సాహితి

కొంగ్రొత్త వెలుగులతో తెలుగు ప్రసరించేలా...

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కొత్త ఏడాది మళ్లా మున్నూటరవై అయిదు వేకువలను తీసుకురాబోతున్నది. వెయ్యేళ్ళ ముందర శాసన హోదా గల భాషగా, ఒక సహస్రం నుంచి సృజన సంపదగా, నన్నయ, పాల్కురికి రెండు తీరులుగా అందించిన రచనలుగా వేల పదాలు మన ముందర కుప్పలుగా పడివున్నాయి. అవి ప్రతి శతాబ్దంలో విస్తృతమవుతూ వచ్చాయి. గత వెయ్యేళ్లుగా నిర్విరామ సాహిత్య రచన భిన్న రూపాల్లో జరుగుతూనే ఉన్నది. తొలి సహస్రం మనకు అందీ అందని చరిత్ర నీడల్లో ఉన్నా, రెండో సహస్రం తెలుగు సారస్వతంలో చిరంజీవిగా ఉన్నది. ఆనాటి రాత పద్ధతులు, భద్రపరిచే పద్ధతులు, రాజులకు, కొద్దిమంది పండితులకు పరిమితం అయిన కాలం నుంచీ, అక్షరాలు అచ్చు పుస్తకాలుగా లభ్యత పెరిగి, చదువరుల సంఖ్య పెరిగి, సాంకేతిక దోహదం పెరిగి, మూడో సహస్రారంభ దశాబ్దాల్లో, వేగంగా పోయే విశ్వభాషల సరసన, తెలుగు మన అస్తిత్వంగా నిలబడి ఉన్నాము.
ఈ రెండో సహస్రంలో భాషలు విశాలం అయ్యాయి. భారత ఉపఖండం విషయానికి పరిమితం అయినా, ఆసియా పొత్తికడుపు నుంచి వచ్చి, ముందు దాడులు, దోపిడీలే చేసినా, ఆరువందల ఏళ్లుగా పాలించిన మహమ్మదీయుల భాష, ఇక్కడి వ్యవహార పరిభాష పదాలుగా సమస్త జీవన రంగాలను ప్రభావితం చేస్తూ కలగలిసి పోయింది. తరువాత పెనుగులాడిన మూడు వందలేళ్ళ పాశ్చాత్య ఆంగ్ల పాలన సైతం, పారిశ్రామిక నారికతలను, వాటితోబాటే వచ్చిన మార్పులను, కొత్త పదాలను జన సంపర్కంలో వదిలి, ప్రపంచ పోకడలు మన దేశీయులకు ఆకళింపు అయ్యేలా, విస్తృత వాడుక గల భాషను ఇచ్చింది. విదేశీ పాలకులు అంతరించారు. సాంస్కృతిక పలుకుబడులు మిగిలిపోయాయి. లోకానికి కిటికీలు తెరుచుకున్నాయి. ఇదీ స్థూలంగా గత సహస్రం ఒనర్చిన మేలు. నన్నయ లోకం కన్నా మన లోకం నేడు వెయ్యేళ్ళ తరువాత చాలా పెద్దది. కానీ, ఆయన ఏర్పరచిన లక్ష్యమే నేటికీ సాహిత్యానికి గొప్పది. అంతకుమించి మనం ఏమీ కొత్తగా చెప్పలేకపోయాము. ‘విశ్వశ్రేయం కావ్యం’ అన్నాడాయన ఒక వ్యాకరణ పుస్తకంలో. ‘ఏ భాష వారైనా, భాష క్షుణ్ణంగా ఎరిగి లోకోపకారి అయిన కావ్యం రాయాలి’ అన్నది ఆయన సూచన. సామాజిక నిబద్ధత ఉండాలా అంటే, మనం నన్నయను ఉదహరిస్తే చాలు. అభివ్యక్తి మార్పులను పూర్వ తరాలపై తిరుగుబాటుగా చూడటం పాత పద్ధతి. అప్పటివారు అభివ్యక్తిలో, ఇతివృత్త శక్తిలో వేసిన దారులు మరింత విస్తరింప చేయడమే ఏ కొత్త తరంలోనైనా జరిగేది. ఇది ఎంత మహత్తరంగా జరిగింది అన్నదే కలుపుగోలు దృష్టి. ఇన్‌క్లూసివ్ దృష్టి అంటారు. ప్రపంచంలో ఏదీ దానంతట అదే, మరే దానితో సంబంధం లేకుండా జరగదు. సాహిత్య, సాంస్కృతిక రంగాల్లోనూ అంతే. మన లాక్షణికుల నుంచీ, గురజాడ, టి.ఎస్.ఇలియట్ దాకా ఇది పాత కొత్తల మేలు కలయిక అనే చెప్పారు వారి వారి భాషల్లో.
