సంపాదకీయం

‘దిద్దుకున్న’ భాజపా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భారతీయ జనతాపార్టీ తప్పిదాన్ని దిద్దుకొంది. పీపుల్స్ డెమొక్రాటిక్ పార్టీ-పీడీపీ-తో కలసి జమ్మూ కశ్మీర్‌లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం భాజపా చేసిన ఘోరమైన తప్పిదం. మంగళవారం భాజపా ఈ చారిత్రక మహాపరాధాన్ని దిద్దుకొంది, జమ్మూ కశ్మీర్ మంత్రివర్గం నుంచి వైదొలగింది! భాజపాకు చెందిన మంత్రులందరూ తమ రాజీనామా పత్రాలను రాష్ట్ర గవర్నర్‌కు పంపించారట! మంత్రివర్గంలోను, శాసనసభలోను ‘పీడీపీ’తో దాదాపు సమాన భాగస్వామ్యం గల భాజపా వైదొలగడంతో, ‘పీడీపీ’అధినేత మెహబూబా ముఫ్తీ ముఖ్యమంత్రిత్వంలోని జమ్మూ కశ్మీర్ ప్రభుత్వం రద్దయిపోవడం అనివార్య పరిణామం. ‘పీడీపీ’ జమ్మూ కశ్మీర్‌కు ‘స్వయం పాలన’- సెల్ఫ్‌రూల్- కోరింది. ఈ ‘స్వయం పాలన’ ప్రతిపాదన అమలు జరిగినట్టయితే జమ్మూ కశ్మీర్ దాదాపు స్వతంత్ర దేశంగా అవతరిస్తుంది. ఈ ‘స్వయం పాలన’ను మొదట పాకిస్తాన్ నియంత పరవేఝ ముషారఫ్ 2005-2006 సంవత్సరాలలో ప్రతిపాదించాడు. ఆ తరువాత ముషారఫ్ మాట ‘పీడీపీ’ నేతల నోట పలికింది. 2002-2008 సంవత్సరాల మధ్య కాంగ్రెస్‌తో కలసి జమ్మూ కశ్మీర్‌ను పరిపాలించిన ‘పీడీపీ’ అధికారచ్యుతి కలిగిన తరువాత ‘స్వయం పాలన’ సిద్ధాంత పత్రాన్ని ఆవిష్కరించింది. ఈ ‘స్వయం పాలన’ ఆవిష్కరణకు ఏకైక లక్ష్యం తాము- ‘పీడీపీ’వారు- పాకిస్తాన్ ప్రేరిత ‘జిహాదీ’ బీభత్సకారులను సమర్ధిస్తున్నామన్న విశ్వాసాన్ని వారికి - బీభత్సకారులకు- కలిగించడం! అందువల్ల ‘పీడీపీ’ వారు ప్రచ్ఛన్న బీభత్సకారులు! 2008-2014 సంవత్సరాల మధ్య ‘పీడీపీ’కి చెందిన మాజీ ముఖ్యమంత్రి ముఫ్తీ మహమ్మద్ సరుూద్, ఆయన కుమార్తె, ప్రస్తుత ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ అనేకసార్లు ఈ ‘స్వయం పాలన’ను సమర్ధిస్తూ ప్రకటనలు చేశారు, దేశ వ్యతిరేక విద్రోహ విషాన్ని వెళ్లగక్కారు. మన సైనిక దళాల ఉనికిని వ్యతిరేకించారు, సైనిక దళాలకు ప్రత్యేక అధికారాలను కల్పిస్తున్న చట్టాన్ని వ్యితిరేకించారు. జమ్మూ కశ్మీర్‌లో భారీగా సైనికులు, అనుబంధ సాయుధ దళాలు-పారామిలిటరీ ఫోర్సస్- నెలకొని ఉన్నందువల్ల మాత్రమే పాకిస్తాన్ ఉసిగొల్పుతున్న జిహాదీ బీభత్సకారులను ప్రభుత్వం కొంతవరకూ నియంత్రించగలుగుతోంది! సైనిక దళాలను జమ్మూ కశ్మీర్ నుంచి ఉపసంహరించాలని కోరుతున్నవారు దేశ విద్రోహులు- పాకిస్తాన్ సమర్ధకులన్నది సతార్కికమైన వాస్తవం. ఈ దేశ విచ్ఛిన్నకరమైన ‘స్వయం పాలన’ ప్రతిపాదనను ‘పీడీపీ’ విడనాడిన దాఖలాలు లేవు. ఇలాంటి పార్టీతో 2015లో జట్టుకట్టడం ద్వారా భాజపా దేశ ప్రజలను విస్మయ చకితులను చేసింది. మూడున్నరేళ్లుగా దేశ ప్రజలు విస్మయగ్రస్తులై ఉన్నారు. భాజపా ఇప్పటికైనా తప్పిదాన్ని దిద్దుకొంది, చెంపలు వేసుకుంది!!
