సాహితి

వినిమయ భాష.. ‘మిశ్రమ’ ఘోష

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలుగు భాష అంటే పాత తెలుగు పదాలు మాత్రమేనని సంస్కృతం నుండి వచ్చినవి వాడకూడదని మహాప్రాణాలు అవసరం లేదని అసలు అచ్చ తెలుగులో అవి లేవని, వాటిని అక్షరాలలో నుండి తొలగించాలని ఒక వాదన ఇటీవల జరుగుతున్నది. నిజానికి వేల ఏండ్లుగా ప్రజలు గాని రచయితలు గాని ఇదంతా మనసులో పెట్టుకొని చేసినవి కావు.
తెలుగు భాష పుట్టినప్పుడు వాడిన మాటలు మాత్రమే ఇప్పుడు లేవు. కొన్ని వేల ఏండ్ల ముందే మార్పులు జరిగాయి. వాడుకలోను, తరువాత రచనలలోను కొత్త పదాల అవసరాలు పడినప్పుడల్లా కొత్త పదాలు తెచ్చుకున్నాం. పొరుగు పదాలా, పర భాషా పదాలా అనే పట్టింపు లేదు. అందుకే నిత్య జీవితంలో ఎన్నో పదాలు కలిసిపోయినయి. మనవి కానివేవో తెలుసుకోలేనంతగా కలిసిపోయినయి. అన్నం, నీరు, జీవనం, భూమి, ఎవుసం, పసురం, జనం, మనసు, గోడ, జీతం, బత్తెం, సుఖం, దుఃఖం, బోనం, వైనం ఇట్లా ఎన్నో తెలుగులోకి వచ్చిన పదాలే. మూల ద్రావిడం నుంచి, ప్రాకృతం నుంచి, సంస్కృతం నుంచి, ఇంకా మరాఠీ, ఉర్దూ, ఫార్సీ, తరువాత ఇంగ్లీష్ నుంచి వచ్చి కలిసిపోయాయి. భాషావేత్తలు చెపితేనే తప్ప మనది కాదని అనుకోకుండా వాడుతున్నాము. రచయితలు, కవులు మాత్రమే కాదు సామాన్య జనం కూడా వాడుతున్నారు. మాట్లాడే వాళ్లకు వారు చెప్పదలుచుకున్నదే ముఖ్యం కాని అది ఏ భాషా పదం అనేది ముఖ్యం కాదు. మరి రచయితలు, కవులు, శాస్తవ్రేత్తలు తప్పనిసరి అవసరాన్ని బట్టి ఆయా భాషా పదాలు తెచ్చుకొన్నారు. అవి కూడా కలిసిపోయాయి. ఇట్లా కలిసిన వాటిలో ఎక్కువగా సంస్కృతం, ప్రాకృతం నుంచి వచ్చినవి శాస్త్రాలు, కావ్యాలు. సంస్కృతం నుండి ఎక్కువగా అనువాదాలు జరిగాయి కాబట్టి.
కలుపుగోలుతనం తెలుగు ప్రజలకున్నట్లుగానే తెలుగు భాషకు కూడా ఉంది. ఆదాన ప్రదాన భాష అని ఒప్పుకున్నారు. కలిసిపోయినపుడు వాటి రూపాలు మన మాటకు అనుకూలంగా మార్చుకున్నాడు. ము, వులు చేర్చుకుని అజంతాలుగా మార్చుకున్నాము. అజంతం తెలుగు భాషకు పుట్టు వనె్న. అదే అందాన్ని, నాదాన్ని కలిగిస్తున్నది. లింగ, వచన, విభక్తులను తెలుగు వాడుకకు తగినట్లుగానే వాటిని వాడుకున్నం. వాడుతున్నం. అవి తెలుగు పదాలుగా మారిపోయాయి. నిజానికి ఇవే తెలుగు సమాలు అనాలి కాని వ్యాకరణవేత్తలు సంస్కృత సమాలు అన్నారు. వాటినుండి వచ్చిన విషయం తెలియాలని కావచ్చు. సంస్కృతం, ప్రాకృతం నుండి మారిన పదాలే తత్సమాలు, తద్భవాలు అని అన్నారు వ్యాకరణవేత్తలు.
