సంపాదకీయం

అంతటివాడు..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వచ్చే సంవత్సరం జరుగనున్న లోక్‌సభ ఎన్నికలలో ‘దగ్గరుండి’ తమ పార్టీని మరోసారి గెలిపించాలని భారతీయ జనతాపార్టీ అధ్యక్షుడు భావిస్తున్నట్టు ప్రచారవౌతోంది. ఇలా లోక్‌సభ ఎన్నికలలో దగ్గరుండి విజయాన్ని పునరావృత్తం చేయడానికి వీలుగా ఎన్నికల వరకూ తానే పార్టీ అధ్యక్షుడుగా అమిత్ షా కొనసాగనున్నాడట! శని, ఆదివారాల్లో ఢిల్లీలో జరిగిన ‘్భజపా’ జాతీయ కార్యవర్గ సమావేశాల సందర్భంగా ఇలా లోక్‌సభ ఎన్నికల వరకు అమిత్‌షా అధ్యక్షుడుగా కొనసాగనున్న వాస్తవం ఆధికారికంగా ధ్రువపడింది. పార్టీలో అమిత్‌షాకు ఉన్న పరమోన్నత ప్రాధాన్యానికి పార్టీలోని ఇతర నాయకులకు, కార్యకర్తలకు ఆయన పట్ల కల అచంచల విశ్వాసానికి ఇది నిదర్శనం. ఆయన అధ్యక్ష పదవిలో ఉండినట్టయితేనే పార్టీ మరోసారి గెలవడానికి వీలుంటుందని, ఆయన ‘దగ్గరుండి’ గెలిపించడానికి అవకాశం ఉంటుందని పార్టీలోని అందరూ ఏకాభిప్రాయం కలిగి ఉన్నారన్నది కలుగుతున్న అభిప్రాయం. అమిత్ షా ప్రాధాన్యం 2014 నాటి లోక్‌సభ ఎన్నికల సందర్భంగా మొదట ప్రస్ఫుటించింది. ఈ ప్రాధాన్యం నిరంతరం విస్తరిస్తూ ఉండడం గత నాలుగేళ్ల ‘్భజపా’ సంస్థాగత చరిత్ర. 2014 లోక్‌సభ ఎన్నికల నాటికి అమిత్ షా పార్టీ అధ్యక్షుడు కాదు. కానీ ఆయన విరచించిన ఎన్నికల వ్యూహం వల్లనే ఉత్తరప్రదేశ్‌లో ‘్భజపా’ ఘన విజయం సాధించింది. అమిత్ షా ఉత్తరప్రదేశ్‌లో ‘దగ్గరుండి’ పనిచేశాడు. ఉత్తరప్రదేశ్‌లోని ఎనబయి లోక్‌సభ స్థానాలలో డెబ్బయి మూడింటిని ‘్భజపా’ కైవసం చేసుకొనడానికి ఆయన ‘దగ్గరుండి’ చేసిన కృషి కారణమన్నది అప్పుడు జరిగిన ప్రచారం. ఉత్తరప్రదేశ్‌లో ఇన్ని లోక్‌సభ స్థానాలు ఒక పార్టీకి లభించడం ఒక రాజకీయ మహాద్భుతం. ఈ మహా అద్భుతం కారణంగానే ‘్భజపా’కు లోక్‌సభలో స్పష్టమైన ‘సంఖ్యాధిక్యం’ లభించింది. 1977 మార్చిలో జరిగిన ఎన్నికలలో ‘అత్యవసర స్థితి’- ఎమర్జెన్సీ- ప్రభావం వల్ల ఉత్తరప్రదేశ్‌లో కాంగ్రెస్ తుడిచి పెట్టుకొని పోయింది. దాదాపు అన్ని లోక్‌సభ స్థానాలను ‘జనతాపార్టీ- ప్రజాస్వామ్య కాంగ్రెస్’ కూటమి కైవసం చేసుకుంది. అయితే ఆ జనతాపార్టీ నాలుగు పార్టీల కూటమి! అందువల్ల ‘ఒకే పార్టీ’ ఉత్తరప్రదేశ్‌లో ఇన్ని స్థానాలను గెలవడం 2014లోనే మొదట జరిగిందని చెప్పవచ్చు. ఈ అద్భుతాన్ని పునరావృత్తం చేయడం అమిత్ షాకు మాత్రమే సాధ్యం. వ్యూహరచనలో ‘అంతటివాడు’ పార్టీలో మరొకరు బహుశా లేరు. అందువల్లనే లోక్‌సభ ఎన్నికలకు ముందుగా ‘ప్రాత్యక్షిక అభ్యాసం’- రిహార్సల్- వలె తన వ్యూహాన్ని అమిత్ షా తెలంగాణ శాసనసభ ఎన్నికల సందర్భంగా అమలు జరుపనున్నాడట. ‘నేనే దగ్గరుండి గెలిపిస్తాను..’ అని తెలంగాణ ‘్భజపా’ నాయకులకు జాతీయ కార్యవర్గ సమావేశాల సందర్భంగా ఢిల్లీలో అమిత్ షా అభయమిచ్చాడట. ఆయన ‘దగ్గరుండి’ రణవ్యూహాన్ని నడిపినట్టయితే 2014లో ఉత్తరప్రదేశ్‌లో లోక్‌సభ ఎన్నికలలో జరిగిన అద్భుతం తెలంగాణ శాసనసభ ఎన్నికలలో జరుగవచ్చునన్నది ‘్భజపా’ నాయకుల స్వప్నం...