జమ్మూ కశ్మీర్‌లో ప్రధాన సమస్య భద్రత! పాకిస్తాన్ ప్రభుత్వం ఉసిగొల్పుతున్న ‘జిహాదీ’ ఉగ్రమూకలు 1947 నుంచి కశ్మీర్‌లో బీభత్సకాండను కొనసాగిస్తున్నారు. ఈ బీభత్సకాండ ఫలితంగానే కశ్మీర్‌లో ప్రజల భద్రతకు భంగం కలుగుతోంది, జమ్మూ కశ్మీర్ ప్రాదేశిక సమగ్రత, భారతదేశ ప్రాదేశిక సమగ్రత భంగపడి ఉన్నాయి. మూడవ వంతుకు పైగా జమ్మూ కశ్మీర్ పాకిస్తాన్ దురాక్రమణకు గురికావడం బీభత్సకాండ ఫలితం. ఈ ‘పాకిస్తాన్ దురాక్రమిత కశ్మీర్’ నుంచి మాత్రమేకాక కశ్మీర్ లోయ ప్రాంతం నుంచి కూడ హిందువులు సమూలంగా నిర్మూలనకు గురికావడం బీభత్సకాండ ఫలితం! భద్రత ఛిద్రమైంది. ఫలితంగా జమ్మూకశ్మీర్‌లో ప్రగతి కూలబడి ఉంది. దశాబ్దుల తరబడి కేంద్ర ప్రభుత్వం లక్ష కోట్ల రూపాయల ప్రత్యేక నిధులను సమకూర్చినప్పటికీ కశ్మీర్‌లో భద్రత వ్యవస్థీకృతం కాలేదు, ప్రగతి వికసించలేదు. 2014 నుంచి కేంద్ర ప్రభుత్వం అనేక ప్రగతి పథకాలను రూపొందించింది. గతంలో నిర్మాణం ఆరంభమైన రైలుమార్గాలు ప్రారంభమయ్యాయి, కృష్ణగంగ జల విద్యుత్ కేంద్రం వంటి ప్రగతి పథకాలు ఆరంభమయ్యాయి. కానీ దశాబ్దుల తరబడి నిర్వాసితులై శరణార్థి శిబిరాలలో తలదాచుకుంటున్న హిందువులు కశ్మీర్ లోయలోని తమ స్వస్థలాలకు తిరిగి వెళ్లలేకపోతున్నారు. పాకిస్తాన్ సమర్ధకులైన దేశద్రోహులు- దేశభక్తులైన హిందువులను తిరిగి రానివ్వడం లేదు. గత నాలుగేళ్లలో కేవలం నాలుగైదు కుటుంబాల హిందువులు మాత్రమే ఇతర ప్రాంతాల నుంచి కశ్మీర్ లోయలోకి వెళ్లగలిగారు.
