సాహితి

దార్శనికతకు చేవ్రాలు రాయప్రోలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వెండి గొలుసుల లంకె వేసి
ప్రచండమగు నీ నీలి తెరల
తూర్పు వాకిలి తలపు రెక్కల
తొలగ లాగెదరెవ్వరో
- అంటూ గత శతాబ్దం తొలి నాళ్ళలోనే తెలుగు వాకిట నవకవితా యుగోదయానికి బాటలు వేసిన యుగకర్త యుగోదయ ద్రష్ట భావకవితా పితామహుడు, ప్రముఖ కవి దార్శనికుడు ఆచార్య రాయప్రోలు సుబ్బారావు.
రాయప్రోలు సుబ్బారావుగారికి ఆధునిక కవిత్వ క్షేత్రంలో కవిగా ఎంత కీర్తిప్రతిష్ఠలున్నవో విమర్శకుడిగా, సాహిత్య తత్త్వ దార్శకునిడిగా కూడా అంతే కీర్తిప్రతిష్ఠలు సమకూరినవి. దానికి కారణం ఆయన సృష్టించిన విలక్షణమైన వాఙ్మయమే. తృణకంకణాది కావ్యాలతోపాటు రమ్యాలోకాది లక్షణ గ్రంథాలను వ్రాసి సృజన- విమర్శన శక్తియందు రాయప్రోలు సమర్థుడనిపించుకున్నాడు.
ఆధునిక యుగంలో తెలుగులో సాహిత్య సిద్ధాంతాల్ని అందులో కావ్య సౌందర్యపరమైన సిద్ధాంతాల్ని ప్రతిపాదించిన వారు ఒక్క రాయప్రోలు సుబ్బారావుగారే. అందువల్ల రాయప్రోలు ఒక కవి మాత్రమే కాదు, ఒక సాహిత్య దార్శనికుడు కూడా అయినాడు. ఆధునిక కావ్య నిర్మాతలలో అగ్రేసరుడు. ఒక సాహిత్య ఉద్యమానికి నాయకుడు. ఒక యుగకర్త అంతటి ప్రతిభాశాలి అయిన రాయప్రోలు సాహిత్య విమర్శలో ప్రతిపాదించిన అంశాలు ఒక యుగ సాహిత్యాన్ని ప్రభావితం చేసినవవి. అందుకు కారణం ఆయన కాలానుగుణమైన మార్పును ఆహ్వానించడమే.
1892 మార్చి 13న గుంటూరు జిల్లా బాపట్ల తాలూకా గార్లపాడు గ్రామంలో జన్మించిన రాయప్రోలు బాల్యంలో తన మేనమామ అవ్వారి సుబ్రహ్మణ్యశాస్ర్తీ, పినతల్లి నర్సమ్మగార్ల నేతృత్వంలో వేదోపనిషత్తులు, భారత భాగవత రామాయణాది మహాకావ్యాలు కాళిదాసు భవభూతి భానుడు మొదలైన సంస్కృత మహాకవుల నాటకాదులను లోతుగా అధ్యయనం చేసిన మహాప్రతిభాశాలి రాయప్రోలు. సంప్రదాయ సాహిత్యంతోపాటు ఆధునికంగా ప్రసిద్ధులైన ఆంధ్ర కవుల కావ్యాలను కూడా చదవటం దానికితోడు 1914లో గీతాంజలి ప్రభావంతో శాంతినికేతనం వెళ్లి రెండేళ్లు రవీంద్రుని సాహచర్యం పొందడం అక్కడే విధుశేఖర్ భట్టాచర్య, నందాలాల్ బోస్ వంటి మహానుభావుల సాంగత్యం కలగడం అటు సంప్రదాయక భూమిక, ఇటు ఆధునిక విజ్ఞాన పరివేషం ఈ రెండింటి సమన్వయం రాయప్రోలు మేధస్సు నూతన లోకాలకు విజ్ఞాన కవాటలను తెరచింది.
రాయప్రోలు తన అభినతత్త్వ దర్శనాన్ని ప్రధానంగా నాలుగు అంశాలుగా వెల్లడించినారు. అవి 1.సౌందర్యతత్త్వ వివేచనం 2.నిజరస వివేచనం 3.ప్రేమతత్త్వ దర్శనం 4.కావ్య భాషా సమాలోచనం. ఈ నాలుగు అంశాలు ప్రాతిపదికగా సాగిన రాయప్రోలు సాహిత్య విమర్శకు ఆధార గ్రంథాలు ప్రధానంగా మూడు. అవి 1.రమ్యాలోకం 2.మాధురీ దర్శనం 3.రూప నవనీతం.
