సంపాదకీయం

ఈ దేశం ఎటు పోతోంది..?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కర్నాటక శాసనసభ ఎన్నికల ప్రచారం సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ ‘హత్యారాజకీయాలపై’ చేసిన వ్యాఖ్యలు దేశంలో ప్రస్తుత ఆందోళనకర పరిస్థితులకు అద్దం పడుతున్నాయి. ‘హత్యా రాజకీయాలు కాంగ్రెస్ పార్టీకి కొత్తేమీ కాదు, ఇప్పటికి 25 మంది భాజపా కార్యకర్తలను హతమార్చారు. జాతిపిత మహాత్మ గాంధీ ప్రవచించిన అహింసా సిద్ధాంతం ఏమయింది?’ అని ఆయన సూటిగా ప్రశ్నించారు. కర్నాటకలో కలబురిగి అనే విద్వాంసుణ్ణి, గౌరీలంకేశ్ అనే మహిళా జర్నలిస్టును హత్యచేశారు. ఈ కేసుల విచారణలో ఎలాంటి ప్రగతి కన్పడలేదు. కమ్యూనిస్టుల ప్రాబల్యం ఉన్న చోట హత్యా రాజకీయాలు ఎక్కువన్న ఆరోపణలు చాలాకాలంగా ఉన్నాయి. సీపీఎం పాలనలో ఉన్న కేరళలో రాజకీయ ప్రత్యర్థులపై దాడులు సర్వసాధారణంగా మారాయి. కేరళ సీఎం పినరయ్ విజయన్ సొంత జిల్లా అయిన కన్నూరులో హిందూ సామాజిక సంస్థలకు చెందిన సుమారు పాతికమంది కార్యకర్తలను బలితీసుకున్నారు. మరో భావజాలం ఉన్నవారు మనుగడ సాగించరాదన్నది కమ్యూనిస్టుల సిద్ధాంతం. అలాగే, తమిళనాడులో అయ్యంగార్, అ య్యర్‌ల కుటుంబాలపై డిఎంకె కార్యకర్తలు తరచూ దాడి చేస్తుంటారు. కావేరీ తీరంలో అర్ఘ్యం ఇచ్చే బ్రాహ్మణుల యజ్ఞోపవీతాలను కత్తిరించే ఉద్యమాన్ని గతంలో డిఎంకె నిర్వహించింది. ఇలా ఎందుకు చేస్తున్నారంటే- ‘యజ్ఞాలు చేసే బ్రాహ్మణులు ఆర్యులు. మేము ద్రావిడులం, రావణాసుర సంతతి వారం’ అని డిఎంకె కార్యకర్తలు చెబుతుంటారు.
ఇక, ఏపీలోని రాయలసీమ విషయానికొస్తే- అక్కడ ముఠా హత్యలు సర్వసాధారణం. సీమలో ఫ్యాక్షన్ రాజకీయాలకు రాజిరెడ్డి (వైఎస్‌ఆర్ తండ్రి), పరిటాల రవి వంటి ఎందరో ప్రసిద్ధ నాయకులు బలైపోయారు. కృష్ణా, గుంటూరు జిల్లాలలో భూస్వాములపై కమ్యూనిస్టులు చాలాకాలంగా హత్యారాజకీయాలు సాగిస్తున్నారు. తెలంగాణ, చత్తీస్‌గఢ్, మహారాష్ట్ర సరిహద్దుల్లో నిరంతరం తుపాకుల మోతలు వినపడుతూ ఉంటాయి. గతనెల చివరివారంలో దాదాపు 60 మంది మావోయిస్టులు ఎదురుకాల్పుల్లో మరణించారు. అంతకుముందు పలు సంఘటనల్లో ఎందరో సిఆర్‌పిఎఫ్ పోలీసులు ప్రాణాలు కోల్పోయారు. ఇన్‌ఫార్మర్ల పేరుతో కొంతమంది అమాయక ఆదివాసీలను మావోయిస్టులు కాల్చిచంపారు.
