సాహితి

సామాజిక దౌర్జన్యాలపై సహజ కవితా ధ్వజం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నచర్యల్లాంటి కవితలు రాసి, కొందరి పెద్దకవుల గళాలే మొద్దులూ బారిన వేళ... ఆకాశాన్నంతా ఒక్కసారి చూపగల్గే కొంగ్రొత్త మెరుపులు మన హృదయాల్ని కుదిపి లోగొంటాయి. చిరుమొక్కలు పెద్ద పువ్వుల్ని పూసిన చిత్రమైన ప్రాకృతిక వేళల్లో - వికసించే రేకు బాకుల్ని చూసి, వాటి కాంతుల్ని చూసి, విప్పారిన యోచనానేత్రాలతో విభ్రాంతికి గురవుతాం. మిత్రుడు ఇంద్రపాల శ్రీనివాస్ రాసిన ఆరు కవితా సంపుటాల్ని అధ్యయన పఠనం చేశాక, అతడి హృదయ అనుభూతి ఆలోచనల కోణాల్ని దర్శించాక అటువంటి విభ్రాంతికే గురి అవుతాం.
మాజీ మానవుడు, తాజా అన్యాయం, కన్నీటి వాచకం, చెరసాలలో చిరునవ్వు, మహాశ్మశానం, నేను అస్తమించను అనేవి ఆ ఆరు స్వీయ కవితాసంపుటాలు. నల్లగొండ జిల్లా తుమ్మల గూడెం శ్రీనివాస్‌ది. లావుపాటి ఇజాల పుస్తకాలు మధించకుండానే, వాటి పఠనానుభవాల ఆలోచనలు - కవిత్వీకరించే తనదైన శక్తి పట్టుమని ముప్ఫైక్క ఏళ్ళైనా లేని ఈ కవికి ఎలా వచ్చాయి.
దుష్ట భ్రష్ట సామాజిక దౌష్ట్యాలని ఖండించే సహజకవితా పటిమ ఇంద్రపాల శ్రీనివాస్‌కు ఎలా అబ్బింది?
సమాజం అనే అనేకాధ్యాయాల గ్రంథాన్ని మమేకమై పఠించడం వల్ల.. బతుకు బాధల అగాధాల్ని చూసి చలించడం వల్ల... కళ్ళు చూసిన సమాజపు కుళ్ళును క్షాళన చేసే ప్రబోధం ఇవ్వవలసిన బాధ్యత కవిపై ఉందని మనసారా గ్రహించడం వల్ల... వెనె్నముకలో ధైర్య రక్తం నిత్య ప్రవాహంగా ఉండడం వల్ల అనుకరణలకూ, అనుసరణలకూ చాలామటుకు దూరంగా ఉండడం వల్ల... ఏ దుమ్ము మరకలూ పడని తాజాతనంతో భావించడం, ఆవిష్కరించడం శ్రీనివాస్ సిరిసంపదలు. ఇలా అనడానికి ఆ ఆరు కవితా సంపుటాలు కవితల్లో అధిక భాగం నిటారుగా నిలబడి సాక్ష్యం పలుకుతాయి.
కవితాసంబంధంగా గొంతు విప్పి చెప్పండని అడిగినప్పుడు ‘‘కవిత పరిష్కారం ఇవ్వకపోవచ్చు. మేలుకొల్పడం బాధ్యత. ఈ అసమ సమాజంలో దౌర్భాగ్యం కన్నా ఘోరమైనది దౌర్జన్యం. శ్రమైక జీవులపై జరిగే దౌర్జన్యాన్ని ఎదిరించే ఏ కవితైనా, నినాదమైనా, సామెతయినా కనీసం రెండక్షరాలయినా నాకిష్టమే. దౌర్జన్యాలని ఎదిరించడం కవుల కర్తవ్యం’’ అని నిజాయితీగా ఎద కిటికీని తెరిచి మరీ చెప్పాడు. దానికి అనుగుణంగానే కవిత్వంతో దూసుకు వెడుతున్నాడు.
