సాహితి

తెలుగు తావుల మాటల నుడిగంటు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలుగు నుడి ఏనాటిదో శక తేదీలతో చెప్పలేం కానీ... ప్రాచీన కాలం నాటిదే. మూల ద్రావిడ భాష నుండి విడివడినదే తెలుగు నుడి. మూలం నుండి విడివడినప్పుడు, ఆ మూలంలోని కొన్ని ధాతువులు కొత్త నుడిలోకి వస్తాయి. అలా వచ్చిన ధాతువుల మాటలు కొత్త అలికిడి (ఉచ్ఛారణ)ని సంతరించుకుంటాయి. తెలుగు నుడి పుట్టుక, వ్రాలు (లిపి) ఏనాటికి పుట్టిందో కాని, అది సరిగా చెప్పలేం. మనకు దొరికిన 6వ శతాబ్దం నాటి తెలుగు శాసనమే మొదటిది. కడప పెనె్వంటములో దొరికింది. ఆ శాసనము పదముల (పద్యాలు)లో లేదు. వచనములోనే ఉంది. ఈ వచన శాసనంలో అప్పటపు (స్వచ్ఛమైన) తెలుగు మాటలే వున్నాయి. ఆ తర్వాత, 8వ శతాబ్దం నుండి లభించిన శాసనాల్లో పదాలు ఎక్కువగా ఉన్నాయి. కొన్ని సంస్కృత ఛందస్సులో, మరికొన్ని దేశీ ఛందస్సులో ఉన్నవి.
అప్పటినుండి తెలుగు మీద పెర (ఇతర, చుట్టుపక్కల) నుడుల కలగలుపు (సంకరం) ఎక్కువగా ఉంది. వీటిలో సంస్కృతం పాలెక్కువ. అలాగే, ఇతర నుడుల మాటలు, ముఖ్యంగా కొండ, కొలామిలనుండి ఎక్కువ చేరాయి. అంతకుముందు కాలపు జానపదాలు మనకు దొరకడం లేదు. అవి దొరికితే అప్పటపు తెలుగు మాటలెన్నో మనకు దొరుకుతాయి. నిక్కముకు భరతనాడులో పెద్ద తావుల్లో తెలుగు నుడి పరుచుకుని (వ్యాపించి) వుంది. అందువలన తెలుగు మాటల బొక్కసము చాలా పెద్దది!
ఆనాటి తెలుగు పొలవరలు (పండితులు) అంతా సంస్కృతం చదివేవారు. అలాగున సంస్కృత మాటలు తెలుగు నుడిలో మిక్కుటంగా కలిసిపోయాయి. అందువలన తెలుగు నుడిలో పెరభాషల కలగలుపు ఎక్కువైంది. చదువుకున్నవారు ఎక్కువైనకొద్దీ, తెలుగు మాటలను చిన్నచూపు చూడటం మొదలైంది. ఉదా: కూడు, బువ్వ, వాన, గుడ్డ తెలుగు మాటలు. అన్నము, భోజనము, వర్షము, దుస్తులు లాంటి పెర నుడి మాటలు వాటి స్థానంలో చోటుచేసుకున్నాయి. ఈ కలగలుపు ఎంతవరకూ వెళ్లిందంటే, అప్పటపు తెలుగులో మాట్లాడితే, తెలుగువారికే అర్థం కానంతవరకూ! అందుకే ఈ వ్యాసంలో అప్పటపు తెలుగు మాటలకు, ఇప్పుడు వాడుతున్న మాటలు చెప్పడం జరిగింది. ఆరోజుల్లో చదువరులు అంటే సంస్కృతం నేర్చినవారే. వారికే రాజాదరణ దొరికేది. అందువలన, వారు వ్రాసేది, మాట్లాడేది మాత్రమే నాగరికమైన నుడి అనే చాటింపు వచ్చింది. తెలుగు నుడి కాయకష్టం చేసుకునే జానపదుల నుడిగా అనుకున్నారు. అందువలన దానికి గౌరవము, ఆదరణ తగ్గిపోయింది. అది చదువుకోని కొందరిదిగానే మిగిలిపోయింది. తెలుగు పొలవరలు ఈ తావుల మాటలను ఈసడించుకున్నారు. దీంతో చదువుకున్నవారి నుడి, చదువుకోనివారి నుడి అని వేరువేరుగా చూడబడింది. చదువులేని జానపదులకు వ్రాలు (లిపి) తెలియదు. అందువలన వారి జానపదాలు, మాటలూ వ్రాయబడలేదు. క్రమంగా మరుగున పడ్డాయి. చదువరులు వ్రాయగలరు. అందువలన మిక్కుటము పెర మాటలతో కలగలుపైన తెలుగుకే చాటింపు (ప్రచారము) వచ్చింది.
