సాహితి

నన్ను మాట్లాడనివ్వండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఎనిమిది గంటల పనిదినం ఎలాంటిదో ఎరగను నేను
ఉదయం పదవుతూనే పనిలో ప్రవేశిస్తాను
మీరు రాగానే చిరునవ్వుల తివాచీ పరుస్తాను
ఆప్యాయపు టత్తరు చల్లుతాను
ప్రతి అవసరానికి దిక్సూచినవుతాను
ఉదయం మధ్యాహ్నవౌతుంది
సాయంకాలవౌతుంది... రాత్రవుతుంది...
మధ్యలో రెండుసార్లు షావుకారు ఉదారంగా పంచే తేనీరు
ఇంటినుంచి వస్తున్నప్పుడే తెచ్చుకున్న చల్లారిన మెతుకులే
అమృతంలా ఆస్వాదిస్తాను
ఇంకా పదవని గడియారం ముళ్లు గుచ్చుకుంటాయ
అప్పుడు వేంచేసే కొనుగోలు మహారాజుల/రాణుల కోసం
ప్లాస్టిక్ పూల నవ్వులు పూయస్తాను
వారు కుళ్ళు హాస్యోక్తులు చిలకరించినా
వరప్రసాదంలా మూట కట్టుకుంటాను
ఇంటి ‘చింత’ల మంటల్ని ఒడికట్టుకునే
అర్ధరాత్రికి రెండే గంటలు బాకీ ఉన్నంతవరకూ
బండి లాగిస్తాను

కనీస వేతనం ఒకటుందని ఎవరు చెప్తారు నాకు
ఇచ్చే గొర్రెతోక జీతంతోనే ఏకరూప దుస్తులు సమకూర్చుకోవాలి
కాళ్ళకి కవచాలు బిగించాలి
నడుముకు పటకాలు ధరించాలి
నివాస సముదాయాలు మొదలుకొని,
బహుళజాతి సంస్థల వరకూ
పెద్ద పెద్ద దుకాణాల నుంచి బ్యాంకులూ, ఏటిఎంల వరకూ
అంతటా కాపలా కుక్కలం మేమే!
బడాబాబులు కనబడితే నిటారుగా నుంచోవాలి
దొరగార్ల వాహనాల తలుపుల తాళాలం కావాలి
పనిగంటలు పది వరకు సాగినా, మించినా
‘మహాభాగ్యం’ అనుకోవాలి
ఎంత ముట్టినట్టు సంతకం చేసినా,
చేతికొచ్చేది ఆరువేలు దాటితే గగనమే.

‘అందరికీ సామాజిక భద్రత దిశగా అడుగులు’ అంటూ
వార్తాపత్రికలూ, దృశ్య, శ్రవణ సాధనాలూ ఘోషిస్తుంటే
అప్రయత్నంగానే
నా నోరు తెరుచుకుంటుంది
మా సంస్థల లాంటి సంస్థలలో
ఆ చట్టాలిప్పటికే అమలులో ఉన్నట్టు స్పష్టపరిస్తే
తెరిచిన నోరు మూతపడటం మరచిపోతుంది
యజమానినేమైనా అడగడానికి భయం లేదు నాకు
ఎందుకంటే, మా జోడే మా పెద్ద కూలీను
మోకాళ్ళమీద కూలబడి, మీ పాదాలకు రక్షలు తొడుగుతాను
నాకొచ్చే నెల బిచ్చం ఆరువేలైతే
బిల్లు రాసేవాడి చేతిలో పడే మాదాకబళం ఎనిమిదివేలు
ఈ తోలుబొమ్మలాడించే విధాత ఎవరో ఎరగం మేం
దేశ దేశాలలో ఊడలు దింపిన మర్రిచెట్టు మా సంస్థ
ఒక్కో పట్టణంలో ఎన్నో శాఖలుండటం మా ఘనత
మాది నియామక పత్రం ఎండమావియైన ఉద్యోగం
ఏ దస్త్రాలలోనైనా చిత్ర‘గుప్తులు’
మా పేర్లు వ్రాస్తారేమో తెలియని అజ్ఞానం
కార్మిక లోకాన్ని ‘కాచే’ అధికార గాంధారుల కలికానికీ కానరాం మేం
కార్మిక నాయక గణాలకూ ఆనం మేం.

ఇక చాలు -
స్వకుచమర్దనాలు... స్వాలింగనాలు
ఈ ‘మేడే’లు, విజయోత్సవాలూ ఆపండి
అధిక శాతం కార్మిక లోకం దగాపడటం మానలేదని చాటండి
కబేళాకు తోలుకుపోతున్న మేకల్లా మేం ‘మే’ ‘మే’ అంటుంటే
అవి, ‘మేడే’ ధ్వానాలని భ్రమించడం మానండి

అన్ని రంగుల జండాలతో
ఒకరిపై మరొకరు బురదలు జల్లుకుంటూ
ఎన్నాళ్ళు ‘లాంగ్‌మార్చ్’ చేసినా ఉన్నచోటే ఉంటారు
ఏకత్రాటి మీదకు రండి
పోయేవి పదవులు, ప్రాభవాలు మాత్రమేనని ఎరగండి
ప్రస్తుతానికి ‘ఉట్టి’ ఎక్కుదాం రండి
ఉన్న కార్మిక చట్టాలనే సమర్థవంతంగా అమలుచెయ్యాలనే
ఒకే ఒకే ఎజెండాతో మరో ప్రస్థానం మొదలెట్టండి.

- మల్లాప్రగడ రామారావు +17814286044