అల్లాడు.
పిల్లలు దిద్దుతున్న అక్షరాలనే కాకుండా వణుకుతున్నవారి చేతులను, పలకను తడుపుతున్నవారి కన్నీళ్లనూ పరిశీలించడం తన వృత్తిలో భాగంగా భావించాడు రచయిత. తమ జీవన కథలు చెప్పి తనను కథకుడిగా మార్చిన పిల్లలకు ‘కథలకు వస్తువవుతున్న పిల్లలకు’ ఈ సంపుటిని అంకితమిచ్చాడు.
ఈ సంపుటిలో ఉన్న 12 కథలూ స్కూలు పిల్లల జీవితాలకు సంబంధించినవే. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే మామూలు కుటుంబాల పిల్లలు ఈ కథల్లో హీరోలు.
చెదిరిన కుటుంబాల పిల్లల మనసు చదువుపై లగ్నం కావడం ఎంత కష్టమో, బాల్యంలో తండ్రిని కోల్పోయి, తల్లి మరొకరి మనువాడి హింసలు, అనుమానాలు, అవమానాల పాలై పోతుంటే పసి ప్రాణం ఎలా భరిస్తుందో ‘రంది మానని గాయం’ కథలో ప్రవీణ్ పాత్ర ద్వారా తెలుస్తుంది. తాగుబోతు తండ్రిని సరిదిద్దుకునే వెంకట్, జ్యోతిలు నిజంగా ‘బంగారు నెలవంకలే’.
అప్పును, ఆకలిని మంటలా భరిస్తున్న రైతు కుటుంబంలోని సంఘటన ‘నల్లాలం పసరు’ కథ. చెప్పినా వినకుండా ఇంట్లో పిల్లలు ఆడుతున్న బంతాటలో వేడి గంజి ఒలికి తండ్రి ఛాతిమీద పడుతుంది. తండ్రి గాయం మానడానికి రాత్రివేళనే బయటికెళ్లి కొడుకు తెచ్చిన చల్లదనం మందు నల్లాలం పసరు. ‘పోరన్ని జీతముంచి రెండు వేలు దెచ్చిన. గవెట్ల తీరాలె మరి’ అన్న రాములు ప్రశ్నకు సారు దగ్గర సమాధానం లేదు. ‘చదువుల పండుగ’ పేరిట సర్కారు ప్రచారానికి ఊళ్లల్లో వాస్తవానికి చాలా తేడా ఉందని ఈ కథ చెబుతుంది.
హిస్టీరియాతో బాధపడుతున్న ఇంటామెవల్ల భర్త, ఆమె పిల్లలు.. చివరకు ఆరోగ్యం కుదుటపడిన ఆమె ప్రవర్తనతో ఇంటిల్లిపాదికి ‘పల్లె పూలవాన’ అయిన వైనం ఓ కథా వస్తువు.
పిల్లల ప్రధాన పాత్రలతో వారి ప్రవర్తన, పరివర్తనలతో వారి వారి కుటుంబాలలోని సంగతులను, మార్పులను కొంత వాస్తవ దృష్టితో, మరింత ఆశావహ దృక్పథంతో సమకూర్చిన కథలివి. రచయిత చుట్టూ తిరిగిన సజీవ పాత్రలే ఇవన్నీ.
పిల్లలు చెప్పిన లేదా వారి ద్వారా తెలియవచ్చిన యదార్థ సంఘటనలే కథలకు మూలాధారంగా ఉన్నందున ఆసక్తికరంగా సాగే కథల్లోని మలుపులు వీటిలో తక్కువ. చదువరిలో ఉత్కంఠ పెంచాలనుకునే కన్నా అసలు విషయం తెలిస్తే కథ ప్రయోజనం సిద్ధించినట్లేనని రచయిత భావించినట్లుంటుంది కథాగమనం.
కథల్లో సజీవ చిత్రణ వీటికి ప్రాణం. ఈ కథల్లో కనబడే గ్రామీణుల మాట, ప్రవర్తన, విసుగు, వినయం, మానవీయ సంబంధాలు స్వతహాగా సంపర్కం చెందితే తప్ప రచయితకు సాధ్యపడదు.
‘మధురానుభూతులతో ఎదగవలసిన బడి బాల్యం, వయసుకన్నా ఎక్కువ కష్టాలు ఎదుర్కొంటున్నది’ అనే రచయిత వేదన ప్రతి కథలోనూ కనబడుతుంది.

- బి.నర్సన్, 944012816