సాహితి

అపూర్వ నిఘంటువు భారత నామకోశము

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నామ కోశము
శ్రీమదాంధ్ర భారతము,
రెండు భాగములు
వెల: ఒక్కొక్క భాగము 700
ప్రతులకు: నవోదయ, కాచిగూడ చౌరస్తా, హైదరాబాదు లేదా
రచయిత: 17-1-388-1-ఎ,
శ్రీ లక్ష్మీనగర్ కాలనీ, హైదరాబాదు-51.
**

సంస్కృతములో వ్యాసుడు రచించిన భారతమును తెలుగులో కవిత్రయమువారు పద్య గద్య పురాణముగా అనువదించారు. ఇది సుప్రసిద్ధము. సందర్భోచితంగా ఇందులో కొన్ని వేల పేర్లు వస్తాయి. అవి వ్యక్తుల పేర్లు కావచ్చు. స్థలముల పేర్లు ఆయుధముల పేర్లు జంతువుల పేర్లు ఎన్నో వస్తాయి. అవన్నీ ఒక నిఘంటువుగా తీర్చిదిద్దితే బాగుంటుందనే ఊహ ఒక మహాపురుషునికి వచ్చింది. ఆయన పేరు బ్రహ్మశ్రీ త్రోవకుంట వేంకట సుబ్రహ్మణ్యముగారు. వెంటనే పనికి ఉపక్రమించారు. పనె్నండు సంవత్సరముల అరణ్యవాసము ఒక సంవత్సరము అజ్ఞాతవాసము పాండవులు చేసినట్లు ఈ రచయిత పదమూడు సంవత్సరములు కఠోర పరిశ్రమచేసి ఒక బృహత్ గ్రంథాన్ని రూపొందించారు. దీని పేరే ‘నామకోశము’. ఇందులో మీరు శబ్దరత్నాకరములో పదార్థములను గ్రహించినట్లే మహాభారత సర్వస్వమును గ్రహింపవచ్చు.
విరాటరాజు ఎవరు? ఈయన సోదరులెవరు? విరోజనుడెవరు? విమలోదకము అంటే పరిశుద్ధమైన జలము అని సామాన్యార్థము. ఐతే ఈ పేరుతో ఒక నదీప్రవాహం ఉందనే సంగతి ఈ గ్రంథంలో ఉదహరింపబడింది. అంటే సుబ్రహ్మణ్యంగారు పౌరాణిక చరిత్ర కవిజ్ఞానముతో మహాభారతములోని వేలాది పదములకు ఇందులో వ్యాఖ్యానప్రాయమైన అర్ధవివరణ చేశారు. ఇది బృహత్ గ్రంథము అంటే రాయల్ సైజులో రెండు భాగములగా ముద్రించబడింది. గాంధారికి నూరుగురు సంతానం అని మనకు తెలుసు. కాని వారందరి పేర్లు ఇందులో ఇవ్వబడ్డాయి.
ఆంధ్రప్రదేశ్‌లోని దాక్షారామము పంచారామములలో ఒకటి. ఇక్కడి స్వామికి భీమేశ్వరుడని పేరు. ఇంకా చాలా భీమక్షేత్రములున్నాయి. వాటి వివరములు ఇక్కడ వివరంగా త్రోవకుంట సుబ్రహ్మణ్యముగారు ఇచ్చారు. కొన్ని పదములకు సంగ్రహంగా ఏకవాక్య వివరణ ఉంటే కొన్ని కథలు విపులంగా దీర్ఘంగా సందర్భోచితంగా వివరణనిచ్చారు. ఇదొక మహాప్రయత్నము. పరిశోధక