జిహాదీ ఉగ్రవాదుల దాడుల్లో వందలాది అమాయక ప్రజలు ముంబయిలో ప్రాణాలు కోల్పోయారు. గుజరాత్‌లో ఆనాటి ముఖ్యమంత్రి, నేటి ప్రధాని అయిన నరేంద్ర మోదీని హత్య చేయడానికి బిహార్ నుండి ‘ఇషత్ జహానా’ ముఠా అహమ్మదాబాద్ చేరింది. అక్కడ వారిపై ఎన్‌కౌంటర్ జరిగింది. ‘ఇలా బిహార్ వాసులను ఎన్‌కౌంటర్‌లో చంపడం అన్యాయం’ అంటూ కాంగ్రెస్ నాయకుడు దిగ్విజయసింగ్ వంటివారు గోలపెట్టారు. ఇవన్నీ నిన్న మొన్నటి సంఘటనలు. దేశ స్వాతంత్య్రానికి పూర్వం జలియన్‌వాలా బాగ్‌లో జనరల్ డయ్యర్ వందలాది మంది భారతీయులను ఊచకోత కోశాడని మనం చరిత్ర పుస్తకాలలో చదువుకున్నాం. 1984లో న్యూఢిల్లీ నడివీధులలో వేలాది అమాయక సిక్కులను కాంగ్రెస్ శ్రేణులు చంపిన ఘటన రక్తచరిత్రకు చెరిగిపోని సాక్ష్యం. ఈ హత్యాకాండకు కాంగ్రెస్ నేతలు జగదీశ్ టైట్లర్, సజ్జనకుమార్‌లు నాయకత్వం వహించారన్న ఆరోపణలు వెల్లువెత్తాయి.
లక్ష్యసాధన కోసం హింసామార్గంలో పయనించండని కారల్ మార్క్స్ ఎప్పుడో చెప్పిన బూజుపట్టిన సిద్ధాంతాన్ని ఇంకా ప్రపంచవ్యాప్తంగా కమ్యూనిస్టులు నమ్ముతున్నారు. ఫలితంగా పుడమితల్లి రక్తంతో తడుస్తున్నది. ‘ఐసిస్’తో పాటు అనేక ముస్లిం మతోన్మాద ఉగ్రవాద సంస్థలు అనేక దేశాల్లో నరమేధాన్ని కొనసాగిస్తున్నాయి. ‘గెలిస్తే సిరియాలో రాజ్యాధికారం, చనిపోతే స్వర్గంలో సుఖాలు’ అని ‘ఐసిస్’ ప్రచారం చేస్తోంది. పాకిస్తాన్‌ను సాధించడానికి లక్షలాది మంది హిందువులను జిన్నా హత్య చేయించాడు. హిందువులపై పగబట్టిన జిన్నా చిత్రపటాన్ని ఇపుడు అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీలో మనం చూడవచ్చు. ఈ చిత్రపటం 1938 నుండి తమ వర్సిటీలో ఉందని, ఇది తమ వారసత్వ సంపద అని వైస్ చాన్సలర్ తారిక్ మన్సూర్ కేంద్ర ప్రభుత్వానికి వివరణ ఇచ్చారు. ఇదీ వర్తమాన భారతదేశ ముఖచిత్రం. ఇందుకోసమేనా వేలాదిమంది స్వాతంత్య్ర సమరయోధులు ప్రాణత్యాగం చేసింది. 1947 నాటి దేశ విభజనను మరచిపోయి నేడు కొన్ని రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులు ముస్లిం పార్టీలకు వంత పాడుతున్నాయి.
ఉత్తరప్రదేశ్‌లోని అలీగఢ్ ముస్లిం విశ్వవిద్యాలయం ఎప్పుడూ అగ్నిగుండంలా కనిపిస్తుంది. వార్షిక పరీక్షలు వాయిదా పడడం, పోలీసులు ఒక వర్గానికి చెందిన విద్యార్థులను అరెస్టు చేయడం, తరగతులను నిరవధికంగా రద్దు చేయడం సర్వసాధారణం. అల్లర్లకు ఎవరు పాల్పడినా తాము సహించేది లేదని వర్సిటీ ఉన్నతాధికారులు హెచ్చరిస్తుంటారు. అయినా పరిస్థితిలో ఎలాంటి మార్పు కనిపించదు. ఈ వర్సిటీలో హిందూ విద్యార్థులకు రక్షణ కల్పించాలని పలువురు నేతలు కేంద్ర మానవ వనరుల మంత్రికి ఎన్నిసార్లు ఫిర్యాదులు చేసినా ఫలితం శూన్యం. అలీగఢ్ ముస్లిం వర్సిటీలో పాకిస్తాన్ పరోక్ష ప్రమేయం నానాటికీ మితిమీరుతోంది. మొన్న గుజరాత్, తాజాగా కర్నాటక ఎన్నికల్లో పాకిస్తాన్ జోక్యం పెరిగిందన్న ఆరోపణలు ఉన్నాయి.
