సాహితి

గజల్ ‘చెలి’కి తెలుగు ‘కౌగిలి’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నేడు వివిధ భాషాచషకాల్లోంచి గజల్ మధుధారలు ప్రపంచ సాహితీ సంగీత ప్రియుల గొంతుల్ని తడపడమే కాదు, గుండెల్లి ‘తడి’ చేస్తున్న విషయం సాహిత్యాభిమానులకు కొత్తగా చెప్పనవసరం లేదు. సాహితీ ప్రక్రియ ఎంత పాతదైనా భావం గుప్పుమన్నప్పుడు హృదయ లయలో చప్పున క్రియా యోగ సంయోగం జరుగుతుందనడంలో సందేహమవసరం లేదు.
పార్సీ భాషలో గజల్‌కి బీజం పడిందని చెప్పినా, గోల్కొండ (హైదరాబాద్-హిందూస్తాన్)లో జననం జరిగిందని ముడివిప్పినా, గానపరంగా మొన్నటి బేగం అక్తర్, నిన్నటి మెహదిహసన్, నేటి గులాం అలి తదితర అసంఖ్యక గాయకుల ద్వారా గజల్ మాధుర్యం నిరూపితమయింది. ఉత్తరభారతదేశంలో అత్తరులద్దుకుంటూ దక్షిణ భారతదేశంలోని అన్ని భాషల్లోనూ పరిమళాలతో గజల్ పరుగులిడుతోంది.
గజల్ ఒక పువ్వు, ఒక పక్షి, ఒక తోట, ఒక ప్రేమ అని ఎన్ని విధాలుగా విశే్లషించినా, ఎన్ని పర్యాయ పదాలతో వివరించినా, అనుభూతి అలలపై హృదయనావను తన్మయత్వపు డోలికల్లో ఊగించడమన్నదే ప్రధానం. ప్రాచీన సాహిత్య ప్రక్రియలలోని ఒకానొక సమయాన్ని సందర్భాన్ని నూతనంగా ఆవిష్కరించడంతో ఓ కొత్త ప్రక్రియగా ప్రపంచ సాహిత్యంలో అగుపిస్తోందని కొందరు విశే్లషించిన విషయాన్ని అభిప్రాయాన్ని శోధించాల్సిన అవసరముందనిపిస్తోంది. ‘మానిషాద ప్రతిష్టం త్వమాగమపసాస్థిగు మాయత్ క్రౌంచితనాదేకం అవధికామమోహితం’- అన్న వాల్మీకి శ్లోకం కూడా గజల్ అని, వాల్మీకి రామాయణ కావ్యమంతా గజళ్ళతో నింపిన సంగమమని శేషేంద్ర వంటివారు చెప్పడం జరిగింది. అంతేగాక వేమన పద్యాలన్నీ గజల్లేనని వివరించబడింది. విశ్వదాభిరామ వినురవేమలో ‘తఖల్లూస్’ వుందని చూపడం జరిగింది.
గాలిబ్ గజళ్ళు మొట్టమొదట ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమి తెలుగులో ప్రచురణ చేయడం ఆ సంకలనాన్ని రషీద్ ఖురేష్ సారథ్యంలో ఇరివెంటి కృష్ణమూర్తి సంపాదకత్వంతో డి.మదన్‌మోహనరావు అనువాదం చేయగా ఇంతికాబ్ ప్రెస్, జె.ఎన్.రోడ్, హైదరాబాద్‌లో ప్రచురణకు నోచుకుంది. తదుపరి బాపు బొమ్మలతో దాశరథి గాలిబ్ గజళ్ళు అనువదించటం ఆ పిదప తెలుగులోనూ గజళ్ళు రాయడంతో రావడంతో తెలుగు లోగిలిలోకి తెలుగు గజల్ అడుగిడింది.
