సాహితి

కుల సమాజంపై కలం దూసిన ‘కవి కోకిల’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘‘రాజు జీవించె రాతి విగ్రహములందు
సుకవి జీవించె ప్రజల నాలుకల యందు’’ అన్నది నిజం.
రాజులు, రాజ్యాలు కాలగర్భంలో కలిసిపోయినా సాహితీ సామ్రాజ్యం మాత్రం అజరామరంగా సాగిపోతూనే వుంది. ఈ సామ్రాజ్యాన్ని లాలించిన, పాలించిన కవి రాజులు చరిత్ర పుటల్లో, సహృదయుల గుండెల్లో నిలిచే వున్నారు. చారిత్రక పురుషుడి పద ఘటనలో ఎన్ని తరాలు జరిగిపోయినా, ఎన్ని జ్ఞాపకాల నీలి నీడలు మిగిలిపోయినా, మరపురాని- మరువలేని కొన్ని చారిత్రక సత్యాలు మాత్రం సజీవంగా కళ్ళముందు కదలాడుతూనే వుంటాయి.
‘‘ముసలివాడైన బ్రహ్మకు బుట్టినారు
నల్వురు కుమారులను మాట విన్నాముగాని
పసరము కన్న హీనుడ భాగ్యుడైన
ఐదవ కులస్తుడెవరమ్మా సవిత్రి’’ అంటూ భరతమాతనే ఆర్తితో ప్రశ్నించిన మహాకవి, కుల సమాజంపై కలం దూసిన ‘కవికోకిల’ జాషువా 1895 సెప్టెంబర్ 28న వినుకొండలో లింగయ్య, వీరమ్మగార్లకు జన్మించాడు. ఆ క్షణాన అతడికి తెలియదు. తాను జన్మించిన కులము, దానివల్ల ఎదురయ్యే విపత్కర పరిస్థితులు, అవమాన అవహేళనలు, దుర్భర దారిద్య్ర స్థితిగతులు. అచంచలమైన ధైర్యసాహసాలతో వాటిని అధిగమించి తెలుగు సరస్వతీ సాహితీ వీణపై సరిగమాలాపన చేసిన ‘కవి కోకిల’ అతడు. గుండెలో గూడు గట్టిన ఆవేదన, తట్టిల్లున ఎగిసే ఆవేశం, మూగగా రోదించే ఆక్రోశం, కరిగించే కరుణ, వివరించే మానవత, స్పందించే తాత్వికత.. ఇలా ఒక్కటేమిటి అన్ని భావాల ‘కవితా విశారదుడు’ ఆయన. ఎద వీణియను మీటిన ‘మధుర శ్రీనాథుడు’. కన్నీటిని పన్నీటితో మేళవించిన ‘కవి దిగ్గజం’. అసమ సమాజంలోని కాఠిన్య పరిస్థితులకి అగ్నిని వర్షించి, సమ సమాజాకాంక్ష కలిగిన ‘నవయుగకవి చక్రవర్తి’, ఎన్ని గజరోహణలు జరిగినా, ఎన్ని గండపెండేరాలు తొడిగినా పొంగిపోలేని ‘పద్మభూషణు’డాయన.
హింసతో ప్రజల మూకీ భాష్పాలకు నోరిచ్చి రచ్చకెక్కించటమే కవుల ఆత్మవేదనోపశమనానికి సాధనమని ప్రగాఢంగా విశ్వసించిన మానవతావాది. అందుకే ఆయన కావ్యాలు వెనె్నల్లో ఆడుకుంటూ ఆనంద పారవశ్యంలో మునిగి తేలే కన్యకలు కారు. ఆయనలోని అంతస్సంఘర్షణకి అక్షరాకృతులు- మానవాళికి అర్పించిన మూగజీవి నివేదనలు.. సామాజిక చీడల చేత పీడించబడుతున్న వర్గంలో ఆయన సభ్యుడు కావడం చేత ఆయన వర్ణనలు కాని, ఖండనలు కాని, విమర్శలు కాని క్షుభిత హృదయం నుండి వెలికివచ్చినవే. ఆయన కవితా ప్రస్థానం మానవతావాదంతో, సంఘ సంస్కరణాభిలాషతో సాగిపోయింది.