నన్నయ తెనుగు భారత రచన మొదలు తరువాత దాదాపు ఒక వెయ్యేళ్ల కాలచక్రం తిరిగి, మూడోకొత్త సహస్రం మొదట్లో ఉన్న మన ముందున్న బరువు బాధ్యతలు నన్నయ, పాల్కురికి ముందర ఉన్నవాటికన్నా తక్కువేమీ కావు. తెలుగును మరో సహస్రం బతికించి 3018కి మనం అందివ్వగలమా? ఇదీ ప్రశ్న. తొమ్మిది వందల ఏళ్ల గ్రాంథికం ఆనాటి అవసరాలకు, నెమ్మది సహజ జీవనానికి సరిపోయినా, ముందు ముందు ఇది చాలదు అని ఎరిగిన వైతాళికులు భారతదేశం అంతటా తమ అభ్యుదయ వాణి వినిపిస్తూ, ‘రాబోయే శతాబ్దాలు ప్రజలవే కనుక, ప్రజల భాష రాయండి, ప్రజలకు తెలిసేలా విజ్ఞాన విషయ వినిమయం జరగాలి’ అని కోరారు. ఇది ఒక శతాబ్ది ముందర, జటిల గ్రాంథికంతో జరిగిన పేచీ కాగా, తెలుగు నాట 1927 ప్రాంతాలకు గానీ నవ్యసాహిత్య పరిషత్తు, వ్యవహారిక భాషను అంగీకరించలేదు. విశ్వవిద్యాలయాలు అంగీకరించేటప్పటికి మరికొన్ని దశాబ్దాలు గడిచాయి. ఆ నేపథ్యం స్వరూపం మారి ఇప్పుడు జటిల గ్రాంథికంతో వ్యవహారిక భాష ఎలా నెగ్గుకుని వస్తుందా అని కాక, విద్యతో ఇంగ్లీష్ దాడి, ప్రభావం పెరిగిపోయిన వర్తమానంలో అసలు తెలుగు ఉండాలా, ఉంటే ఏ మేరకు ఉండాలి అన్న కీలక అంశం శాస్ర్తియ దృష్టి లేని రాజకీయ వర్గాల, విద్యావ్యాపార వర్గాల పాలైంది. చదువరులు లేకపోతే, సాహిత్యం ఎవరికోసం ఎన్నాళ్లు బతుకుతుంది? అదే ఇప్పుడు దేశి భాషల ముందున్న ప్రశ్న. 2018లో తెలుగు సమాజం, తెలుగు సాహిత్యం, సాంస్కృతికతను ఎలా నిలబెట్టుకుంటుంది?