రాయప్రోలు సాహిత్య విమర్శలో ఒక క్రమానుగతమైన విచార ధార ఈ మూడు గ్రంథాలలో పూర్ణత్వాన్ని పొందినట్లు కనిపిస్తున్నది. రమ్యాలోకంలోని భావాలను కొందరు విమర్శించగా, మాధురీ దర్శనం పేరుతో వారికి జవాబు చెప్పినారు. ఈ రెంటిలో ప్రతిపాదించిన సాహిత్య విమర్శనా తత్త్వమైన సౌందర్య దర్శనాన్ని, ప్రేమతత్త్వాన్ని మరింత విస్తృతంగా స్పృశిస్తూ సరళమైన విధానంతో రూప నవనీతంలో సహృదయావిష్కారం చేసినారు. రాయప్రోలు తత్త్వదర్శనంలో రమ్యాలోకాది గ్రంథాల ద్వారా సిద్ధాంతీకరించిన నాలుగు దృక్పథాలను సంక్షిప్తంగా ఇక్కడ తెలుసుకుందాం.
సౌందర్య దర్శనం
కానబడకనుమాన ప్రమాణమునకె / అందియందని పరతత్త్వమవల నుంచి / పంచభూత భాసితమైన ప్రకృతి కలనె / సన్నిహిత లక్ష్యమనియె వచస్వినేడు - అని అంటాడు రాయప్రోలు. మానవుడు తన జీవన వికాస క్రమంలో వివిధ పరిణామ దశలలో పాశవిక ప్రవృత్తినుండి క్రమంగా ఉన్నత భూమికలోకి ఎదగటం మానవీయ లక్షణాన్ని సంపాదించి పెంచుకోవటంలో, దాన్ని సమగ్రీకరించి దివ్యత్వాన్ని అనుభవంలోకి తెచ్చుకోవడంలో సౌందర్యం అత్యంత కీలకమైన అంశం. అందువల్ల మానవునికి సృష్టిగత సౌందర్యమే ప్రధానమైదని రాయప్రోలు వెల్లడించినాడు. వ్యక్తిలో అభిరుచి క్రమంను బట్టి సౌందర్యం ఆస్వాదింపబడుతుందన్న విషయాన్ని వెల్లడిస్తూ రాయప్రోలు
అట్టి సౌందర్యమీ సుప్రకృతి ధరించు / బహు విధాల అనంత రూపముల నెపుడు / రక్తినర్చింతు రభిరుచి క్రమము కొలది / శిల్పులకు గాయకులు, కవిశేఖరలును
- అని అంటాడు, ప్రకృతి సౌందర్యాన్ని ధరిస్తున్నది అనటంలో సౌందర్యం ప్రాకృతిక వస్తుగతమని తాత్పర్యం. ఈ సౌందర్యం బహు విధాలుగా అనంత రూపాలలో వ్యక్తమవుతున్నది. అభిరుచి ననుసరించి కొన్ని కొన్ని విధాలు కొన్ని కొన్ని రూపాలు సౌందర్య బోధను కలిగిస్తున్నాయి. ఆరాధింపబడుతున్నాయి. ఇక్కడ శిల్పులు మొదలైన వారి ప్రస్తావన కళల ద్వారా సౌందర్యాన్ని ఆవిష్కరించుటలో వైవిధ్యం సూచించటం కొరకే కాని, సౌందర్య బోధ పొందే వ్యక్తులందరికి ఈ అభిరుచిపరమైన అర్చన వర్తిస్తుంది. రాయప్రోలు సౌందర్య విషయంలో రెండు విలువలను ప్రతిపాదిస్తూ -
శీలమట్టుల నౌచితిం జెదరనీక / అహి విధానమశ్లీల మనాదరించి / ప్రేమ మంత్ర మహోపాసనామయులగు / నవ్యులకుపాధియయ్యె సౌందర్యమొకటె - అని అంటాడు. ఆధునిక కవులకు సౌందర్యం లక్ష్యం కావాలంటూనే ఔచిత్య సాహిత్యం, అశ్లీల రాహిత్యం అన్నవి రెండు ముఖ్యమైన విలువలుగా పేర్కొన్నాడు. సౌందర్య విషయంలో ఔచిత్యాన్ని శీలాన్ని వలె చెదిరిపోకుండా రక్షించుకోవలసి ఉంటుందని రాయప్రోలు అభిప్రాయం.