నల్లగొండ డివిజను స్థాయిలో అభ్యుదయ సమ సమాజం వారు ఒక వ్యాసరచన పెట్టిన సందర్భంలో తాను కుల రహిత సమాజాన్ని కోరుతూ ఇరవై మూడు పుటల వ్యాసం రాయగా వచ్చిన తృతీయ బహుమానం తనను మొదట ప్రేరేపించిందని, కొలనుపాక తోకల రామారావు, సుద్దాల అశోక్ వంటి వారి ప్రోత్సాహక వాక్యాలు ముందుకు నడిపించాయని, ఆరు కవితా సంపుటాలు తాను వేయడంలో అన్ని వైపులనుంచి ఎంతో ప్రోత్సాహం లభించిందని, వ్యసనాలకి దూరంగా ఉంటూ మిత వ్యయంతో జీవించడం వల్లే సంపుటాలు అచ్చువేయగలిగానని, నాకిష్టమైన కవి అమృతం కురిసిన రాత్రి కవి బాలగంగాధర తిలక్ అని ఇలా మరికొన్ని అంశాలు ముచ్చటించారు. బూజును దులిపే బూజు కర్రకే బూజు పడితే ముందు దానిని తొలగించాలని ఆయన అన్నప్పుడు ఎన్నో అర్థాలు ధ్వనించాయి. అంతేకాదు ‘లోగడ ఆధునిక కవులు ప్రజల్లో ఉండేవారని, ఇప్పటి ఆధునిక కవులు ప్రచారాల్లో ఉంటున్నా’రని అనేశాడు. దాపరికం లేని భావ ప్రకటన నిజాయితీ శ్రీనివాస్ నైజగుణాలు మరి.
మాజీ మానవుడు సంపుటిలో ‘రాక్షసులంతా రాజకీయ నాయకులాగా పగటివేషాలు వేస్తా’రంటూ -‘ఓడింది ఒక్క ఓటుతో అయతే/ వాడి కన్నీళ్ల ప్రవాహంతో/ రాష్ట్రం మొత్తం జల దిగ్బంధం అవుతుంది/ గెలిచింది పదివేల పైచిలుకు మెజారిటీ అయితే/ వాడి మొహం ముందు/ సూర్యుడు సైతం వెలవెల బోవాల్సిందే’ అంటాడు. ‘ఇండియా ఇప్పుడు / భాగ్యవంతుల్ని ఉత్పత్తి చేస్తున్న అభాగ్యదేశం’ అంటూ ఏక వాక్య దేశ దుస్థితిని తెలుపుతాడు. అన్నదాత రైతు గురించి ‘సాగు చచ్చినా రైతు ఆశచావదు/ సాగు చేబడితే రైతుకు చావు తప్పట్లేదు/ మట్టిని నమ్ముకున్న వాడు/ మట్టిలో కలసిపోయే రోజులివి’ అంటూ ‘అన్నదాతకు మిగిలింది ఉరితాడు/ ఆ మర్నాడు తెగింది ఓ పసుపుతాడు/ రైతు ఇప్పుడు / ఇంట్లో శవాలను పండిస్తున్నాడు’ అని మనచేత కన్నీళ్లు పెట్టిస్తాడు.
ఉగ్రవాదం రోజు కింతమందిని అంతమందిని అంతమొందిస్తున్నా అది దినచర్య అయిపోయిందని భావించారో ఏమో మన కవులు ఆ అంశాన్ని పట్టించుకుని రాయవలసినంత రాయలేదనిపిస్తుంది. ‘మృత్యుగుహ’ ఖండికలో ఉగ్రవాద దారుణాల్ని చిత్రించి ఖండించాడు. పేగుల్లో నిప్పుఖండికలో ‘ఇప్పుడు పలుగు పార / పొట్ట నింపడానికే కాదు/ పూట్ట గొట్టే గుంటనక్కల / బొంద పెట్టడానికి కూడా’ అనడం కవిస్వరంలో భాస్వరం జ్వలిస్తుంది.