విద్యార్థులకు భారతీయ సంస్కృతినభిమానించేవారే కాదు పోటీ పరీక్షలకు హాజరవుతున్న సామాన్య విద్యార్థులు కూడా దీనిని రిఫరెన్సుగ్రంథంగా తప్పనిసరిగా తమ హోంలైబ్రరీలో ఉంచుకొని తీరాలి. ఇది ఒక విశ్వవిద్యాలయమో, ప్రభుత్వమో చేయవలసిన పని. కానీ, 80 ఏళ్ల వయసు కల్గిన ఒక వ్యక్తి చేశాడంటే ఆశ్చర్యపడవలసి వస్తున్నది. శ్రీ త్రోవకుంట వేంకట సుబ్రహ్మణ్యముగారి జీవితం ఈ రచనతో ధన్యమైనది.
దాదాపు పనె్నండు సంవత్సరాల కఠోర పరిశ్రమ ఫలితంగా ఈ బృహత్ గ్రంథాన్ని రూపొందించి ఇటీవల దానిని రెండు భాగములుగా అచ్చు వేయించారు. ఇటువంటి కృషిలో ప్రత్యక్షంగా ఎదురయ్యే సమస్యలు కొన్ని ఉన్నాయి. మొదటిది మూల గ్రంథమైన వ్యాస భారతము జయము అనే పేర రచింపబడింది. తర్వాత అది విస్తరించింది. ఇందులో వ్యాస రచన ఎంత? ప్రక్షిప్తములు ఏమిటి? వ్యాసుడు ఒక వ్యక్తికాదని ఒక పీఠము అని వాదించేవారు వున్నారు. అంటే వేదవ్యాసుడు అష్టాదశ పురాణ రచన చేసిన వ్యాసుడు ఒకరే కాక పోవచ్చునని వాదం. అది అలా ఉంచితే ఈ వ్యాస భారతములో నన్నయ గారికి లభించిన ప్రతి ఏమిటి? తిక్కన ఎర్రనలు చూచిన ప్రతి ఏమిటి? వీరి మధ్య వందల సంవత్సరాల అంతరం ఉంది కాబట్టి మూడు ప్రతులు ఒకటే కానక్కరలేదు. ఈ ప్రశ్నకు పరిష్కారంగా 20వ శతాబ్దంలో కొన్ని ప్రయత్నాలు జరిగాయి. అందులో వావిళ్ల వారు ప్రచురించిన శ్రీమదాంధ్ర భారతము ప్రామాణికమైనది. పాదాంతరములు కింద ఫుట్‌నోట్స్‌లో ఇచ్చారు. ప్రసన్న కథాకవితార్థయుక్తి- కలితార్థముక్తి - ఏది సరియైన పాఠం అనే విషయం ఈనాటికీ పండితులు నిర్ధారించలేక పోతున్నారు. 1960 ప్రాంతంలో ఉస్మానియా విశ్వవిద్యాలయంవారు మహాభారత పరిశోధిత ప్రతిని రూపొందించారు. ఆ సందర్భంగా దాదాపు నలభై మంది ఎం.ఏ పాసైన తెలుగు అధ్యాపకులు అందులో పాల్గొన్నారు. నేను కూడా పనిచేశాను. భూపతి లక్ష్మీనారాయణగారు డైరెక్టరుగా వ్యవహరించారు. ఇక తిరుమల తిరుపతి దేవస్థానం రూపొందించిన ప్రతిని కూడా ఈ సందర్భంలో సంప్రదించవలసి ఉంటుంది. అవసరమైన చోట పద్యము ఇవ్వటం సందర్భోచితంగా అర్ధతాత్పర్యములతోబాటు విశేషములను ఇవ్వటం జరిగింది.