భారత్‌ను మూడుముక్కలుచేసి ద్విజాతి సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన వాడు మహమ్మద్ అలీ జిన్నా. ‘స్వాతంత్య్రం తెచ్చినందుకు మీ నెత్తిమీద కిరీటం పెట్టాలి’ అని మహాత్మా గాంధీతో ఎవరో అంటే- ‘అది ముళ్ల కిరీటం.. స్వాతంత్య్రం ఇచ్చినట్టే ఇచ్చి నన్ను శిలువపైకి ఎక్కించారు’ అని ఆయన కంటతడి పెట్టారు. ఇది జరిగి 70 ఏళ్లు గడిచాయి. అలీగఢ్ వర్సిటీలో జిన్నా చిత్రపటం ఘనంగా వేలాడుతోంది. మత విద్వేషాలతో ఈ దేశాన్ని ఇంకా ఎన్నిముక్కలు చేస్తారు? సామాన్య పౌరునికి దేశభక్తి లేకపోతే బాధపడాలి. ముఖ్యమంత్రులకు దేశభక్తి లేకపోతే మన దేశం అస్తిత్వం నిలుస్తుందా? కర్నాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్యపై అవినీతికి, హత్యారాజకీయాలకు సంబంధించి అనేక ఆరోపణలున్నాయి. తనను అవినీతి పరుడని విమర్శించినందుకు మోదీపై పరువునష్టం దావా వేస్తానని సిద్దరామయ్య బహిరంగంగా హెచ్చరించాడు.
హర్యానా ముఖ్యమంత్రి మనోహర కట్టర్, మంత్రివర్గ సహచరుడు అనిల్‌విజ్ ఇటీవల చేసిన వ్యాఖ్యలు సంచలనం సృష్టించాయి. బహిరంగ ప్రదేశాలలోకాక మసీదులు, ఈద్‌గాల్లో ముస్లింలు ప్రార్థనలు చేసుకోవాలని కట్టర్ సూచించడం కాంగ్రెస్ వారికి ఆగ్రహం తెప్పించింది. ముస్లింలపై ఆంక్షలు విధించేందుకు హర్యానాలోని భాజపా ప్రభుత్వం కుట్ర పన్నుతోందని కాంగ్రెస్ చిల్లర రాజకీయాలకు దిగింది. ఇది దేశ సమగ్రతకు భంగం కలిగించే విషయం. కాశ్మీర్‌కు స్వాతంత్య్రం ఇవ్వాలని, దేశాన్ని ముక్కలు చేయాలని కొంతమంది విద్యార్థి సంఘాల నేతలు పిలుపునిస్తే- సీతారాం ఏచూరి, రాహుల్ గాంధీ, అరవింద్ కేజ్రీవాల్ వంటి నాయకులు మద్దతు ఇవ్వడం నీచ రాజకీయాలకు నిదర్శనం. జిహాదీ ఉగ్రవాదులు, మావోయిస్టులు వివిధ విశ్వవిద్యాలయాలను తమ రిక్రూట్‌మెంట్ సెంటర్లుగా మార్చుకోవటం గమనార్హం. దీనిని సంబంధిత రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకోవటం లేదు.
ఇక, ప్రత్యేక హోదా హామీని మోదీ మరచిపోయారని ఆంధ్రప్రదేశ్‌లో అధికార తెదేపా సహా వైకాపా, కాంగ్రెస్ పార్టీలు ప్రజల్లో భావోద్వేగాలను రెచ్చగొడుతున్నాయి. ఎన్నికలు ముంచుకొస్తున్న సమయంలో అన్ని పార్టీలూ ‘హోదా’ మంత్రాన్ని జపిస్తూ భాజపాను విలన్‌గా చూపుతున్నాయి. కర్నాటక అసెంబ్లీ ఎన్నికల్లో భాజపాను ఓడించాలని తెదేపా పిలుపునిచ్చింది. నిధుల కేటాయింపులో వివక్ష చూపుతున్నారని, రాష్ట్రాలపై కేంద్రం పెత్తనం తగ్గాలని ఏపీ, తెలంగాణ సీఎంలు నిరసన గళం విప్పారు. అలనాడు మన రాజ్యాంగ నిర్మాతలు ఆశించిన ఫెడరలిజం ఇది కాదు. ఇది ముమ్మాటికీ వేర్పాటువాదం. కేంద్రం బలహీనమైనప్పుడల్లా మన దేశంపై విదేశాల జోక్యం పెరుగుతుంది. రాజకీయ ప్రయోజనం కోసం మత విద్వేషాలు రెచ్చగొట్టేవారు, జాతీయవాదాన్ని వ్యతిరేకించేవారు ఈ వాస్తవాన్ని గ్రహించాలి.

- ప్రొ. ముదిగొండ శివప్రసాద్ ఫోన్: 040- 2742 5668