వాడుక కోసం కలిసిపోయినని కొన్ని కాగా, రచన కోసం తెచ్చుకున్నవి కొన్ని కలిసిపోయినవి. సాహిత్యంలోనే కాదు శాసనాల నుండి ఈ కలిసిపోవడం జరిగింది. గాథాసప్తశతిలో ప్రాకృతమే ఉన్నది. గాథాసప్తశతి వెలువడింది కోటిలింగాల ప్రాంతంలో అయితే తెలుగు పుట్టుక వరకే ప్రాకృతం ఈ ప్రాంతంలో ఉందని తెలుస్తున్నది. సహజంగానే తెలుగులో ప్రాకృత పదాలు కలిసిపోయినవనుకోవాలి. గాథాసప్తశతి హాల చక్రవర్తి సంకలనమే కాని స్వయం రచన కాదు. జరిగిన, మాట్లాడుకున్న, చూపిన సన్నివేశాలే వాళ్ల భాషలోనే చిన్న ఛందస్సులో సంకలనం చేసినాడు. జనంలో అటువంటి భాషలు ఉన్నవి. వాటిలో మన తెలుగు మాటలు కొన్ని కనబడుతవి. అట్లే సంస్కృతం కూడా ఈ ప్రాంతంలో ఎక్కువగానే వాడుకునేవారనడానికి నన్నయ్యకు పూర్వం క్రీ.శ.945 నాటి కుర్క్యాల శాసనమే నిదర్శనం. సంస్కృతంలో పండితులున్నారు. వారి వాడుక, పురాణాలు, పూజలు, పరిపాలకుల వాడుక మొదలైనవన్నీ ఎప్పటినుండో తెలుగులో సంస్కృత పదాలు కలిసిపోవడానికి కారణమయినవి. ఈ కారణంగా కొన్ని కులాల వారు మాత్రమే వాడినారనే అభిప్రాయం ఏర్పడింది. చదువుకున్నవారి ప్రభావం మిగిలినవారిపై పడడం ఎప్పుడైనా ఉన్నదే. ఒక వర్గానికే పరిమితం కాకుండా అందరిలోకి చేరడం మంచిదే కదా. వాటితో వారి భావజాలం కూడా జనంలోకి వచ్చిందనే అభిప్రాయం కూడా ఉండవచ్చు. ఆ భావజాలం కాలం గడిచినకొద్ది మారవచ్చు. భాషలో కలిసిన పదాలు సందర్భాన్ని బట్టి వాడుకోవడం ఉంది. ఉంటుంది. కొన్ని పదాలు కాలగర్భంలో కలిసిపోవచ్చు. సంధ్యవేళ అనే మాట సందేల, గంగాస్నానం, గంగ తానం, శరణార్థి, సెనార్తి, అగ్ని, అగ్గి, కథ, కత, కవిత్వం- కైతకం, భాష, బాస, కొన్ని సంయుక్తాలు ద్విత్వాలుగా, కొన్ని మహాప్రాణాలు అల్పప్రాణాలుగా మారిపోవచ్చు. కొన్ని అట్లే ఉండవచ్చు. ఇట్లాంటి పదాలు కొందరికే పరిమితమని అనుకోరాదు. వాడుక అచ్చంగా రచనలకు సరిపడకపోవచ్చు. అర్థశాస్త్రం, గణిత, భౌతిక, రసాయనిక, జీవశాస్త్రాలు రాయడానికి కేవల వ్యవహారమే సరిపోదు. వాటి పారిభాషిక పదజాలం అవసరం తప్పనిసరి. వ్యాకరణం, విమర్శ, ఛందస్సు, తత్వశాస్త్రం వంటివి కూడా అంతే. పరిభాష లేకుండా