సంపాదకీయం

‘స్వచ్ఛంద’ ద్రోహం..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఏడుగురు రోహింగియా ముస్లింలను వారి స్వదేశమైన బర్మాకు తిప్పి పంపరాదన్న అభ్యర్థనను సర్వోన్నత న్యాయస్థానం తిరస్కరించడం నకిలీ ‘స్వచ్ఛంద సంస్థల’కు చెంపపెట్టు. ఈ ఏడుగురూ బర్మా- మ్యాన్‌మార్- దేశపు పౌరులు. 2012లో మన దేశంలోకి అక్రమంగా చొరబడిన ఈ ఏడుగురినీ వారి స్వదేశానికి తిప్పి పంపడానికి ఆరేళ్లు పట్టడం వైపరీత్యం. గురువారం నాడు ఈ ఏడుగురినీ మన ప్రభుత్వ అధికారులు మణిపూర్‌లో సరిహద్దును దాటించి బర్మా అధికారులకు అప్పగించగలగడం గొప్ప చారిత్రక సంఘటన. ఎందుకంటె మన దేశంలోకి విదేశాల నుంచి చొరబడుతున్న వారిని పసికట్టి పట్టుకొనడం దశాబ్దుల తరబడి దాదాపు అసాధ్యమైపోయింది. పట్టుబడుతున్నవారు ‘శరణార్థి’ హోదాను పొంది ఏళ్లతరబడి మన దేశంలో తిష్ఠవేసి ఉండడం నడుస్తున్న చరిత్ర. ఇలా అక్రమ ప్రవేశకులను ‘శరణార్థులు’గా మార్చడానికి మన దేశంలోని కొన్ని రాజకీయ పక్షాల వారు, ‘స్వచ్ఛందం’ ముసుగు వేసుకొన్న దేశ వ్యతిరేక సంస్థల వారు, మానవ అధికార ‘పరిరక్షకులు’ కృషిచేస్తుండడం నడుస్తున్న చరిత్ర. రోహింగియా ముస్లింలను మన దేశంలోనే శాశ్వతంగా కొనసాగనివ్వాలన్న ఇలాంటి వారి ‘అంతరంగం’లో దేశ వ్యతిరేకత నక్కి ఉంది. ‘మానవీయత’ పేరుతో ఈ దేశ వ్యతిరేకులు ‘రోహింగియా’ ముస్లింల తరఫున ఉద్యమాలు చేస్తున్నారు, కోర్టులను ఆశ్రయించి రోహింగియాలను బర్మాకు తరలించే కార్యక్రమాన్ని అడ్డుకొంటున్నారు. గురువారం బర్మాకు తరలివెళ్లిన మహమ్మద్ జమాల్, ముక్కు బల్‌ఖాన్, సబీర్ అహ్మద్, మహమ్మద్ సలామ్, జమాల్ హుస్సేన్, మొహమ్మద్ రహీముద్దీన్, మొహమ్మద్ యూనస్ అనేవారు బర్మాలోని ‘అరకాన్’- రఖాయిన్- ప్రాంతానికి చెందినవారట! మన దేశంలోకి చొరబడిన ఈ ఏడుగురినీ 2012లో అస్సాం పోలీసులు నిర్బంధించారు. వీరు అక్రమ ప్రవేశకులని అస్సాంలోని సిల్చార్ జిల్లాలోని కచార్ కోర్టు నిర్ధారించింది. మూడు నెలలపాటు జైలులో ఉండిన ఈ ఏడుగురూ ఆ తర్వాత అక్రమ ప్రవేశకుల కోసం ఏర్పడిన శిబిరాలలో ఉన్నారు. తాము స్వదేశానికి తిరిగి రావడానికి అనుమతించాలని ఈ ఏడుగురూ బర్మా ప్రభుత్వానికి విజ్ఞప్తులు పంపారు. ఆ ప్రభుత్వం ఈ ఏడుగురూ స్వదేశానికి తిరిగి రావడానికి అనుమతినిచ్చింది. వీరందరూ తమ దేశం పౌరులని బర్మా ప్రభుత్వం అంగీకరించింది, మన ప్రభుత్వానికి తెలియచేసింది. ఇలా అక్రమ ప్రవేశకుల అభీష్టం మేరకు, బర్మా ప్రభుత్వం అనుమతితో మాత్రమే ఈ ఏడుగురు చొరబాటుదారులను మన ప్రభుత్వం దేశం బయటికి తరలించింది. ఈ ఏడుగురు తమ స్వస్థలమైన ‘అరకాన్’లోని ‘్భద్రపద కీటో’ గ్రామానికి సురక్షితంగా చేరారు. ఈ తరలింపును చొరబాటుదారులు కాని, బర్మా ప్రభుత్వం కాని వ్యతిరేకించలేదు. కానీ మన దేశంలోని కొందరు ‘హక్కుల రక్షకులు’ మాత్రం ఈ ఏడుగురినీ బర్మాకు తరలించడం ‘అమానవీయ చర్య’ అని ఆరోపించారు, సర్వోన్నత న్యాయస్థానం వారిని అభ్యర్థించారు, తరలింపును ఆపించమని ‘ఆక్రోశించారు..’, సుప్రీం కోర్టు వారిచే చీవాట్లు తిన్నారు..