నేడు తెలుగు భాషా లిపిలో గజల్స్ వ్రాసేవారు దాదాపు అయిదు వందలమంది పైమాటేనని తెలుస్తోంది. వివిధ సంస్థల పేరిట వివిధ ట్రస్ట్‌ల పేరిట, ఫేస్‌బుక్‌లోనూ దర్శనమిస్తుండడంతో గజల్ స్థానం ప్రస్ఫుటంగా కనిపిస్తోంది. కాని తెలుగు సాహిత్య ప్రక్రియల్లోని పద్యం, వచన కవిత, కథా నవలల సాహితీ విభాగాల్లోని గజల్‌ని ఒక సాహిత్య ప్రక్రియగా శాశ్వత స్థానం (నెలవంక- నెమలీక సాహిత్య మాస పత్రిక మినహా) అటు సాహితీ పత్రికలు సాహితీపరులు ఇవ్వకపోవడం స్పష్టంగా అగుపిస్తోంది. ప్రపంచ సాహిత్యంలో వచ్చిన మార్పుల్ని ప్రక్రియల్ని తెలుగు సాహిత్యం దిగుమతివరకే గాదు, పుంఖానుపుంఖంగా రచనలు ఇప్పటికీ (వచన కవిత్వం) వెలువడుతున్నాయన్నది వాస్తవం. అలాగే హైకూలు తదితర దాని ప్రభావిత లోకల్ ప్రక్రియల్ని సయితం విస్తారంగా ఆహ్వానిస్తుండటం గమనిస్తున్నాం. కానీ ఎంతో వేదనాభరితమూ, ప్రేమసహితమూ కలిగి మనిషిని కరిగించే ‘గజల్’కి తగినంత ప్రాధాన్యత ప్రాముఖ్యతనివ్వకపోవడం తెలుగు సాహిత్యంలో లోటుగానే అగుపిస్తోంది. గజల్ రూపకల్పన విధి విధానం ప్రజలకి పరిచయం చేయకపోవడం సాహితీపరులకి ప్రజలకి తీరని దాహంగానే తోస్తోంది.
గజల్ నిర్మాణం (స్ట్రక్చర్) విషయానికొస్తే, గజల్ ఛందస్సును పరికిస్తే ద్విపద గుర్తుకొస్తుంది. గజల్‌లో సుందరమైన సుకుమారమైన, మృదువైన భావనల్ని మత్లా, మఖ్తా, మిస్రాషేర్, రదీఫ్, కాఫియా, తఖల్లూస్ వంటి గులాబీ రేకుల్లో పొదిగిన పుప్పొడితో రూపకల్పన జరిగినపుడు ఆ గజల్ సుగంధాలను వెదజల్లుతుందనడంలో సందేహమే లేదు.
గజల్ విన్నప్పుడూ, చదివినప్పుడూ, రెండు పాదాలున్న చరణాల్ని ‘షేర్’గా ప్రతి ‘షేర్’లోని ప్రథమ పాదాన్ని ‘మిస్రా’గా, ద్వితీయ పాదాన్ని ‘మిస్రాసానీ’గా, గజల్‌లోని మొదటి షేర్‌ని ‘మత్లా’ అని చివరి ‘షేర్’ని ‘మఖ్తా’గా పిలుస్తారు. గజల్‌లోని ప్రథమ పాదం ‘షేర్’ అయితే ‘మత్లా’లోని రెండు పాదాలలో ఆఖరి పదాన్ని ‘రదీఫ్’ అని ఆ ‘రదీఫ్’ అన్ని ‘షేర్ల’లోనూ రెండవ పాదాంతంలో క్రమంగా పునరావృతంగావడం జరుగుతూనే వుంటుంది. ‘రదీఫ్’ బహువచనం ‘రదాయిఫ్’.
గజల్ అందాన్ని అద్భుతంగా తీర్చిదిద్దడంలో ‘కాఫియా’ ప్రధాన పాత్రవుతుందన్న విషయం తెలిసిందే! ఈ ‘కాఫియా’ ప్రతి చరణంలోనూ, ‘రదీఫ్’కి ముందు వస్తుంటుంది. ‘రదీఫ్’, ‘కాఫియా’లు ‘మత్లా’లోని రెండు పాదాల చివర్లోనూ, ‘షేర్ల్’లోని రెండవ పాదాల ఆఖర్లోనూ పూలబంతుల్లా దొర్లుతూ పునరావృతమవుతూనే వుంటాయ్. గజల్‌లో ‘మక్తా’ అన్నది చివరి చరణంగానో, లేక ‘షేర్’గానో వుంటుంది. గజల్ రాస్తున్న కవి పేరుతో, లేక తనకిష్టమైన ప్రేయసి పేరునో, కలం పేరునో చెప్పడాన్ని ‘తఖల్లూస్’ అని నామకరణం చేయబడింది. అయితే కొందరు ‘మఖ్తా’లో తమ పేరును ఉపయోగించక ‘మత్లా’లోనో, ‘షేర్’లలోనో ప్రస్తావించడం జరుగుతుంటుంది. గజల్‌లో ఏ ‘షేర్’కి ఆ ‘షేర్’ జీవిస్తుంది, సంపూర్ణతనిస్తుంది, పరిపూర్ణత కలిగి వుంటుంది, జీవంతో తొణికిసలాడుతుంది. ఏ పువ్వు కాపువ్వు సౌందర్యాన్ని ఒలకబోసినట్టు ఏ షేర్‌కి ఆ షేర్ సుందరంగా అర్థవంతంగా వుంటుంది. అన్ని షేర్లు (పూలు) కలిపితే గజల్ పరిమళాలు వెదజల్లే పూలహారమవుతుంది. గజల్ మొత్తానికి ఏకకణజీవిగానూ బతుకుతుంది, బహుకణజీవిగానూ జీవిస్తుంది. గజల్‌లో నాలుగైదు షేర్లకంటే ఎక్కువగా వున్నవీ వున్నాయ్, ఆ సంఖ్య దాదాపు పాతికవరకూ వెళ్లిందని తెలుస్తోంది. వర్తమానంలో ఒక్క గజల్‌తోనే బసవపురాణంలాగా ఒకే పుస్తకంగా దీర్ఘగజల్‌గానూ వస్తుందేమో భవిష్యత్‌లో చూడాల్సిందే!
