సంపాదకీయం

స్వచ్ఛతా ప్రస్థానం..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మాతృభూమి కేవలం మట్టిముద్ద కాదన్నది స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మరోసారి గుర్తుచేసిన సనాతన వాస్తవం. బ్రిటన్ వారి బీభత్స పాలన నుండి భరతజాతి విముక్తమైన తరువాత ప్రతి ఏట స్వాతంత్య్ర దినోత్సవాన్ని జరుపుకుంటున్నాము. బుధవారం జరిగిన డెబ్బయి రెండవ స్వాతంత్య్ర దినోత్సవ శుభవేళ ఢిల్లీలోని ఎఱ్ఱకోట ప్రాంగణం నుంచి దేశ ప్రజలను సంబోధించిన ప్రధాని జాతీయ గరిమను పునరావిష్కరించాడు, బ్రిటన్ తస్కర ముష్కర మూకలను మన దేశం నుండి వెళ్లగొట్టడానికి యత్నించిన సమర వీరులను, ఉద్యమకారులను సంస్మరించాడు. ఈ సంస్మరణ విదేశీయుల కబంధ బంధం నుంచి, దాస్య శృంఖలాల నుంచి భరత మాతృదేవిని విముక్తం చేయడానికై శ్రమించిన మహనీయుల పట్ల మన కృతజ్ఞతావిష్కరణ.. ఇది కేవలం లాంఛనం కారాదన్నది ప్రధాని మాటలలో ధ్వనించిన వాస్తవం. అరవింద యోగి చెప్పినట్టు ‘రాష్ట్రం’-జాతి- నిరంతర ప్రగతిశీల అయిన నిత్య స్రోతస్విని. ఈ జాతీయ ప్రగతి గతిని వేగవంతం చేయడం తమ ప్రభుత్వ కార్యక్రమమన్నది మోదీ స్వాతంత్య్ర శుభోత్సవ ప్రసంగ ప్రధాన ఇతివృత్తం. ‘జాతి’ ‘జాతీయత’ కేవలం అనుభూతి కాదని, ఆవేశం కాదని, కల్పిత భావం కాదని, ‘జాతి’ ‘జాతీయత’ దేశ ప్రజల అనాది జీవన వాస్తవమని అరవింద యోగి ప్రవచించినట్టు మోదీ అభిభాషించాడు. మాతృభూమి ఒక ‘మట్టిముక్క’ కాదు- అన్న అరవిందుని ప్రవచనం అనాది వేద నాదానికి ప్రతిధ్వని.. మాతృభూమి సజీవ చైతన్యరూపం, విశ్వవ్యవస్థకు విగ్రహ రూపం, ప్రజల, ప్రాణుల సర్వసమగ్ర అస్తిత్వానికి ఆధారం, ఈ సర్వసమగ్ర అస్తిత్వం జాతీయత. నేలతల్లి నీటిని ప్రసాదిస్తోంది, ఆహారాన్ని సమకూర్చుతోంది, ప్రగతికి సుగతికీ ఆధారం మాతృభూమి. అందువల్లనే అనాదిగా భారతీయులు ‘మాతాభూమిః పుత్రోహం పృథివ్యాః’ అన్న వాస్తవాన్ని గుర్తిస్తున్నారు.. ‘్భమి తల్లి- నేను ఆమె బిడ్డను.’ ఈ అనాది వాస్తవాన్ని అరవింద యోగి పునరుద్ఘాటించాడు, ప్రముఖ తమిళ కవి సుబ్రహ్మణ్య భారతి పునరావిష్కరించాడు. ఈ ‘పునరావృత్తి’ని మోదీ ప్రస్తావించాడు, అరవింద యోగిని, సుబ్రహ్మణ్య భారతిని ప్రశంసించాడు. సంస్కార పథంలో ప్రపంచ దేశాలను నడిపించడానికి భారతదేశం మళ్లీ నడుం బిగించింది- ఇది మోదీ ఉటంకించిన సుబ్రహ్మణ్య భారతి కవితలోని సారాంశం..
