సంపాదకీయం

సుషమ.. పరమశోభ!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దాదాపు ఇరవై రెండేళ్ల క్రితం, భారతీయ జనతాపార్టీ జాతీయ ప్రతినిధి మండలి సమావేశాలు ఒడిశా రాజధాని భువనేశ్వర్‌లో జరిగాయి. 1998లో లోక్‌సభ ఎన్నికలకు పూర్వరంగం అది. ‘్భజపా’ ప్రధానమంత్రి అభ్యర్థి అటల్ బిహారీ వాజపేయి పాల్గొన్న మాధ్యమ ప్రతినిధుల సమావేశంలో ఎక్కువ ప్రశ్నలకు అప్పటి పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి సుషమా స్వరాజ్ సమాధానాలను చెప్పింది. వాజపేయి పత్రికా ప్రతినిధుల సమావేశాలు నిర్వహించిన విలక్షణ రీతి అది. అంతేకాదు వాజ్‌పేయి, లాల్‌కృష్ణ అద్వానీ సుషమమ్మను పుత్రికా వాత్సల్యంతో పార్టీలో పెంచి పెద్దచేయడం మరో విలక్షణ వాస్తవం. అందువల్ల భువనేశ్వర్ సమావేశంలో పత్రికల ప్రతినిధుల ప్రశ్నలకు సమాధానాలను సుషమా స్వరాజ్ కూడ చెప్పడం ఆశ్చర్యకరం కాలేదు! ఆమె చెప్పిన ఒక సమాధానంలోని ‘ఆకాంక్ష’ ఇప్పటికి ‘సాకారం’ కావడం ఆమె సంకల్ప సిద్ధికి ధ్రువీకరణ... సంకల్పసిద్ధి జరిగిన వెంటనే సుషమా స్వరాజ్ తన పార్థివ దేహాన్ని పరిత్యాగం చేయడం మాత్రం ఊహించని పరిణామం! నాటి భువనేశ్వర్ సమావేశంలో ఆమె సమాధానం చెప్పిన ప్రశ్న రాజ్యాంగంలోని మూడువందల డెబ్బయ్యవ అధికరణానికి సంబంధించినది. జమ్మూ శ్మీర్ ప్రత్యేక ప్రతిపత్తికి సంబంధించినది! ‘మూడువందల డెబ్బయ్యవ అధికరణాన్ని తొలగించాలన్న మీ విధానాన్ని, మీరు ఈ ఎన్నికల తరువాత ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలిగితే అమలు జరుపగలరా?’ అన్నది ప్రశ్న. ఎందుకంటె 1998నాటి ఎన్నికలలో ఏ పార్టీకి కూడ లోక్‌సభలో స్పష్టమైన ‘సంఖ్యా బాహుళ్యం’- మెజారిటీ- సిద్ధించబోదన్నది అప్పటి బహిరంగ రహస్యం. ‘్భజపా’ ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసినప్పటికీ ఇతర పక్షాల మద్దతుపై ఆధారపడి ఉండాలన్నది స్పష్టం! ఈ ‘ఇతర పక్షాల’కు మూడువందల డెబ్బయి అధికరణం గురించి అప్పటికి పెద్ద ధ్యాసలేదు. ధ్యాస ఉండిన మిత్రపక్షాలు ఈ అధికరణాన్ని సమర్ధించాయి కూడ! అందువల్ల ఈ ప్రశ్నకు ప్రాధాన్యం ఏర్పడింది. ఈ ప్రశ్నకు సుషమా చెప్పిన సమాధానం ‘‘మూడు వందల డెబ్బయ్యవ అధికరణం చారిత్రక అపవాదం... ‘అపవాదం’ తొలగిపోక తప్పదు..!’’ వాజ్‌పేయి ప్రభుత్వ కాలంలోను, నరేంద్ర మోదీ మొదటి ప్రభుత్వ కాలంలో ఈ ‘అపవాదం’ తొలగలేదు. కారణాలు స్పష్టం, ఇన్నాళ్లకు, ఇనే్నళ్లకు ఈ ‘అపవాదం’ తొలగింది, చరిత్ర వెలిగింది. ‘గుదిబండ’ అధికరణం రద్దయింది! సుషమా స్వరాజ్ నాడు చెప్పిన జోస్యం నిజమైంది. సంకల్పం సిద్ధించింది. సుషమా స్వరాజ్ జీవితంలో చివరి శుభ పరిణామం ఇది, ఆమె ఆనందం వ్యక్తం చేసిన చివరి మహా విషయం ఇది. ఈ శుభ దినం కోసం తాను తన జీవితంలో ఇంతవరకు ఎదురుచూసినట్టు మంగళవారం రాత్రి ఏడున్నర గంటల ప్రాంతంలో ప్రధాని నరేంద్ర మోదీకి ఆమె సందేశం పంపారు. రెండు గంటల తరువాత ఆమె భౌతిక జీవనయాత్ర చాలించడం సంకల్పసిద్ధికి బహుశా మరో చారిత్ర నిదర్శం! ‘సుషమ’ అని అంటే కాంతి!!
