సాహితి

కాలాన్ని ఒడిసిపట్టిన ‘కాలమ్’లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పత్రికల్లో శీర్షికలు - ఒక్క మాటలో చెప్పాలంటే బొట్టూ కాటుకలు. ఇవి ఇంగ్లీషులో కాలమ్స్‌గా మొదలై తెలుగు పత్రికా రంగంలోనూ ప్రకాశించాయి. విశేష సందర్భాలు వీటి అవసరాన్ని పాదుకొల్పితే, ఒక్కోసారి లబ్దప్రతిష్టులను కాలమిస్టులుగా పరిచయం చేసే క్రమంలో మొదలవుతాయి.
పత్రికా పంథాను స్పష్టం చేయడానికి జన ప్రయోజన అంశాల చర్చకు ఇవే ప్రధాన స్రవంతులు. విశే్లషణలకు, వాదోపవాదాలకు ఇవే వేదికలు. వార్తా కథనాలు వంటకాలైతే పత్రికకు మసాలా రుచులిచ్చేవి శీర్షికలే. కాలమిస్టుల సత్తాను బట్టి కాలానికి నిలబడ్తాయి. కబుర్లు, ఇల్లాలి ముచ్చట్లు, మాణిక్య వీణ, ఫాలాక్షుడి డైరీ, చేరాతలు, స్వగ‘తంబు’, ధర్మపథం, యాది ఇవన్నీ పత్రికల్లో పలువురు సాహితీమూర్తులు, మానవతావాదులు నిర్వహించిన శీర్షికల పేర్లు. ఇంకా ఇలాంటి శీర్షికలెన్నో ఏళ్ల తరబడి కొనసాగి పత్రికలకు పాఠకులకు మధ్య కలకాలం నిలిచిపోయే సంబంధ బాంధవ్యాలు ఏర్పరిచేవి. వార్తా పత్రికలంటే క్రితం రోజు జరిగిన సంఘటనలను, విశేషాలను తెలియజేయడం, పతాక శీర్షికలైతే దాదాపు ఒకటే ఉండడం, లోపలి పేజీల్లో ప్రాంతీయ, జాతీయ, ప్రపంచ వార్తలు షరా మామూలే. వీటికి తోడు రాజకీయాలు, పౌరపాలన, పాలక, ప్రతిపక్ష పార్టీల పరస్పర విసుర్లు. ఇంతటితో పత్రికల బాధ్యత తీరిపోయిందంటే అది అర్ధ సత్యమే. ఈ సందర్భంగా-రెండు, మూడు దశాబ్దాల క్రితం ఇవే పత్రికలు పోషించిన పాత్ర, ఎత్తుకున్న బాధ్యతలను ఓసారి గుర్తు చేసుకోవాల్సిందే. అప్పట్లో రాజకీయాలను పలకరిస్తూనే సమాజం దాని పోకడలు, ప్రజలు-వారి ఆలోచనా రీతులు, కళలు-వాటి మార్గదర్శక నియమాలు, ప్రాపంచిక విజ్ఞానం, భావి పౌరులను తీర్చిదిద్దే క్రమం అన్నీ తమ ప్రాథమిక అంశాలుగానే భావించేవి. వీటిని తీర్చడానికి పలు శీర్షికలను నిర్వహించేవి. పత్రికల స్థాపన కూడా ఈ కోణంలోంచే జరిగేది. అందుకోసమే తొలి తెలుగు దినపత్రికలకు అనుబంధంగా వారపత్రికలు కూడా నడిచేవి. దినపత్రికలు వార్తలకు, రాజకీయాలకు ప్రాతినిధ్యం వహించగా, సాహితీ, సాంస్కృతిక, కళారంగాలకు వారపత్రికలు వేదికగా నిలిచేవి. వీటికి తోడు పత్రికలు వైవిధ్యం కోసం పోటీ పడేవి. అవి తమ స్థానాన్ని ఉన్నత పరుచుకోవడం కోసం ప్రపంచ జ్ఞానులను, మహా మేధావులను ఏరికోరి, సగౌరవంగా సంపాదక పీఠాన్ని అప్పగించేవి. ఆ రోజుల్లో సంపాదకుడి ముందు పత్రిక యజమాని కూడా బలాదూరే. ‘నేషనల్ హెరాల్డ్’ యజమాని అయిన పండిత నెహ్రు తన వార్తలు ప్రాధాన్యతను బట్టి ఓమూలన ప్రచురించినా కిమ్మనకుండా ఉండేవాడట. పత్రికలకు పేరు ఉన్నట్లేగాని సంపాదకుల