ఇలా మాతృభూమి పట్ల భక్తిగల నూట ఇరవై ఐదు కోట్ల భారతీయుల సమష్టి కృషి ద్వారా సమష్టి ప్రగతిని సాధించాలన్నది తమ ప్రభుత్వ లక్ష్యమని మోదీ చెప్పడం పునరావృత్తి. నాలుగేళ్లుగా ఆయన ఈ కార్యక్రమం ‘సబ్‌కా సాథ్ సబ్‌కా వికాస్’- అన్యోన్య సహకారంతో అందరి అభ్యుదయం- గురించి దాదాపుప్రతిరోజూ ప్రస్తావిస్తూనే ఉన్నాడు. ఈ అభ్యుదయ కేతనం భరతభూమిపై పైపైకి లేచి ఆకాశం కంటె ఎత్తుగా ఎగరాలన్నది మోదీ వ్యక్తం చేసిన ఆకాంక్ష! మానవ సహిత అంతరిక్ష నౌకలు అంబర వీధులలో విహరించాలన్నది ఈ ఆకాంక్ష. మన శాస్తవ్రేత్తలు మానవ రహిత అంతరిక్ష నౌకలను నిర్మించగలిగారు, ఈ అంతరిక్ష వాహనాలు వందల కొలదీ ఉపగ్రహాలను భూసమాంతర కక్ష్యలో ప్రతిష్ఠించగలిగాయి. ఈ ఉపగ్రహాలు అంతరిక్షంలో పరుగులు తీస్తూ భూమి చుట్టూ పరిక్రమిస్తున్నాయి. చంద్ర మండలాన్ని సైతం భారతీయ అంతరిక్ష నౌక చేరుకోగలిగింది. ‘చంద్రయాన్’, ‘మంగళ్‌యాన్’ వంటి కార్యక్రమాలు సుదూర గగన సీమలో భరత విజ్ఞాన వీచికలను వెదజల్లుతున్న విజయ వాహికలు. 2022వ సంవత్సరం నాటికి మానవ సహిత అంతరిక్ష నౌకలను విశ్వాంతరాళంలో విహరింపచేయడం తమ లక్ష్యమన్నది మోదీ చేసిన వాగ్దానం. ఈ వాగ్దానం వాస్తవ రూపం ధరించినట్టయితే భారతీయులు అంతరిక్ష యాత్ర చేసి తిరిగి రాగలరు. ఇంతవరకు రష్యా ‘నౌక’లోను, అమెరికా ‘వాహనాల’లోను ఎక్కి భారతీయులు అంతరిక్ష యాత్రలు చేశారు. స్వదేశీయ పరిజ్ఞానంతో, స్వదేశీయ అంతరిక్ష నౌకలనెక్కి భారతీయులు పైపైకి దూసుకొని వెళ్లగలిగినప్పుడు అంతర్జాతీయ సమాజంలో మన గరిమ మరింత విస్తరించగలదు..
