సంపాదకీయం

వ్యవసాయ సహాయం..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వ్యవసాయదారుల సంక్షేమానికి కేంద్ర ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందనడానికి ఇది సాక్ష్యం. ‘అభూత పూర్వరీతి’లో వ్యవసాయ ఉత్పత్తులకు ‘కనీస మద్దతు ధరల’ను కేంద్ర మంత్రివర్గం బుధవారం పెంచడం ఈ సాక్ష్యం. ‘ఇది చారిత్రకమైన హెచ్చింపు’- హిస్టారికల్ ఇన్‌క్రీజ్- అని ప్రధాని నరేంద్ర మోదీ స్యయంగా అభివర్ణించడం కర్షక హితం పట్ల కేంద్ర ప్రభుత్వ రాజకీయ నిర్వాహకుల అంతరంగానికి అద్దం. బుధవారం నాటి నిర్ణయం ప్రకారం ఆహార ధాన్యాలను, ఇతర వ్యవసాయ పదార్థాలను ఉత్పత్తి చేస్తున్న రైతులకు తమ ఉత్పత్తులపై మరింత గిట్టుబాటు ధరలు లభించనున్నాయి. రైతులు, గ్రామీణులు ప్రయోజనం పొందుతారు. రైతులు, గ్రామీణులు దేశ జనాభాలో అత్యధిక శాతం ఉన్నారు. కనుక అధికాధిక జనహితానికి కేంద్ర ప్రభుత్వ నిర్ణయం దోహదం చేయగలదు. రైతులు ‘బస్తా’ ధాన్యాన్ని ఇతర ఉత్పత్తులను పండించడానికి పెడుతున్న ఖర్చుకు ఒకటిన్నర రెట్లు నికర ఆదాయం పొందడానికి పెరిగిన ఈ ‘కనీస మద్దతు ధర- మినిమం సపోర్ట్ ప్రయిజ్-లు దోహదం చేయగలవన్నది కేంద్ర ప్రభుత్వం చేసిన నిర్ధారణ. ఉదాహరణకు ‘బస్తా’ కందులు పండించడానికి సగటున మూడువేల నాలుగు వందల యాబయి రూపాయలను రైతులు ఖర్చు చేస్తున్నారట. ‘కందుల బస్తా’ను కొనుగోలు చేస్తున్న ప్రభుత్వాలు ఇంతవరకూ బస్తాకు ఐదువేల నాలుగు వందల యాబయి రూపాయల చొప్పున రైతుకు చెల్లించేవారు. ఈ ధరను ప్రస్తుతం ఐదువేల ఆరువందల డెబ్బయి ఐదు రూపాయలకు ప్రభుత్వం పెంచింది. అంటే ప్రభుత్వానికి కందులను అమ్మే రైతులకు ప్రతిబస్తాకు అదనంగా రెండు వందల ఇరవై ఐదు రూపాయలు లభించనుంది. బస్తా ధాన్యం-వరి- ఉత్పత్తి చేయడానికి సగటున దాదాపు పదకొండు వందల యాబయి రూపాయలు వ్యయం అవుతుండగా ఇంతవరకూ రైతులకు పదహైదు వందల యాబయి రూపాయల మద్దతు ధర లభించింది. ఇది పదిహేడు వందల యాబయి రూపాయలకు పెరగడం వల్ల రైతులకు ప్రతిబస్తాపై అదనంగా రెండు వందల రూపాయల ఆదాయం లభించనున్నది. పెంచిన ధరల ప్రకారం పదునాలుగు వ్యవసాయ ఉత్పత్తులను సేకరించినట్టయితే ప్రభుత్వానికి అదనంగా ముప్ప యి మూడువేల కోట్ల రూపాయల వ్యయం అవుతుందట! ప్రభుత్వ పంపిణీ వ్యవస్థ ద్వారా విక్రయిస్తున్న బియ్యం కొనుగోలు వల్ల మాత్రమే పదిహేనువేల కోట్ల రూపాయల అదనపు భారాన్ని ప్రభుత్వం మోయవలసి వస్తోందట...