నిజనరవివేచనం
నిజరసమంటే ఋతురసమని రాయప్రోలు తాత్పర్యం. ఋతుమంటే సత్యమని అర్థం అంటే సత్యరసమును శాంతముగా రాయప్రోలు ప్రతిపాదించినాడు. కావ్యపరమార్థ తత్త్వాభిముఖంగా రాయప్రోలు రసవివేచనం కొనసాగింది.
ఖేదమోదప్రసక్తులన్ భిన్నకుశల / దశలకు వశంవదమగుచు తన్మయమయి / తన్మయమొనర్చు సహృదయాంతః కరణము / ఖోపభోగ్యమె రసమనగనొప్పు కృతుల - ఇది ఆధునిక వివేచనా మార్గంలో రాయప్రోలు నిర్వచించిన రససూత్రం. ఈ రస నిర్వచనము రాయప్రోలు ప్రతిపాదించిన నిజరస సిద్ధాంతమునకు భూమిక. మనస్సు, బుద్ధి, అహంకార చిత్తములకు అంతఃకరణ చతుష్టయమని పేరు. అంతఃకరుణ ముఖంగా అంటే చిట్టిచివరిదైన చిత్తము ద్వారా అనుభవింపబడేది రసమని రాయప్రోలు తాత్పర్యం. రసము, ఆనందము, సౌందర్యము అన్నవి ఏకావరణ జన్యములే. ఆనందాన్ని అనుభవించే స్థితికి రసమని వ్యవహారం. ఆ అనుభవానికి ఆనందమని పేరు. రసాస్వాదనం, రసానుభవం, రసానందం మొదలయిన వ్యావహారం ఈ అంశానే్న స్పష్టపరుస్తుంది. ఈ ఆనందం సౌందర్యమయమైంది. సౌందర్యం లేక ఆనందం కలుగదు. ఆనందం కలిగించనిది సౌందర్యం కాదు. ప్రాచీన అలంకారికులు రస విషయంలో వెల్లడించిన భిన్న భిన్న అభిప్రాయములను దృష్టిలో పెట్టుకొని సమకాలీన సమాజ వ్యవస్థకు అనుగుణంగా రాయప్రోలు శాంతమును నిజరసముగా ప్రతిపాదిస్తూ
కరుణ శృంగారములు రెండె కావ్యమందు
నిజరస విపాకభోగ మందింపగలవు
అని అంటాడు. ఖేద, మోద ప్రసక్తులైన కరుణ శృంగారములు నిజరసాన్ని (శాంతమును) చేరుకోవడానికి ప్రధాన వాహికల వంటివని చెప్పినాడు. ప్రధానమైన ఈ రెండు (కరుణ శృంగారములు) ప్రవృత్తి రసములు నివృత్తి రసమైన నిజరసమును (శాంతము)ను చేరుకోవడానికి కారణాలవుతున్నాయని చెప్పడంలో రాయప్రోలు శాంతమును మూలరసంగా ఋతరసంగా, నిజరసంగా, ప్రతిపాదించినాడని స్పష్టవౌతున్నది. అందుకే నిజరసమయిన శాంతమును గూర్చి రాయప్రోలు ఇలా అంటాడు.
సృష్టికొక్క సుస్థాయి అభీష్టమేమి / శాంతమగు, నది విషయ విశ్రాంతిమయము / సంయమించిన ఇంద్రియ స్థాయి పదము / సాహితీ రస పర్యవసాయి అదియె
ప్రేమతత్త్వ దర్శనం
సాహిత్య విమర్శలో రాయప్రోలు ప్రతిపాదించిన మూడవ అంశం ప్రేమతత్త్వ దర్శనం. ఈ ప్రేమతత్త్వానే్న రాయప్రోలు తరువాతి దశలో అమలిన శృంగారంగా సంకేతించినాడు.
చిన్ని నివ్వరి సిగవలె సన్నగా త / ళుక్కుమన నాత్మకలజూచె నొక్క ద్రష్ట / నవ్యతృణకంకణాభరణ, ప్రయుక్తి / ప్రేమయోగమొక్కండు భావించెనేడు
ప్రేమ యొక్క స్వరూపం ఎంత సూక్ష్మమైనదో రాయప్రోలు ఈ పద్యంలో వెల్లడించినాడు. నివ్వరిసిగవలె అత్యంత సూక్ష్మమైన బ్రహ్మస్వరూపమును ఋషులు దర్శించినట్లుగా తన తృణకంకణ కావ్యంలో ప్రేమయోగాన్ని ప్రేమతత్వ దర్శనాన్ని భావించినానని రాయప్రోలు చెప్పినాడు. ‘‘తపస్సుచే, తాలిమిచే ధ్యానధారచే లీనమై ఐక్యమీయజాలినది ప్రేమ’’ అని రాయప్రోలు ప్రేమకు నిర్వచనం చెప్పినాడు. స్ర్తి పురుషుల పరస్పర త్యాగభాగదేయ ఫలితమే దాంపత్యమని దాంపత్య ప్రేమను నిర్వచించినాడు రాయప్రోలు.