పేర్లమీదే అవి నడిచేవి. గోరా శాస్ర్తీ, నార్ల వెంకటేశ్వరరావు లాంటివారు అలాంటి గౌరవాన్ని అందుకున్న వారిలో ప్రముఖులు. రాజకీయాలకు అతీతంగా పాఠకులను తీర్చిదిద్దే క్రమంలో సంపాదకులు తమ ఆలోచనా విధానాలకు, సమాజ ఉపయుక్త అంశాలను వివిధ శీర్షికల ద్వారా పత్రికల్లో ప్రాచుర్యం కల్పించేవారు. ఇలాంటి శీర్షికలను నిర్వహించేవారిని ఎన్నుకోవడంలో నిష్పక్షపాతంగా, యోగ్యత, అర్హతలను బట్టి నిర్ణయం తీసుకునేవారు. వివిధ రంగాలలోని నిష్ణాతులను, పాత్రికేయ రచనలో ఆరితేరిన వారిని, సాహిత్యాభిలాషులను కాలమిస్టులుగా ఎంచుకోవడంవల్ల పత్రిక పరమార్ధానికి అద్దం పట్టడమే కాక దాని విలువ ప్రజాదరణ మెట్టుమెట్టుగా పెరిగేది. ఈ శీర్షికల పట్ల పాఠకులు విపరీతంగా ఆకర్షితులవడానికి కారణం వీరిద్దరి నైపుణ్యతే అని చెప్పుకోవాలి.
ప్రధానంగా పత్రికలకున్న తటస్థ వైఖరి, ప్రజాపక్ష నిబద్ధత కాలమిస్టులకు స్వేచ్ఛని, ధైర్యాన్ని ఇచ్చేవి. కాలమిస్టులే కాదు కార్టూనిస్టులు కూడా తెగించి బొమ్మలు వేసేవారు. కార్టూన్లు సైతం చర్చనీయాంశాలు అయ్యేవి. సుదీర్ఘ కాంగ్రెస్ పాలనలో కొంచెం అటు ఇటుగా పత్రికలన్నీ ప్రజాపక్షంగా నడిచేవి. ఎంతో కొంత మొగ్గు చూపినా అదంతా దృశ్యాదృశ్యంగానే ఉండేది.
నాటి శీర్షికలవైపు దృష్టి సారిస్తే-ఇవి పలు రకాలు. రాజకీయ, సామాజిక, సాంస్కృతిక, ఆధ్యాత్మిక అంశాలను స్పృశించేవిగా పేర్కొనవచ్చు. సాహిత్యంపై శీర్షికలతోపాటు ప్రత్యేక వ్యాస పరంపర కొనసాగేది. చలసాని ప్రసాదరావు ‘కబుర్లు’ రాజకీయ ప్రధానంగా కొనసాగితే చేకూరి రామారావు ‘చేరాతలు’ సాహితీ విశే్లషణను చేపట్టాయి. పురాణం సీత ‘ఇల్లాలి ముచ్చట్లు‘, విద్వాన్ విశ్వం ‘మాణిక్యవీణ’ సమాజ నడతకు దర్పణాలు. సంపాదకులే వీటిని నిర్వహించి తమ సామాజిక బాధ్యతను చాటుకునేవారు. వీరేకాక తుర్లపాటి కుటుంబరావు, తిరుమల రామచంద్ర, పతంజలి, అబ్బూరి చాయాదేవి, గొల్లపూడి మారుతీరావు, ఆదివిష్ణు ఇలా కొందరు రచయితలు కాలమిస్టులుగా ప్రసిద్ధులు.
పాత తరం పత్రికల్లో ప్రశ్నలు-జవాబులు సైతం పాఠకుల్ని అలరించే శీర్షికలే. మాలతీ చందూర్ జవాబులు ప్రపంచ జ్ఞానానికి నిలువుటద్దాలు. ఈ రోజుల్లో గూగుల్ సెర్చ్ చేసినట్టు, ప్రపంచవ్యాప్తంగా ఏ రంగానికి చెందిన ప్రశ్న వేసినా మాలతీ చందూర్ సంతృప్తికరమైన వివరణాత్మక సమాధానం ఇచ్చేవారు. కె.రామలక్ష్మి ‘ప్రమదావనం’లోని జవాబులు మహిళల సమస్యలకు పరిష్కారాలు చూపుతూ గుండెనిండా ధైర్యాన్ని నింపేవి. ఈ శీర్షిక ద్వారా ఆ రచయిత్రి ఎన్నో జీవితాలను సరిదిద్దిన, నిలబెట్టిన సందర్భాలు ఉన్నాయి. రామలక్ష్మి ఏ ప్రశ్నకు ఎలాంటి దీటైన సమాధానం ఇచ్చారోనని పురుషులు సైతం వీటిని చదివేవారు.