భాషా సౌందర్యం కవిత్వంలో పెల్లుబుకుతుందనడానికి తార్కాణంగా ఉర్దూ గజల్ మనకి కనిపిస్తుంది. భాషలోని పదాలు గజల్‌లో అద్భుతంగా అమరాయనిపిస్తుంది. భాషలోని అతిలలిత పదాలని భావానికి తగినట్టుగా ఎన్నుకోవడంలోనే గజల్ కవి ప్రతిభ తెలుస్తుంది. ఒక్క భాషలోనే లలిత పదాలుంటాయనీ కాదు, ఇతర భాషల్లో లేవనడం సరికాదు. ప్రపంచంలో ప్రతిచోటా గులాబులుంటాయన్నది ఎంత వాస్తవమో ప్రపంచంలోని అన్ని భాషల్లోనూ భావాన్ని సుకుమారంగా చెప్పగలిగే అతిలలిత పదాలూ వుంటాయన్నది అంతే వాస్తవం.
‘బష్కెదుష్వార్‌హై హర్ కామ్ ఆసాన్ హోనా
ఆద్మీకోభీ నహీ మొయస్సర్ ఇన్సాన్‌హోనా’- గాలిబ్
దాశరథి కలంలోంచి పై గజల్ అనువాదాన్ని పరికిస్తే
‘ప్రతిది సులభముగా సాధ్యపడదు లెమ్ము
నరుడు నరుడౌట ఎంతో దుష్కరము సుమ్ము’ అని చెప్పడంలో జీవిత సత్యానికి గజల్ ఒక ఖజానాగా వుందనడం నిరూపణమవుతుంది. ప్రేయసి విరహంతో తిరుగాడే ప్రేమికుల్ని గురించి ఒక్కో పదానే్న కాదు అక్షరాన్ని సయితం పదునుపెట్టి అదనుచూసి గజల్ పొదలోంచి బాణంలా వదులుతుండటంతో ఆ వాక్యాల అంబులు తగిన హృదయాలు తన్మయత్వంతో విలవిలలాడాల్సిందేననిపిస్తుంది. ఈ క్రింది షేర్‌ని వింటుంటే!
ఇలాజె దర్ద్ మేఁ్భ దర్ద్‌కి లజత్ పె మర్తాహుఁ
బొథె చాలోఁ మెఁ కాంటెనోకె సోజన్ సెని కాలై హై’- అల్లామా ఇక్బాల్
బాధలోనే సౌఖ్యముందేమోనని బాధనే ప్రేమించడం, మరణంలోనే జననం జరుగుతుందేమోనని ఎదురుచూడటం ప్రేమికుల లక్షణం. ప్రేయసి కోసం మండుటెండలో వట్టికాళ్ళతో తిరగడంతో అరికాళ్ళు బొబ్బలెక్కాయ్, అంతేనా! దారంతా ముళ్లుతో వుండటం వలన ఆ ముళ్ళు బొబ్బల్లో గుచ్చుకున్నాయ్, అంతేనా! బొబ్బల్లో వున్న ముళ్ళుని బయటికి తీయడానికి పదునైన సూదులతో చికిత్సకి పూనుకున్నాడు ప్రేమికుడు. ఒకవైపు బొబ్బలు, మరోవైపు ముళ్ళు, ఇంకోవైపు సూదులు అన్నీ బాధించేవే! అయి నా ప్రేమికుని ఓపిక ముందు అవన్నీ నివ్వెరబోతాయని తెలుపుతాడు. ఇంత దర్ద్ (బాధ)ని ఒకే ఒక షేర్‌లో చూపించడమంటే బిందువులో సింధువుని దర్శింపజేయడంగాక మరేమవుతుంది.