నిఘంటు విస్తృతీకరణ
గత యాభై ఏళ్లుగా మన తెలుగులో (ఇతర భారతీయ భాషల వలెనే) కొన్ని వేల పాశ్చాత్య పదాలు కలిసిపోయి, ప్రజల వాడుకలో ఉన్నాయి. వీటికి అనుగుణంగా, మన పదకోశాల, శబ్ద సంకలనాల విస్తృతి జరగాలి. శబ్ద రత్నాకరం అంటేనే అర్థం, నిత్యం కొత్త అలలు (పదాలు) పుడుతూ ఉంటాయని. ఈ కొత్త పదాల పట్ల మన వైఖరి ఏమిటి? నైఘంటు అవసరాల మేరకు ఒక మాట నిఘంటువులోకి ఎక్కాలి అంటే, అది సమాజ ప్రజల వాడుకలో విస్తృతంగా ఉండాలి. అలాగే సాహిత్య వాడకం, ప్రయోగం జరిగి ఉండాలి. ఇది రెండూ కూడా నిండుగా ఉన్న వేల అన్య పదాల పట్ల ఏమిటి మన వైఖరి? నిఘంటువులు మనం సమీక్ష జరిపి అరవై డెబ్భై ఏళ్లు దాటింది. ఆమధ్య పొట్టి శ్రీరాములు విశ్వవిద్యాలయం నిఘంటు ప్రచురణ చేసినా, అది ఆధునికతకు దూరంగానే ఉన్నదని కొంచెం పరిశీలిస్తే తెలుస్తుంది. ఇతర ప్రపంచ భాషలు, మనకన్నా తక్కువ సంఖ్య గల ఫ్రెంచ్, జపనీస్, ఇటాలియన్, జర్మన్ నిఘంటువులెలా నిర్మాణం చేస్తున్నారు అన్నది శాస్ర్తియంగా ఆకళింపు తెలుసుకుని, ప్రపంచ వ్యవహార భాష అయిన ఇంగ్లీష్ భాషావేత్తలెలా తమ మాటల లోకవ్యాప్త పునాదులు విస్తరిస్తున్నదీ కూడా చర్చకి వచ్చే సెమినార్లు జరిపి, ఎంత ఖర్చు అయినా సరే, ఈ పనికి పూనుకోవడం తెలుగు ప్రభుత్వాల స్థాయిలో చాలా అవసరం.
తెలుగు ఆధునీకరణ సాధ్యమేనా?
సాధ్యమే! ముందుగా ఏది సంప్రదాయ తెలుగు, ఏది ఉపయుక్త/ఆధునిక తెలుగు అన్నది తేలాక, ప్రపంచ జ్ఞాన విస్తారత అంతా పలు విషయాల గురించి ఉన్నది, నిత్యం జమవుతుండేది, ఎప్పటికప్పుడు మనం తెలుగులోకి మార్చగలిగే ప్రక్రియలో వేలాదిమంది సాంకేతిక సహాయాలతో పనిచేస్తే అందుకు అనుగణంగా ఆర్ట్స్ అండ్ హ్యూమానిటీస్ (కళా, మానవీయ రంగాలు) బలోపేతం చేస్తే ఇది సాధ్యపడుతుంది. వీటిలో వ్యవహార విషయ అనువాదం, సాహిత్య అనువాదం (ఇది అటునుంచి, ఇటునుంచి కూడా) రెండు శాఖలుగా ఉండాలి. వెయ్యేళ్ల సారస్వత సంపద, ప్రస్తుత తెలుగువారికి అస్తిత్వమూలం గనుక, విద్యార్థులకు ఎంత ఉన్నత విద్యలోనైనా, ఆ విద్యాస్థాయి తీరుకు అనుసారంగా ఒక తెలుగు రచన నిర్బంధ అంశంగా ఉండాలి. దీనిలో వారు సాధించే మార్కులు, వారికి కెరీర్‌లో ఉన్నతి, ప్రాధాన్యత కోసం పరిగణించబడతాయి అన్నది పొందుపరుస్తూ, తెలుగు ఒకటో తరగతి నుంచి ఉన్నత చదువుల్లో ఒక భాగంగా ఉండేలా చూడాలి. (ఒక వెయ్యేళ్ల దూరదృష్టి ఉంటే తప్ప ప్రభుత్వాలకు ఇది అమలుచేయడం సాధ్యం కాదు). ఇలా అమలు అవుతుంటే, చదువుకున్నది మర్చిపోలేరు కనుక, తెలుగుపై ఒక పరిచయం, వీలైతే ఇంకా ఎక్కువ ఆసక్తి ఎవరికైనా కలిగే అవకాశం, సృజనకారులుగా మారే వెసులుబాటు, ఇలా తెలుగు అన్ని స్థాయిల్లో కొత్త తరాలకు విద్యాబోధన అంశంగా ఉన్నప్పుడే సాధ్యం. దీనికి అనుగుణంగా మన విద్యావ్యవస్థలో సవరింపులు చేస్తే, అప్పుడు తెలుగు చదివేవారు సమాజంలో సంఖ్యాపరంగా పెరుగుతారు. మాకు తెలుగు రాదు అని చెప్పుకునే దశలో ఉండరు. ఇది కనీసం రెండు తరాల కాలం పట్టే ప్రక్రియ.