నామావళి అంటే ఏమిటి?
త్రోవగుంటవారు మొత్తం 4245 నామములను సంకలనం చేశారు. ఇందులో ఉపాఖ్యానములు వచ్చినప్పుడు సంగ్రాహంగా వచనంలో కథ చెప్పారు. ఇంకా నదులు, పర్వతముల స్థలములు, ఆయుధములు నవ ద్వీపాలు వివిధ దానముల వలన కలిగే ఫలము భారతములో ఉదాహరింపబడిన వివిధ యజ్ఞముల యాగములు అవి జరిగిన ప్రదేశములు సాంఖ్యయోగము ఇత్యాదులు భారతములోని వివిధ పాత్రలు వాటికి వర్తమాన నామములు ఇలా త్రోవగుంట సుబ్రహ్మణ్యంగారు ఈ రచనను తీర్చిదిద్దారు. త్రోవగుంటవారి రచన రాకముందు ఇలాంటి ప్రయత్నం ఒకరిద్దరు చేయలేకపోలేదు. ఐతే ఆ గ్రంథములు ఇంతటి సమగ్రంగా బృహత్‌గ్రంథంగా రాలేదు. ఉదాహరణకు 1) యనమండ్ర వెంకట రామయ్యగారు (1878) కేవలం 700 పేర్లు మాత్రమే ఇందులో పురాతన నామకోశము పేరుతో బూదరాజు రాధాకృష్ణ భారత భాగవత రామాయణ ఉపనిషత్తులోని పేర్లను ఒక గ్రంథంగా వెలువరించారు. ఇవి వ్యాస భారతమును చూచివారు చేసిన సంగ్రహ రచన. ఈ కారణం చేత వీరు ఉదాహరించిన కొన్ని పేర్లు కవిత్రయ భారతంలో కన్పడటం లేదు. పూర్వగాథా లహరి వేమూరి శ్రీనివాసరావుగారి రచన. ఇందులో పూర్వగాథలు ఉన్నాయి. కాని కవిత్రయ భారత నామప్రసక్తి సమగ్రంగా పాటింపబడలేదు.
ఆంధ్ర మహాభారత నిఘంటువు: అబ్బరాజు సూర్యనారాయణరావుగారి కూర్పు - మహాభారత నామ సర్వస్వం: రచన పుత్తాపుల్లారెడ్డి
టిటిడి ప్రచురణ, సంగ్రహ గ్రంథము - పురాతన నామకోశ సంగ్రహం, ఇది లభ్యంకావటంలేదు.
ఈ విధంగా చూచినప్పుడు త్రోవగుంటవారు చేసిన ప్రయత్నం సమగ్రము. సర్వాంగ సుందరము అని వేరే చెప్పనక్కరలేదు.
రచయిత ఎదుర్కొన్న మరొక సమస్య ఒకే ఉపాఖ్యానము. భిన్న రూపాలల్లో ఉండటం. ఉదంకుడు పైల శిష్యుడు అనే విషయం అందరికీ తెలిసిందే. ఐతే మరొకచోట ఇతడు గౌతమ శిష్యుడు అని ఉంది. దీనిని ప్రామాణికంగా గ్రహించాలి. ఉదంకుడు శ్రీకృష్ణునికి చిన్ననాటి స్నేహితుడు. భృగు వంశీయుడు అని మరొకచోట ఉంది. దీనికి పరిష్కారం ఏమిటి? బహుశా ఈ ఉదంకుడు పైల శిపుడు ఒకరుకాకపోవచ్చును. ఇలాగే గజ కచ్ఛప వృత్తాంతం అహల్యా వృత్తాంతంలో తేడాలు కన్పడుతున్నాయి. వీటిని ఈ గ్రంథ రచయిత సందర్భోచితంగా పరిష్కరించడానికి ప్రయత్నించారు. తీర్థాలు క్షేత్రాల విషయంలో కూడా కొన్ని అంతరాలు ఉన్నాయి. అరణ్యపర్వంలో ఉదాహరింపబడిన తీర్థాల సంఖ్య 227. సభాశల్య పర్వాలలో మరికొన్ని వచ్చాయి. వీటి ప్రసక్తి వ్యాస భారతంలో సరిపోవటంలేదు. ఇలాంటి సమస్యలన్నింటినీ త్రోవగుంట వెంకట సుబ్రహ్మణ్యంగారు ఇందులో ఉదాహరించారు. కౌరవుల పేర్లలో వ్యత్యాసాలు. కౌరవులందరూ భీముని చేతిలోనే చంపబడ్డారా? సుదర్శనుడెవరు? ఇత ఎవరి చేతిలో చంపబడ్డాడు? ఇక్కడ సందేహాలున్నాయి అంటే వ్యాస భారతంలోని పేర్లకు కవిత్రయ భారతంలోని పేర్లకు కొద్దిగా తేడావస్తున్నది. ఇందుకు కారణాలేమిటి? ఔత్తరహ భారత తాళపత్ర ప్రతులలో దక్షిణాత్య ప్రతులలో కొద్దిగా తేడా ఉంది. ఇవన్నీ త్రోవగుంటవారు పరిశోధించి అధిగమించారు.
ఇన్నాళ్లకు ఇనే్నళ్లకు శ్రీమదాంధ్ర భారతముపై ఒక సమగ్ర నామకోశము రావటం నిజంగా మన అదృష్టం. పరిశోధకులకు పండితులకు మాత్రమే కాకుండా పోటీపరీక్షలకు వెళ్లే విద్యార్థులకుకూడా ఈ గ్రంథం కొంగు బంగారము వంటిది.

- ముదిగొండ శివప్రసాద్, 040-27425668