సాహితి

ఉమాదేవీయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘‘తనువు చందనశాఖి
మనసు నందనవాటి
కలముపనిషద్గంగ
గళము హిమనగశృంగ’’
కొందరు గొప్పవారుగా జన్మిస్తే మరికొందరు ఏదో ఒక నిర్దిష్ట ప్రయోజనం కోసం జన్మనెత్తిన వారుంటారు. కొందరు సామాన్యంగా జన్మించి మాన్యులవుతారు. మరికొందరు కారణ జన్ములుంటారు. అలాంటివారిలో ఎం. ఉమాదేవి ఒకరు. క్రమోన్మీలన దశలో తేజస్వినిగా మారింది. శివసహస్రనామం, లలితాసహస్రనామ భాష్యాలు వెలువరించింది. ఉపనిషత్తులకు వ్యాఖ్యానాలు చెప్పింది. పంచమ వేద అనుశీలనం చేస్తూ పార్వతీ చరణ కింకిణిగా మారింది. పారాణిగా తనను తానే శ్రీమాతగా అలంకరించుకున్నది. హారతి కర్పూరంగా వెలిగిపోయింది. రసార్ద్రహృదయంతో కరిగిపోయింది.
క్రీ.శ. 1946 జూలై 5న శ్రీకాకుళం జిల్లా సంగమేశ్వర క్షేత్రంలో ఉమాదేవి జన్మించారు. వీరిది సంప్రదాయ అరామ ద్రావిడ వంశం. తండ్రి భాగవతుల సన్యాసిరావు, తల్లి భళ్లముడి అనసూయమ్మ, వారిది కుద్దిగాం అగ్రహారం. ఇది కొత్తూరు మండలంలో ఉంది. వీరి పూర్వీకులు నిష్ఠాగరిష్ఠులైన శివభక్తులు. నీలకంఠేశ్వర దేవాలయ నిర్మాతలు. ఇది వంశధార నదీ తీరంలో ఉంది. అనసూయమ్మ గారి తండ్రి జగన్నాథ భుక్తగారు మహాతపస్వి. అనసూయమ్మ గారికి ఐదుగురు సంతానం. ఉమాదేవి మూడవ కాన్పు. తండ్రి యునైటెడ్ కమర్షియల్ బ్యాంకులో మేనేజర్‌గా పనిచేయడం వల్ల వివిధ ప్రాంతాలకు పర్యటనలకు వెళ్తుండేవారు. అందులో క్వెట్టా (నేటి పాకిస్థాన్) వంటి సుదూర ప్రాంతాలు కూడా ఉండేవి. బివిఎస్‌రావుగారు ఉద్యోగరీత్యా కలకత్తాలో ఉండగా ఉమాదేవి అక్కడ ప్రాథమిక విద్యను అభ్యసించారు. ఆ విధంగా తెలుగు, హిందీ, బెంగాలీ, భాషలు సహజంగానే వచ్చాయి. అనంతరం హైదరాబాదులో బిఎస్‌సి అభ్యసించింది. అనంతరం 1966లో ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఎం.ఏ. సంస్కృతం నేర్చుకున్నది. ఆర్యేంద్రశర్మ, బి. ఆర్. శాస్ర్తీ, పుల్లెల శ్రీరామచంద్రుడు వంటి దిగ్గజాలు అప్పుడు సంస్కృత శాఖలో ఉండేవారు. 1967లో ఉమాదేవికి చారిత్రక నవలా చక్రవర్తి ప్రొఫెసర్ ముదిగొండ శివప్రసాద్‌తో వివాహం జరిగింది. అప్పటి నుంచి ఆమె జీవితంలో నూతనాధ్యాయం ప్రారంభించింది. ఇందుశేఖర్, పద్మసుషమ, శ్రీలేఖ వారి సంతానం. ఇటు ఇంటిపని, అటు వంటపని చూసుకుంటూ ఆమె‘‘ పాల్కురికి సోమనాథుని సంస్కృత సాహిత్యం’’ అనే అంశంపై ఉస్మానియా విశ్వవిద్యాలయంలో పరిశోధన చేసి పిహెచ్.డి పట్టా పొందారు. తర్వాత సంస్కృత భాషోపన్యాసకురాలిగా దాదాపు ఇరవై సంవత్సరాలు పనిచేశారు. ఈ కాలంలోనే పత్రికలకు వివిధ వ్యాసాలు వ్రాయటం మొదలు పెట్టారు. నిరంతర దేవీపూజ తత్పరతతో ఆధ్యాత్మిక జీవితం గడుపుతూ అసంఖ్యాక శిష్యగణాన్ని సమకూర్చుకున్నారు.