జాతీయతత్త్వ నిష్ఠకు జీవనరూపంగా సుషమా స్వరాజ్ వెలుగొందడం చరిత్ర. భౌతిక రూపం మలగక తప్పదు. కానీ భౌతికమైన ఈ ‘వెలుగు’ ఇంత త్వరగా మలగిపోవడమే విస్మయకరమైన విపరిణామం. వందేళ్ల మానవ జీవన యాత్రను సుషమా స్వరాజ్ అరవై ఏడు వసంతాలకే చాలించడం ఈ విపరిణామం. ఢిల్లీ ముఖ్యమంత్రిగా, లోక్‌సభలో భాజపా-ప్రతిపక్ష- నాయకురాలిగా, కేంద్రమంత్రిగా ఆమె వ్యవహరించిన తీరు భారతదేశానికి మరింత మంచి పేరును తెచ్చిపెట్టడానికి కారణం ఆమె మాధ్యమంగా అంతర్జాతీయ వేదికలపై ప్రస్ఫుటించిన ఈ జాతీయ నిష్ఠ... జాతీయ సంస్కారం!
భారత జాతీయత సర్వమత, సర్వవైవిధ్య సమభావ తత్త్వమన్న వాస్తవాన్ని ఐక్యరాజ్యసమితి వేదికపైన, అంతర్జాతీయ వేదికలపైన నిరూపించగలిగిన న్యాయ నిపుణ స్వరాజ్. వౌలికంగా న్యాయవాది అయిన సుషమ తమ వాదనా పటిమను జాతీయ అంతర్జాతీయ వేదికలపైన చట్టసభలలోను ధ్రువపరచడం జాతీయ భావవ్యాప్తికి దోహదకరం. సర్వమత సమభావ వ్యవస్థ జీవన స్వభావమైన మన దేశం మేధావులను, వృత్తి నిపుణులను, శాస్తవ్రేత్తలను, మానవీయ సంస్కారవంతులను సృష్టించి ఎగుమతి చేయగలిగిందన్నది 2017 సెప్టెంబర్ 23న ఐక్యరాజ్యసమితిలో విదేశీ వ్యవహారాల మంత్రి స్వరాజ్ ఆవిష్కరించిన వాస్తవం! ఇందుకు పూర్తి భిన్నంగా నిరంతర శ్రమ జీవనయాత్రను సాగించడం కర్మయోగ సాకారం. స్వచ్ఛందంగా రాజకీయ జీవితానికి స్వస్తిచెప్పగలిగిన అతి కొద్దిమంది ప్రజాప్రతినిధులలో ఆమె గణనీయురాలు. ఈ రాజకీయ జీవన యాత్రను, కేంద్రమంత్రి పదవిని స్వచ్ఛందంగా పరిత్యాగం చేసిన రెండు నెలలకే ఆమె భౌతిక జీవనయాత్ర పరిసమాప్తం కావడం కర్మయోగ సాఫల్యానికి మరో ప్రతీక! ‘సుషమ’ అని అంటే మామూలు కాంతి కాదు, పరమమైన కాంతి, పరమ శోభ.. ‘సుషమా పరమా శోభా..’ అని ‘నామలింగాను శాసనమ్’- అమరకోశం- వివరిస్తోంది. పేరుపెట్టడం తల్లిదండ్రుల బాధ్యత... కానీ పేరుకు తగినట్టుగా ‘పరమశోభ’గా జాతీయ జీవన రంగంలో ఆమె ప్రస్ఫుటించడం ఆమె జీవన సాఫల్య చిహ్నం. హైందవ జాతీయ తత్త్వనిష్ఠ, భారతీయ సంస్కార శోభ ఆమె జీవన మాధ్యమంగా ప్రస్ఫుటించాయి. ఆమె రాజకీయవేత్తగా, సాహితీవేత్తగా ఈ ‘జాతీయత’ను పెంపొందించగలిగింది. విదేశ వ్యవహారాల మంత్రిగా ‘ఏక మత రాజ్యాంగ వ్యవస్థ’ను నెలకొల్పుకున్న