సంపాదకీయం

వైరుధ్యాల కూటమి!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావుకు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రధాన ప్రత్యర్థిగా అవతరించడం ‘సమా ఖ్య కూటమి’ వల్ల సంభవించిన విప్లవ పరిణామం. సమాఖ్య కూటమి ఏర్పడవలసి ఉంది. కానీ జాతీయ స్థాయిలో మళ్లీ ‘మిశ్రమ రాజకీయ’ శకాన్ని స్థాపించడానికై ‘వలసిన’ నాయకత్వం కోసం మాత్రం పోటీ ఆరంభమైంది. భాజపాకు వ్యతిరేకంగా, కాంగ్రెస్ స్పర్శలేని ‘మహాసమాఖ్య కూటమి’ని మొదట ప్రతిపాదించినవాడు తెలంగాణ ముఖ్యమంత్రి, తెరాస అధినేత. ఈ ప్రతిపాదనను వెంటనే ఆమోదించి కేసీఆర్‌కు అభినందనలు తెలిపిన తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, బెంగాల్ ముఖ్యమంత్రి మమత జాతీయస్థాయిలో ఈ ‘సమాఖ్య కూటమి’- ఫెడరల్ ఫ్రంట్-కి నాయకత్వం వహించడానికి నడుము బిగించింది. ‘కూటమి’కి జాతీయస్థాయిలో నాయకత్వం వహించడానికి సంసిద్ధతను వ్యక్తం చేసిన మొదటి ప్రాంతీయ నాయకుడు కూడ తెలంగాణ సీఎం మాత్రమే! కానీ ఈ ప్రాంతీయ పక్షాల కూటమికి జాతీయ స్థాయిలో కేసీఆర్ నాయకత్వం వహించడం తనకు ఇష్టం లేదని ధ్వనింపచేయడానికి మమత చేస్తున్న హడావుడి అంతా ఇంతా కాదు. ఇతర ప్రాంతాల నేతలతో చర్చలు జరపడంలో తాను కేసీఆర్ కంటె అగ్రగామిగా ఉన్నానన్న ఆధిపత్య ధోరణిని ఆమె ప్రతిరోజూ ఆవిష్కరిస్తూనే ఉంది. మరోవైపు ‘నేను కదా సమాఖ్య కూటమికి నిజమైన నాయకురాలిని..’ అన్న రీతిలో బహుజన సమాజ్ పార్టీ- బసపా-అధ్యక్షురాలు మాయావతి దేశమంతటా పర్యటిస్తోంది. గత పదమూడవ తేదీన కేసీఆర్ బెంగళూరుకు వెళ్లి ‘లౌకిక జనతాదళ్’ అధినేత, మాజీ ప్రధాని దెవెగౌడతో చర్చలు జరిపాడు. జాతీయస్థాయి ‘ప్రజా కూటమి’- పీపుల్స్ ఫ్రంట్-లో చేరవలసిందిగా ‘లౌకిక జనతాదళ్’ను కేసీఆర్ ఆహ్వానించివచ్చాడు. అందువల్ల మాయావతి కేసీఆర్ కంటె మరో అడుగు ముందుకేసింది. ఆమె కర్నాటక వెళ్లి ‘లౌకిక జనతాదళ్’కు వోట్లు వేయమని ప్రజలను ఉద్బోధిస్తోంది. మాయావతి పార్టీ వారు ‘లౌకిక జనతాదళ్’తో పొత్తు పెట్టుకుని కర్నాటక శాసనసభ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు కూడ. ఇంకా ఏర్పడని ‘ప్రాంతీయ పార్టీల జాతీయ కూటమి’ నాయకత్వం కోసం వివిధ రాష్ట్రాల సీఎంలు, మాజీ సీఎంలు పోటీ పడుతుండడం తెరాస పదిహేడవ వార్షికోత్సవ సర్వ ప్రతినిధి సమావేశానికి నేపథ్యం!