లలితా సహస్రనామ భాష్య ప్రవచనములు ప్రారంభించారు. అగస్త్య, హయగ్రీవ సంవాదాత్మకమైన లలితా నామములకు భాష్య గ్రంథం రచించారు. న్యూఢిల్లీ మానవ వనరుల శాఖ వారి సీనియర్ ఫెలోషిప్ లభించటంతో ‘శివసహస్రనామ భాష్యం’ రచించారు. ఆ తరువాత వౌసీజీ జీవితం అనే బయోగ్రఫీ వెలువరించారు. ఆ తరువాత మధుమేహ వ్యాధితో బాధపడుతూనే 14 ఉపనిషత్తులకు వ్యాఖ్యాన గ్రంథాన్ని తెలుగులో రచించారు. క్యాన్సర్ వ్యాధిని అధిగమించి సంకల్పబలంతో పంచమవేదంలోని ఉపకథాసంకలనం ప్రారంభించారు. ఐతే అనుశాసనిక పర్వం పూర్తిచేసి 18 డిసెంబర్ 2017 హేవలంబ పుష్యశుద్ధ పాడ్యమి సోమవారం పౌష్యలక్ష్మియై హైదరాబాదులో తన 71 ఏట ఆమె శివైక్యం చెందారు.
ఒక విజేత వెనుక ఒక స్ర్తి ఉంటుందని ఒక నానుడి. ప్రొఫెసర్ ముదిగొండ శివప్రసాద్ నూటొక్క గ్రంథాలు వ్రాయడానికి ప్రేరణ ఉమాదేవిగారే. ‘నీవు వేలుపుటారి, వేల్గురేకవు - కేవలంబును మృదాకృతిని నేను’ అనే పద్యాన్ని నవలాచక్రవర్తి గుర్తు చేసుకొన్నారు. ఆమె స్ర్తి రూపమందిన గేహధర్మ, ఆమె ప్రకృతి అయితే తాను వికృతిని అని భావించారు. నిజానికి ఇదొక శివశక్తుల లీల. శక్తిపోయి శివుడు మిగిలాడు. ‘అయ్యో! రెండు పక్షులలో ఒక పక్షిరాలిపోయింది’ అన్నారు భక్తురాలు చివుకుల జయప్రద. ‘కాదు ఒకే పక్షి రెండు రెక్కలలో ఒక్క రెక్క వాలిపోయింది’ అన్నాడు శివుడు.
రఘువంశంలోని అజవిలాసం నుండి ఎలిజీ సంప్రదాయం మనకు సాహిత్యంలో కన్పడుతున్నది. ఉమాదేవి దీపం క్రింద క్రీనీడలా కాకుండా తానే దీపమై స్వతఃసిద్ధంగా వెలిగింది. సద్గురు శివానంద మూర్తి, కుర్తాళం పీఠాధిపతులను ఆరాధించారు. ఆపన్నులకు శక్తిపాతాన్ని చేసింది. లక్షలకు లక్షల బాలామంత్రాన్ని జపించి ఆర్తులకు ధారపోసింది. పార్థివ శరీరం శిథిలమైనా అక్షరరూపంలో ఆధ్యాత్మికాకాశంలో ధృవతారగా నిలిచింది. ‘మానవసేవయే మాధవసేవ’ అనే సందేశం ఆచరించి అనుష్ఠాన వేదాంతానికి సాకారంగా నిలిచింది.
శ్రీమతి ఉమాదేవి చిన్నతనంలోనే కూచిపూడి నృత్యం, వీణ, వయోలిన్ నేర్చుకున్నారు. ఆ అభిరుచితో కుమార్తె శ్రీలేఖను నర్తకిని చేశారు. శ్రీలేఖ పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం నుండి డాన్సులో ఎం.ఏ. ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణురాలై పిహెచ్‌డి కూడా నృత్యశాఖలోనే చేసింది. కుమారుడు ఇందుశేఖర్, కుమార్తె పద్మసుషమ హిందూ ధార్మిక సామాజిక కార్యకర్తలుగా సంవత్సరాల తరబడి పనిచేయటంలో వారిని తీర్చిదిద్దిన బాధ్యత ఈ తల్లికే చెల్లింది. ఒక శివాజీ సమాజానికి అందాలంటే ఒక జిజియాబాయి చాలా అవసరం ఉంటుంది. అందుకనే కుటుంబమే సంస్కార కార్యక్షేత్రం అని ఉమాదేవి సందేశిమిచ్చారు.
శ్రీమతి ఉమాదేవి అమెరికాలో కొంతకాలం ఉన్నప్పుడు అక్కడి సామాజిక పరిస్థితులను అధ్యయనం చేశారు. తెల్లవారి విశృంఖల జీవనం కన్నా నల్లవారి కౌటుంబిక సంబంధాల చేత ఆమె ఆకర్షింపబడ్డారు. ‘ఇల్లు అంటే రాతి గోడలు కావు, హృదయాల మధ్య అనుబంధం’ అని ఉమాదేవి విశ్వసించారు. పునర్జన్మలో హిమాలయ గౌరీశంకర శిఖర సమీపంలోని ఓషధీ ప్రస్థపురంలో జన్మించాలని ఆశించారు. హైదరాబాదులోని ఆచార్య శిప్రముని పీఠం పక్షాన గురుపూర్ణిమ నాడు ఒక విదుషీమణికి ఉమాదేవి పేరు మీద వార్షిక పురస్కారాన్ని నగదు బహుమతితో ఇవ్వాలని నిశ్చయించారు.

- డా. రాయసం లక్ష్మి