కుదరదు. మరి పరిభాషకు కుల సంప్రదాయాలను పరిమితం చేయలేము. అది ఆయా విషయ పరిజ్ఞానాన్ని బట్టి ఉంటుంది. కనుక వాటిలో వచ్చే తత్సమ తద్భవాలను కాదనలేం. నిజాం కాలంలో పరిపాలన, బడి భాష ఉర్దూలో ఉండటంవల్లనే సామాన్యుల వాడుకలో కూడా కలిసిపోయినవి. చలాయించు, ఫిరాయించు, బనాయించు, దావత్, కబ్జా, అలాయ్, బలాయ్, జరంత, దస్త్రాలు, దుకానం- ఇట్లా ఎన్నో సామాన్యులు కూడా వాడుతున్నారు. మూల రూపాల్లో కొన్ని మార్పులు జరుగవచ్చు. ప్రాచీన కాలంలో కూడా అట్లే కలిసిపోయినవి. కేవలం భారత కవులు అనువాదం చేయడం వలననే తత్సమ, తద్భవాలు ఏర్పడ్డాయని అనుకోవలసిన పనిలేదు. కాకపోతే అనువాదం సందర్భంగా మరికొన్ని పదాలు తెచ్చుకొన్నారు. అందువలన తత్సమ తద్భవాలు కవుల వలన మాత్రమే ఏర్పడినవి కావు. కన్నడం ఈ ప్రాంతంలో కొంతకాలం ఉన్నా స్థిరపడలేదు. పదాలు కొన్ని ఇప్పుడు కూడా కలిసి ఉన్నాయి.
ఆయా భాషా పదాలు కలవడం వలన భాష పుష్టివంతమయినదే కాని నష్టం జరగలేదు. ఒకవేళ ఇవి కలిసి ఉండకపోతే అచ్చమైన తెలుగు పదాలు మాత్రమే ఉండేవేమో అనుకోవచ్చు. కాని అది చారిత్రక వాదం కాదు. తార్కికవాదం కూడా కాదు. ఇప్పుడు కూడా ఇంగ్లీష్ పదాలు చేర్చుకోకపోతే తెలుగు స్వచ్ఛంగా ఉంటుందని అనుకుంటున్నామా? దూరంగా ఉండగలుగుతున్నామా? ఇది చారిత్రక అనివార్యం. సంస్కృత ప్రాకృతాలు కూడా అప్పుడు చారిత్రక అనివార్యాలే.
నన్నయ్య, తిక్కన, పోతన, పాల్కురికి, మొదలైన వారంతా తత్సమ తద్భవ మిశ్రీతమైన తెలుగునే వాడుకున్నారు. పాల్కురికి బసవ పురాణంలో జాను తెనుగు అన్నాడు కాని అచ్చ తెనుగు అనలేదని గమనించాలి. అచ్చతెనుగు జాను తెనుగు ఒకటి కాదు. బసవ పురాణం ఛందోపరంగా దేశీయత, కథాపరంగా శైవం సామాన్యుల కథలే ఉన్నాయి. అయినా తత్సమ తద్భవాలున్నాయి. అయితే తెలుగుపదాలు ఎక్కువగా వాడి చూపించాడు. కాని అవి తరువాతి కవులకు మార్గదర్శనం కాలేదు. రంగనాథ రామాయణం వంటి కొన్ని ద్విపదలో వచ్చిన చంపూ కావ్యాలకు, తత్సమ మిశ్రీతమయిన భాషకే ఆదరణ పెరిగింది. శతకాలలో కూడా తత్సమ తద్భవాలు అలవోకగా వాడుకున్నారు. సుమతీ, వేమన వంటి ప్రజాదరణ ఎక్కువగా ఉన్న శతకాలలో కూడా ఉన్నాయి.
