సంపాదకీయం

కృష్ణగంగ.. బ్రహ్మపుత్ర

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కృష్ణ గంగానది నీటిపై తనకు లేని హక్కులను సాధించుకొనటానికి పాకిస్తాన్ ప్రభుత్వం పదే పదే అంతర్జాతీయ సంస్థలలో వివాదాలను దాఖలు చేస్తోంది. బ్రహ్మపుత్ర జలాలపై మనకు ఉన్న హక్కులను సాధించుకొనటానికి మన ప్రభుత్వం మీనమేషాలు లెక్కపెడుతోంది, తటపటాయిస్తోంది. బ్రహ్మపుత్ర నదీ జలాలను అక్రమంగా జుర్రేయడానికై చైనా దశాబ్దికిపై రహస్యంగాను, బహిరంగంగాను యత్నిస్తోంది. టిబెట్‌లో బ్రహ్మపుత్రపై ఆనకట్టలను నిర్మిస్తోంది. తూర్పు ఆసియా దేశాలకు చుక్కనీరు దక్కకుండా ‘మాతృగంగ’- మెకాంగ్- నది నీటిని చైనా మళ్లించుకొంటోంది. అది వేరే సంగతి.... కృష్ణగంగపై మనం నిర్మించిన జల విద్యుత్ ఉత్పాదక కేంద్రం పట్ల పాకిస్తాన్ మరోసారి అభ్యంతరం చెప్పడం ఈ నీటి తగాదాల చరిత్రలో వర్ధమాన ఘట్టం. నీటి తగాదాల చరిత్రకు అనాదిగా ఒకే దేశంగా ఉండిన భారత్ దాదాపు రెండున్నర సహస్రాబ్దులుగా దశలవారిగా విభక్తమైపోవడం కారణం! కలియుగం ఇరవై ఆరవ శతాబ్ది- క్రీస్తునకు పూర్వం ఆరవ శతాబ్ది- నాటికి టిబెట్- త్రివిష్టపం- మన దేశంనుండి విడిపోవడంతో అఖండ భారత విభజన ఆరంభమైంది. చైనాకు, మన దేశానికి మధ్య దాదాపు రెండు వేల ఐదువందల ఏళ్లపాటు టిబెట్ స్వతంత్ర దేశంగా కొనసాగింది. ఈ స్వతంత్ర ‘టిబెట్’కూ మన దేశానికి మధ్య కైలాస పర్వతం మానస సరోవరం సహజ సరిహద్దులుగా కొనసాగాయి. ‘కైలాస’, ‘మానస’ క్షేత్రాల పట్ల సాంస్కృతిక నిష్ఠలేని బ్రిటన్ దురాక్రమణదారులు మన దేశాన్ని ‘పాలించిన’ కాలంలో క్రీస్తుశకం 1914లో టిబెట్‌కూ మనకూ మధ్య కొత్త సరిహద్దు ఏర్పడింది. ఫలితంగా ‘కైలాస-మానస క్షేత్రం’ టిబెట్‌లో కలసిపోయింది. కొలంబోనుంచి హిమాలయాల వరకు జనం భక్తిశ్రద్ధలతో ఆరాధించే ‘కైలాస మానస సరోవర ప్రాంతం’ ఇలా టిబెట్‌లో కలవడంవల్ల బ్రహ్మపుత్ర పరీవాహ ప్రాంతం- అరుణాచల్ వరకూ- టిబెట్‌లో మిగిలింది. నిజానికి బ్రహ్మపుత్ర దక్షిణ తీరం వరకూ భారత్, ఉత్తర తీరం వరకు టిబెట్ వ్యాపించడం రెండు వేల ఐదువందల ఏళ్ల భౌగోళిక చరిత్ర. ఈ సరిహద్దు కొనసాగి ఉండినట్టయితే, టిబెట్‌ను ఆక్రమించిన చైనా బ్రహ్మపుత్రనుదాటి వచ్చేది కాదు, కైలాసం, మానసం యాత్రలకు మనం చైనా ప్రభుత్వం అనుమతిని తీసుకోవలసి వచ్చేది కాదు. బ్రిటన్‌కు భరతభూమి పట్ల మమకారం లేదు. అందువల్ల ‘కైలాస మానసం’ నేపాల్, భూటాన్‌లకు ఉత్తరంగా ప్రవహించే ‘బ్రహ్మపుత్ర’ 1914లో టిబెట్‌లో కలిశాయి. 1949 తరువాత అప్పటి మన ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ టిబెట్‌ను చైనా దురాక్రమించడానికి సహకరించి చైనాను మన ఉత్తరపు సరిహద్దునకు చేర్చాడు. బ్రహ్మపుత్రను చైనా కొల్లగొట్టడానికి ఇదీ కారణం.
