సాహితి

కవితా జీవనది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హరహమూ, అనుక్షణమూ భవ్య కవితావేశంతో తెలుగు నేలను తన కవిత్వ ప్రవాహంతో ప్లావితం చేసిన గొప్ప కవి సి.నారాయణరెడ్డి. ఆయన అస్తమయం తెలుగు సాహిత్య చరిత్రలో ఒక శకానికి చరమగీతం పాడింది. దాశరథి, నారాయణరెడ్డి అన్నదమ్ముల వలె తెలుగు సాహిత్య రంగంలోకి ప్రవేశించినప్పటికి అది భావకవిత్వం తొలగిపోయి ప్రగతివాద కవిత్వం పెంపొందించుకుంటున్న కాలం. అది మన దేశానికి స్వాతంత్య్రం వచ్చిన కాలం కూడా. హైదరాబాద్ సంస్థానానికి విముక్తి లభించిన సన్నివేశం. సామ్యవాద ఉద్యమం, దేశ పునర్నిర్మాణ వేగంలో చెదరిపోయింది. జాతీయోద్యమ చైతన్యం, సంస్కృతి పునరుత్థానం రెండూ కవిత్వానికి నూతన సామగ్రిని, ప్రేరణను అందించాయి. ఈ సందర్భంలో చరిత్ర మూలాల్లోకి వెళ్లి కావ్యాలను నిర్మించే ప్రయత్నం ప్రారంభమైంది.
శివభారతము, రాణాప్రతాపసింహ వంటి చారిత్రక కావ్యాల మార్గాన్నించి కొంచెం ప్రక్కగా వచ్చి నారాయణరెడ్డి నాగార్జున సాగరం, కర్పూర వసంతరాయలు, విశ్వనాథనాయకుడు వంటి గేయ కావ్యాలు నిర్మించారు. తెలుగు గేయ ఛందస్సులో కథాకావ్య నిర్మాణం బహుశా ఇదే ప్రారంభం అనుకుంటా. ఈ చారిత్రక కావ్యాల నిర్మాణంలో సమకాలీన స్పృహ ఉండటం గమనార్హం. నాగార్జున సాగర్ నిర్మాణానికి ప్రధానమంత్రి నెహ్రూ శంకుస్థాపన చేసినప్పుడే నాగార్జునసాగరం కావ్యం ఆవిష్కరణ కూడా జరిగింది. దాదాపు ఈ రోజుల్లోనే బమ్మెరలో పోతన జయంతి ఉత్సవాలు మూడు రోజుల పాటు జరిగాయి. అప్పటి లోక్‌సభ డిప్యూటీ స్పీకర్ అనంతశయనం అయ్యంగార్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అప్పుడు నారాయణరెడ్డి తెలంగాణ రచయితల సంఘానికి కార్యదర్శి. కవిసమ్మేళనం జరుగుతుంటే ఉర్దూ ముషాయిరాల వలె పాఠకులు తమ ప్రతిక్రియను ప్రశంసను ప్రకటించి కవులను ప్రోత్సహించవలెనని కవిత్వాన్ని వినిపిస్తూ రాత్రంతా గడిపారు. ఆ కవిసమ్మేళనంలో అనుముల కృష్ణమూర్తి తన పద్యాలను చదువుతున్నప్పుడు రెండుమూడు సార్లు చదివించుకుని శ్రోతలు ఆనందపడ్డారు. దాశరథి, సినారెలు భావించిన ముషాయిరా పద్ధతి కవిసమ్మేళనం ఆ విధంగా సఫలమైంది.
కవిత్వం చదివేప్పుడు ఒక రాగచ్ఛాయ ఉండటం దాశరథి, సినారెలు తెలంగాణలో అలవాటు చేశారు. ఉర్దూ కవిత్వం వలె రెండు పాదాలలో కవిత్వాన్ని నిర్వహించటం రెండవ పాదాంతంలో ఒక విశిష్టమైన పదాన్ని ప్రయోగించటం ఆ విధంగా కవి సహృదయులకు నడుమ ఒక అనుసంధానం ఏర్పడటం అప్పుడే జరిగింది. ఆ విధంగా పల్లె పల్లెకూ బస్తీ బస్తీకి పట్టణాలకూ కవిత్వం వ్యాపించింది. ఆనాళ్లలో ప్రబంధ పఠనం పేర మనుచరిత్రాదులను దాశరథీ ప్రభృతులు సినారె ఘట్టాలను వినిపించి ప్రాచీన కవిత్వం పట్ల ఆసక్తిని పెంచేవారు. తెలంగాణ రచయతల సంఘంలో ఏ వాద పరిమితులు లేకుండా అందరూ ఉండేవారు. వానమామలై సోదరులు, కప్పగంతుల లక్ష్మణశాస్ర్తి, పల్లా దుర్గయ్య, కాళోజీ సోదరులు, వి.పి.రాఘవాచార్య, సంపత్కుమార ఇలా ఎందరో ఉండేవారు. తెలంగాణ రచయితల సంఘం వార్షికోత్సవంలో శ్రీశ్రీ, ఆరుద్ర, ఇంద్రగంటి వంటి కవులను భాగస్వాములను చేయటం వారి సమష్టి తెలుగు సాహిత్య దృక్పథానికి ఒక దృష్టాంతం.
