సాహితి

కీట్స్, కాళిదాసు తత్వం... అనుభూతి... ఆరాటం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘‘ఎ థింగ్ ఆఫ్ బ్యూటీ ఈజ్ ఎ జాయ్ ఫర్ ఎవర్ (రమ్యమైనది ఏదైనా ఎప్పుడూ ఆనందాన్ని కలిగిస్తూనే ఉంటుంది)’’ అన్నాడు ఆంగ్ల కవి జాన్ కీట్స్. ఈ వాక్యంతో మొదలయ్యే తన కవితలో ప్రకృతిలోని ఎన్నో రమణీయ వస్తువులతో తాదాత్మ్యం చెంది, అనుభూతుల జడివానలో తడిసిపోయి ఆనంద డోలికలలో ఊగిపోయే కీట్స్ కనిపిస్తాడు. కీట్స్‌ది ఒక గొప్ప అనుభూతి ప్రపంచం.
అడుగడుగుకూ తనకు ప్రకృతిలో కనిపించే అద్భుత తత్త్వం తనను ఎప్పుడూ మంత్రముగ్ధుణ్ణి చేస్తుంటుంది అంటాడు కీట్స్. దానివల్ల తాను దుఃఖాన్ని దూరం చేసుకుంటుంటాను అంటాడు. ‘‘ఒక అందమైన వస్తువును చూచిన ఆనందానుభూతి కాలంతోపాటు కొట్టుకుపోక మనలో ఉండిపోతుంది గానీ తరగను మాత్రం తరగదు. ఆ అనుభూతి మన సంసార జీవితపు జంజాటం అనే వేసవి ఎండలో ఒక చలివెందర; ఆ చలివెందరలో పడుకొని ఆదమఱచి నిదురపోతే వచ్చే ఒక తీయని కల. అందమైన వస్తువును చూచి అనుభూతి పొందటం మానసికారోగ్య లక్షణం; ఆ అనుభూతి ఒక ప్రశాంతి నిలయం; మనస్సుకు ఒక ఆహ్లాదపూర్వకమైన ఊరట; ఒక అనిర్వచనీయ సమాధి స్థితి. ప్రకృతిలోని అందం పుడమితల్లితో మనల్ని కట్టిపడేసే బంధం. రమ్యమైన వస్తువును చూచి పొందిన అనుభూతిని మనం ఒక్కసారి మానసికంగా పునరానుభవంలోకి తెచ్చుకుంటే అప్పటిదాకా మనం ఏదైనా నిరాశలోనో, నిస్పృహలోనో, నిర్వేదంలోనో, నిర్లిప్తతలోనో ఉండి ఉంటే ఆ దుస్థితి అంతా ఇట్టే మాయమైపోయే అనుభవం. మనకు దర్శించగలిగే ‘దృష్టి’ఉంటే ప్రకృతిలో అందాలు అంతులేనన్ని. ఉదయించే సూర్యుడు, వెనె్నల కురిసే చంద్రుడు, చల్లని నీడల మహావృక్షాలు, ముద్దులొలికే చిన్నారి మొక్కలు- ఇలా ఎన్నని చెప్పగలం?! ఇక పూల సంగతికొస్తే అవి అందానికి పరాకాష్ఠలు. ‘డాఫిడిల్’ పూవులు (మన ఱెల్లుపూల లాంటివి) ఒక ఉదాహరణ. మఱి వివిధ సుగంధ లతలను ఒరుచుకుంటూ ప్రవహిస్తూ, అక్కడక్కడ కొన్నిచోట్ల ఏవేవో కొన్ని రాళ్ళ గుట్టల్లోకి, లోయల్లోకి పోయి మాయమవుతూ, మళ్ళీ మఱోచోట తేటతెల్లంగా పల్లాలకు జాలువారుతూ, మళ్ళీ చల్లగా ‘జారుకుంటూ’, మనతో దోబూచులాడుతుండే నీటి ప్రవాహాలను, సెలయేళ్ళను చూస్తూ ఉంటే మన అంతరంగాలు ప్రపంచానే్న మఱచిపోయి ఏదో చెప్పలేని ఆత్మానందానుభూతిలో పరవశించిపోతాయి. ఇలాంటి దృశ్యానందానుభూతిదాయక వస్తువులన్నీ ఒక ఎత్తయతే