సాహితి

వీరగాథా కావ్యం ‘ఒకనాడు’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒక నిర్దిష్ట సమస్యను సార్వత్రిక సమస్యలో భాగంగా చిత్రించిన పద్య కావ్యం ‘ఒకనాడు’. కావ్యకర్త విద్వాన్ విశ్వం. నిజానికి ఈ కావ్యం సినారే పేర్కొన్నట్లుగా భావ కవితలోనే దేశ భక్తి కవిగా పేర్కొనవచ్చు.
బ్రిటీష్ పాలకుల దోపిడీ తత్వాన్ని, సైనికుల అరాచకాల్ని ఈ కావ్యం చిత్రించింది. 1893 అక్టోబర్ 4వ తేదీన అనంతపురం జిల్లా గుత్తి దగ్గరున్న రైల్వేగేటు కీపర్ గూళ్యపాలెం హంపన్నను బ్రిటీష్ సైనికులు కాల్చి చంపినారు. బ్రిటీష్ సైనికులు ఇద్దరు ఒక స్ర్తిపై అత్యాచారం చేయబోయారు. హంపన్న సైనికులను అడ్డుకున్నాడు. స్ర్తిని కాపాడడం హంపన్న చేసిన నేరం! ఈ కావ్యంలో బ్రిటీష్ ప్రభుత్వ దోపిడి విధానాలను, గ్రామీణ ప్రజల జీవిత చిత్రణను విద్వాన్ విశ్వం వాస్తవంగా కళాత్మకంగా చిత్రించారు.
కావ్యానికి రాసిన తొలి మాటలో విశ్వనాథ సత్యనారాయణ ‘‘కవి దగ్గర ఒక స్వతంత్రమైన శబ్ద నిర్మాణ శక్తిగలదు’’. అని అన్నారు. ఇంకా ఆయన విశ్వం భాషను అడవిలోని సింహముల భాష అని కూడా అన్నారు. కావ్య వస్తువు ప్రసిద్ధం, హంపన్న ఉదంతం గురించిన కావ్యాలు ఒకనాడు తర్వాత చాలా వచ్చాయి. వస్తుప్రాశస్త్యంవల్ల కావ్యాలకు గొప్ప పేరొచ్చింది. ఆ రోజుల్లోనే న్యాయవాది గుత్తి కేశవపిళ్ళై జ్ఘఒఆ చిజచిఆక కళ్ఘూఒ అనే వ్యాసం ఈ ఉదంతం గురించి హిందూ దినపత్రికలో ప్రకటించారు. భాస్కర బ్రహ్మయ్య గుత్తి చరిత్ర పేరిట తందాన పాటను రచించారు. కుంటమద్ది శేషశర్మ హంపన్న కథను బుర్రకథగా వ్రాసినారు. ‘‘గుత్తి చరిత్ర’’ పేరుతో బత్తుల వెంకటరామిరెడ్డి కథ వ్రాశారు. రాయల కథా వాచకంలో తెలుగు భాషోపాధ్యాయులు సీరిపి ఆంజనేయులు కథ వ్రాసినారు. ప్రముఖ అష్టావధాని ఆశావాది ప్రకాశరావు, జమదగ్ని వంటివారు కావ్యాలు రచించినారు. 1980 నవంబరు నెలలో బాలచంద్రిక అను మాసపత్రికలో హంపన్న కథ ప్రచురితమైంది.
ఒకనాడు కావ్యంలో బ్రిటీష్ సైనికుల అరాచకానికి గురియైన పాత్ర నాగులమ్మ. నిజానికి ఈ పాత్ర వాస్తవమైనదే. నాగులమ్మ, హంపన్నలు మంచి స్నేహితులు, వీరిద్దరి మద్య, అమలిన శృంగారం నెలకొంది. బ్రిటీష్ సైనికులు ఈ ప్రాంతంలో విడిది చేశారు. చుట్టుపట్ల గ్రామాలపై పడి విధ్వంసం సృష్టించేవారు. ఇంతకు ఈ సైనికులు ఇక్కడెందుకు తిష్టవేసినట్లు?