ఈ స్వప్నం సాకారం అవుతుందా? అన్నది కేవలం తెలంగాణకు సంబంధించిన ప్రశ్న. కానీ అమిత్ షా ప్రాధాన్యం రానున్న లోక్‌సభ ఎన్నికల రణనీతికి సంబంధించిన బృహత్తరమైనది, విస్తృతమైనది. ‘అంతటివాడు’, ‘అంతటి సమర్థుడు’ మరొకరు లేరు కనుకనే 2019 ఏప్రిల్, మే నెలల్లో జరిగే లోక్‌సభ ఎన్నికల వరకూ ఆయనను అధ్యక్షుడుగా కొనసాగించాలని ‘్భజపా’ ప్రముఖులు భావిస్తూ ఉండవచ్చు. 2014 నాటి ఎన్నికల సమయంలో అమిత్ షా అధ్యక్షుడుగా లేడు కదా! అప్పుడు కూడ పార్టీ గెలిచింది కదా! అన్న ‘అసౌకర్యమైన’ వ్యాఖ్యలను విశే్లషణలను చేస్తున్నవారు పార్టీలో కొందరు ఉండవచ్చు! వారి మాటలను పెద్దలు పట్టించుకోలేదు. ప్రస్తుత దేశ వ్యవహారాల మంత్రి రాజనాథ్ సింగ్ గతంలో ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి. ఆయన ముఖ్యమంత్రిత్వంలో 2002లో ఉత్తరప్రదేశ్ శాసనసభ ఎన్నికలలో పోటీచేసిన ‘్భజపా’ ఘోర పరాజయం పాలైంది, మళ్లీ గెలవడానికి పదహైదు ఏళ్లు పట్టింది. అలా ‘పరాజయ ప్రతీక’ అయిన రాజనాథ్ సింగ్ 2014 నాటి లోక్‌సభ సమర సమయంలో భాజపా అధ్యక్షుడు. అందువల్ల అధ్యక్షుడు ఎవరు? అన్నదానితో నిమిత్తం లేకుండా ‘్భజపా’కు ఎన్నికలలో గెలుపులు, గుణపాఠాలు లభించడం చరిత్ర! వ్యక్తిగత నాయకత్వ పటిమకు అతీతమైన సైద్ధాంతిక విలక్షణ అస్తిత్వం ‘్భజపా’కు ఉండడం ఇందుకు కారణం!