మన మానవ జాతి చరిత్రలోని మహాపురుషుల స్మరణ ఒక ఎత్తు. వాళ్ళు చేసి చూపించిన మహోదాత్తమైన ప్రతి పనీ విశ్వానికే ఒక అందం. వాటిని తలచుకున్న ప్రతిసారీ మన హృదయాలు అనే నాలుకల మీద దివ్యామృత బిందువులు ఒలికిన అనుభూతి కలుగుతుంది. ఇలా రమ్యమైన వస్తువును చూచినా, విషయాన్ని విన్నా అది గుర్తుకొచ్చినప్పుడల్లా ఆనందాన్ని ఇస్తూనే ఉంటుంది అంటాడు కీట్స్- తన హృదయాంతర్గత - అనుభూతి భావజాలాన్ని కవితాత్మకంగా ఆవిష్కరిస్తూ. రమ్యత యొక్క అనుభూతి కాలానికి అతీతమైనది అని కీట్స్ భావన అయితే ఈ విషయంలో కీట్స్‌కంటే చాలా శతాబ్దాలు పూర్వికుడైన కాళిదాసు యొక్క భావన మఱోవిధమైన విలక్షణతతో ఒప్పారింది. తన ‘శాకుంతలం’ నాటకంలో ఒకచోట -
‘‘రమ్యాణి వీక్ష్య మధురాంశ్చ నిశమ్య శబ్దాన్ / పర్యుత్సుకో భవతి యత్సుఖితోపి జంతుః / తచ్చేతసా స్మరతి నూన మభోధ పూర్వం / భావస్థిరాణి జననాంతర సౌహృదాని’’ - అంటాడు కవికుల గురువు, మానవ మనస్తత్వాన్ని మథనం చేసి చెప్పిన మహాకవి అయిన కాళిదాసు. అందమైన వస్తువుల్ని చూసినప్పుడు, మధురమైన శబ్దం విన్నప్పుడు మనకు తెలియని ఏవో సంగతులు మనకు జ్ఞాపకం వస్తాయి. ఏవో జననాంతర సౌహృదాలను, సంబంధాలను మన మనస్సుయొక్క అడుగు పొరలలో పేరుకొని సుస్థిరంగా ఉన్నవాటిని అవి జ్ఞాపకం చేస్తాయి. అంతేకాదు అదే సమయంలో ఆ వస్తువును, శబ్దాన్ని చూచిన దాని, విన్న దాని ఆనందం కంటే భిన్నమైన ఒక ఆరాటం - ఏదో తెలియని ఒక తమకం- ఒకించున దుఃఖతప్తత- ఒక కలగుండు వడిన స్థితి కలుగుతుంది. అదే పర్యుత్సుకత అంటే. ఆ పర్యుత్సుకతా స్థితికి కారణం మనలో ఉండే ఏనాటిదో అయిన జన్మాంతర హృదయ సంస్కారం అంటాడు కాళిదాసు. ఇది చాలా లోతైన భావన. మహోదాత్త భావన.
జీవుని జీవత్వస్థితి నిరంతరం ఏదో వేదనా సంభరితంగా ఉంటుంది. కారణం తెలియని, ఆధారం కనిపించని, స్పష్టత లేని ఒక రకమైన వేదనను జీవుడు నిత్యమూ అనుభవిస్తుంటాడు. ఏదో ఒక అమూల్య రత్నాన్ని పారేసుకున్నట్టు, ఒక మహానంద సామ్రాజ్యంనుంచి తాను పతనమైపోయినట్టు ఎప్పుడూ వేదన పొందుతుంటాడు. ఆ పారేసుకున్న రత్నం ఏమిటో, ఆ ఆనంద సామ్రాజ్యం ఏదో అదేమీ వాడికి తెలియదు. అది దేనికోసమో చెప్పలేని వేదన. దాని ఉపశమనం కోసం జీవుడు సదా సర్వదా ప్రయత్నిస్తుంటాడు. ఈ ‘జీవుని వేదన’ అనేదే కవిసమ్రాట్ విశ్వనాథ తాను తఱచుగా పడుతుంటాను అని తన వాఙ్మయంలో చెప్పుకున్న, మొత్తుకున్న వేదన.