ఇంటింటికీ వంట ఇంధనం సరఫరా చేయడం, పల్లెపల్లెనూ విద్యుత్‌కాంతులతో వెలిగింపచేయడం వంటి తమ పథకాల విజయవేగం గురించి మోదీ ప్రస్తావించాడు. 2014 మే 26వ తేదీకి పూర్వం పదేళ్లు పాలించిన ప్రభుత్వం కంటె వేగవంతంగా తమ ప్రభుత్వం గత నాలుగేళ్లుగా ప్రగతి పథకాలను, సంక్షేమ కార్యక్రమాలను అమలుజరుపుతోందన్నది స్వాతంత్య్ర దినోత్సవ వేదికపై నుండి మోదీ ధ్వనింపచేసిన మహా విషయం... ఇది అతిశయం కాదు, వాస్తవం! 2013- 2014వ ఆర్థిక సంవత్సరం కంటె ముందు జరిగిన స్థాయిలోనే వివిధ పథకాలు అమలుజరిగి ఉంటే ప్రగతి ఫలాలు ప్రజలందరికీ అందడానికి మరికొన్ని దశాబ్దులు పట్టి ఉండేది. కానీ నాలుగేళ్లలో తమ పాలన వల్ల దశాబ్దులలో జరిగినంత ప్రగతికి ఇబ్బడి ముబ్బడిగా అభ్యుదయం వెల్లివిరిస్తోందన్నది మోదీ చేసిన వెల్లడి. దేశంలోని అన్ని గ్రామాలకు, వనవాసీ జనావాసాలకు విద్యుత్ సౌకర్యం కలగడం ఇందుకు ఆయన చెప్పిన ఒక ఉదాహరణ. విద్యుత్ ప్రభలు విస్తరించడం, వంట ఇంధనంతో ఇంటింటా పొయ్యి వెలగడం మహిళల సంక్షేమ సాధనలో భాగం. పర్యావరణ పరిరక్షణకు, ‘స్వచ్ఛత’ విస్తరణకు ఈ రెండు కార్యక్రమాలు దోహదం చేస్తున్నాయి. ‘స్వచ్ఛ భారత్’ మళ్లీ అవతరించడానికి దోహదం చేస్తున్నాయి. ‘స్వచ్ఛ భారత్’ భౌతికమైనది మాత్రమే కాదు, బౌద్ధిక మానసిక ప్రవృత్తికి సంబంధించినది. ఒక నిజాయితీపరుడు పన్ను చెల్లించడం వల్ల ముగ్గురు నిరుపేదలు భోజనం చేయగలుగుతున్నారు. అవినీతి రహితమైన స్వచ్ఛ భారత్ అవతరించిందన్నది మోదీ చెప్పిన మాట. 2013లో ‘ప్రత్యక్ష’ పన్నులను చెల్లించిన వారి సంఖ్య నాలుగు కోట్లు కాగా ప్రస్తుతం వీరి సంఖ్య ఏడున్నర కోట్లు దాటి పోవడం ‘అవినీతి రహిత’ స్వచ్ఛ భారతీ ప్రగతికి ఒక సాక్ష్యం.. మరిన్ని సాక్ష్యాలను కూడ మోదీ సమర్పించాడు. వచ్చేనెల ఇరవై ఐదవ తేదీన పండిత దీన్‌దయాళ్ ఉపాధ్యాయ జయంతి రోజున ఆరంభం కానున్న ‘జన ఆరోగ్య అభియాన్’- ఆయుష్మాన్ భారత్- పది కోట్ల కుటుంబాలకు చెందిన యాబయి కోట్ల మందికి ప్రయోజకరం.. ఆరోగ్య భారతం ‘స్వచ్ఛ భారతం’లో భాగం..
స్వల్పకాల సేవాపథకం కింద సైన్యంలో చేరుతున్న యువతులకు ప్రధాని మరో శుభవార్త చెప్పారు. యువతులను సైనిక దళాలలో నియుక్తి చేయడం కోసం ‘స్థారుూ సంఘం’- పర్మినెంట్ కమిషన్- ఏర్పడుతోంది. మహిళా సాధికార ప్రగతి పథంలో ఇది మరో ముందడుగు. ‘ముమ్మారు తలాక్’- ట్రిపుల్ తలాక్- నిరోధం పట్ల తమ ప్రభుత్వ నిష్ఠను పునరుద్ఘాటించడం ముస్లిం మహిళలకు ఆనందదాయకం... జమ్మూ కశ్మీర్‌లో ప్రశాంతికి అటల్ బిహారీ వాజపేయి ప్రధాన మంత్రిత్వం నాటి ‘త్రిసూత్ర’ పరిష్కారాన్ని మోదీ పునరుద్ఘాటించాడు. ఇన్‌సానియత్- మానవత్వం-, జంహోరియత్- ప్రజాస్వామ్యం-, కశ్మీర్‌యత్- కశ్మీరీ అస్తిత్వం! ఈ మూడు సూత్రాలకు మరో సూత్రం జోడించడం వాజపేయి మరిచిపోయాడు, నరేంద్ర మోదీకి స్ఫురించలేదు.. ఆ సూత్రం ‘హిందూ స్థానియత్’- భారతీయత..!