కృష్ణగిరి పెనె్వంటము (తమిళనాడులో) తెలుగు రచయితల సంఘం అధ్యక్షులు సా.వెం.రమేష్‌గారు తెలుగు నుడి మీద కృషి చేస్తున్నారు. ఆయన అభిప్రాయం ప్రకారం, ‘సరి తీరులో ఎదుగుతున్న నుడిలో 15 పాళ్ళు ‘కుదురులు’, 75 పాళ్ళు ‘వంపులూ’, 10 పాళ్ళు ‘ఎరువులూ’ వుంటాయి. అలావుంటే నుడి చేవగల నుడి కింద లెక్క’ అన్నారు. నుడి మొదలైన మొదటి రోజుల్లో అక్కరల (అవసరం) కోసం ఏర్పడిన మాటలను ‘కుదుర్లు’ అంటారు. ఆ తర్వాత కాలంలో, కొత్త అక్కరల కోసం, కుదుళ్లనుండి కొత్త మాటలను పుట్టించుకుంటారు. వీటిని ‘వంపులు’ అంటారు. పెర నుండి అరువు తెచ్చుకున్న మాటలను ‘అరువులు’ అంటారు.
కొత్తగా అవసరమున్న ఎసిడి ఆనవాలిక (శాస్త్ర సాంకేతిక పదాలు)ను పెర నుడులనుండే తీసుకుంటున్నాము. ఆ మాటల అలికిడి (ఉచ్ఛారణ) కూడా పెరనుడిదే. తలచుకుంటే, ఈ తరంలో, ఈ ఎసిడి ఆనవాలిక పదాలను కొత్తగాను, తెలుగు నుడి అలికిడిలోనూ అక్కర మేరకు పుట్టించవచ్చును. వీటిని తెలుగు కుదుళ్ళనుండే పుట్టించాలి. వేల ఏండ్ల మెలన (చరిత్ర) కలిగిన తెలుగు నుడి మరింత చేవ దేరుతుంది!
తెలుగు నుడి మాట్లాడే జనులు వేరేచోట్లకు వలస వెళ్లారు. వెళ్లిన చోటున్న నుడుల ప్రభావంతో నుడి అలికిడిలో కొంత మార్పు వస్తుంది. విడివిడి దవ్వులలో (దూరాలలో) వున్నా వారి మాటల నుడి ఒకటే. ఎందుకంటే, కుదుర్లు అవే కనుక. కాని దవ్వును బట్టి అలికిడిలో కొంత యాస వస్తుంది. వీటిలో ‘తావుల మాండలికాలు’ అంటారు. ‘పది ఆమడల దూరమెళితే, కొత్త నుడి వినిపిస్తుంది’ అనే లోకపు మాట (జాతీయం) కూడా వుంది.
కడప పెనె్వంటముకు చెందిన డా. కోడూరి ప్రభాకరరెడ్డిగారి ‘రేనాటి పలుకుబడులు’ అనే పుత్తము రేనాటి సీమలోని గ్రామీణ మాటల బొక్కసము! ఎన్నో తీరుల పని (కృషి) చేసి, ఎందరో జానపదులను కలిసి, వెతికి ఆ సీమ అప్పటపు తెలుగు మాటలను, వాటి ఆకరములనూ సంపాదించి ఆ తావుల నుడిగంటు (నిఘంటువు)ను వ్రాలు చేశారాయన. ఇది నిక్కువంగా మిక్కిలి కష్టమైన పని! ఆ తావుల తెలుగు మాటలకు నేటి మాటలలో తెరవు (అర్థము) వ్రాశారు. ఆంగ్ల తెరవు కూడా చెప్పారు. ఉదాహరణగా అప్పటి కొన్ని జానపదాల (పాటలు)ను కూడా పొందుపరిచారు. వాటి యొక్క తెరవులను నేటి మాటలతో చెప్పారు. ఆయన చేసిన ఈ పని వలన తెలుగు తావుల మాటలకు (మాండలికాలు) తెరవు తేలిగ్గా తెలుస్తుంది.
ఈ రీతిలోనే ఇతర తావుల మాటలకు కూడా నుడిగంటలు రావాలి. రాయలసీమ, తెలంగాణ, కోస్తా, ఉత్తరాంధ్ర తావులలో వేరువేరు మాండలికాలున్నవి. వీటి కుదుళ్ళలో కెళ్ళి వెతికి తవ్వి (పరిశోధన చేసి) తెరవులను చెప్పే లాగున నుడిగంటులను తయారుచేస్తే, అన్ని తావుల వారికి పెరతావు మాటల తెరవు తెలుస్తుంది. తెలుగు నేలలో అన్ని తావులలోనూ వాడుకలో మిగిలివున్న తెలుగు మాటలకు తెరవు తెలుసుకుని వాడుకలోకి తెస్తే, మరుగున పడిన అప్పటపు తెలుగు నుడిని మళ్లీ వాడుకలోకి తేవచ్చును.
ఈ పనిని ముఖ్యంగా పిహెచ్‌డి చేసేవారూ, మిక్కిలి శ్రద్ధ కలిగిన రచయితలు, తెలుగు పొలవరలూ చేపట్టాలి. చేపట్టి ఆ మాటలు సాధారణ జనానికి చేరే విధంగా పనిచేయాలి. తేలికగా పూర్తి కావడానికి కొందరు పిహెచ్‌డి చేసేవారు అంతగా పసలేని విషయాలను తీసుకుంటున్నారు. వాటివలన తెలుగు నుడికి, తెలుగు సాహిత్యనికీ లాభమేమీ కలుగదు. పిహెచ్‌డి అంటే, ఆ విషయంలో ‘తాత్విక పరిపూర్ణుడు’ అని అర్థం!

- మనె్న సత్యనారాయణ, 9989076150