చదువరులు పెరగాలంటే ఎలాంటి సాహిత్యం రావాలి?
సాహిత్యం సమాజంలో పలు వర్గాలవారు పాల్గొనే ఒక మాధ్యమం అవుతుంది. అత్యధిక ప్రజల జీవన న్యాయాన్ని కోరడం ద్వారా, నేటి రాజకీయ వ్యాపార నియంతలు కడుతున్న ఆధిపత్య, అణుబాంబుల వంతెనలు దాటి మానవుడి ముందర ఉన్న ఎన్నో సహస్రాల జీవన ధ్యాసను తెలుగు రచయితలు సజీవంగా ఉంచగలరు. వేర్వేరు జీవన రంగ నైపుణ్యాలు, ఆయా రంగాలకు చెందిన వారైతే బాగా చెప్పగలరు. అటువంటి స్వీయ స్వరాలు నమోదు చేయవలసిన ఇరవయ్యో శతాబ్దపు ఎన్నో వృత్తిపరమైన రంగాల గురించి తెలుగు రచయితలు సృజనాంశాలుగా రాయవలసిన విశ్వశ్రేయస్సే. మనమే కాదు ప్రపంచంలోనే ఇవాళ ఎక్కువగా రాస్తున్న విషయాలివి. ఇప్పుడు రాయవలసినంత విశాలంగా రావడం లేదు అన్నది ఒక స్థితి. జీవన సంక్లిష్టతలను కావ్యాలు చేయలేని అసహాయత ఎక్కడుందో ఆలోచించడం కూడా మన బాధ్యతే.
నాటక దర్శనం
మన నాటక ప్రక్రియ ఎంతలా ఇరవయ్యో శతాబ్దంలో వికాసం చెందింది, ఇవాళ మనం క్షుణ్ణంగా పట్టించుకోవలసి ఉన్నది. వాడుక భాషలో కథలు, కవితల రచనకు ముందరే మన నాటక రచనను చిలకమర్తి, గురజాడ, తిరుపతి వేంకట కవులు, బలిజేపల్లి వంటివారు రంగస్థలాన్ని దృశ్యప్రబంధ వేదికలుగా మలిచారు. ఈ దారిలో తరువాతి దశాబ్దాల్లో తెలుగు నాటకం ఇంకొందరు నాటక శిల్పుల ద్వారా ఎంత దూరం నడిచిందో చూడడం కూడా 2018లో మన పరిశీలనకు సిద్ధంగా ఉన్న సజీవ సమాచార వాహిని.
నవలకు పునరుజ్జీవం
నవల నానాటికీ చిన్నదై కేవలం నూట ముప్ఫై పేజీలే అని ప్రచురణకర్తలు చెప్పడం, అవునే్ల అని రచయితలు అనుకునే పరిస్థితి ఒక్క తెలుగు నవలా సాహిత్యంలోనే ఉన్నది. ఈ పరిస్థితి బాగుపడేందుకు కూడా మనం దారులు వెతకాలి. వట్టికోట, మహీధర, వుప్పల వంటి విలక్షణ నవలాకారుల కోసమని రంగం ఏర్పాటుచేయాలి.
విమర్శ జీవద్వంతం కావడం ఎలా?