పొలాలు, రైతులు, పంటలు, వానలు, ధనవంతుల్లోని శ్రమ జన శత్రువులు, మానవ సంబంధాలు, అప్పులు, బ్రతుకులు, చావులు, ఆకలి బాధలు, పాలకుల దౌష్ట్యాలు, యాంత్రిక జీవనాలు, ఈ విధంగా ఎన్నో అంశాలపై రాసిన శ్రీనివాస్ కవితలు సజీవ సహజ కవితా రసధారలుగా ఉంటాయి. శోధించగలిగితే కొన్ని వ్యక్తీకరణలు మరచిపోనివిగా స్మృతి పథాన వుండి పోతాయి.
‘ఈ భూమీద సూర్యుడు స్పృశించని చోటుందేమో..
అవినీతి స్పృశించని చోటు లేదు’
‘త్రిబుల్ బెడ్‌రూం ప్లాట్‌లో. ఉన్నడో పోయాడో తెలిసేది/ శవంకంపు అపార్టుమెంటునంతా చుట్టు ముట్టాక... ‘కాలం కన్నా వేగంగా అంతరిక్షంలోకి దూసుకు పోతున్న మనిషి / భూమీద మనిషి మనసు లోతు తెలుసుకోలేనప్పుడు / మానవ జాతి మనుగడకు నలుదిశల నుండి ముంపు ముంచెత్తినట్లే’ అంటాడు.
హైరానా కవితలో ‘అటువైపు నుండి బిర్యానీ వాసన / ఇటు వైపుగా వీచి/ దరిద్రుడెదురయ్యాడని మూతి తిప్పుకుని వెళ్లిపోతుంది నిష్ఠురంగా’ అనడంలో దరిద్రుడంటే ఎంత లోకువో అనేది తెలుస్తుంది.
పొడుపు కథల్లో కవిత్వం వుండేది. కన్నీళ్ల కలయిక ఖండిక అటువంటి పొడుపు కథా కవిత్వం చివర అమెరికా అనేది చెప్పకపోతే- ‘‘నింగిలోకే కాదు / నీ అంగిలోకే తొంగి చూడగలదు/ అందమైనదే కానీ / ఆడపిల్ల కాదు/ నేల మీద కాదు నీ ప్రతిమూల దూరిపోగలదు / పెద్దనే్న కానీ, / ప్రేమ గల హృదయం కాదు. / అది అందాల అమెరికా/ దేశ దేశాల కన్నీళ్ల కలయికగా అమెరికాను చెప్పడం కవితాభివ్యక్తితో శక్తి ఉండడానికి నిదర్శనం. ‘శవాలు’ కవిత పరిణతి చెందిన పెద్ద కవుల కవితాస్థాయికి సమాన హోదాలా దర్శనమిస్తుంది.
‘‘కత్తుల మహాసముద్ర తీరంలో/ కాళ్లు చేతులు విరిగిన సామాన్యుల శవాలు / తుపాకుల సరస్సులో / బుల్లెట్లతో కడుపు నిండిన సగటు మనిషి శవాలు.. / ఏ పేచీలేని శవాలు / ఒంటికి గోచీ కూడా లేని శవాలు’ ఇలా అధివాస్తవిక కవితా జగత్తులోకి తొంగి చూచేలా ఉంటుంది ఈ కవిత.
కలిగినోళ్ల కింద నలిగినోళ్ళెందరో.. అంటాడో ఖండికలో భేషజాలు లేని కవితా భాషాప్రవీణుడు మన శ్రీనివాస్.
