సాహితి

సమాజశాస్త్ర కోణంలో మహాభారతం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వెల: రూ.150/-
పుటలు: 210
ప్రతులకు:
- డా. కె. జగన్నాథశర్మ
12-11-1346/ఎ,
బౌద్ధనగర్,
సికిందరాబాద్-500 061.
9949353846
**
ధర్మే చార్థేచ కామేచ మోక్షేచ భరతర్షభ
యది హాస్తి తదవ్యత్ర యనే్నహాస్తి న తత్క్వచిత్
ధర్మార్థ కామ మోక్షాలకు సంబంధించిన సర్వాంశాలు భారతంలో ఉన్నాయి. భారతంలో ఉన్న అంశాలు మరోచోట ఉండవచ్చు కాని భారతంలో లేని అంశం మరోచోట ఉండదు అని ప్రతీతి. మొదటిసారి జయము పేరిట 8800 శ్లోకాలతో మరి కొంతకాలానికి 24000 శ్లోకాలతో భారతం, మరికొంత కాలానికి లక్ష శ్లోకాలతో మహాభారతం - ఇలా మూడు పొరల్లో మహాభారత నిర్మాణం జరిగింది. మహా భారతాన్ని ఎందరో విద్వాంసులు పాత్రచిత్రణ, అలంకారాలు, రసం, ధ్వని, సంధులు, సమాసాలు ధార్మికత ఇలా రకరకాల కోణాల నుండి పరిశీలించారు. అయినా మరి కాస్త పరిశోధనకు భారతం అవకాశమిస్తూనే ఉంది.
డా.కడియాల జగన్నాథ శర్మ మహాభారతాన్ని ముఖ్యంగా అందులోని వివాహ వ్యవస్థను గురించి సమాజ శాస్త్ర, మానవ శాస్త్ర చారిత్రకాంశాలతో విశే్లషించారు. ఇందుకుగాను నాగార్జున విశ్వవిద్యాలయం సోషియాలజీ విభాగం నుండి డాక్టరేట్ డిగ్రీ పొందారు. భారత రామాయణాలను సామాజిక భౌగోళిక చారిత్రక కోణం నుండి పరిశోధించే రచనలు ఇంగ్లీషులోనే కాదు తెలుగులో కూడా రావలసి ఉంది. ఇఇలా విశే్లషించేటప్పుడు సెంటిమెంట్స్, ఉద్వేగాలు, భావజాలాలు ప్రభావితం చేసే అవకాశం హెచ్చుగా ఉంటుంది. సిద్ధాంతం, వాస్తవం వేర్వేరయ్యే అవకాశముంటుంది. వాస్తవ భ్రాంతికి లోనయ్యే ప్రమాదముంటుంది. వాస్తవాలు పవిత్రమైనవి. వాటిపై వెలిబుచ్చే అభిప్రాయాలు మాత్రం మనిషికి మనిషికీ మారుతూ ఉంటాయి. (పుట.14) వేదాల వర్గీకరణ, అష్టాదశ పురాణాలు, భారతం నిర్మించిన వ్యాసుడు ఒకడేనా? వేర్వేరా? అన్న ప్రశ్న ఉదయిస్తుంది. జవాబు అవును/ కాదు అనాల్సిందే. ‘ఇతరులకంటగట్టే ఉద్దేశం నాకు ఇసుమంతైనా లేదు’ అంటూనే భారతం అంతటి పెద్ద కావ్యాన్ని ఒక్కడే రాశాడా అని సందేహాన్ని వెలిబుచ్చారు (పుట.39) ఆ సందేహం అక్కర్లేదు. కృష్ణద్వైపాయనుడనే వ్యాసుడు ‘సంవత్సరత్రయంబు’ శ్రమించి జయ నామక భారతాన్ని రాసి వైశంపాయనుని వ్యాప్తి చేయడానికి నియోగించాడు అని భారతం (ఆది 1-67)లో స్పష్టంగా చెప్పబడింది.
గడియారం వెంకట శేషశాస్ర్తీ అన్నట్లు ‘మహాభారతం భరత వంశ రాజుల చరిత్ర’, ఒకనాటి భారతీయ కుటుంబ చరిత్ర, అంతేకాదు వేదయుగం నుండి వెల్లివిరిసిన భారతాధ్యాత్మిక వైజ్ఞానిక సాంఘిక సారస్వత రాజకీయ సంస్కృతీ సంప్రదాయాల సంపూర్ణ జీవిత చరిత్ర’. ‘్భరతం ఏ వ్యక్తినీ సుగుణాల ఖనిలా, దుర్గుణాల పుట్ట, అరూపక అవసరాన్నిబట్టి ప్రయోజనాన్ని బట్టి బలాలను బలహీనతలను రెంటిని చూపెట్టి ద్విభాష్యాలు చెప్పేవారి ఉద్దేశాలు మాత్రం వేర్వేరుగా భిన్న దృక్పథాలతో కూడి’ ఉంటాయని జగన్నాథశర్మ అన్నారు. (పుట 7.) సహజమే కదా! ప్రాచీన సామాజిక వ్యవస్థల్ని అధ్యయనం చేయడానికి తోడ్పడే సమగ్ర విశ్వసనీయ గ్రంథం మహాభారతం. మహాభారత సమాజం సంధి సమాజం. ఆర్యుల, ఆర్యేతరుల పరస్పర సంస్కృతీకరణను చిత్రించిన గ్రంథం. (పుట.65) కనుక లోతైన పరిశీలన ద్వారా వివాహ బంధాల సామాజిక సంబంధాల స్వరూపాన్ని పరిణామ క్రమాన్ని విశే్లషించడం రచయిత లక్ష్యం.