‘కృష్ణగంగ’పై పాకిస్తాన్ దశాబ్దులపాటు పేచీ పెడుతుండడానికి కారణం 1947లో మరోసారి జరిగిన భారత విభజన - 1935లో బర్మాను భారత్‌నుండి బ్రిటన్ ప్రభుత్వం విడగొట్టింది-! 1948నుంచి జమ్మూకశ్మీర్‌లోని మూడవ వంతు పాకిస్తాన్ అక్రమ ఆధీనంలో ఉంది. అందువల్ల జమ్మూకశ్మీర్ పొడవునా ప్రవహించి ‘వితస్తా’ ఝీలం నదిలో కలిసిపోయే ‘కృష్ణగంగానది’ కూడ వివాదగ్రస్తమైంది. ప్రస్తుతం ‘కృష్ణగంగ’ నూటయాబయి కిలోమీటర్ల మేర ‘పాకిస్తాన్’ దురాక్రమిత కశ్మీర్- పిఓకె-లో ప్రవహిస్తోంది! అందువల్ల మనకూ పాకిస్తాన్‌కు 1960వ దశకంలో కుదిరిన ‘‘సింధూ నదీజలాల’’ ఒప్పందానికి విరుద్ధంగా మన ప్రభుత్వం కృష్ణగంగపై జమ్మూకశ్మీర్‌లో జల విద్యుత్ కేంద్రాన్ని నిర్మించిందని పాకిస్తాన్ ప్రభుత్వం ఆదివారం ప్రపంచ బ్యాంకునకు ఫిర్యాదు చేయగలిగింది. గతంలో కూడ పాకిస్తాన్ ప్రభుత్వం ‘కృష్ణగంగ’ ఆనకట్ట నిర్మించరాదని కోరుతూ ‘అంతర్జాతీయ మధ్యవర్తిత్వ న్యాయ మండలి’లో అనేక ఏళ్లపాటు వివాదం నడిపింది. 2013లో ‘హేగ్’ నగరంలోని ఈ ‘మధ్యవర్తిత్వ న్యాయకూడలి’- ‘కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్’- వారు మన దేశానికి అనుకూలంగా తీర్పునిచ్చారు. అందువల్ల మన ప్రభుత్వం ఈ జలాశయ నిర్మాణాన్ని పూర్తిచేయగలిగింది. మూడువందల ముప్పయి ఎంవివి విద్యుచ్ఛక్తిని ఉత్పత్తిచేయగల ఈ జలాశయ పథకాన్ని శనివారం ప్రధానమంత్రి ప్రారంభించాడు. మన ప్రధాని ఈ ప్రారంభోత్సవం నిర్వహిస్తుండిన సమయంలోనే పాకిస్తాన్ ప్రభుత్వం ‘ప్రపంచ బ్యాంకు’నకు ఫిర్యాదుచేసింది. కృష్ణగంగ ఝీలం నది ఉపనది. 1960నాటి సింధూ జలాల ఒప్పందం ప్రకారం సట్లజ్- శతద్రు-, ‘విపస’- బియాస్-, రావి నదుల నీరు మొత్తం మన దేశానికి చెందాలి. ఝీలం, చెనాబ్, సింధు నదుల నీటి ప్రవాహాలు నిర్నిరోధంగా పాకిస్తాన్‌లోకి ప్రవహించడానికి మన దేశం దోహదం చేయాలి! పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్ మన అధీనంలో ఉండినట్టయితే ‘కృష్ణగంగ’పై పాకిస్తాన్‌కు మాట్లాడే అవకాశం లేదు. ఇదీ వౌలికమైన అంశం. ఎందుకంటె ‘ఝీలం’లో కలవడానికి ముందు యధేచ్ఛగా మనం కృష్ణగంగ జలాలను వాడుకోగలిగి ఉండేవారం. కృష్ణగంగ జమ్మూకశ్మీర్‌లోనే పుట్టి జమ్మూకశ్మీర్‌లోనే ‘ఝీలం’లో కలుస్తోంది. కానీ ‘పిఓకె’ కారణంగా కొంత ‘కృష్ణగంగ’ తమదని పాకిస్తాన్ ప్రభుత్వం వాదించింది. కానీ ‘ఆధీనరేఖ’కు మనవైపున ప్రాంతంలో జల విద్యుత్ కేంద్రం నిర్మాణం కావడంవల్ల ‘పిఓకె’లోకి ప్రవేశిస్తున్న కృష్ణగంగ నీటి పరిమాణం ప్రవాహవేగం ఏ మాత్రం తగ్గదు. ఎందుకంటె విద్యుత్ ఉత్పత్తి జరిగిన తరువాత జలాశయం నుండి దిగువన నది యథాతథంగా ప్రవహిస్తుంది. అందువల్లనే అంతర్జాతీయ న్యాయమండలి మనకు అనుమతినిచ్చింది. కానీ పాకిస్తాన్ మళ్లీ ప్రపంచ బ్యాంక్‌నకు ఫిర్యాదుచేసింది!
ఇలా లేని వివాదాన్ని కల్పించి సాగదీస్తున్న పాకిస్తాన్ లక్ష్యం కేవలం మన పట్ల శత్రుత్వాన్ని సాధించడం. కానీ బ్రహ్మపుత్ర నదీ జలాలను వాడేయడానికి యత్నిస్తున్న చైనా టిబెట్‌లో ఆనకట్టలను నిర్మించకుండా నిరోధించాలని అంతర్జాతీయ మధ్యవర్తిత్వ మండలిలో మన ప్రభుత్వం ‘నివేదన’ను దాఖలుచేయలేదు. ఇదీ అంతరం. మన నదులకు దిగువన ఉన్న పాకిస్తాన్‌తోను బంగ్లాదేశ్‌తోను మన ప్రభుత్వం ఒప్పందాలను కుదుర్చుకొంది. పాకిస్తాన్‌తోను బంగ్లాదేశ్‌తోను ఒప్పందాలు కుదిరాయి. ఈ ‘చిన్న’ దేశాలకు న్యాయంగా లభించవలసిన ‘వాటా’కంటె చాలా ఎక్కువగా నీటిని మన దేశం ప్రదానం చేస్తోంది. కానీ ఎగువ నుండి మన దేశంలోకి వస్తున్న బ్రహ్మపుత్ర నదీ జలాల పంపిణీపై చైనాతో మనకు ఇంతవరకు ఒప్పందం కుదరలేదు. పాకిస్తాన్ దురాక్రమిత కశ్మీర్‌లోని ప్రవహిస్తున్న నదులపై ఇప్పుడు చైనా జల విద్యుత్ కేంద్రాలను నిర్మిస్తోంది! ఇదంతా దేశ విభజన దుష్ఫలితం. టిబెట్‌ను చైనాకు మన ప్రభుత్వం ధారాదత్తం చేసినందువల్ల కలిగిన విపరిణామం.