సాహితి

విలక్షణ కవితా సంపుటి ‘ఆ సందుక’ (పుస్తకమ్)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వర్తమాన సాహిత్య జగత్తులో ఆర్ష ధర్మాన్ని ఆధునిక భావజాలాన్ని సమన్వయించుకొని ద్వైదీభావం లేని ద్వైతాన్ని అనితర మార్గంగా ఎంచుకొని ప్రయాణిస్తున్న కవి, విమర్శకుడు, పండితుడు ఆచార్య మసన చెన్నప్ప! పాండిత్యం, కవనం, విమర్శనం, వక్తృత్వచాలనం చతుర్ముఖమై సాహితీ ప్రపంచంలో ఉనికిని చాటుకున్న అభ్యుదయశీలి మానవతావాది మసన చెన్నప్ప!
1980లో ప్రచురించిన ‘మల్లిపదాలు’ కవిత్వంతో రచనా వ్యాసంగం ప్రారంభించారు. నేత్రోదయం, అమృత స్వరాలు, అగ్నిస్వరాలు, చెన్నప్ప నానీలు, నయాగరా, అమెరికా! ఓ అమెరికా (అమెరికా నానీలు), నిన్న మొన్నటి ‘ఆ సందుక’ (2010)వరకు రచనలను ప్రచురించారు. ఆధునిక దృక్పథం అభ్యుదయ భావజాలంతో సమకాలీనం విస్మరించని వాసన తగ్గని దవనంకుప్ప ఆచార్య మసన చెన్నప్ప!
2010 సంవత్సరంలో ప్రచురించిన ‘ఆ సందుక’ కవితా సంపుటి చెన్నప్ప కవన వ్యక్తిత్వాన్ని తెరచి చూపించింది. ఆ సందుక ద్వారా చెన్నప్ప వర్తమాన ఆధునిక కవిత్వంలో స్వచ్ఛమైన కవిగా అవతరించాడు. అస్పష్ట భావజాలంతో, అర్థంకాని అస్తిత్వ వేదనతో కవిత్వాన్ని సంక్లిష్టం చేస్తున్న వర్తమాన కవులకు భిన్నంగా నిర్మలమైన ‘గోవుపాలవంటి’ కవిత్వాన్ని అందించారు. ‘ఆ సందుక’ను ‘‘నా జ్ఞాపకాల పుట్ట అది/ పిల్లల కోడిపెట్ట అది’’ అంటూ జ్ఞాపకాల గంపలనిండా దాచుకున్న కవిత్వాన్ని అద్భుతంగా ఆవిష్కరించారు.
ఆ సందుకను తెరచి చూస్తే 87 కవితా ఖండికల సమాహారం కనిపిస్తుంది. ఈ సంపుటిలో- అడుగంటుతున్న మంచితనం, మారిపోతున్న మనిషితనం, మానవతా విలువల పట్ల మథనం, వ్యవస్థ మరియు దేశం పట్ల బాధ్యతను గుర్తుచేయటం, పెరుగుతున్న ఒంటరితనం మీద నిరసనం, అణగారిన పేదలకు ఆర్తిని పంచటం వారి పక్షం వహించటం, మాతృభావనలో అమృతత్వం దర్శించటం, ధర్మహాని పట్ల ఆగ్రహం, అనుభూతిగా దాచుకున్న జ్ఞాపకాలను రసావిష్కరణ చేయడం వంటి సంపుటి నిండా కనిపిస్తాయి. చెన్నప్ప మంచి భావుకుడు. సహృదయుడు. అన్వయక్లిష్టత లేకుండా సరళ సుందరంగా కవితను అల్లగల సహజత్వం ఆయన కవితా గుణం! సంస్కృత సమాస సుగంధం ప్రయోగించని నిసర్గపద ప్రయోగం చెన్నప్ప శైలీ విన్యాసం. ‘‘దేవుడా/ ఈ ఏడాది కూడా చింతలు బాగా కాయాలి/ కోమట్ల ఇండ్ల ముందు/ చింతపండు కొట్టి విత్తులు తీసి/ సంపాదించిన రెండు రూపాయలతో/ మావూరి నరసింహస్వామి జాతరకెళ్లాలి... (మావూరి జాతర) అంటూ వూరి జాతరలో బాల్యం ఆనందాన్ని అలవోకగా కవిత్వీకరిస్తాడు. తాను చూసిన దృశ్యాన్ని, పొందిన అనుభూతిని భావాత్మకం చేయడంలో కవి అసామాన్యుడు. ‘‘ఆ చెఱువు ఇదేనా?/ కట్టమీద నిలబడి చూస్తే/ నా శైశవానికది/ సముద్రంలా భాసించేది/ ఆకాశంలో చుక్కల్లా/ అక్కడక్కడా కొంగలతో/ అందంగా కనిపించేది’‘’ (ఆ చెఱువు) ఆచార్య జయధీర్ తిరుమలరావు చెప్పినట్లు తనను వెన్నాడే భావాలను తనను వెంటాడే ఆలోచనలను సునిశితంగా ప్రకటిస్తాడు. ‘‘పిడుగులు మీద పడ్డా/ అడుగులు తడబడకుంటేనే/ అతడు మనిషి/ కొండ విఱిగి పడ్డా/ గుండె చెదరకుంటేనే అతడు మనీషి’’ (అందరి ఉగాది) చెన్నప్ప దృష్టిలో- కవిత అంటే/ కలత రేపేది కాదు/ ధైర్యానికి చిగురు తొడిగేది.