సంతానం లేనపుడు - సంతానాన్ని కనలేనపుడు ఆ వంశానికి చెందిన మరొకనితో సంగమించి సంతానం పొంది వంశాన్ని నిలబెట్టుకోవడాన్ని ‘నియోగం’ అంటారు. ఆ పద్ధతి భారతంలో కనిపిస్తుంది. అలా పుట్టినవారే పాండవులు. అలా నియోగం ద్వారా కన్న సంతానం పట్ల సర్వహక్కులు స్ర్తి నర్త (సోషల్ ఫాదర్)కు చెందుతాయి తప్ప నియోగింపబడిన వారికి (బయోలాజికల్ ఫాదర్) చెందవు. పాండవులు ఆర్యేతర తెగకు చెందినవారు. పాండవులు కౌరవులకన్న తక్కువ పాటి సంస్కృతి కలిగిన అన్య తెగకు చెందినవారు. నియోగం వల్ల పుట్టడం, బహుభర్తృత్వం వారి ఆచారం కావడమే దీనికి నిదర్శనమని సిద్ధాంతాలు (పుట.106) చేయడం అతార్కికం. శంతనుడు ఆర్యుడై, భీష్ముడు ఆర్యుడై, సత్యవతీ నియోగంతో వ్యాసుని వల్ల జన్మించిన ధ్రుతరాష్ట్రుడు, పాండు రాజులు ఆర్యులై, కేవలం పాండవులు మాత్రమే ఆర్యేతరులు కావడం పునరాలోచనీయం. భీష్ముడు, కౌరవులు ఆర్యులై, పాండవులు మాత్రం అనార్యులై, భిన్న తెగల వారయితే ‘పాలిపంచాయతి’ ఉండడానికి ఆస్కారమే లేదు. బహుభర్తృత్వం సాధారణ వంశ ఆచారమే అయి ఉంటే కౌరవులు నూరు మందికి ఒకే భార్య ఉండాల. కనీసం ఉప పాండవులందరికీ ఒకే భార్య ఉండాలి. ‘ద్రౌపది పంచ పాండవుల బంధం’ వంశాచారం కాదు. అసాధారణ సంఘటన మాత్రమే. ఖాసా తెగవారు పాండవులను ఆరాధించడం ఆ తెగలో బహు భర్తృత్వం ఆచారంగా ఉండడం ఇక్కడ బలం చేకూర్చే అంశం కాదు. ‘ఈ ఆచారం పాండవులది కాకపోతే వ్యాసుడు ఏవో కథలు చెప్పి దానిని ఎందుకు సమర్థిస్తారు.’ (పుట. 94) అని ఒక విచిత్రమైన వాక్యం జగన్నాథ శర్మ ప్రమేయం లేకుండానే వచ్చి పడింది. ఆ వాక్యమే మనకు జవాబు చెప్తుంది. ఈ ఆచారం పాండవులది కాదు కనుకే వ్యాసుడు సమర్థించాల్సి వచ్చింది. సాధారణ వంశాచారమే అయితే వ్యాసుడు వచ్చి సర్ది చెప్పాల్సిన పనిలేదు. ఆర్య అనార్య వాదం కాలం చెల్లిన సిద్ధాంతాల్లో ఒకటని విజ్ఞుల భావన.
మహాభారత కాలంలో మంగళ సూత్రధారణ లేదని జగన్నాథశర్మ చెప్పారు. (పుట.120). నిజమే వారన్నట్లు, తిక్కన కాలం వరకు మంగళ సూత్రధారణ విషయం అస్పష్టమే. ఉత్తరాభిమన్యుల వివాహ ఘట్టంలో తిక్కన కేవలం తలంబ్రాలనే వర్ణించాడు.
మ్రింగెడు వాడు విభుండని,
మ్రింగెడిది గరళ మనియును, మేలని ప్రజకున్
మ్రింగుమనె సర్వమంగళ
మంగళసూత్రంబు నెంతమంది నమ్మినదో!’ అని
పోతన స్పష్టంగా భాగవతంలో ప్రస్తావించాడు. తిక్కన పోతనల నడుమ ఈ ఆచారం వచ్చి ఉంటుంది. వివాహం - పరిణామం, భాగస్వాముల ఎంపిక, బహుభార్యత్వం, బహుభర్తృత్వం, నియోగాలు, పెళ్లి ఆచారాలు, కుటుంబ సంబంధాలు, ఆస్తుల పంపకాలు, స్ర్తిలు, వారి స్థితిగతులు, పురుషాధిక్యత, వర్ణ వ్యవస్థ, సామాజిక గతిశీలత, మొదలైన వాటి గురించి కడియాల జగన్నాథశర్మ ఈ గ్రంథంలో సంయమన పూర్వకంగా, ఆలోచనాత్మకంగా విశే్లషించడం ముదావహం. అభినందనీయం.

- వెలుదండ నిత్యానందరావు, 9441666881