ఈ మహాకవి పద్యకావ్యాలు ప్రధానంగా ఖండ కావ్యాలు ఏడు భాగాలు. గబ్బిలం, నా కథ, ఫిరదౌసి, ముంతాజ్ మహల్, బాపూజీ, నేతాజీ, కాందిశీకుడు స్వయంవరం, స్వప్నకథ, ముసాఫర్లు, కొత్తలోకం, క్రీస్తు చరిత్ర మొదలగు కావ్యాలు. నాగార్జునసాగర్, రాష్టప్రూజ చిన్న కావ్యాలు. ఇవికాక చిదానంద ప్రభాతం, ధృవవిజయం తెరచాటు, రుక్మిణి కళ్యాణం, కుశలవోపాఖ్యానం వంటి దృశ్యకావ్యాలు. చిన్న నాయకుడనే చారిత్రక నవలను కూడా రచించాడు.
‘‘మరణం లేని మానవత్వాన్ని కామించు
కవితా వీణపై నేను మ్రోగించిన వ్యథాతంత్రులే’’
ఖండ కావ్యాలని తెలిపాడు. ఇవి జాషువా వారి ప్రతిభకు, వస్తు వైవిధ్యానికి, ఊహాపటిమకి గీటురాళ్ళు. ‘్ఫరదౌసి’, ‘ముంతాజ్ మహల్’ కరుణరస భూయిష్టాలు. ‘బాపూజీ’, ‘నేతాజీ’ కావ్యాలలో జాతిపిత మహోన్నత వ్యక్తిత్వంతోపాటు తరతరాలుగా భారతదేశంలో కాపురం వుంటున్న దురాచారాలను, సాంఘిక దురన్యాయాలను, రాజకీయ దుస్థితిని తూర్పారపట్టారు జాషువాగారు.
‘‘మనము బానిసలము మనకును బానిసల్
శాశ్వతముగ నిమ్నజాతి వారు
బానిసీండ్ర కింద బానిసలున్నచోట
బలము ముమ్మరించు పాలకులకు’’ అంటూ మహాత్మునిచే అటు రాజకీయ దుస్థితిని, కులం పేరిట పెత్తనం చెలాయించే స్వార్థశక్తులను ఈసడించాడు.
నాగార్జునసాగర్, రాష్ట్ర పూజ ప్రచార సాహిత్యానికి నిలయం కాగా, నా కథ, మూడు భాగాలు జాషువా గారి స్వీయ చరిత్రలో ప్రధాన ఘట్టాలు. ‘నా కథ’ ఆట పాటలతో తోటివారు దరికి చేరనీయనపుడు ఆ పసివాని మనసు ఘోషను జాషువా గారు వర్ణించిన రీతి అత్యద్భుతం.
‘నిమ్నజాతుల కన్నీటి నీరదములు పిడుగులై
దేశములు గ్రాల్చివేయునవి’’ రాబోయే పెను తుఫానునీ సూచించాడు.
ఆ ఈశ్వరునికి జాషువా మహాకవి చేసిన అక్షరార్చన ‘గబ్బిలం’. ఆయన కృతులన్నింటిలోకి తలమానికమనదగినది ఈ గబ్బిలం. ఒక అస్పృశ్యతా, అస్పృశ్యుని హృదయావిష్కరణ గబ్బిలం. నా కావ్యాలన్ని మరుగునపడితే పడవచ్చు కాని ‘గబ్బిలం’ మరుగున పడటానికి వీలు లేదు అని అంటారు జాషువాగారు.
‘‘చెప్పులు కుట్టి జీవనము చేసే వీని సేవలకు
ఎపుడు అప్పు పడ్డది భారతావని’’ అంటూ
‘‘వాని ఱెక్కల కష్టంబు లేనివాడు
సస్యరమవండి పులకింప సంశయించు
ప్రపంచానికే భోజనము పెట్టువానికి భుక్తిలేదు
వానినుద్ధరించు భగవంతుడే లేడు
వాడు చేసికొన్న పాప కారణమే మొయింతవరకు వానికెరుకలేదు’’
అని చేయని తప్పుకి కులం పేరిట దారుణ శిక్షకి గురికావటాన్ని హృదయవిదారకంగా లిఖించాడు.