హైదరాబాద్ శివారు కొంపల్లి సమీపంలో జరుగుతున్న తెరాస వార్షిక మహాసభల్లో జాతీయస్థాయిలో సమాఖ్య కూటమిని ఏర్పాటు చేయడం గురించి ప్రముఖంగా చర్చించనున్నారట! తెలంగాణ రాష్ట్ర సాధనకు జరిగిన మహోద్యమ నేతగా, రాష్ట్ర మహోదయం తర్వాత మహాభ్యుదయ సాధనకు కృషిచేస్తున్న సీఎంగా మంచిపేరు తెచ్చుకున్న కేసీఆర్ జాతీయ రాజకీయ గతిని నిర్దేశించాలని భావిస్తుండడం ఈ ఏటి తెరాస మహాసభల ప్రత్యేకం! కేసీఆర్ ప్రతిపాదనను స్వీకరించిన మమత, మాయావతి వంటివారు నాయకత్వం మాత్రం తమకే కావాలని ఉవ్విళ్లూరుతుండడం సమాఖ్య కూటమి ఏర్పడక ముందే పొడసూపుతున్న వైరుధ్యాలకు సంకేతం! ఈ వైరుధ్యాలు కేవలం నాయకత్వం ఎవరు వహించాలన్న ఆధిపత్య రాజకీయానికి పరిమితమై లేవు. ‘సమాఖ్య కూటమి’ స్వరూప స్వభావాల గురించి ఒక్కొక్క రాష్ట్రానికి చెందిన నేతలు, ప్రాంతీయ పక్షాల అధినేతలు ఒక్కొక్క విధంగా మాట్లాడుతున్నారు. ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని అధికార పక్షాలు రెండూ ఈ కూటమిలో చేరగలవా? భాజపాను, కాంగ్రెస్‌ను వ్యతిరేకిస్తున్న తెరాస, తెదేపా అధినేతలు ఒకే రాజకీయ వేదికపైకి రాగలరా??
జాతీయస్థాయిలో కాంగ్రెస్ వ్యతిరేక, భాజపా వ్యతిరేక కూటమి ఏర్పాటులో ఇది వౌలికమైన సమస్య. జాతీయస్థాయిలో మూడవ కూటమికి నాయకత్వం వహించడానికి తాను సిద్ధమని కేసీఆర్ మార్చి మూడవ తేదీన ప్రకటించాడు. అలా ప్రకటించేనాటికి తెదేపా జాతీయస్థాయిలో భాజపాతో జట్టుకట్టి ఉంది. ఆ తర్వాత వారం రోజుల్లోనే తెదేపా మంత్రులిద్దరూ భాజపా నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం నుండి వైదొలిగారు. ఏపీలో చంద్రబాబు మంత్రిమండలి నుంచి భాజపా మంత్రులిద్దరూ నిష్క్రమించారు. ఏపీకి ‘ప్రత్యేక తరగతి హోదా’ను సాధించడానికై తెదేపా చేస్తున్న ఉద్యమానికి పార్లమెంటులో తెరాస మద్దతు ప్రకటించింది. మమతా బెనర్జీతో, ఝార్‌ఖండ్ మాజీ సీఎం, ఝార్‌ఖండ్ ముక్తి మోర్చా నేత శిబుసోరెన్‌తో, ఇతరేతర ప్రాంతీయ ప్రముఖులతో చర్చలు జరిపిన కేసీఆర్ చంద్రబాబుతో మాత్రం ఎందుకని ‘సమాఖ్య కూటమి’పై చర్చలు జరుపలేదు? చంద్రబాబు నాయుడైనా కేసీఆర్‌ను చర్చలకు ఆహ్వానించి ఉండవచ్చు. అటువంటిదేమీ ఇంతవరకు జరగకపోవడం ‘ఫెడరల్ ఫ్రంట్’ ప్రారంభ స్ఫూర్తికి గొప్ప