హిందువుల పునరావాసం కోసం కశ్మీర్‌లో ప్రత్యేక పట్టణ వాటికలను నిర్మించాలన్న కేంద్ర ప్రభుత్వం వారి పథకాన్ని అమలు జరపడంలో ముఫ్తీ మెహబూబా ప్రభుత్వం ఘోరంగా విఫలమైంది. 2014వ సంవత్సరానికి పూర్వం వలెనే ఈ నాలుగేళ్లు కూడ దేశద్రోహులకు, పాకిస్తాన్ తొత్తులకు పునరావాసాలు, ఉపాధులు కల్పించడానికి మాత్రమే మెహబూబా ప్రభుత్వం ప్రాధాన్యం ఇచ్చింది. సైనికుల పైన, పోలీసులపైన రాళ్లురువ్వి గాయపరచిన, హత్యలు చేసిన బీభత్సకారులను వేల మందిని మెహబూబా ప్రభుత్వం విడుదల చేసి పునరావాసం కల్పించింది. కేంద్ర ప్రభుత్వ నిధులను మెక్కి తెగబలిసిన పాకిస్తానీ తొత్తులు మళ్లీ మన సైనికులపై దాడులు చేస్తున్నారు, రాళ్లు రువ్వుతున్నారు. రాళ్లు రువ్వుతున్న బీభత్సకారులను సైనికులు చెదరగొట్టినప్పుడల్లా మెహబూబా ముఫ్తీ ముఖ్యమంత్రి హోదాలో నిరసనలను, రుసరుసలను ప్రకటిస్తూనే ఉంది. ప్రభుత్వం లోని భాజపా మంత్రులు ఈ దేశ వ్యతిరేక విధానాలను కక్కలేక మింగలేక నిస్సహాయులుగా, కేవలం వీక్షకులుగా మారడం మూడున్నర ఏళ్ల చరిత్ర. బీభత్సకారులు దేశ విదేశాల నుంచి జమ్మూ కశ్మీర్ సందర్శనకు వచ్చిన యాత్రికులపై రాళ్లురువ్వారు, హత్యలు కూడ చేశారు. కశ్మీర్‌కు వెళ్లడానికి ఇతర ప్రాంతాలవారు భయపడి నిరాకరించాలన్నది పాకిస్తాన్ తొత్తుల పథకం. ఈ పథకాన్ని వమ్ముచేయడంలో మెహబూబా ప్రభుత్వం విఫలమైంది! రంజాన్ పవిత్ర మాసం పొడవునా టెర్రరిస్టులకు వ్యతిరేకంగా చర్యలను మన సైనిక దళాల వారు ఆపివేసినప్పటికీ ‘జిహాదీ’ హంతకులు మాత్రం దాడులను ఆపలేదు.
జమ్మూ కశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తిని కట్టబెట్టడం ద్వారా ‘జిహాదీ’ ముష్కరులలోను, విచ్ఛిన్నకారులలోను అహంకారాన్ని పెంచిన భారత రాజ్యాంగంలోని 370వ అధికరణం బీభత్సకాండ ‘అంకురించి విష వృక్షంగా ఎదగడానికి’ అసలు కారణం! ఈ అధికరణాన్ని రద్దుచేయడమే- కశ్మీర్ కల్లోలాన్ని నిర్మూలించి ప్రశాంతిని, ప్రగతిని నెలకొల్పడానికి వౌలిక పరిష్కారం. భాజపా ఈ అధికరణాన్ని రద్దుచేయాలని ఏళ్ల తరబడి కోరుతోంది. ‘పీడీపీ’, నేషనల్ కాన్ఫరెన్స్, కాంగ్రెస్ పార్టీ వంటి పక్షాలు 370వ అధికరణాన్ని రద్దుచేయరాదని కోరుతున్నాయి. మాజీ ముఖ్యమంత్రులు ఫరూక్ అబ్దుల్లా, ఒమర్ అబ్దుల్లాల నాయకత్వంలోని ‘నేషనల్ కాన్ఫరెన్స్’ ఈ ‘ప్రత్యేక ప్రతిపత్తి’- స్పెషల్ స్టేటస్-తో సంతృప్తి చెందలేదు. వారు జమ్మూ కశ్మీర్‌కు ‘స్వయం ప్రతిపత్తి’- అటానమీ-ని కోరుతున్నారు. ‘పీడీపీ’ మరింత ముందుకెళ్లి- విద్రోహ పథంలో- ‘స్వయం పాలన’- సెల్ఫ్‌రూల్-ను కోరింది! ఇలాంటి ప్రచ్ఛన్న బీభత్సకారులైన ‘పీడీపీ’ వారితో జాతీయతా నిష్ఠగల భాజపా జట్టుకట్టడం దేశ ప్రజలు నిరసించిన విపరిణామం. ఇప్పుడైనా ‘విజ్ఞత’ నిద్రలేచింది, ‘విచక్షణ’ అంకురించింది!