‘ఇక్కడ కరువు లేదు’ కవిత సామాన్యుల బాధల అగణితం. ‘‘జీవితాన్ని కన్నీళ్లతో భాగిస్తే / మిగిలినవి బాధలు/ భవిష్యత్తును ఊహలతో కూడితే మొత్తం కలతలే/ ఆఖరికి కొస ప్రాణాలను/ చివరి కోరికతో గుణిస్తే / దక్కింది శ్మశానమే.
సాదాసీదాగా కనబడే ఈ కవి సామాన్యుల గురించి అసామాన్య కవితాఖండికల్ని ఇంత ఎత్తులో ఎలా రాయగలిగాడా అని కవి వయస్సును బట్టి భయంవేస్తుంది. ‘వరిచేనుకు శ్రీమంతం’ ఒక మనోహర ప్రాకృతిక భావుకత కల కైత. విత్తనం పురుడికెళ్లే దశావిశేషం దీంట్లో దాగుంది. వ్యంగ్య ధర్మాలున్న కవితలూ ఈ కవి రాశారు.
‘నిజమెప్పుడూ ప్రవాస జీవితం గడుపుతుంది. / పాండవుల వనవాసంలా/ అబద్ధం ఉన్న ఊరును విడిచి వెళ్లదు. మాజీ సర్పంచ్‌లా’ అంటాడు ‘నిజమెప్పుడు ’ ఖండికలో.
‘కలలు’ ఖండిక (నేను అస్తమించనులో) అభివ్యక్తిలో అజంతా వంటివారి స్థాయికి వెళ్లిందంటే మామూలు సంగతా? ఈ కవి ఆరు కవితా సంపుటాలు కవితాధిరోహణలో ఆరు శిల్పసమన్విత సోపానాలైతే ఆరోమెట్టుపై కవితాసాధనల పర్యవసాన స్వస్వరూపం వంద మయూర నృత్యాల కవిత్వంగా అందగించింది. పురి విప్పడమే కాదు సామాజిక బాధ అగాధ అంశాలు దృశ్యమానం చెయ్యడం ఆశ్చర్య విశేషం.
‘మాజీ మానవుడు’లో కవి సంపూర్ణ మానవుడిగా గోచరించాడు. ‘తాజా అన్యాయాల’పై ధిక్కార కవిత్వం వ్రాశాడు.
‘కన్నీటి వాచక పఠనం చేయించాడు. ‘చెరసాలలో చిరునవ్వుల్ని కవిత్వీకరించాడు. ‘మహాశ్మశానం’ లోనూ వెలుగుల క్రమాన్ని తాత్త్వికంగా చూపాడు. ‘‘నేను అస్తమించను’’లో మరింతగా కవిగా ఉదయించాడు. జయధీర్ తిరుమలరావు అన్నట్టు ఈ కవిది కొత్త వాసనల కవిత్వం. తాను కవిత్వ రచనలు ఉత్తీర్ణుడయినా తన కవిత్వాన్ని విమర్శించే వారికి పరోక్ష పరీక్షలు పెడతాడు. తనకు సంబంధం లేకుండానే నేనింక ఏదో సాధించాలి అనే మధనాగ్ని కళాకారుడికీ, కవికీ ఉంటుంది. తానెంత చేసినా, రాసినా, గీసినా, ఇంకా ఏదో సాధించవలసి ఉంది అనుకునే తత్త్వం ఇంద్రపాల శ్రీనివాస్‌కు ఉండడం వల్లే ఏదో మూడ్‌లో ‘నా రచనలు నాకిప్పటి వరకూ నచ్చలే’దంటాడు.
అయితే అతని కవితలు మనకి, సమాజానికి నచ్చుతాయనేది వాస్తవం. అది మన అంచనాలకు ఆయన గళం సామాజిక దౌర్జన్యాలపై సహజ కవితాధ్వజం భవిష్య కావ్య ఫలాలను స్వాగతిద్దాం.

- సన్నిధానం నరసింహ శర్మ, 9292055531