1857లో భారత స్వాతంత్య్ర సమరం జరిగింది. దేశం ఈస్టిండియా కంపెనీ చేతుల్లో నుంచి నేరుగా బ్రిటిష్ రాణి చేతుల్లోకి వెళ్ళింది. రాజ ప్రతినిధి ద్వారా భారతదేశ పాలన కొనసాగింది. పరిపాలనను సుస్థిర పరచుకోవడానికి ప్రభుత్వం సైనిక వ్యవస్థను పటిష్టపరచుకోసాగింది. దేశంలో నెలకొన్న అసంతృప్తి దేశ వ్యాప్తంగా తిరుగుబాట్ల రూపంలో వ్యక్తమవడాన్ని ప్రభుత్వం పసిగట్టింది. తిరుగుబాట్లను ఉద్యమాలను తీవ్రంగా అణచివేయడానికి సైన్యాన్ని విస్తరించింది. కావలసిన చోటుకు సైన్యం సకాలంలో వెళ్ళడానికి రైల్వేలను విస్తరించుకొనింది. చిన్న చిన్న సంస్థానాలు భారత ప్రభుత్వంలో లీనమయినాయి. 1857 తరువాత మొత్తం సామాజిక స్వరూపమే మారిపోసాగింది. దేశ స్వాతంత్య్ర పోరాటానికి కాంగ్రెస్ వంటి పార్టీలు ఏర్పడబోతున్న కాలమిది. ఇటువంటి కాలం ‘‘ఒకనాడు’’ కథాకాలపు నేపథ్యం.
బాధ్యత లేని అధికారులు ప్రజలకు మేలు చెయ్యరని విశ్వం అంటారు. బ్రిటీష్ సైన్యం చేస్తున్న ఘోరకృత్యాలను ఈ కావ్యంలో చిత్రించారు. ‘‘దండుపోవు దారిన పల్లెల కోళ్ళనెల్ల దోచుకున్నారంట కంట పడిన వారి వెంట పడి అవమానపరిచిరంట సీమ వాళ్ళు’’ అని అందుకు కారణాలు ఆయనే ‘‘కండకావరంబు కన్నుల క్రొవ్వును మాది రాజ్యమన్న చేదు తలపు, ఆయుధాలు కలవగన్న దర్పము’’ చేత సైనికులు అలా ప్రవర్తించారని విశ్వం వివరిస్తారు. ‘‘కొల్లగొట్టినారు కొంపలు దీసి ముల్లె మూట గట్టి చల్లగానే దాట వేసినారు. సీమ దీవి కవలీల కున్ఫిణి ఫిరంగి గుండు దండు’’ అని సైన్యం చేస్తున్న అసలు పనిని చెబుతున్నారు. ‘‘రాణి దొరతనము వచ్చే రాణువేమె మారలేదు రవంతయు’’. అని ఈస్టిండియా కంపెనీ పాలన నుంచి భారతదేశం బ్రిటీష్ రాణి పాలన కిందికి వచ్చినా పరిస్థితిలో మార్పు లేదంటారు. సైన్యపు విచ్చలవిడితనం ‘‘బొడ్డు పూడు దీనుక బొనమ్ముదిని, కైపు తలకు నెక్కుదాక తప్పద్రావి బట్టలూడు దాక బరితెగించి ఆడెను కల్లుతావు కొతి తెల్లసేన’’ అని ఒక చిత్రం చూపుతారు. సైనికుల ఈ ప్రవృత్తి ఇప్పటికి కూడా కొన్ని దేశాలలో మారలేదని వార్తలు వస్తున్నాయి.
విశ్వం కేవలం కవి కాదు, కొంత రాజకీయవేత్తల సాహచర్యమున్నవాడు. రాజకీయతత్త్వ రచనలు చేసినవాడు. అందుకే సైన్యాన్ని ‘‘బరులనేలగొన్న పరుల సేన తెల్లదైన నల్లదేయైన నేమైన పాడుపనులకెపుడు పాటుపడును’’ అని విజ్ఞత లేని సైన్యపు నీతిని నిగ్గుదేలుస్తాడు. సిపాయిల తిరుగుబాటు తరువాత దేశవ్యాప్తంగా సైన్యం మొహరించింది. అనేకచోట్ల సైనిక శిబిరాలు వెలసినాయి. గుంతకల్లు పట్టణం సమీపంలో దండుమిట్ట అని ఇప్పటికీ పిలుచుకునే ప్రాంతం ఒకటుంది. అక్కడ సైనిక శిబిరమొకటుందేట.