ఈ సంపుటిలో అద్భుతమైన నాస్టాల్జియాను ఆవిష్కరించిన ఖండికలు ఆ సందుక, ఆ చెఱువు, మా అమ్మ, మా ఊరి జాతర వంటి ఖండికలు! ‘ఆ సందుక’ ఖండిక సంపుటికి శీర్షికగా వైశాల్యీకరింపబడటం ఔచిత్యంగా కనిపిస్తుంది.
‘‘ఆ సందుకను నేను/ పత్తర్‌గట్టీలో పదహారు రూపాయలియిచ్చి కొన్నాను./ కాని ఇప్పటికీ దాని రూపం చెక్కుచెదరలేదు’’- అని ఆ సందుకతో తనకున్న అనుబంధాన్ని నాస్టాల్జియాగా మార్చారు. ‘‘ఇప్పుడా సందుకలో నేను ఏ వస్తువూ దాచిపెట్టను/ నిజానికది ఖాళీగా ఉంటేగాదా’’ అని తన మనసులో గూడుకట్టుకున్న వైనాన్ని విస్తరిస్తాడు కవి. తెలంగాణ ప్రాంతంలో బట్టలో, వస్తువులో ఆభరణాలో దాచుకోవడానికి, ఊరికో, పెండ్లికో పోయేటపుడు తీసుకుపోవడానికి, గత కాలాలలో ఉపయోగించిన అతి ముఖ్యమైన పెట్టె ‘‘సందూక్’! ఉర్దూ పదం సందూక్ అయితే వాడుకలో సందుకగా మారింది. కవితో మమేకయై కవి జ్ఞాపకాలను, అనుభూతులను దాచుకుంది. రసవంతమైన ఖండికగా ఆవిష్కరించుకుంది.! ‘‘బస్సు ఆలస్యమైనప్పుడు/ స్టాండు లేని బస్టాండులో/ సందుకే నాకు సీటయ్యేది/ అద్దె గదిలో అదే నా పెన్నిధి! అది రాసుకునేటప్పుడు బల్లగా మారేది/ అమ్మ కన్నీళ్ళు, అయ్య ఆశీస్సులూ/ అక్కల దీవెనలూ, అన్నల కోరికలూ, అన్నింటినీ మోసుకొని వచ్చే/ ఆ సందుకకు ఎంతో చరిత్ర ఉంది. అటూ తనకూ, తన కుటుంబ సభ్యులకు మధ్యగల అనుబంధాల వారథిగా ‘ఆ సందుకను’ కవి భావిస్తాడు. సందుక కవికున్న బంధమే కాదు సమస్త కుటుంబాలకు సంబంధమైన సామాజిక అనుబంధం అది. కవికి సందుకని చూసినా అమ్మను చూసినా ఒక విధమైన మమకారం. అమ్మ కూడా తనను మోసినట్టే, తాను ప్రేమించే సందుకను మోసిందని దానికి ఏ అవమానం జరిగినా కొడుకుకు జరిగిన అవమానంగా కుంగిపోతుందని కవి పలవరిస్తాడు. మనుమరాలు కవిని ఆ సందుకలో ఏ ముంది తాతయ్యా అని అడిగితే మా అమ్మ వుంది అని చెప్పాలనిపిస్తుంది కవికి. ‘‘నా విద్యార్థి జీవితానికి గట్టి సాక్ష్యం ఆ సందుక/ పాత సామాన్లు అమ్మేటప్పుడు/ దాని ప్రస్తావన వచ్చింది కాని/ అమ్మ గుర్తుకొచ్చి కళ్ళలో