తెలంగాణ కవిత్వ వాహిని ఈ రకంగా ప్రవహించటంతో అప్పటి వరకు ఆంధ్రలో సాగుతున్న ప్రవాహంలో అవిజ్ఞాతంగానే ఎన్నో మార్పులు వచ్చాయి. క్రమంగా ఉద్యమాల పరిమితులు చెరిగిపోవటం ప్రారంభమైంది. నవ్యసంప్రదాయ వాదం చాలా బలంతో ముందుకు కొనసాగింది. ఛందస్సుల మధ్య, వస్తువుల మధ్య వైరుధ్యం తొలగిపోయింది. ఇక్కడ పరివ్యాప్తమైన ఉర్దూ పారశీక కవిత్వ ప్రభావం వల్ల ప్రేమ కవిత్వం రాయవలసిన అవసరం లేదన్న కొందరి మూర్ఖ వాదన పక్కకు నెట్టింది. గేయ కవిత్వం కథా బలంతో నూతన కావ్య రూపాన్ని పొంది, ఇంతకు పూర్వం ప్రకాశితమైన గేయ కావ్యాలు కినె్నరసాని పాటలు, శివతాండవం. ఈ రెంటిలోనూ లేని ఇతివృత్త ప్రాబల్యం వల్ల సినారె గేయకావ్యాలు ఒక సుస్థిర మైన స్థానాన్ని సంపాదించుకోగలిగాయి. నారాయణరెడ్డి ఈ కాలంలోనే తను పరిశోధనను కొనసాగించారు. ‘ఆధునికాంధ్ర కవిత్వంలో సంప్రదాయము-ప్రయోగాలు’ అన్న ఆ గ్రంథం వెలువడిన తరువాత ఆధునిక సాహిత్య చరిత్రను అంచనా వేయటంలో పెనుమార్పులు వచ్చాయి. విశ్వనాథ, కృష్ణశాస్ర్తీ, శ్రీశ్రీ ఆ ముగ్గురే కేంద్రంగా సాహిత్యాన్ని విశే్లషిస్తూ వచ్చిన సన్నివేశం - ఆధునిక సాహిత్యానికి గురజాడ అప్పారావే యుగకర్త అన్న మరొక సిద్ధాంతానికి అడ్డుకట్ట పడింది. నారాయణరెడ్డి ఈ గ్రంథంలో ఆధునిక కవిత్వారంభానికి గురజాడ ఎంత చేశాడో అంతకన్న ఎక్కువగా రాయప్రోలు సుబ్బారావు చేశారని, ఇద్దరూ యుగకర్తలేనని తేల్చి చెప్పారు. అంతేకాక ఆధునిక కవిత్వ లక్షణాన్ని ప్రతిపాదించటంలో సిద్ధాంతీకరించటంలో కావ్యరూపంగా ప్రయోగించటంలో రాయప్రోలు సుబ్బారావునకున్న ప్రాధాన్యాన్ని, ప్రతిష్ఠను నారాయణరెడ్డి గ్రంథం నిలబెట్టింది. దాన్లోని అనేక అంశాలు ఈనాటికీ ప్రామాణికంగానే స్వీకరింపబడుతున్నాయి. ఆవిధంగా నారాయణరెడ్డి గొప్ప పరిశోధకుడుగా స్థిరపడ్డారు.
సినిమా ప్రపంచంలోకి ప్రవేశించిన తరువాత నారాయణరెడ్డి తన విశ్వరూపం ప్రకటించాడు. తన చిన్ననాడు పల్లెలో విన్న వీధి గాయకుల పాటలు, హరికథలు, బుఱ్ఱకథలు, తన గొంతుకలో నాటిన నాద భావుకత్వం సర్వతోముఖంగా విస్తరించింది. ఆయన పాటలు పది రకాల విశేషాంశాలను ఇముడ్చుకుంటూ సర్వజన మనోహరంగా కొనసాగాయి. తన పాటలను గూర్చి ఆయన ఒక విస్తృతమైన గ్రంథం పాటలో ఏముంది? అన్న పేరుతో వెలువరించారు. కేవలం పాటలే కాకుండా విశ్వనాథ నవల ‘ఏకవీర’ చిత్రానికి మాటలు కూడా రాశారు. కానీ ఆయన ఆ మార్గంలో కొనసాగలేదు.