ఒకవైపు అస్పృశ్యత, మరొకవైపు సాంఘిక దురన్యాయాలు, ఇంకోవైపు సామాజిక రుగ్మతలు, ఆర్థిక రాజకీయ వైరుధ్యాలు, స్వార్థాపేక్ష అన్ని వైపులనుండి పద్మవ్యూహంలా ముప్పిరిగొనగా అన్నిటిని తన కవితా బలమనే కలంతో చీల్చి చెండాడిన అభిమన్యుడు జాషువా. ఆయన నిశిత పరిశీలనా దృష్టినుండి తప్పించుకున్న అంశమే లేదు.
పుణ్యతీర్థాలు దర్శించి, వేలకు వేలు ధనాన్ని వ్యయిస్తూ, నిరుపేదల జోలెల పైసా కూడా దానం చేయని వ్యక్తుల్ని- వారినేమి అనలేని దైవాన్ని కూడా ధైర్యంగా నిరసించాడు. గుడి గోపురాలకు మాత్రమే పరిమితమైపోయిన ఆ దేవుడికి ముఖమెలా చెల్లుతుందన్నాడు. ‘‘గుళ్ళు గోపురాల కొరకు చందాలెత్తి పొట్టపోసుకొనుట పుణ్యమగునే’’ అంటూనే దుర్భర దారిద్య్ర పరిస్థితుల్లో గంజికి కూడా నోచుకోక ప్రజలు అల్లాడుతుంటే మరొకవైపు పూజా పునస్కారాలంటూ వేలకు వేలు ధనాన్ని వెచ్చించటాన్ని తీవ్రంగా విమర్శించాడు.
‘‘ప్రతిమల పెండ్లి సేయుటకు వందలు వేలు వ్యయించు గాని దుః
ఖిత మనులైన పేదల పకీరుల శూన్యములైన పాత్రలన్
మెతుకునిదల్పదీ భరతమేదిని ముప్పది మూడు కోట్ల దే
వత లెగవడ్డ దేశమున భాగ్యవిహీనుల క్షతులారునే’’
అస్పృశ్యుడి తర్వాత అణచివేతకు గురయ్యే జాతి స్ర్తి జాతే. దోపిడీకి గురయ్యేవారి పక్షాన నిలచి పోరాడే జాషువా కలాన్ని స్ర్తి దాటిపోలేదు. పోదు.
స్ర్తి అమాయకత్వాన్ని మూఢాచారాన్ని నిరసిస్తూ ఖండకావ్యం అయిదవ భాగంలో
‘‘వెర్రిబాగులమ్మ, పరమ మూఢ, చవల హృదయ
తలవ్రాత కేడ్చు విద్యావిహీన మారు పల్కలేని మందభాగ్య’’ అంటూ భావగర్భితంగా ప్రయోగిస్తూ ఈ దుస్థితినుండి దాటిరావాలని ఉద్బోధించాడు.
జాషువా గారు తన కావ్యాలు ఆనాటి సమాజంలోని అసమానతలకు అద్దంపట్టి మన చేత కంటతడి పెట్టించి, మరువలేని కావ్యాలుగా మిగిలిపోవాలని అభిలషించినా, నాడు చుండూరు, కారంచేడు, పదిరికుప్పం, చల్వకుర్తి వంటి ఎన్నో సంఘటనలు జరిగినా, నేడు రాష్ట్రంలోనే కాక యావత్ దేశంలో ఏదో ఒక మూల అణగారిన వర్గాలపై జరుగుతున్న దారుణ మారణకాండలు, అత్యాచారాలు, మత కలహాలు ఎదుగుబొదుగు లేని స్ర్తి స్వేచ్ఛ.. ఇవన్నీ జాషువా కావ్యాలను అనుక్షణం జ్ఞప్తికి తెస్తూనే వుంటాయి. మహాత్ముని రక్తతర్పణంతోనూ, మహాకవుల రక్తాక్షరాలతోనూ ఈ చరిత్ర లిఖించినా మనలో సంస్కారం కలగనంత వరకు ఈ స్థితి మారదు. మనలోని సంస్కారమే ఆ మహాకవి, సమ సమాజంపై కలం దూసిన ‘కవి కోకిల’కు స్మృతాంజలి నివాళులు.
‘‘్ధర్మమునకు బిరికితనమెన్నడును లేదు
సత్యవాక్యమునకు జావులేదు’’

- గుండాల రాకేష్, 7893356150