నీళ్ళు తిరిగాయి’’ అంటూ అమ్మ ప్రేమకు ప్రతి రూపంగా, చిన్ననాటి కుటుంబ జ్ఞాపకాలకు సజీవ సాక్ష్యంగా ‘ఆ సందుక’ను కవి అంతరాంతరాలలో భద్రపరుచుకుంటారు. ‘‘నా జ్ఞాపకాల పుట్ట అది/ పిల్లల కోడి పెట్ట’’; ‘‘అర్ధాంగి కంటె ముందుగా/ నా గదిలో అడుగుపెట్టిన దేవత’’; ‘‘నా మనుమరాలితో రెండేళ్ళ అనుబంధమే కాని/ దానితో ముప్ఫయి రెండేళ్ళ బంధం’’ వంటి వ్యక్తీకరణలు కవి మమతానురాగాలను అజరామరం చేసి ‘ఆ సందుక’ ఖండికను సాంద్రపరిచాయి!
ఇంకా ఈ సంపుటిలో నగర వాతావరణంలో ఆవరిస్తున్న ఒంటరితనంతోపాటు, తాత్త్విక చింతనలు, భారతీయ సంస్కృతి పట్ల అవధుల్లేని విశ్వాసం ఆయా ఖండికలలో కనిపిస్తాయి. ‘‘సృష్టి అనే చక్రానికి/ నాభీ నేమి ఎవరో ఊహించారా?/ విరిగిపోయి కొత్తగా చేరే అడ్డనాకు గురించి ఆలోచించారా?’’ (అమృతసిద్ధి) అని ఆధ్యాత్మిక జిజ్ఞాసవైపుకు తీసుకుపోతారు. ఉపనిషత్తుల దృష్టికోణంలోంచి జీవితాన్ని దర్శించమని కవి ప్రకటించాడు.
చేనేతకారుల ఆకలి చావుల విషాదాన్ని- ‘‘కూడూ గుడ్డతోపాటు నీవు వేసిన గుడ్డకే/ విశ్వమంతా విలువ/ కాని ఆకలికెంత ఇష్టమో/ ఆత్మహత్యకు ప్రేరేపిస్తుంది నిన్ను.’’.. అని వేదనతో ‘ఉత్తిష్ట’ అనే ఖండికలో చేనేతకారుల ఆత్మహత్యల్ని వర్ణిస్తాడు. ఆత్మహత్యల బలహీనతలోంచి బయటపడమని ‘‘మార్కండేయుడు/ నీ మూలపురుషుడని తెలుసుకో/ లయకారుడినైనా/ ఎదిరించడం నేర్చుకో..’ అంటూ నేతన్నలకు ఆత్మప్రబోధం కల్గిస్తాడు.
అణగారిన వర్గంనుంచి వచ్చినవాడు కాబట్టి కవి ‘‘అది పంకమని/ అసహ్యించుకుంటావెందుకు?/ పద్మాలకదే/ పుట్టినిల్లు..... దళితుడని దూరంగా వుంచుతావెందుకు?/ అక్కున చేర్చుకుంటే అతడు/ ఆపద్బాంధవుడవుతాడు’’ (ఆపద్బాంధవుడు) అని ఈ సంపుటిలో కవి పీడిత పక్షం నిలిచాడు.
ఈ సంపుటిలో కవి తన అనుభూతిని, సార్వజనీనం చేయడంలో అభివ్యక్తి చాలా సహజంగా ఒదిగింది. వ్యక్తీకరణలో భావచిత్రాలు, ప్రతీకలు పఠితుడిని వస్తువునుంచి దూరం చేయకుండా కవితల పట్ల కేంద్రీకరించే విధంగా చేశాయి.

- బోడ జగన్నాథ్, 9848904063