ఒక సిద్ధాంతం నేపథ్యం నుంచి చెప్పడం ఎంత ముఖ్యమో, ఒక రచన కళాత్మ బాధ్యతలను ముతకగా నిర్వహించినప్పుడు ఆ మాటలు స్పష్టంగా చెప్పలేని మొగమాటాల్లో ఉన్న తెలుగు విమర్శ, కొత్త అవలక్షణాలుగా, మితిమీరిన ప్రాంతీయదనాలు, సామాజిక పరిష్కార కోణాలను పరిగణించని అస్తిత్వ ప్రాధాన్యతా ధోరణులు, వీటిలో ఎప్పుడూ ఒక లోముట్టడిలో బతుకుతున్నది. దీన్నుంచి విడుదల కావాలంటే, విశ్వభాషల సాహిత్య విస్తృత అధ్యయనం విమర్శకుడికి రచయిత కన్నా ఎక్కువ అవసరం. ఎందుకంటే సమాంతర, తులనాత్మక చిత్రం గీసి, రచయితలు ఎక్కడ వెలిగారో, ఎక్కడ మలిగారో చెప్పాలంటే, తెలుగుకు ఉన్న విమర్శ దీపకాంతులు, చిన్నవిగా కాక పెద్దవి కావాల్సిన అవసరం ఉన్నది.
బాలసాహిత్యం
తెలుగు, ఆంగ్ల, ఉర్దూ భాషల్లో ఈ త్రి-్భషా పత్రిక నడపడం ప్రభుత్వానికి గల దూరదృష్టికి మంచి ఉదాహరణ కావచ్చు. ఐక్యరాజ్య సమితి కూడా ఆనందించి ఈ కృషిలో మనకు సహాయపడవచ్చు. ఈ ప్రోత్సాహక విధానం భాషలో రచనా సామర్థ్యాలను చిన్నప్పట్నుంచీ అభివృద్ధి చేయడమే కాక, నేటి బాలలే రేపటి పౌరులు, కళాకారులు, రచయితలు అని చాటిచెప్తుంది. ప్రతిదీ లాభనష్టాలతో నడవదు. లక్షల సంఖ్యలో ఉన్న ప్రైవేటు స్కూళ్లకు వివిధ స్థాయిల్లో అనుమతులిచ్చిన ప్రభుత్వం ఒక అనుబంధ ఆదేశంగా, ప్రతి స్కూల్ కనీస ధరకు, ఒక యాభై పత్రికలు కొనాలని ప్రభుత్వ ఆదేశాలు ఉంటే, ఈ పత్రిక కొన్ని వేల కాపీలు పిల్లలకు, లైబ్రరీలకు అందుబాటులో ఉంటుంది.
విశ్వభాషగా తెలుగెలా?
దేశ భాషలందు తెలుగు లెస్స అనుకుంటున్న, చెప్పుకుంటున్న స్థాయినుంచి విశ్వభాషలందు తెలుగు లెస్స అనేలా, ప్రభుత్వాలే ప్రపంచస్థాయి విశ్వవిద్యాలయాల్లో కొన్నింటిలోనైనా తెలుగు పీఠాలు ఏర్పటుచేయాలి. తద్వారా అక్కడి ఆ దేశ విద్యార్థులకు తెలుగు ఒక బోధనాంశంగా డిగ్రీ, పీజీలో పరిశోధనలు ఉండేలా, వారికి అక్కడే మనం తిరిగి ఉద్యోగావకాశాలు ఇచ్చేలా ప్రభుత్వస్థాయి ఒప్పందాలు, భాషా, సాహిత్య, సాంస్కృతిక స్థాయి సంయుక్త కృషికి బాటలు వేయాలి. అన్నీ 2018లో చేసేస్తామని కాదు - భాష, ఆ భాషలో సాహిత్యం, అది ప్రతిఫలించే సాంస్కృతికత కుంటుపడ్డ దశలో మనం ఉన్నాం. అందుకే ఆలోచనలు పెద్దగా చేయాలి. ఇవి నెరవేర్చడం ఒక ఎరుకగల సమాజ పౌరులు, వారెన్నుకున్న ప్రభుత్వాల బాధ్యత. విశ్వభాషగా ఎదగాలంటే ప్రయాణం పెద్దదే. మరి కృషిబద్ధులవౌదామా?
*
- రామతీర్థ, 9849200385