సాహితి

వాదాలు మాత్రమే సాహిత్యం కాదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘సాహిత్యం’ అనేది విస్తృతమైన పదం. సహితమైనది సాహిత్యమనీ, శబ్దార్థాల కలయిక సాహిత్యమనీ చెప్పారు. సాహిత్యమనేది అక్షరార్చన. ఒక తపనగా వుండాలి. విశ్వనాథ వారి మాటల్లో అదొక జీవుని వేదన. అక్షరార్చనాపరుడికి జాషువా ప్రకటించిన ‘ఆర్ద్ర హృదయం’ ఎంత అవసరమో శ్రీశ్రీ వెల్లడించిన కవితావేశమూ అంతే అవసరం. అయితే ఈ ఆవేశం తిక్కన నిర్దేశించినట్టు ‘్భవ్య కవితావేశం’గా వుండాలి. సాహిత్యం కాలమనే ‘యాసిడ్ టెస్ట్’కి నిలవాలి. ఏది రాశామన్నది కంటె ఎంతమంది స్పందించారనేది ముఖ్యం. ఎంత రాశామన్నది కంటె ఆ రాసింది హృదయంతో రాస్తున్నావా? ఎవరికోసమో రాస్తున్నావా? ఫలానా వాదిగా కీర్తినీ, పురస్కారాలనూ పొందడానికి రాస్తున్నావా? కవి లేదా రచయిత హృదయపు లోతుల్లోకి వెళ్లి అనుశీలించి రాస్తున్నావా? ఒక వర్గపు ముద్రకోసం రాస్తున్నావా? .. ఇటువంటి ప్రశ్నలు యాభై సంవత్సరాల సాహితీ పరిశీలనతో ‘వడి వడిగా అడుగిడుగా’ సంధించినవే!
వాదాలవల్ల సాహిత్యానికి ప్రయోజనం చేకూరిందన్నది కొంత నిజమే. కానీ ఆ వాదాల వారికే బాగా లాభించింది... ఇప్పుడూ లాభిస్తోంది. చివరకు ఈ వాదాలు ఎంతవరకు దారితీస్తున్నాయంటే ఎవరైనా సాహిత్య సభల్లో మాట్లాడితే శ్రోతలు ‘‘వీరు ఏ వాదానికి చెందినవారు?’’ అని అడుగుతున్నారు. ఇదేమీ గర్వకారణం కాదు- సంకుచిత తత్త్వం- కాదంటే కుండీలో మర్రిచెట్టు!
జాతీయవాదం స్వాతంత్రోద్యమంలో సాగింది. మహోధ్ధృతంగా సాగింది. దేశభక్తి, పరాయిపాలన, దేశ పూర్వవైభవం, అనేక సంస్కరణల ప్రయత్నాలు వంటివి ఆ ఉద్యమంలో నినదించాయి. భారతీయుల్ని ఏకత్రాటిపై నిలిపాయి. జాతీయోద్యమాన్ని రగిలించాయి. నేటివరకు అప్పటి కవిత్వం, కథలు, నవలలు ఎంతగా నిలిచాయో తెలుసు. ఒక లక్ష్యం కోసం ప్రారంభించబడిన ఆ ఉద్యమం ఫలప్రదమైంది. జాతీయోద్యమవాదం ఈ నేలపై, ఇక్కడి సిద్ధాంతాలతో, ఇక్కడి ప్రజలు మమేకంగా వెలువడింది కాబట్టి సర్వజనవాదమైంది. అందుకే విజయవంతమైంది. ఎప్పుడైనా, ఎన్ని లోపాలున్నా దేశభక్తి అవసరమని చాటి చెప్పిన వాదమది. అంటే అది సార్వకాలికమూ, సార్వజనీనమూ అయినది. అంటే దేశమంతా ‘సుజలాం, సుఫలాం’లాగా వుందని కాదు.
వాద చోదకులు, వాదాభిలాషులు తెలుసుకోవలసిన, అనుశీలించవలసిన ముఖ్యాంశం ఒకటి వుంది. భారతదేశం సింగపూర్, మారిషస్‌ల వంటి ‘బుల్లి’ దేశం కాదు. ఒకే జాతి, ఒకే భాష, ఒకే మతం ఉన్న దేశం కూడా కాదు. అయినా ఇతర దేశాలతో పోటీపడి నిలవ కలుగుతున్నాం. కొత్త మార్పుల్ని సాగతిస్తున్నాం.
