సాహితి

‘సాహిత్యం’తో ప్రజా చైతన్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సాహిత్యం ప్రజలను చైతన్యపరుస్తుంది. ఆరోజుల్లో ఆంగ్లేయుల కబంధ హస్తాలనుండి బయటపడేందుకు ఎందరో కవులు దేశభక్తి గీతాలను రాసి ప్రజలను చైతన్యవంతులను చేసారు. కథైనా, నాటకమైనా సమాజంలోని సమస్యలను వెలికితీయడమే ప్రధాన ఉద్దేశ్యం. ఆధునిక తెలుగు కథానిక 1910 సంవత్సరంలో మహాకవి గురజాడ అప్పారావు చేతిలో ఆవిర్భవించింది.
ఒకప్పుడు కాలక్షేపానికి పరిమితమైన కథానిక నేడు సామాన్య మానవ జీవిత పరిధిలోనికి చొచ్చుకుపోయి సమాజంలోని లోటుపాట్లును ఎత్తిచూపుతూ దిశానిర్దేశం చేస్తోంది. ఈమధ్యకాలంలో ముఖ్యంగా కొత్త రచయితలు సమాజంలోని సంఘటనలను పరిశీలించి ఎంతో గొప్పగా కథలు రాస్తున్నారు. మీడియా ప్రభావంవల్ల కొంతకాలంపాటు పాఠకులు పుస్తక పఠనానికి దూరమైనా ఇటీవల కాలంలో పుస్తకాలను చదివే పాఠకుల సంఖ్య పెరిగింది.
మానవుడు తల్లి గర్భంలోనుండి భూమిపై పడ్డ 3,4 సంవత్సరాల నుండి కథలతో సాన్నిహిత్యం ఏర్పడుతుంది. చిన్నతనంలో తల్లి గోరుముద్దలు తినిపిస్తూ చందమామను చూపించి ‘చందమామ రావే’అంటూ పాడుతుంది. అమ్మ పాడే ఆ పాటలోనూ సాహిత్యం ఉంది. ఆ తర్వాత కొంత కాలానికి ఆరు, ఏడు సంవత్సరాలు రాగానే కథలు చెప్పమంటూ అమ్మమ్మ, నాయినమ్మలను సతాయిస్తారు. అలా కొంతకాలానికి బాలల పత్రికలు చదవడం అలవాటు చేసుకుంటారు. ఆ పత్రికల్లో ప్రచురించబడ్డ కథలే పిల్లలను సన్మార్గం వైపు నడిపించే కరదీపికలవుతాయి. ఈ విధంగా మనిషికి ఊహ తెలిసినప్పుడే మొదలైన కథకు ఎప్పుడూ చెడ్డరోజులు రాలేదు. కాకపోతే పటుత్వమైన కథలు ఎక్కువగా రావడం లేదు. కొన్ని కొన్ని కథలు మళ్ళీమళ్ళీ చదివించేవిగా ఉంటాయి. ఇక మీడియాపరంగా పరిశీలిస్తే కొన్ని చానళ్ళు సాహిత్యంపై ప్రత్యేక కార్యక్రమాలు ఏర్పాటుచేయడం శుభ పరిమాణం.
సాహిత్యం ద్వారా ప్రజల్లో మార్పు వస్తుందా? అంటే చెప్పడం కాస్త కష్టమైనా మార్పురావడానికి తప్పనిసరిగా ఉపయోగపడుతుందనే చెప్పాలి. బాల్య వివాహాలు జరిగే రోజుల్లో గురజాడ అప్పారావు కన్యాశుల్కం రచన చేసారు. డబ్బుకోసం ఊహ తెలియని చిన్నారులను వృద్ధులకిచ్చి వివాహం జరిపించేవారు. ఆ సమస్యను తీసుకుని గురజాడ ఎంతో కరుణ రసాత్మకంగా పుత్తడిబొమ్మ పూర్ణమ్మను రచించారు. పూర్ణమ్మ రచన చదివిన వారికి కళ్ళుచెమర్చక మానవు. బాల్య వివాహాలపై తన రచన పుత్తడిబొమ్మ పూర్ణమ్మ రచన ద్వారా ధ్వజమెత్తాడు గురజాడ. కథ, కవిత, నవల, నాటకం ఏ రచనైనా కానీయండి వాటి ద్వారా సమాజాన్ని మార్చగలిగేందుకు ప్రయత్నిస్తే చాలా మంచిది.
అసలు సమాజమంటే ఏమిటి? మారే స్వభావం కలదే సమాజం. మానవ స్వభావాలు మారినట్లే సమస్యలుకూడా ఎప్పటికప్పుడు మారుతుంటాయి. ఆ సమస్యలకు పరిష్కారం చూపుతూ రచనలుచేస్తే ఉపయోగకరంగా ఉంటుంది. సమాజంలో మారుతున్న సమస్యలతోపాటు ఎప్పటికీ మారని సమస్యలు కూడా ఉన్నాయి.
ప్రస్తుతం పాఠకులు మినీ కథలు చదవడంలోనే ఎక్కువగా ఆసక్తిని ప్రదర్శిస్తున్నారు. తీరికవేళల్లో, ప్రయాణ సమయాల్లో మినీ కథలను చదువుతున్నారనే చెప్పాలి. ఈమధ్యకాలంలో ఓ రచయిత మిత్రునితో మాట్లాడుతూ మీరెందుకు మినీ కథలే రాస్తుంటారు. నాలుగైదు పేజీల కథలెందుకు రాయరు? అని అడిగా. దానికతను ఐదారు పేజీల కథలను చదివే ఓపిక ఈనాటి పాఠకులకు లేదన్నారు. అందుకే నేను మినీ కథలకే ఎక్కువ ప్రాధాన్యతను ఇస్తాను అని అన్నారు.
ఈనాటి సమాజానికి సాహిత్యం అవసరం ఎంతో ఉంది. కథ, నవల, వ్యాసం, కవిత, ఇలా అన్ని ప్రక్రియలను చదివి వాటిలో చక్కని అవగాహన చేసుకున్ననాడు మరిన్ని మంచి రచనలు వెలువడడానికి ఆస్కారం ఉంది. ఆ దిశగా ప్రతీ ఒక్కరూ కృషిచేసి మన తెలుగుభాష గొప్పదనాన్ని దేశ విదేశాల్లో వ్యాప్తిచేయాలి. ఆ దిశగా కృషిచేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

- ఎం.సోమశేఖరాచార్యులు