రెండోవైపు సినారె తన లోలోతుల్లోకి మధించుకుంటూ దాని ఫలమైన తాత్త్విక దర్శనాన్ని తర్వాతి కావ్యాలలో ప్రతిఫలింపజేశాడు. భూమిక, విశ్వంభర, మట్టి-మనిషి- ఆకాశం ఈ కోవకు చెందిన కావ్యాలు. హిందీ సాహిత్యంలో ‘కామాయని’కి ఎటువంటి స్థానం ఉందో అటువంటి స్థానం విశ్వంభరకు ఉందని తెలుగు సాహిత్య విమర్శకుల అభిప్రాయం. నారాయణరెడ్డి తాత్త్విక ప్రస్థానంలో ఒక వైలక్షణ్యం ఏమిటంటే దానిలో పౌరాణిక స్పర్శ లేకపోవటం చలం, కృష్ణశాస్ర్తీలను బ్రహ్మసామాజిక భావన ఆవరించింది. నారాయణరెడ్డిని ఔపనిషదకమైన తత్త్వ దృష్టి ఆవరించింది. దానివల్ల అనుకోకుండానే ఆయన ఆర్ష మార్గాన్ని, పాశ్చాత్య దేశాలలోని మానవతావాద పద్ధతిని తనలో సమన్వయించుకున్నాడు. విశ్వంభర కావ్యాన్ని ఈ దృష్టితో చూస్తే మానవుడు అనాదిగా సాగిస్తూ వచ్చిన సమన్వయ మార్గం ఆత్మానే్వషణ మార్గం స్పష్టమవుతుంది. అందువల్ల పరిమితమైన వస్తువులను వర్ణించిన, పరిమితమైన వాదాలను అవలంబించిన కవులను, కావ్యాలను దాటి విశ్వజనీన స్థాయికి చేరుకోగలిగాడు. లోకంలో ఏ కవి అయినా సృష్టి తత్త్వాన్ని, దాని ఆరంభ వికాసాలను భావన చేస్తాడో అతనికే విశ్వ జనీన కవితా స్థాయి లభిస్తుంది.
కవిత్వంలో నారాయణరెడ్డి ఎన్నో గొప్ప ప్రయోగాలు చేశారు. మన కవుల్లో ఎందరో కాళిదాసు రుతుసంహారాన్ని అనువదించారు. ఒక్క విశ్వనాథ మాత్రమే తెలుగుదేశపు ప్రకృతి ప్రతిఫలించే ‘తెలుగు రుతువులు’ కావ్యాన్ని నిర్మించారు. ఆ పద్ధతిలోనే సినారె తాను పుట్టి పెరిగిన పల్లెలోని ప్రకృతిని ఆవరించే గొప్ప కావ్య రుతుచక్రం రచించారు. మరొక రీతిలో మానుష వ్యవహారాన్ని అందులోని వైవిధ్యాన్ని, వైరుధ్యాన్ని ప్రపంచీకరిస్తూ ప్రపంచ పదులనే ఒక కావ్యాన్ని ఒక కొత్త ఛందో రూపంలో నిబద్ధించారు. సినారె తెలుగు కవిత్వానికి ఇచ్చిన కొత్త కానుక గజల్ ప్రక్రియ. ఉర్దూ పారశీక సాహిత్యాలలోని గజల్ లక్షణాన్ని అనుసరిస్తూనే తెలుగు పాట ఒరవడిని, మాట మెత్తదనాన్ని కోల్పోకుండా తెలుగు గజల్ నిర్మించాడు.
దాశరథి వలెనె సినారె కూడా పద్యవిద్యలో నేర్పరి. జలపాతం సంపుటంలో అంకిత పద్యాలు ఆయన కౌశలాన్ని వెల్లడిస్తాయి. ఒక చోట గీత పద్యంలో పాదాన్ని ‘మబ్బుల వలె, వెనె్నల వలె, మంచుల వలె’ అని విరిచారు. పూర్వ కవుల్లో కృష్ణశాస్ర్తీ ప్రేమకొరకు, ప్రేమ కొరకు, ప్రేమ కొరకు అని విరిచారు. దానికంటే ఇది విలక్షణంగా ఉంటుంది. సంవత్సరంలో ప్రసరించే మూడు రుతువులను ఇది సూచిస్తుంది.
వ్యక్తిగా నారాయణరెడ్డి అజాత శత్రువు. జీవితంలో ఎవరినీ నొప్పించలేదు. ఆయన సారస్వత పరిషత్ అధ్యక్షుడిగా నిర్వహించిన కార్యక్రమాల్లో పరిణతవాణి అనేది విశిష్టమైనది. 65 సంవత్సరాలు వయసు మించిన ప్రముఖులతో ప్రసంగాలు చేయించి, వాటిని ప్రచురించారు. ఈ ప్రసంగాల పరంపర ఆధునిక సాహిత్య చరిత్ర సంస్కృతి నిర్మాణానికి ఆధారశిలలుగా పనికి వస్తుంది. అలాంటి నారాయణ రెడ్డికి జ్ఞానపీఠ పురస్కారం లభించటం మా తరానికి లభించిన పురస్కారమే.
వర్షం పడితే మనం తడుస్తాం. ఎండ కొడితే మనం తపించి పోతాం. ఈ రెండు తీవ్రతలు వెనె్నలకు ఉండవు. శరత్కాలానికీ ఉండవు. శరత్కాలం వచ్చి పోతుంది. కానీ మనస్సులో ఒక దీప్తిని నిలుపుతుంది. సినారె కవిత్వం తెలుగు సహృదయులకు మరొక శతాబ్దం పాటైనా ఆత్మీయ ముద్రను అందించి, ఆనందింపజేస్తుంది.

- కోవెల సుప్రసన్నాచార్య