భావకవిత్వం వచ్చిన రోజుల్లో అంతా ‘్భలే కవిత్వం’ అంటూ ఉవ్విళ్ళూరారు. శ్రీశ్రీ కూడా ప్రభవలో భావకవిత్వం అల్లాడు. 1910 నుంచి 35 వరకూ ఈ ఉద్యమం కొనసాగింది. దాదాపు అంతా భావకవిగా అవతరించారు. ఈ కవిత్వం సరికాదనీ, అస్పష్టమనీ పులుముడు కవిత్వమనీ ఎవరో ఒక పెద్దాయన రాస్తే చాలామంది ఆ విమర్శ గ్రంథాన్ని నెత్తిన పెట్టుకున్నారు తప్ప అందులోని గూఢాంశాలను, తత్వాన్ని తెలుసుకుందామని తక్కువమందే ప్రయత్నించారు. ‘‘పాడిందే పాట’’గా ఉందని విమర్శించారు. అయినా ఆ భావికవిత్వం కవితా ప్రియుల్ని వదలలేదు. సినిమాల ద్వారా, లలిత సంగీతం ద్వారా భావ కవిత్వం కాలానికి నిలబడింది.
అభ్యుదయవాదం మహోజ్జ్వలంగా వెలువడింది. శ్రీశ్రీని నాయకుడ్ని చేసింది. అయితే ఈ వాదం కూడా రెండు ముక్కలైంది. ఎవరి కుంపటి వారు పెట్టుకున్నారు. ‘మహాప్రస్థానం’ ఒక్కటే అభ్యుదయవాదానికి ఊపిరి ఇస్తోంది. ఇందులోనూ అభ్యుయేతర కవితలూ ఉన్నాయి. ఆత్మాశ్రయ, అనుభూతి కవితలు ఉన్నాయి. కృష్ణపక్షంలాగా అస్పష్టత, నిరర్థకతలు చోటుచేసుకొన్నాయి. జగన్నాథ రథచక్రాలు వస్తున్నాయని శ్రీశ్రీ ఎప్పుడో వేసిన కేక గాలిలో కలిసిపోయింది. ఇవాళ అరసం ఉందా? అంటే ‘‘ఉందిగానీ...’’ అని సణగాల్సిందే. దీనికంటే తెలకపల్లి రవి సాహిత్య స్రవంతి బాగా చురుగ్గా పనిచేస్తోంది. దిగంబర కవులన్నట్టు అభ్యుదయం అడుగంటింది. విశ్వనాథ వెనక్కి వెళ్ళగా ఏమోగానీ శ్రీశ్రీ వెళ్ళిన తర్వాత చతికిలబడి వాదం బలహీనమైంది. ప్రజల్ని ఆవేశపరిచే లేదా సామ్యవాదం వైపు నడిపించే కలాలు నీరసపడ్డాయి.
విరసం తన స్థాయిలో అంతో ఇంతో నిబద్ధతంగా పనిచేస్తోంది కానీ పూర్వ వైభవం లేదు. చెరబండరాజు, శివసాగర్ వంటి స్పందింపజేసే శక్తిగల వారేరీ? దిగంబరవాదం గాలిబుడగలా వచ్చి పేలిపోయింది. నిజానికి 1970-71లో అవినీతిగాని, లంగా మార్కుల సినిమాలు కానీ, అగాథమీలుగానీ, బాబాలుగానీ ఇప్పటిలాగా అధ్వాన్నంగా లేవు. అప్పుడేదో క్షణికావేశంతో ఏదో చెయ్యాలన్న ఖంగారుతో ఆరుగురు ఏదేదో రాశారు. అన్ని వాదాలలో కంటే రెండు మూడేళ్ళలోనే ముగిసిన పిల్ల ఉద్యమమిది. చదువుదామన్నా, ఇతరులకి చదువమని చెప్దామన్నా చెప్పలేని స్థితి. స్ర్తివాదులచే మొట్టికాలు తిని కనుమరుగైపోయిన వాదమిది.
స్ర్తివాదం కొత్త అంశాలను వెలుగులోకి తెచ్చింది. స్ర్తిల సమస్యల్ని కళ్ళకు కట్టింది. మళ్లీ ఈ స్ర్తివాదులు దానిని పెట్టెలో పెట్టి తాళం వేసేశారు. స్ర్తివాదం వచ్చినప్పటికంటే ఇప్పుడు స్ర్తిల దుస్థితి భయానకంగా, అభద్రతాభావంగా వుంది. వ్యాపార ప్రకటనలో, సినిమాలలో ఆడియో విడుదల, ఫిలిం పురస్కారాల సభల్లో ఆడదానిని ‘అంగడిబొమ్మ’గా చూపిస్తూ ఉంటే హాయిగా అప్పుడప్పుడు స్టార్ హోటళ్ళల్లో విందులతో ఉపన్యాసాలిస్తున్నారు. ఆనాడు కళ్ళెర్రజేసినవాళ్ళు ఇప్పుడు పబ్బం గడుపుకుంటున్నారు. ఏమీ పట్టనట్టు నటిస్తున్నారు. పైకి మాత్రం స్ర్తివాదముద్ర!
