సాహితి

కొడుకును కన్నా కోరిక తీరలేదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘దినదినానికి అతనిలో హుషారు చచ్చిపోతూ వుంది. నవ్వుతూ నవ్విస్తూ బస్తాలతో బంతులాడుతుండిన మనిషి తన వంతు పని తాను చేస్తున్నాడు. ఏదో పోగొట్టుకున్నట్లు ముభావంగా తిరుగుతున్నాడు. కంటపడిన రాతికీ రప్పకూ మొక్కుతున్నాడు. అతని వాలకం ఒక రాగాన అంతుబట్టక కూలీలందరూ చుట్టూ చేరి గుచ్చి గుచ్చి అడిగితే ‘ఇంటి పేరు నిలబెట్టే దానికొక మొలక మొలవకపోతే ఇంక ఆ బతుకుండేని లాభం?’’ అని నిట్టూర్చాడు.
కొడుకును కనలేకపోయానని ఆ దంపతులు దిగులు పడిపోతున్నారు. లారీ కూలీల మేస్ర్తి రంగయ్య కథనం ఇది. రచయిత పులికంటి కృష్ణారెడ్డి. రంగయ్య భార్య రాణెమ్మ ఎన్నో పూజలు చేసి తడిబట్టల్లో నూటొక్కసార్ల ఆదిదంపతుల్ని నూటొక్కసార్లు చుట్టింది. కథ పేరు ‘కొత్త రిక్షా’.
మేస్ర్తి రంగయ్య వృత్తితో విసుగెత్తిపోయి రిక్షా రంగయ్యగా రూపాంతరం పొందాడు. ‘పదిండ్లు ఒప్పుకున్నా. రిక్షా తెచ్చుకున్నా. ఆ పిల్లకాయల్ని కానె్వంటు స్కూళ్లకి తీసుకుపోయి తీసుకొనొస్తా. నా బతుకులో ఒక మొలకెట్టా మొలవకపోయే. కనీసం ఇట్లయినా నా ముచ్చట తీర్చుకుంటా’ అన్నాడు. అడిగిన వాళ్లతోను, అడగనివాళ్లతోను. పిల్లలను స్కూలుకు చేర్చడం, మళ్లీ ఇళ్లకు తీసుకురావడం అతనికి ఎంతో సంతృప్తిని కలిగిస్తుంది. ఆనందం వెల్లివిరుస్తుంది. ‘ముచ్చటగా తయారయి బుడిబుడి నడకతో వస్తున్న పిల్లవాణ్ణి అమాంతంగా జవురుకుంటాడు. జాగ్రత్తగా రిక్షాలో కూర్చోపెడతాడు చేతిలో సంచీ తీసి రిక్షాకు తగిలిస్తాడు. భద్రంగా కూసో బాబూ అంటూ బయల్దేరుతాడు. అతనికి గిరాకీ హెచ్చింది. రెండు ట్రిప్పులు వేస్తున్నాడు. తనకు బిడ్డలు లేరన్నమాటే మరచి, ‘అందరూ తన బిడ్డలే’ అని భావిస్తూ వాళ్ళతోనే తన ముద్దు ముచ్చట తీర్చుకుంటున్నాడు. పసి పిల్లల తల్లిదండ్రుల ఆశీర్వచనంవల్ల రంగయ్య భార్య రాణెమ్మ గర్భవతి అయింది. రంగయ్య ఆనందంతో పిల్లలకు పెద్దలకు బిస్కెట్లు పంచిపెట్టాడు. కడుపుతో వున్న అమ్మ - కనక మానుతుందా? తొమ్మిది నెలలు దినాల్లా గడిచిపోయి రాణెమ్మ మగబిడ్డను ప్రసవించి తాను బతుకు చాలించింది. రంగయ్య కుంగిపోయినా కాలక్రమేణా ఇరుగు పొరుగులు చెప్పిన ధైర్యంతో నిలదొక్కుకున్నాడు. ‘ఆరు నూరైనా తన కొడుకును ఒక ప్రయోజనకుడిని చేయాలని పట్టుబట్టాడు. అతని పెంపకం, పోషణలో కుర్రవాడు పెరిగి పెద్దవాడయి ‘ఇప్పుడు బ్యాంక్ ఆఫీసర్’ అయ్యాడు. పెండ్లి చేసుకుని నెల్లూరులో ఉద్యోగం చేసుకుంటున్నాడు. ఆరు సంవత్సరాలు గడిచిపోయినా రంగయ్యకు కొడుకు దగ్గరనుంచీ ఉత్తరాలు రావడం బహు అరుదయిపోయింది. తపాలా బంట్రోతు రామయ్య కోసం రోజుకు రోజు ఎదురుచూస్తూ ఏమీ లేదనిపించుకోవడం అలవాటయిపోయింది. ఏడేండ్ల తరువాత ఒకనాడు రామయ్య అతని గుడిసె ముందు రిక్షా ఆపి ‘రంగయ్యా, నీకు మనిఆర్డరు’ అని అరిచాడు. రంగయ్య ముందు నమ్మలేకపోయినా, ఇన్నాళ్లకు కొడుకు తనను గుర్తుచేసుకుని ‘వంద’ రూపాయలు పంపాడని ఉబ్బి తబ్బిబ్బు అయినాడు. ‘తాను ఎంతోకాలం కార్చిన చెమటకు ప్రతిఫలం ఆ డబ్బు’ అనుకున్నాడు. ‘ఎన్నో వందల రూపాయలు చూసిన చేతులవి. అయినా ఈ వంద రూపాయలు చేతిలో వుంటే ఆ ఆనందమే వేరుగా ఉంది’ అని మురిసిపోతాడు. ఇంటింటికీ తిరిగి ఈ వార్త ఊరంతా చెప్పుకుని సంతోషిస్తాడు. తన బరువు బాధ్యతలన్నీ- రిక్షాలో కుర్రవాళ్ళను జాగ్రత్తగా తిప్పడం- మరో కుర్రవాడికి అప్పజెప్పి, తను నెల్లూరు బస్ ఎక్కాడు; కొడుకు పోషణలో జీవిత శేషం విరామంగా విశ్రాంతిగా గడపాలని.