ఆ వేదన ఏమిటి అంటే పరమాత్మలో ఒక అణువుగా ఉండే తాను జీవాత్మగా వేఱుగా ఉన్నానేమిటి? ఏమిటి ఈ ఎడబాటు? ఎందుకు తనకీ బాధ? పరమాత్మలో తాను మమేకం అయ్యేది ఎట్లా? ఎప్పుడు? ఇలా తపిస్తూ ఉండే జీవుడికి భగవంతుని మఱోరూపమైన ‘రమ్యత’ ఒక వస్తువుగానో, ఒక శబ్దంగానో కనిపించేసరికి ప్రాణం లేచొస్తుంది. దుఃఖానందాలకు అతీతమైన ఒక తమకం- ఒక ఆరాటం- ఒక కలవరపాటు- కలగుండు వడిన ఒక మానసిక స్థితి కలుగుతుంది. అది జన్మాంతర సహృదయతా సంస్కార ఫలం. మామూలుగా మనం కొన్ని ఏళ్ళ ఎడబాటు తరువాత మన అమ్మనో, నాన్ననో చూస్తే మనకు ఆనందంతో ఏడుపొస్తుంది. గొంతు గద్గదికం అవుతుంది. మనకు ఒక భార రహిత స్థితి కలిగి గాలిలో తేలిపోతున్నట్టు అనిపిస్తుంది. ఇది ఒక అద్భుత అనిర్వచనీయానుభూతి. అందులో కాళిదాసు చెప్పిన పర్యుత్సుకత ఉంటుంది.
మనం మన నిత్య జీవితానుభవాలలో కూడా ఈ రమ్య వస్తు ఆలోకనంతో గాని, రమణీయ శబ్ద శ్రవణంతోగాని ఈ తెలియని దుఃఖాతీతమైన పర్యుత్సుకత (ఆరాటం)ను అనుభవిస్తూనే ఉంటాం. మనం నలుగురం కూర్చొని మాట్లాడుకుంటున్నప్పుడు ఆ మన నలుగురిలో ఎవరోఒకరు ఒక అద్భుతమైన చమత్కారాన్ని తళుక్కుమనిపిస్తూ- ఒక ఫ్లాష్‌లాగా - ఒక మాట వదలటమో, ఒక మధుర భావాన్ని వ్యక్తీకరించడమో జరిగిందనుకోండి. అప్పుడు అది వినగానే మనలో ఎవరికి వారికి ‘‘అరే! ఇతగాడు ఎంత బాగా అన్నాడు! ఎంత ఆర్టిస్టిక్‌గా ఎక్స్‌ప్రెస్ చేశాడు! ఆ మాట అతనికంటే ముందే మనం అనలేకపోయామే!’’ అనే ఒక ఆరాటపు భావన, ఒక విచిత్రమైన బెంగ, దిగులు కొన్ని క్షణాలు మనకు అనుభవంలోకి వస్తాయి - అతని మాటలు విన్న ఆనందంతోపాటే. దీనికి కారణం సర్వాంతర్యామిత్వం కలిగిన ఆత్మ అనే దానియొక్క, జన్మాలకు అతీతమైనదీ అయిన హృదయ సంస్కారం.
ఇదీ - కాళిదాసు ఒక చిన్న శ్లోకం ద్వారా రమ్యత అనే దానిపైన తనకున్న భావనను తెలియజేసిన మానవ మనస్తత్త్వ విశే్లషణ. ఒక విధంగా చెప్పాలంటే రమ్యత యొక్క ఆనంద ప్రభావాన్ని జాన్ కీట్స్ వివరిస్తే రమ్యతానుభూతి యొక్క పునాదిని తవ్వి చూపించాడు కాళిదాసు. కీట్స్ ది మహత్తరమైన మానవీయ దృష్టి. కాళిదాసుది ఆధ్యాత్మిక మానసిక దృష్టి. కీట్స్ చెప్పిన ఆనందం (అనుభూతి) చెరిగిపోనిది. కాళిదాసు చెప్పిన ఆరాటం (పర్యుత్సుకత) కాదని రానిది.

- శ్రీపతి పండితారాధ్యుల పార్వతీశం, 9849779290