దళితవాదం పదేళ్ళకు పైగా పెనుగాలిలా వచ్చింది. కొత్త ఆలోచనలను కలిగించింది. భాషా స్వేచ్ఛను బహిరంగపరిచింది. ఎప్పుడైతే రెండుగా వర్గీకరణ రణంలో మునిగిపోయారో దళితవాదం చతికిలబడింది. అప్పుడప్పుడు జయంతులు, వర్థంతులు చేస్తూ ‘మేమున్నాము సుమా’ అంటున్నారు. అంబేద్కర్ కుల నిర్మూలన కోసం పట్టుబడితే, ఇప్పుడు కుల ద్వేషం బలీయమవుతోంది. ఎన్ని అవకాశాలు వచ్చినా ఇంకా ఆధిపత్య ధోరణిని స్వీకరిస్తున్నారు. ఎంతసేపు పాడిందే పాటగా చెప్తున్నారు. జాషువాను తప్ప కుసుమ ధర్మన్న కవిని ‘బాగుండదని’ ప్రకటిస్తున్నారు. ఎవరైతే స్ఫూర్తిప్రదాతో అతనికి అన్యాయం జరుగుతోంది (పుస్తకాలు వేశాం గదా అంటే చాలదు). పదవులు, పురస్కారాలు, ప్రభుత్వ అవకాశాలూ అన్నీ ఒక ‘ముద్ర’ వేసుకొన్నవారికే దక్కుతున్నాయి. జాషువా ఆ రోజుల్లో గౌరవం కలానికా? కులానికా? అన్న ప్రశ్న ఇపుడు ఇతర కులాలవారు వేయాల్సి వస్తోంది.
ఈ వాదాలవల్ల అనుభూతి కవిత్వం, మానవీయ కవిత్వం, ఆర్ద్ర కవిత్వం వంటివాటికి చెల్లు చీటీ రాస్తున్నారు. జ్ఞాపకాల గురించి రాస్తూంటే ‘నోస్తాలజీ’ అని నొసలు చిట్లిస్తున్నారు. కట్నాలకోసం, ఎన్.ఆర్.ఐల భర్తలకోసం అర్రులు చాస్తుంటే స్ర్తివాదులుగా పేరు ‘మోసిన’వాళ్ళు నిమ్మకు నీరెత్తినట్టు ఉంటున్నారు. జాషువా ‘విశ్వనరుడ నేను’ అని చాటి చెప్తే- ‘‘కాదు నువ్వు మా కులానివే, అలా కూర్చో’’ అంటున్నారు. మంగిపూడి వేంకట శర్మ హేతుబద్ధంగా ‘నిరుద్ధ్భారతం’లో అంటరానితనాన్ని నిరసిస్తూ 1951లో రాస్తే దానిని అణివేశారు. కాటూరివారి ‘గుడిగంటలు’, ఎన్.జి.రంగా ‘హరిజన నాయకుడు’, వేంకటపార్వతీశ కవుల ‘మాతృమందిరం’ వంటి వాటిని మూలపడేశారు. కృష్ణశాస్ర్తీ జీవితతత్వాన్ని, బాధనీ, మరణాన్నీ చెప్పి వ్యక్తిత్వ వికాసాన్ని చెప్పాడనీ చెప్పరు. ధూర్జటి కొడుకులు లేకపోయినా మోక్షం వస్తుందనీ పలకరు. ఆనాడు రాజుల్ని తిట్టిపోసిన కవుల ధైర్యం ఇవాళ ఎంతమంది కవులకి వుందో ఆత్మపరిశీలన చేసుకోవాలి. ప్రాంతీయవాదం ఒకే జాతి మధ్య చిచ్చుపెడుతుంటే ‘పెదవి కదల్పరు’. ఒక వాదంవారి సభలకి మరొకవాదం వారిని పిలవరు. పిలిచినా వేదిక ఎక్కనివ్వరు. బయట ఓహో అంటూ పుస్తక సమీక్షలు రాయించుకుంటూ వేదికమీదకి పిలిస్తే ‘మైల’ పడతామంటారు. ఒకనాడు ధర్మన్న కవి కులాధిక్యతపై ఎక్కుపెడితే ఇవాళ ఒకే వర్గంవారు ఇతర వర్గాలపై ఎక్కుపెడుతున్నారు. అందుకే యువత సాహిత్యానికి దూరమవుతోంది. మన భాషా ప్రభావం, పద్యవైభవం, కవుల ప్రావీణ్యం చెప్పేవారు లేక ‘వాదాలమయం’ కావటంతో యువత మిగిలిన రంగాలపై ఆసక్తి చూపుతోంది. విదేశాలలోని తెలుగువారి గురించి కాదు- ఇక్కడివారి గురించే ఆవేదన. అన్ని వాదాలూ, అన్ని కవిత్వాలూ, అన్ని భావాలూ సాహిత్య రంగంలో వున్నవారు ఆహ్వానించాలి, ఆదరించాలి. లేకపోతే రాబోయే తరం మనల్ని ‘అవశేషాలుగా’ గుర్తిస్తుంది.

- ద్వా.నా.శాస్ర్తీ, 9849293376