అతను నెల్లూరు చేరి, ‘తన కోసమే ఎదురుచూస్తున్న కొడుకు, కోడల్ని’ కలుసుకుంటాడు. ‘కొడుకు ఆప్యాయంగా పలకరించాడు. కోడలు నమస్కరించింది’. ఇన్నాళ్లు తను ఉత్తరాలు రాక, సమాచారం ఏమీ తెలియక పడిన ఆవేదన అంతా వెళ్లగక్కుకుంటూ ‘రేపు నీకు బిడ్డలు పుడ్తే అప్పుడు తెలుస్తది, కడుపు తీపి ఏంటో’ అంటాడు.
కోడలు ‘అప్పుడే ఏమిటి మామయ్యా, పుట్టారు. ఒక మనుమడు, ఒక మనవరాలు అని జవాబు చెబుతుంది. నాలుగేళ్ల బాబును, మూడేళ్లపాపను ‘అమాంతంగా ఆ ఇద్దరినీ చెరొక చేత్తో జవురుకొన్నాడు. కొడుకు కళ్లలో తృప్తి, ఆనందం, ప్రసన్నత కనిపించడం రంగయ్యకు ఎంతో ఆనందం అనిపించింది.
కొడుకు చల్లగా చెప్పాడు- ‘నీ కోడలు కూడా నాతో పనిచేస్తూ వుంది. అందుకే ఇంత మంచి ఇల్లు కట్టుకోగలిగాను. పిల్లల్ని కానె్వంటుకు పంపాలి. ఎవ్వరినీ నమ్మడానికి వీల్లేదు. మొన్న ఒక రిక్షావాడు మా బ్యాంకులో ఆఫీసర్ కొడుకుని అమ్మేసి పరారయ్యాడు. మీరైతే నాన్న, ఇంక మాకేం దిగులు లేదు. ఎవరెవరో పిల్లల్ని ఎంతో జాగ్రత్తగా చూసుకునేకంటే నీ మనవణ్ణి మనుమరాల్ని ఎలా చూసుకుంటారో చెప్పు నాయనా? అందుకే రిక్షా కూడా కొనిపెట్టేను. కొత్త రిక్షా నాన్నా!’ ఈ మాటలు విని రంగయ్య ‘వేదాంతిలా చిరునవ్వు నవ్వాడు. ఆ చిరునవ్వులో అంతరార్థం ఏమిటో అతనికే తెలియాలి మరి!’ అని కథ ముగింపు అవుతుంది. తండ్రి కొడుకు ఇంట్లో విశ్రాంతిగా గడుపుదామని ఆశలు పడ్డట్టు కథకుడు చెప్పడు కథ పొడుగునా ఎక్కడా! రిక్షా లాగడమే తనకు యిక్కడా పని. అందుకోసమే కొడుకు కోడలు తనను ఇంత ఆప్యాయంగా పిలిచారు అని అర్థం చేసుకుని ‘వేదాంతి’ అయిపోయాడు. మనసులోనే మాటలు దాచుకున్నాడు.
విదేశాలలో వుండి లక్షలకొద్దీ డాలర్లు సంపాదిస్తూ కూడా, పురుళ్ళకు పుణ్యాలకు, పిల్లలకు ‘బేబీ సిట్టర్’గా వ్యవహరించటానికి తమ తల్లిదండ్రుల్నీ, అత్తమామల్నీ పిలిపించుకుంటున్న వాళ్ల కథలు మనం అనేకం చదివాం. బేబీ సిట్టర్‌కు ఇచ్చే డాలర్లకంటే తమ కుటుంబీకులకు అయ్యే ఖర్చు చాలా తక్కువ. అదీగాక రక్షణ. ఆ విదేశీ కథల ముందు రుూ స్వదేశీ కథను గుర్తుచేసుకు పోల్చుకోవాలి చదువరి. మనుషుల తీరు ఎక్కడయినా ఒక్కటిగానే వుంటుందని చెప్పకుండా చెబుతున్న కృష్ణారెడ్డి కథన రీతి అనితర సాధ్యం.

- శ్రీవిరించి, 09444963584