ఈ కనీసపు మద్దతు ధర కంటే మరింత ఎక్కువ చెల్లించి ప్రభుత్వేతర వాణిజ్య సంస్థలు రైతుల నుంచి కొనుగోలు చేయాలన్నది వ్యవహార వాస్తవం. కానీ ‘స్వేచ్ఛా వాణిజ్య వ్యవస్థ’- మార్కెట్ ఎకానమీ- మాయాజాలం రైతన్న బతుకులతో వికృతంగా చెలగాటమాడుతుండడం నడస్తున్న చరిత్ర. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఒక వైపున వ్యవసాయ సంక్షేమ పథకాలు ప్రకటిస్తున్నాయి. మరోవైపున ‘బహుళ జాతీయ వాణిజ్య సంస్థలు’- మల్టీ నేషనల్ కంపెనీలు- వ్యవసాయ రంగాన్ని తమ కబంధ బంధంలో ఇరికించుకొనడానికి ప్రయత్నం చేస్తున్నాయి. పంపిణీ రంగంలోను, చిల్లర వ్యాపార రంగంలోను చొరబడిపోయిన స్వదేశీయ, విదేశీయ ‘బహుళ జాతీయ వాణిజ్య సంస్థలు’ విత్తనాలను, ఎఱువులను అధికధరలకు విక్రయిస్తున్నాయి. ‘మొన్‌సాంటో’ వంటి పైశాచిక వాణిజ్య సంస్థల దుర్మార్గపు వ్యాపారం పత్తిరైతుల ఆత్మహత్యలకు దోహదం చేసింది. బహుళ జాతీయ వాణిజ్య సంస్థల కరాళ దంష్టల్రకు వ్యవసాయం బలికాకుండా నిరోధించనంత వరకూ మద్దతు ధరలను పెంచడం బూడిదలో పోసిన పన్నీరే.. వ్యవసాయ వ్యయాన్ని పెంచుతున్న విదేశీయ సంస్థలను దేశం నుండి వెళ్లగొట్టాలి. ఎఱువులను, విత్తనాలను విదేశాల నుంచి కొనడం నిలిపివేయాలి. అలా జరిగినప్పుడు వ్యవసాయ ఉత్పత్తుల వ్యయం గణనీయంగా తగ్గిపోగలదు. వ్యయం తగ్గితే రైతులకు వ్యవసాయం లాభసాటి కాగలదు.
పాశ్చాత్య వాణిజ్య సామ్రాజ్యవాదం విస్తరించే వరకు, వేల ఏళ్లపాటు రైతులు పొలాల్లో ‘బంగారం’ పండించడం చరిత్ర. బ్రిటన్ దుర్మార్గపు పెత్తనం ఈ చరిత్రను ధ్వంసం చేసింది. ఈ విధ్వంసానికి ముందు రైతులు తమకు అవసరమైన విత్తనాలను తామే తయారుచేసుకున్నారు. పండించిన ప్రతి పంట నుంచి తదుపరి పంటకు అవసరమైన విత్తనాలను తయారు చేసుకున్నారు. విత్తనం కందులు, విత్తనాల వడ్లు, విత్తనం మిరప గింజలు, విత్తనాల సజ్జలు.. ఇలా రైతుల ఇళ్లలోని కుండల్లో, గాదెల్లో, గరిసెల్లో, భూగర్భ పాత్రల్లో విత్తనాలను నిలువ చేసేవారు. ఈ పద్ధతి, వేల ఏళ్ల సంప్రదాయం పథకం ప్రకారం ధ్వంసం కావడం బ్రిటన్ దురాక్రమణ ఫలితం, పాశ్చాత్య షడ్యంత్రం.. అందువల్ల రైతులు విత్తనాలను కొనవలసి వచ్చింది. వ్యవసాయంపై