సాహితి

కళ్లకు కట్టిన కాకతీయ వైభవం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాకతీయ కళాదర్శనము
ప్రొ. ముదిగొండ శివప్రసాద్
2/2/647/132బి, సెంట్రల్ ఎక్సైజ్ కాలనీ,
హైదరాబాద్ - 500 013,
పేజీలు: 14+384, వెల: రు.500/-
*
తెలుగు ప్రాంతాలను సుమారు 350 సంవత్సరాలు పరిపాలించిన కాకతీయ రాజుల రాజకీయ సామాజిక సాంస్కృతిక పార్శ్వాలను గురించిన విపులమైన అధ్యయనం.
కాకతీయులు ఏ రాజవంశానికో చెందినవారు కాదు. భూమి పుత్రులు రైతులుగా, సైనికులుగా, సేనాపతులుగా క్రమంగా మెట్లెక్కుతూ వచ్చి చాళుక్యులకు సామంతులై రాజ్యాధికారాన్ని చేపట్టారు.
కాకతీయుల రాజ్యపాలనలో మానవుని సమగ్ర వికాసానికి సంబంధించిన ఒక సమన్వయ దృష్టి ఉన్నది. భూమాతను చెరువుల ద్వారా సేవించి సస్యశ్యామలమైన కరవులకు తావులేని ఒక సమాజాన్ని నిర్మించారు. గ్రామ వ్యవస్థను సరళీకరించి వివాదరహితం చేసారు. గ్రామదేవతారాధనకు ప్రాధాన్యమిచ్చి గ్రామీణములైన పండుగలను అనుష్టించారు. సమీప భవిష్యత్తులో రచించబడ్డ క్రీడాభిరామం ఈ అంశాలను వెల్లడించింది. కాకతమ్మ, వనవీర, భద్రకాళి, మాహురమ్మ ఇత్యాది దేవతలకు గౌరవాదరాలు పెరిగాయి.
మత సంబంధంగా తాము జైనులైనా, శైవులైనా తమ విశ్వాసాలకు అతీతంగా త్రికూటాలయాలు నిర్మించారు. రుద్రదేవర, వాసుదేవర, సూర్యదేవతలను ప్రతిష్ఠించడమే కాకుండా గణేశ, కుమార తత్త్వాలకు దేవీ తత్త్వానికీ సముచిత ప్రాధాన్యమిచ్చారు.
డాక్టర్ శివప్రసాద్ తమ గ్రంథంలో ఈ విషయాలన్నీ విశదంగా వివరించారు. కాకతీయుల కాలంలో నృత్య గానాలకు సముచిత ప్రాధాన్యం ఉండేదనడానికి జాయపనాటి రామప్ప దేవాలయం సాక్షి. అక్కడి కోష్ఠ ప్రతిమలు ఆనాడు అటవీ ప్రాంతాలలో జరిగే రహస్య తాంత్రికోపాసనలు తెలియజేస్తాయి.
కాకతీయ శిల్పాలలో నృత్య రత్నావళిలోని భంగిమలే కాక, నాట్య శాస్తమ్రు, అభినయ దర్పణములోని నర్తన ముద్రలు కానవస్తాయి. డాక్టర్ శివప్రసాద్ ఈ గ్రంథంలో ప్రేరణి (పేరిణి) నృత్తమును గురించి విశేషంగా వివరించారు.
ప్రత్యేకంగా ఒక అధ్యాయం కాకతీయ శిల్ప రీతిని విశే్లషించేది దీనిలో ఉన్నది. సాంచీ తోరణానికి కాకతీయుల తోరణాలకు గల పోలికలు చర్చింపబడ్డాయి. హోయసల శిల్పమూర్తులు పొట్టివనీ, అలంకార భారం కలవని పేర్కొని కాకతీయ శిల్పమూర్తులు పొడవుగా, సన్నగా ఉంటాయని శివప్రసాద్ తేల్చి చెప్పారు. ఇంత విశే్లషించి శివప్రసాద్-కాకతీయ శిల్పాలంకారం నాగార్జునకొండ, అమరావతి శిల్పాలకన్నా ముందంజ వేసింది-అని నిశ్చయించారు.
కాకతీయుల రాజ్యం తొలిదశలోనే పాంచరాత్ర శైవాగమాలు, ఇతరాగమాలు ఈ ప్రాంతంలో అధ్యయనాధ్యాయనాలలో ఉన్నాయి. వేయి స్తంభం గుడిలో వాసుదేవాలయం వెనుకభాగంలో ఆగమాలలో పేర్కొన్న కేశవాది చతుర్వింశతి మూర్తులు ఉన్నాయి. సూర్యాలయం చుట్టూ సూర్యదేవ మూర్తులు, రుద్రదేవుని ఆలయం చుట్టూ రుద్రమూర్తులూ ఉన్నాయి. బసవేశ్వర రామానుజుల శైవ వైష్ణవ వ్యాప్తితోపాటు, సంప్రదాయాగమాలు కూడా ఇక్కడ వ్యాప్తిలోనికి వచ్చినట్టుగా భావించవచ్చును.
మొత్తంమీద డాక్టర్ శివప్రసాద్ తన గ్రంథంలో శాసనాలను, సంగీతాది శాస్త్రాలను, జానపద కళలను, రాజకీయ చరిత్రను ఇలా అనేక ఇతరాంశాలను విపులంగా చర్చించి ఒక ప్రామాణికమైన గ్రంథాన్ని అందించారు.
కాకతీయుల కాలంలో తటాకాల స్పర్శతో భూమి పులకించి ధాన్యాన్ని అందించింది. గ్రామాలు జానపదోత్సవాలతో దేవతారాధనలతో సుఖంగా ఉన్నాయి. అష్టాదశ వృత్తుల వారి సామరస్యం వల్ల సమాజం ఆనందోల్లాసితమైంది. అనేక శిల్పసహిత నానా దేవతాలయాలవల్ల ప్రజల ఆధ్యాత్మిక చైతన్యం వృద్ధి పొందింది. రక్షణ విషయంలో సైన్యం సమృద్ధంగా ఉన్నది. అందరు రాజులూ-రాణి రుద్రమతో సహా యుద్ధాలలో పాల్గొన్నవారే. సంస్కృతాంధ్ర సారస్వతాలు వైభవాన్ని పొందాయి. మార్గదేశి సారస్వతాలు కలిసి సాగిపోయినాయి.
నాడు మల్లిరెడ్డి అనే ఒక సేనాపతి ఇరవై రెండు శైవ వైష్ణవ జైన బౌద్ధ ఆలయాలను కట్టించి ఈ మతాల నడుమ భేదము సంశయగ్రస్తమైందని శాసనంలో పేర్కొన్నారు.
కాకతీయులను గురించి ఇంత విస్తృత సమాచారంతో గ్రంథాన్ని రచించిన డాక్టర్ శివప్రసాద్ అభినందనీయులు.