పాల్కురికి వాడిన భాష, ఛందస్సులను అనుకరించకపోవడానికి రాజాదరణ లేక కాదు ప్రజాదరణ కూడా తక్కువేనేమో. పల్నాటి భారతం ద్విపదలో ఉన్నా బసవ పురాణంలోని భాషకాదు. రాజులను ధిక్కరించిన పోతన కూడా కొందరికి తెలుగు గుణమగు, కొందరి సంస్కృతము గుణమగు అని చదువుతున్నవారు, వింటున్నవారు, రాస్తున్నవారు కొందరు, కొందరు అది ఇష్టపడుతున్నారని చెప్పడం తన కాలం నాటి వ్యవహారమే. రెండింటిని కలిపి అందమైన కవిత్వం రాసి చూపించారు.
సంస్కృత ప్రాకృత భాషలనుండి పదాలు చేరినపుడు జరిగే మార్పులనే వ్యాకరణవేత్తలు వివరించారు. చిన్నయసూరి తత్సమ పరిచ్చేదంగా వివరాలు రాసి, ప్రయోగాలు కూడా కొన్ని చూపించారు. ప్రౌఢ వ్యాకర్త కూడా సవరణలు సూచించారు. తత్సమ పద నిరూపణ పేరు డా.మాదిరాజు బ్రహ్మానందరావుగారు ఇటీవల ఒక పుస్తకం వెలువరించారు. మార్పులను ఎంతో వివరణాత్మకంగా, తేలికగా అర్థమయే విధంగా రాసిన ఈ పుస్తకం తెలుగు విద్యార్థులకు ఉపయోగపడుతుంది.
నిఘంటువులలోను నిత్య వాడకంలోను చేరిపోయిన తత్సమాలు, తద్భవాలు వదిలి భాషను ఇప్పుడెవరూ ఉపయోగించలేరు. ప్రయోగం చేసినా ప్రయోగమే అవుతుంది కాని ప్రాచుర్యం పొందరు. పత్రికలు మొదలుకొని పరిపాలనదాకా తత్సమ, తద్భవాలు తప్పవు. వినిమయ భాషలో ఎప్పుడు ఏది అవసరమో అది వాడబడుతుంది. అది దేశ్యమా, అన్యదేశమా? తత్సమమా? తద్భవమా? అనే విషయాలు పుట్టింపులు ఉండవు.
మహాప్రాణాలు, సంయుక్తాలు, సమాసాలు, తెలుగులో భాగం అయినవి. వీటిని తెలుసుకొని కలుపుకొని వాడుకోవడంవలన భాష అందం కాని, బలం కాని తగ్గదు. వైశాల్యం, గాఢత పెరుగుతుంది. వాదాల కోణంలో కాక భాషాకోణంలోనే చూడాలి. ఇటీవల తెలుగులో కనుమరుగయేవి అవుతాయి. దంత్య చ, జ, లు, ఋ (ఋ తరువాత లు లిపి కూడా అందుబాటులో లేదు కంప్యూటర్‌లో) ‘ఱ’లు క్రమంగా పోతున్నాయి.
వాడుక, రచన, శాస్త్ర రచన మొదలైన వాటిలో నిలిచేవి నిలుస్తాయి. తొలగేవి తొలగుతాయి. మనం కావాలని వాడుకలో ఉన్న అక్షరాలని, మాటలని తగ్గించడం సరియైనది కాదు. అంతేకాదు వేయేండ్ల సాహిత్యం, శాస్త్రాలు, తరువాతి తరాలకు అర్థం కాకుండా కనీసం చదువకుండా (అక్షరాలు నేర్పకపోతే) చేసిన వారమవుతాం. తెలుగు సుసంపన్నంగా, సుబోధకంగా, సకల భావాలు తెలిపేవిధంగా ఉండడమే ప్రధానం. అట్లా వాడుకోవడం, కాపాడుకోవడమే ప్రధానం.

- డా గండ్ర లక్ష్మణరావు, 9849328036