వ్యాపారం పట్టు సాధించడానికి ఇది ఆరంభం. విదేశీయ సంస్థలు విత్తనాల విక్రయంపై పట్టుసాధించడం ప్రపంచీకరణ ఫలితం. ఆకులను, ఆవుపేడను, పశువుల పేడను తవ్వితీసి నిలువ ఉంచిన మట్టిని ఎఱువుగా వాడిన సమయంలో పంటలకు పెద్దగా తెగుళ్లు వచ్చేవి కావు. సోకిన తెగుళ్లను గోమూత్రం, వేపాకు వంటి ఔషధాలతో నిర్మూలించేవారు. కాని బ్రిటన్ దురాక్రమణ సమయంలోను, అంతకు పూర్వం ‘జిహాదీ’ల బీభత్సకాండ సాగిన శతాబ్దుల కాలంలోను ఆవులను హత్యచేసి తినడం ఆరంభమైంది. గోమాంసం ఎగుమతి మొదలైంది. ఫలితంగా ‘పేడ’ గ్రామాల నుంచి మాయమైంది. చెట్లను నరికి కలపను తరలించుకుపోయిన పాశ్చాత్య వాణిజ్య బీభత్సకారులు మన అడవుల నిర్మూలనకు అంకురార్పణ చేశారు. ఫలితంగా వ్యవసాయానికి ఎఱువుగా ఉపయోగపడిన పచ్చని ఆకులు కనుమరుగయ్యాయి. కృత్రిమ రసాయనాలను ఎఱువులుగా వాడడం మొదలైంది. ఈ రసాయన ప్రభావంతో వందల రకాల చిత్ర విచిత్ర క్రిమికీటకాలు పుట్టుకొచ్చాయి. వాటిని చంపడానికి రసాయన విషాలు అవసరమయ్యాయి. వీటిని అమ్ముతున్న వాణిజ్య సంస్థలు ప్రధానంగా విదేశీయ సంస్థలు రైతులను దోచుకుంటున్నాయి. పేడ, ఆకుల పరిమళాలకు పరవశించి ఉపరితలానికి వచ్చి భూమిని నిరంతరం ‘దున్ని’ పరిపుష్టం చేసిన వానపాములు,ఎఱలు ఇప్పుడు పొలాల్లో లేవు. రసాయనాల విషపు వాసనలు భరించలేని ఈ ‘కర్షక మిత్రులు’ ముప్పయి అడుగుల లోతుకెళ్లి భూగర్భంలో శరణార్థులయ్యారు! వానపాముల స్పర్శ లేని భూమి నిస్సారమైంది, నిర్జీవమైపోతోంది. భూసారం పెంచాలని మరింతగా కృత్రిమ రసాయన విషాలను ఎఱువులుగా వాడుతున్నారు. పెద్దపెద్ద పురుగులు పుట్టుకొచ్చి పంటలను, రైతుల బతుకులను మింగేస్తున్నాయి.
‘మార్కెట్ మాయ’ నుంచి వ్యవసాయాన్ని విముక్తం చేయడం వ్యవసాయ జీవనుల సంక్షేమ సాధనకు వౌలికమైన పరిష్కారం. యుగాల నాటి సంప్రదాయ, సేంద్రియ వ్యవసాయాన్ని పునరుద్ధరించడం వల్ల మాత్రమే ఉత్పాదక వ్యయం తగ్గుతుంది. సేంద్రియ, సంప్రదాయ వ్యవసాయానికి వీలుగా అడవుల విస్తీర్ణం పెరగాలి. ఆవుల సంఖ్య, పశువుల సంఖ్య పెరగాలి. చిన్న రాష్టమ్రైన సిక్కింలో మొత్తం వ్యవసాయం సేంద్రియ పద్ధతిలో జరుగుతోంది. అన్ని రాష్ట్రాల్లోను ఇలా ఎందుకు జరగరాదు?