కానీ, అమిత్ షా పట్ల అతి విశ్వాసం ప్రకటిస్తున్న ‘్భజపా’వారు ఈ సైద్ధాంతిక విలక్షణ అస్తిత్వం గురించి ధ్యాసను కోల్పోయినట్టున్నారు. సంస్థాగత ప్రజాస్వామ్యం ఈ విలక్షణ అస్తిత్వంలో భాగం. దేశంలోని అనేక ప్రధాన రాజకీయ పక్షాలలో సంస్థాగత ప్రజాస్వామ్యం నేతి బీరకాయలోని స్వచ్ఛమైన నేయి.. ఎండమావిలోని మధుర జలం..! ‘ఒళ్లంతా నోరు అన్నట్టు’గా ఆయా పార్టీల అగ్ర నాయకుడు లేదా అధినాయకురాలు పార్టీ అంతా తానుగా వ్యవహరించడం దశాబ్దుల చరిత్ర. జాతీయ పార్టీలు కావచ్చు, ప్రాంతీయ పార్టీలు కావచ్చు, ‘మఘ’లో పుట్టి ‘పుబ్బ’- పూర్వ ఫాల్గుని-లో మరో పార్టీలో కలిసిపోయే ‘చిత్ర’జీవుల పార్టీలు కావచ్చు.. సంస్థాగత ప్రజాస్వామ్యం ఈ పక్షాలకు తెలియని విద్య. కానీ ‘్భజపా’ ఈ సంస్థాగత ప్రజాస్వామ్యాన్ని దశాబ్దులుగా వ్యవస్థీకరించుకొని ఉంది. అనుకూలురు ఔనన్నా, ప్రత్యర్థులు కాదన్నా ఇది ‘్భజపా’ విలక్షణ అస్తిత్వంలో భాగం! అందువల్ల అమిత్ షా అంతటివాడు మరొకరు లేరన్న సాకుతో 2019నాటి లోక్‌సభ ఎన్నికల వరకు సంస్థాగతమైన ఎన్నికల ప్రక్రియను స్తంభింపచేయడం సైద్ధాంతిక నిష్ఠను నీరుకార్చడంతో సమానం. రెండేళ్లకోసారి చొప్పున వరుసగా మూడుసార్లు ఒకే వ్యక్తి అధ్యక్షుడుగా ఎన్నిక కావచ్చునట. అందువల్ల జనవరి నాటికి లేదా మార్చి నాటికి సంస్థాగతమైన ఎన్నికల ప్రక్రియను పూర్తిచేయవచ్చు. అమిత్ షాను మూడవసారి అధ్యక్షుడుగా ఎన్నుకోవచ్చు. అమిత్ షా ‘‘దగ్గరుండి’’ 2019నాటి ఎన్నికలలో పార్టీకి మళ్లీ సంఖ్యా బాహుళ్యాన్ని సాధించి పెట్టవచ్చు! కానీ, పార్టీలో సంస్థాగత ఎన్నికల ప్రక్రియను మొత్తం 2019 జూన్ తరువాతి కాలానికి వాయిదా వేసేశారట! ఇదేనా విలక్షణత? వైలక్షణ అస్తిత్వం..??
‘భజపా’ సాధించిన, సాధిస్తున్న విజయాలకు 1980వ, 1990వ దశకాలలో భూమికను సిద్ధం చేసిన వాడు లాల్‌కృష్ణ అద్వానీ. అయోధ్య రామమందిర పునర్ నిర్మాణ ఉద్యమం, ‘్భజపా’ విజయప్రస్థానం సమాంతర పరిణామాలు. 1990వ సంవత్సరం నాటికి అద్వానీ పార్టీలో తిరుగులేని నాయకుడు. కానీ ఆయన ‘పదవీ’కాలం 1990లో ముగిసింది. 1986లో అటల్ బిహారీ వాజపేయి అధ్యక్ష పదవి నుంచి విరమించాడు, అద్వానీ అధ్యక్షుడుగా ఎన్నికయ్యాడు. అప్పటి నియమావళి ప్రకారం ‘రెండేళ్ల’ అధ్యక్ష పదవిని ఒకే వ్యక్తి రెండుసార్లు మాత్రమే వరుసగా నిర్వహించగలడు. అందువల్ల ‘అంతటివాడైన’ అద్వానీ రెండుసార్లు కొనసాగిన తరువాత అధ్యక్ష పదవి నుంచి తప్పుకున్నాడు. 1991 జనవరిలో మురళీ మనోహర్ జోషి పార్టీ అధ్యక్షుడయ్యాడు. మూడవసారి తాను ‘పోటీ చేయడానికి’ వీలుగా అద్వానీ సంస్థాగత నియమాలను మార్పించలేదు.. 1991 ఏప్రిల్, మే నెలల్లో కూడ లోక్‌సభ ఎన్నికలు జరిగాయి. ఆ ఎన్నికలలో ‘దగ్గరుండి’ గెలిపిస్తానని అద్వానీ కోరలేదు. అద్వానీ కానీ, జోషి కానీ ‘అస్తిత్వం’ ఒకటే! అమిత్ షా కానీ, మరొకరు కాని ‘అస్తిత్వం’ ఒక్కటేనన్న నియమం ఇప్పుడు ఏమైంది?
*