పాకిస్తాన్ బీభత్సకారుల- టెర్రరిస్టుల-ను సృష్టించి ఎగుమతి చేస్తోందన్నది సుషమా ప్రపంచానికి గుర్తుచేసిన కఠోర వాస్తవం! ‘సహిష్ణుత’ భారతీయుల సర్వమత సమభావం. ‘అసహిష్ణుత’ పాకిస్తాన్ ప్రభుత్వ ప్రేరిత ‘జిహాదీల’ స్వభావమైన ఇస్లాం మతేతరుల పట్ల విద్వేషం. ఇలా మత విద్వేషం వెళ్లగక్కుతున్న పాకిస్తాన్‌ను ప్రపంచ దేశాలు క్రమంగా నిరసిస్తున్నాయి, వెలివేస్తున్నాయి. ‘బలూచీస్థాన్ ప్రజలను పాకిస్తాన్ ప్రభుత్వం పాశవికంగా అణచివేస్తుండడం హేయమైన ప్రభుత్వ బీభత్సకాండకు ప్రతినిధిత్వం..’అని 2016 సెప్టెంబర్ 26న స్వరాజ్ ‘ఐక్యరాజ్యసమితి’ వేదిక పైనుంచి చెప్పడం మన విదేశాంగ నీతి ‘పరివర్తన’కు చిహ్నం. బలూచిస్థాన్‌లో ప్రభుత్వ దమనకాండ పాకిస్తాన్ ‘అంతర్గత వ్యవహారం’కాదని, మానవీయ వౌలిక మూల్యాలకు సంబంధించిన వ్యవహారమని ప్రపంచానికి చాటించగలగడం ఈ పరివర్తన! బలూచిస్థాన్ ప్రజలు 1947లో పాకిస్తాన్‌లో కలవడానికి అంగీకరించలేదు. ప్రత్యేక దేశంగా ఏర్పడాలన్నది వారి ఆకాంక్ష. కానీ బ్రిటన్, పాకిస్తాన్ ప్రభుత్వాల ఉమ్మడి కుట్ర ఫలితంగా బలూచిస్థాన్ బలవంతంగా పాకిస్తాన్‌లో కలసిపోయింది. అందువల్ల ‘బలూచిస్థాన్’ స్వాతంత్ర ఉద్యమానికి మరిన మన విధానం వల్ల నైతిక బలం లభిస్తోంది! ఈ మారిన విధానం సుష్మాస్వరాజ్ ద్వారా ప్రస్ఫుటించింది!
పదేళ్లపాటు - 2004 నుంచి 2014 వరకు- మన ప్రభుత్వం సరిహద్దులలో చైనా ప్రభుత్వ దళాలు జరుపుతున్న ‘చొఱబాట్ల’ను కేవలం నిరసించింది. ‘నంగి నంగి’గా వ్యవహరించింది. కానీ గత ఐదేళ్లుగా మన ప్రభుత్వం చైనా ‘చొఱబాటుల’ను నిరోధిస్తోంది, నిలదీస్తోంది. మన సిక్కింలోను, భూటాన్‌లోను విస్తరించి ఉన్న డోక్‌లా- డోక్‌లామ్- పచ్చిక మైదానంలోకి చొరబడిన చైనా దళాలు నిష్క్రమించేవరకు మనం నిరోధించగలిగాము. మన దౌత్య నీతికి లభించిన విజయం ఇది. సుషమా స్వరాజ్ ఈ దౌత్యనీతికి ప్రతినిధి! ‘‘ప్రకృతిని మనం విచక్షణ రహితంగా విధ్వంసం చేసినట్టయితే, ప్రకృతి మనపై ప్రతిక్రియకు పూనుకొంటుందన్న వాస్తవాన్ని మనం గ్రహించాలి’’అని ఐక్యరాజ్యసమితి వేదికపై ఈ ‘చిన్నమ్మ’ చెప్పిన హితవు జీవ వైవిధ్య పరిరక్షక భారతీయతత్త్వానికి అనురూపం! అణువునుంచి అనంత విశ్వం వరకూ....!!