‘పాత కెరటాలు’ పేరిట మాలతీ చందూర్ వందలాది ఇంగ్లీషు నవలల పరిచయం కూడా విలువైన సమాచారంతో కూడిన ఉత్తమ శీర్షిక. మిక్కిలినేని రాధాకృష్ణమూర్తి ‘నటరత్నాలు’ పేరిట ఎందరో రంగస్థల నటులను పరిచయం చేసారు. శ్రీశ్రీ ఆత్మకథ ‘అనంతం’, దాశరథి రంగాచార్య ‘జీవనయానం’, సామల సదాశివ ‘యాది’ వారి వ్యక్తిగత జీవితాలతోపాటు ఆనాటి సామాజిక పరిస్థితులను వ్యక్తపరిచి పాఠకులను ఆకట్టుకున్నాయి. సమాజోపయోగ పత్రికా శీర్షికలు ఎన్నో ఉన్నాయి. ఇక్కడ ప్రస్తావించనంత మాత్రాన వాటిని విస్మరించినట్టుగా, చిన్న చూపు చూసినట్టుగా భావించరాదు. నేడు రాజకీయ పార్టీల పరంగా కొన్ని దినపత్రికలు చీలిపోయి లేదా ఆరంభమయి తమ వద్ద పనిచేస్తున్న వారితోగానీ, తమ పద్ధతులకు వత్తాసు పలుకుతున్న వారితోగానీ రాయించిన వ్యాసాలతో సంపాదకుని పేజీ నింపేసి తమ సామాజిక బాధ్యతనుండి తప్పుకుంటున్నాయి. దీని పర్యవసానంగా ఎందరో సామాజిక శాస్తవ్రేత్తలు, సాహితీ దురంధరులు మనకు ఉండి కూడా లేనట్టే అయింది.
ఇప్పుడు భౌగోళికంగా రెండు రాష్ట్రాలుగా విడిపోయినా తెలుగు సాహిత్యం, సంస్కృతి, కళలు పొత్తుల సంసారమే. తెలుగువారు ఎవరు ఏ క్షేత్రంలో నిష్ణాతులైనా ఆ జ్ఞానాన్ని నిజాయితీగా అందరూ పంచుకోవాలి. పత్రికలు ఈ చొరవ తీసుకోవాలి. పుణెకు చెందిన దిలీప్‌బామ్ మోటార్ వాహనాల సమస్యలపై సమాధానం చెబితే విన్నప్పుడు, ఆంధ్రకు చెందిన సాహితీవేత్త తెలంగాణకు, తెలంగాణకు చెందిన జానపద కళాకారుడు ఆంధ్రకు పనికిరాకుండా పోడు. కొనే్నళ్ల క్రితం ఒకరి భుజం ఒకరు తట్టినవాళ్లే కదా!
కాలమిస్టు అంటే ఎవరు? సమాధానాలు ఇలా కొన్నింటిని చెప్పుకోవచ్చు - తలపండిన వాడు, జీవన సారాన్ని పుక్కిటపట్టిన వాడు, శాస్త్రాలను అవపోశన పట్టినవాడు, గురువుగా భావింపబడేవాడు, బతికినన్నాళ్లు రాసినా తరగని మేధోసంపత్తి గలవాడు, ప్రలోభాలకు లొంగనివాడు, వజ్రసంకల్పుడు. ఇప్పుడు రాస్తున్న వారిలో ఇందులో ఒక్క గుణమున్నా పాఠకులు ఆ ‘కాలమ్’ని నెత్తిన పెట్టుకుని పూజిస్తారు. మిగతా వారికోసం ప్రపంచాన్ని గాలించైనా వెదికి పట్టుకోవాలి. రానున్న తరంలో మన భాష నిలువాలన్నా, మన సంస్కృతి పరిఢవిల్లాలన్నా, పత్రికలు తమ పాత్రను నిభాయించామని గర్వపడాలనుకున్నా ఇలాంటి శీర్షికలే ప్రాణాధారం.

- బి. నర్సన్, 9440128169