సాహితి

దేహం తొడుక్కొని...

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సర్వగ భావంలో కందువ
కలల కళ్లు విప్పి
నిర్భగ్న నిశ్చలత్వంతో లోకాలోకానం చేస్తున్న
దృశ్యమే తోచింది
ఉదయారుణ వలయాన్ని నెత్తిన పెట్టుకున్న ఉర్వీధరానికి
చెట్టుపూల చూపుల భాష్యం వివరిస్తున్నట్లుంది
అవ్యక్త మధుర ధ్వని సమాస పరిమళం
అంతటా అలుముకొంది
పక్షిపాడుతున్న పాటలో రూపాంతరం చెందుతున్న
వత్స నగ్నవాజ్ఞ్మయమంతా వర్ణ విభ్రాజితమే...

తరణి తారళ్య తపశ్శిఖరాన్ని త్రవ్వుకుంటూ
ఆదిమ నిశల్ని అనువదిస్తే-అది
ఆలయ దీపం విశే్లషణలా
గర్భాంతర వాసంలో వెలుగుతున్న చిదానంద లీలగా తోచింది
కళ్లు మూసుకున్న ధ్యానంలో అనక్షర లిపియై
ఒళ్లు విరుచుకుంటున్న ఆహితాగ్ని జ్వాలగా పూచింది
చీకటి ప్రయాణం చేస్తూ
వెలుతురు కోవగట్టిన లోచనాపథ శిల్పం
కలల జాదరని కౌగలించుకొన్న ఱెప్పల మీద
తరుణ సమంగా కింజిల్క ధమ్మిల్లం లోంచి జారిపడింది..
పగలు మొదలై ఎండను నవ్వుతోంది
చెట్టు పుప్పొడిని పుక్కిలిస్తోంది
పువ్వు గాలిని ఉక్కిరి బిక్కిరి చేస్తోంది
గంథ పరివాదిని అంతర గాంధారమందుకుంది
ఈ శతాబ్దపు పాట పడవని మోస్తున్న
నాదాత్మ
విశ్వచేతనకు విపులార్ధ సంఘటితంగా
సంకేతాన్ని సమీకరిస్తూ
అవయవాల్లో మునిగిపోయింది
కనీనికల్లో కాంతి జలం కడలు కొంటోంది...

భూగోళం చుట్టివస్తున్న వసంతానికి
పూవుల్ని అలంకరించుకున్న కొమ్మ
మధూళి చినుకులతో మాటునల్లుతోంది
అంతరాత్మ కౌతుకంతో, అవని
వర్ణమయమైన శబ్దాల్ని ఎదనాటుకుంది
ప్రపంచం
స్వప్నాన్ని సొంతం చేసుకుంది
జీవితపు పొదరింటి మీద
ఓ పద్యం
దేహమై కనిపిస్తుంది..

- సాంధ్యశ్రీ, 8106897404