వైరుధ్యం. ‘కూటమి’ ఏర్పాటు పట్ల కేసీఆర్ చూపుతున్నంత ఉత్సాహం చంద్రబాబు చూపడం లేదు. ‘ఏపీకి చెందిన మొత్తం ఇరవై అయిదు లోక్‌సభ స్థానాలను తమ పార్టీ గెలుచుకోవడం’ గురించి, తద్వారా 2019లో జరిగే ఎన్నికల తర్వాత ‘కేంద్ర ప్రభుత్వాన్ని ఎవరు ఏర్పాటు చేయాలన్నది తమ పార్టీ నిర్దేశించడం’ గురించి మాత్రమే చంద్రబాబు పదేపదే ముచ్చటిస్తున్నాడు. తెలంగాణలో తెదేపా ఎన్ని లోక్‌సభ స్థానాలను గెలుస్తుందన్నది చంద్రబాబు చెప్పకపోవడం కేసీఆర్‌కు హర్షం కలిగించే పరిణామం. కాంగ్రెస్ వ్యతిరేక, భాజపా వ్యతిరేక ‘ఫెడరల్ ఫ్రంట్’లో తెదేపా కూడ చేరితే తెలంగాణలో జరిగే లోక్‌సభ ఎన్నికల్లో తెదేపా బహుశా పోటీ చేయదా? చంద్రబాబు నిర్థారించుకున్న ‘ఇరవై అయిదు స్థానాలు గెలిచే’ లక్ష్యానికి ఇదే తాత్పర్యమా? ఈ తాత్పర్యం ప్రాతిపదికగానైనా కేసీఆర్ చంద్రబాబుతో చర్చలకు పూనుకోవాలి.. ఎందుకు పూనుకొనడం లేదో మరి..? బెంగళూరుకు, కోల్‌కతకు వెళ్లి వచ్చిన కేసీఆర్ సమీపంలోని అమరావతికి కూడ వెళ్లిరావచ్చు లేదా చంద్రబాబు హైదరాబాద్‌కు వచ్చి కేసీఆర్‌తో చర్చలు జరుపవచ్చు. వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ సైతం ఫెడరల్ ఫ్రంట్ పట్ల స్పందించకపోవడంలో ఆంతర్యం ఏమిటో మరి?
ఫెడరల్ ఫ్రంట్ పట్ల కేసీఆర్‌కున్నత తపన మరే పార్టీకి లేదన్నది స్పష్టవౌతున్న వాస్తవం. కేసీఆర్ సంభావిస్తున్న ‘కూటమి’ భాజపాకు మాత్రమే కాదు, కాంగ్రెస్‌కు కూడ వ్యతిరేకంగా ఏర్పడవలసి ఉంది. కానీ కేసీఆర్‌ను అభినందించి ప్రోత్సహిస్తున్నట్టు అభినయించిన మమత ‘కోల్‌కత చర్చలు’ జరిగిన కొద్ది రోజులకే ఢిల్లీకి వెళ్లి కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియాతో చర్చలు జరిపివచ్చింది. మాయావతి సైతం కాంగ్రెస్‌తో చేతులు కలిపేందుకు సిద్ధంగా ఉంది. ములాయం సింగ్ తనయుడు అఖిలేశ్ యాదవ్ నాయకత్వంలోని సమాజ్‌వాదీ పార్టీ కూడ కాంగ్రెస్‌కు మిత్రపక్షం. లాలూప్రసాద్ నేతృత్వంలోని రాష్ట్రీయ జనతాదళ్ కాంగ్రెస్‌ను వదలడం లేదు. తమిళనాడులోని డిఎంకె నేతలతో కూడ మమత చర్చలు జరిపింది. డిఎంకె కాంగ్రెస్‌కు మిత్రపక్షం. ఇలాంటి ప్రాంతీయ పుచ్ఛాలను- తోకలను- పట్టుకొని జాతీయ రాజకీయ గోదావరిని కేసీఆర్ ఈదగలరా? సర్వ ప్రతినిధి సభలో సమాలోచన చేయాలి...