ఈ కావ్యంలో ప్రభుత్వ దోపిడిని కాకుండా సైనికుల ఘోరకృత్యాలు వివరించినారు. స్వాతంత్య్ర సంగ్రామం ఊపందుకుంటున్న కాలమిది, అఖిల భారత కాంగ్రెస్ వ్యవస్థాపక సమావేశానికి గుత్తి కేశవపిళ్ళై హాజరయినాడు. జిల్లాలోని ఉద్యమ సంఘటనలేవీ కావ్యంలో చిత్రించలేదు. ప్రజల్లో బ్రిటీష్ ప్రభుత్వం పట్ల నెలకొన్న అసంతృప్తిని గాని, పెంపొందుతున్న స్వాతంత్య్ర ఆకాంక్షను గాని కావ్యంలో వివరించలేదు. సమాజంలోని ఒక వాస్తవ స్థితిని కవి విస్మరించినారు. ఈ కావ్యం కేవలం త్యాగశీలతను కీర్తించినట్లైంది. కేవలం హంపన్న ప్రతిఘటనకే ప్రాముఖ్యతనిచ్చినట్లైంది, సామూహిక నిరసన వ్యక్తం కాలేదు. అందుకే ఈ కావ్యం కళాత్మకంగా గొప్పదైందేగాని రాజకీయంగా కాలేకపోయింది ఐతే రాయలసీమ గ్రామీణ చిత్రణ హృద్యంగా వుంది. పలుకుబళ్ళున్నాయి. అన్నిటికి మించి స్వతంత్రించిన పద్య నిర్మాణం వుంది. సూర్యోదయ వర్ణన, రైలు బండివర్ణన, పాఠకున్ని కావ్యంలో ముందుకు తీసుకెళతాయి.
గ్రామీణ జీవితం:- హంపన్న ఉండే గేటు మీదుగా ప్రతిరోజూ నాగులమ్మ తన జొన్న చేనుకు వెళుతుంది. ఈమెది గుంతకల్లు సొంతవూరు. రోజూ చేసుకుపోయేటప్పుడు గాని, ఇంటికి పోయేప్పుడు గాని హంపన్నతో ముచ్చటిస్తుంది. అతన్ని మామ అని పిలుస్తుంది. కావ్యంలో వీరిద్దరి కలయిక నిండుదనాన్ని చేకూర్చింది. అసలీ పాత్రలేకపోతే కథ లేదు, గదా! వీరిద్దరి సంభాషణలో గ్రామీణ జీవితం వ్యక్తమవుతుంది. ‘‘నాగులమ్మ’’ ఆమె తల్లి లేని పిల్ల, కల్లయి కపటమ్మ, ఉల్లమందురజొరని ఒంటిపిల్ల’’ కవి ఈ పాత్రను సహజంగా చిత్రించినాడు. ఆమె ఆకారాన్ని, స్వభావాన్ని కన్నులకు కట్టినట్లు చూపిస్తాడు. నాగులమ్మ లేకపోతే గ్రామంలో నవ్వులు పూయవట, గయ్యాలులు కూడ ఆమె దగ్గర పిల్లలేనట!
హంపన్నను కాల్చి చంపిన సైనికుడు ‘‘ఆఫ్’’ ఇతనిపై హత్యానేరం కేసును పెట్టినవారు గుత్తి కేశవపిళ్లై ఈ వివరాలు కావ్యంలో లేవు. గుత్తి వైద్యశాలలో శస్తచ్రికిత్స చేసినవాడు కర్రెపియట్. ఇతను అసిస్టెంట్ సర్జన్ ఈ కేసు నాటి మద్రాసు హైకోర్టువరకు నడిచింది. న్యాయమూర్తి కోలెన్స్ సిపాయిలు నిర్దోషులని తీర్పునిచ్చినాడు, ప్రజల చరిత్రలు ఎప్పుడూ గాయాలతోనే ముందుకు సాగుతుంటాయి. కావ్యం ముగింపుతో కవి నేటి స్థితిని గురించి నిర్వేదం చెందుతాడు, హంపన్న స్మారక చిహ్నంపై ‘‘మంత్రులొక్కరైన మాట కచ్చోటికి పోయిరారు, ఒక్క పూలమాల వేయబోరు’’అని పాలకుల నిర్లక్ష్యాన్ని చెబుతాడు.
రాజకీయాన్ని వస్తువుగా గ్రహించి ప్రభుత్వానికి ప్రజలకుండే ఘర్షణనుకాక నాగులమ్మ హంపన్నల మైత్రిని గురించి, సైనికుల ఆగడాలను గురించి వివరించడంవల్ల కావ్యం పాఠకునిపై రాజకీయ ముద్ర వేయలేకపోయింది. ఖండ కావ్యాలు వెలువడిన తరువాత కాలంలో వచ్చిన కావ్యమేమో! ఆనాటి జీవితాన్ని తన దైవశైలిలో ఒక చరిత్రకాంశాన్ని కళాత్మకంగా నిర్మించినవారు విద్వాన్ విశ్వం. చరిత్రను కళగాని, కళను చరిత్రగాని అధిగమించకుండా నడచిన కావ్యమిది, ఒక వాస్తవ సంఘటనను కళగా, సాహిత్య రూపంగా ఎలా మార్చవచ్చునో ఉదాహరణగా ఈ కావ్యాన్ని చెప్పుకోవాలి.
****

- దాస్యం సేనాధిపతి, 9440525544

- దాస్యం సేనాధిపతి, 9440525544