జీవితంలో ప్రేమ శిఖరాన్ని అధిరోహించాలంటే స్నేహ సురత వాత్సల్యములు అను మూడు ప్రధానాంగములు. మూడు దశలలో ప్రేమ శిఖరానికి మూడు మెట్ల వంటివని పేర్కొన్నాడు.
స్నేహసురత వాత్సల్యముల్ జీవితమున
ప్రేమ కంగంబులగు అంగి ప్రేమయొకడె
ప్రేమ శిఖరావరోణాభిజ్ఞులయిన
మృదు సహృదయుల కివియెల్ల మెట్టులగును
కావ్యభాషా సమాలోచనం
రాయప్రోలు సాహిత్య విమర్శలో నాలుగవ ప్రధానాంశం కావ్య భాషా సమాలోచనం. ఇది రమ్యతా పరివేషంలో సాగింది. కావ్య సౌందర్య మీమాంసలో ప్రప్రథమంగా ప్రసక్తమయ్యేది భాష. భాష శబ్దమయం. ఈ శబ్దం లేదా వాక్కు మానవ ముఖం నుండి నిర్గుతమయ్యే దశకు పూర్వం ‘నాదం’గా ప్రవర్తించింది. ఈ నాదాన్ని ఈ శబ్దాన్ని ఉపాసన చేసినవారే మహాకవులైనారు. శబ్ద బ్రహ్మవేత్తలైనారు. వాల్మీక్యాది మహర్షులు, త్యాగరాజాది నాదోపాసకులు ఇందుకుదాహరణ. అందుకే రాయప్రోలు నాదం శబ్దంగా భాషగా పరిణమించటాన్ని ఇలా వర్ణించినాడు.
ఆకసంబున మొలచి అవ్యక్తనాద
భంగమయి, శృతియయి, స్వరజటాక
లాపమై వర్ణమాలయై లలిత శబ్ద
మయిన భాషా జగత్కంజలింతు
ఇక్కడ శబ్దం ఉన్నత భూమికల నుండి అవతరించే తీరులోని పరిణామక్రమం చెప్పబడింది. శబ్దగుణమాకాశమన్నది సుప్రసిద్ధమే. రాయప్రోలు ఆధునికంగా ప్రవేశపెట్టిన కావ్య భాషా రచనా విధానానికి భంగిమ అని పేరు పెట్టినాడు. దీనికి ఆయన నిర్దేశించిన లక్షణమిది.
మృదుల సరళాక్షరముల సమ్మేళనాప్తి
నార్ద్రనవనీత మార్దవ మందు నుడువు
శ్రవణ సుఖమిచ్చు సులలితోచ్చారణమున
భంగిమ యటందురీ పదబంధ సరణి
పదబంధ సరణిని భంగిమ అన్న రాయప్రోలు పదాల కూర్పులో నూతనత్వాన్ని ఆవిష్కరించి తెలుగు కవులలో నన్నయ తర్వాత మళ్లీ అంతటి వాడనిపించుకున్నాడు.
ధర్మమనుడు యోగమనుడు తత్వమనుడు
ప్రాణిసాధింపగల పరమార్థములకు
తల్లి భాష ప్రధాన సూత్రం బయగుట
భాషకంటె నవ్వులకు తపస్సు లేదు
అంటూ తన రమ్యాలోకంలో మాతృభాషా ప్రాధాన్యాన్ని వెల్లడించిన రాయప్రోలు గొప్ప భాషాతపస్వి. తనదైన దర్శనంతో నూతన కావ్యభాషా రచన విధానం వెయ్యేళ్ళ తెలుగు సాహిత్యాన్ని తన పద్మపీఠికగా చేసుకొని కూర్చున్న చతుర్ముఖ బ్రహ్మవలె సాక్షాత్కరిస్తాడు రాయప్రోలు సుబ్బారావు.

ఆచార్య కె.యాదగిరి, 9390113169