‘ఎక్ హంగామె పె వౌఖూఫ్ హై షర్‌కీ రౌన ఖ్
నౌ హమె గమ్ హి నహి న్మగయె షాదీ న సహీ’- గాలిబ్
ఇంట్లో హడావిడి అన్నది పెళ్లిలో వుంటుంది, చావులోనూ వుంటుంది కాని ఒకటి సంతోషం మరొకటి విషాదంగా అర్థమవుతుంటుంది. కానీ ఇక్కడ కవి జీవించి వున్నప్పుడు చవిచూడని హడావిడి సందడి వౌనంగా ఇన్నాళ్ళూ వున్న ఇళ్ళు తన మరణంతో సందడిగా వుంటుంది కదా! అని సంతోషపడే దృశ్యాన్ని ఊహించి సంతోషించి గజల్‌ని వినిపించి తన్మయత్వం పొందేవాని పేరే గజల్ కవి, గజల్ కవిగా వాడే అర్హుడనిపిస్తుంది, అది గాలిబ్‌కే స్వంతమయిందని తెలుస్తుంది.
గజల్ కేవలం ఛందస్సుతోనే కొలుస్తూ పడికట్టు పదాలతో అంత్యప్రాసల వేషంలో సాగితే హృదయానికి స్పందన నీయదు సరికదా! పదాల డప్పులతో తల బొప్పి కొట్టడం ఖాయమనిపిస్తుంది. కొందరు తెలుగు గజళ్ళ పేరిట వ్రాస్తున్న వాటిలో ‘వస్తావా’, ‘తెస్తావా’, ‘కోస్తావా’, ‘చేస్తావా’ అనే ‘కాఫియాల’తో ఊదరగొడితే ప్రేక్షకులు ఇక నువ్వు వేదిక దిగి ‘్ఛస్తావా’ అనకమానడు. మరికొందరు గేయాల్ని గజళ్ళుగా చేసి పాడటం, ఇంకొందరు పాటల అంచుల్లో ‘తఖల్లూస్’ని తగిలించి గానం చేయడంతో గజల్ అయిపోయిందన్న భ్రమని కల్పించడం జరుగుతోంది. భావనతో రాగయుక్తంగా పాడి కొందరు స్పందనని కలిగిస్తున్నా అది గజల్ అయిపోదని తెలుస్తూనే వుంటుంది.
నేడు గజల్‌ని వ్రాస్తున్నవారు ఎందరో వున్నా గజల్‌ని వేదికపై సరోర్, తబల, హార్మోనియంతో ఆలాపన చేసేవారు తెలుగు నేలలపై నలుగురైదుగురు అగుపించడం కష్టతరమైపోతోంది. గజల్‌ని పాడుతున్నప్పుడు ‘కాఫియా’తోపాటు ‘రదీఫ్’ని గజల్ గాయకునికే ప్రేక్షకుడు వినిపించడం ఉర్దూ గజల్ మహల్‌లో చూస్తాం, ఆ ఒరవడి తెలుగు ప్రేక్షకులకి తెలుగు గజల్ గాయకులు కవులు కల్పిస్తే తెలుగు గజల్‌కి పరిపూర్ణత సిద్ధిస్తుంది. అందుకు గజల్ అమృతాన్ని అన్ని వర్గాలవారూ ఆనందించి అభినందించడానికి ఆస్కారముంది. అలా లేనినాడు తెలుగు గజల్ కాగితాలకే పరిమితమై తెలుగు సాహిత్య చరిత్రలో ఓ ప్రక్రియగా మిగిలిపోయే ప్రమాదముంది. నాటి జానపద గీతాల నుండి నేటి చిత్రాల పాటలవరకు గీతం సంగీతం ప్రేక్షకుల్ని కట్టిపడేస్తూనే వుందన్న సంగతిని అర్థం చేసుకుని తెలుగు గజల్ వ్రాసేవారు ఆలపించేవారు ఒక వాతావరణాణ్ణి కల్పించాల్సిన అవసరముంది.
గజల్ ప్రక్రియని ప్రకరణని పరమార్థాన్ని అర్థించుకొని వ్రాయడం, పాడడం వలన గజల్ తెలుగు నేలపై ముత్యాల ముగ్గులు రతనాల రంగులు వేస్తుందనడంలో సందేహం లేదు. గజల్ చెలి తన చేలాంచలాన్ని తెలుగు ప్రేమికునికి అందిస్తుందనడంలో సంశయమక్కర్లేదు. ఫైజ్ చెప్పినట్టు ‘జలేన జగ్‌మే అలావోతొ షేర్ కిస్ మక్సద్’ జ్వలించని కవితెందుకు- తెలుగు గజల్స్ వ్రాసే వారందరూ (కవిత్వం వ్రాసేవారు కూడా) ఫైజ్ వాక్యాన్ని అర్థం చేసుకుని సాగితే గజల్ సఫలమవుతుంది. ఫలప్రదమవుతుంది. గజల్ ‘చెలి’ని తెలుగు ‘లోగిలి’ స్వాగతిస్తుంది.
తెలుగు కౌగిలిలో గజల్ ‘చెలి’ పరవశిస్తుంది.

- యక్కలూరి శ్రీరాములు 9985688922