ఇది ఉదాహరణ మాత్రమే! పాకిస్తాన్ ప్రేరిత జిహాదీ బీభత్సకారుల ‘హక్కుల’ రక్షణ కోసం ఇలాంటి నకిలీ ‘మానవీయత’ను ప్రదర్శిస్తున్నవారు దేశమంతటా ఉన్నారు. వీరు ప్రచ్ఛన్న బీభత్సకారులు. చైనా ప్రేరిత మావోయిస్టుల ‘మానవీయ అధికారాల’కు ఏ మాత్రం భంగం వాటిల్లరాదన్న లక్ష్యంతో ఉద్యమాలు, న్యాయ సంఘర్షణలు చేస్తున్నవారు దేశం నిండా మెండుగా ఉన్నారు. వివిధ రకాల బీభత్సకారులు పోలీసులను సైనికులను రాజకీయవేత్తలను అధికారులను సామాన్య ప్రజలను హత్యచేస్తూనే ఉన్నారు. ఈ నకిలీ ఉద్యమకారులకు ఇలా హత్యలకు గురవుతున్న వారి ‘హక్కుల’ సంగతి పట్టదు. కానీ బీభత్సకారులపై, అక్రమ ప్రవేశకులపై ‘ఈగలు’ సైతం వాలరాదు, నకిలీ ‘హక్కుల’ రక్షకులు ‘రోకలిబండల’ను ధరించి ‘రణరంగం’లో దూకేస్తున్నారు. బర్మాకు తరలి వెళ్లడం, తమ స్వస్థలాలకు తిరిగి వెళ్లడం ఏడుగురు అక్రమ ప్రవేశకుల అభీష్టం. కానీ వాస్తవాలను గుర్తించే ప్రయత్నం కూడ చేయని నకిలీ ‘హక్కుల’ రక్షకులు ఈ తరలింపును ఆపించడానికై కోర్టుకు వెళ్లారు.. నవ్వులపాలు కావడం వేఱు!
మన దేశంలో ప్రస్తుతం దాదాపు నలబయి వేల మంది ‘రోహింగియా’లు అక్రమంగా తిష్ఠవేసి ఉన్నారు. వీరందరూ దశాబ్దికి పైగా బర్మా నుంచి మన ఈశాన్య ప్రాంతంలోకి, అక్కడి నుంచి దేశంలోని ఇతర ప్రాంతాలలోకి చొరబడినవారు. హైదరాబాదు నగరంలోనే దాదాపు రెండువేల ఐదువందల మంది రోహింగియాలు చేరిపోయి ఉన్నారు, జమ్మూ కశ్మీర్‌లో దాదాపు ఆరువేల మంది తిష్ఠవేసి ఉన్నారట! ఈ నలబయి వేల మందిలో పదహారు వేల మంది ‘ఐక్యరాజ్యసమితి’ గుర్తింపును పొంది ఉన్నారట! ఈ నలబయివేల మందినీ తిరిగి బర్మాకు పంపించాలన్నది 2014 నుంచి మన ప్రభుత్వం చేస్తున్న వాదం. కానీ న్యాయస్థానాలలో ‘పిటిషన్’లు దాఖలు చేయడం ద్వారా ఈ ప్రయత్నాన్ని అడ్డుకొనడానికి ‘స్వచ్ఛంద’ ప్రహసనం నడుస్తుండడం సమాంతర పరిణామం! ‘రోహింగియాలు’ వారి స్వదేశానికి తిరిగి వెళ్లడం వల్ల ఎవరికి నష్టం? కానీ తరలించరాదని కోరుతూ సర్వోన్నత న్యాయస్థానంలో ‘పిటిషన్’లు దాఖలయ్యాయి. రోహింగియాలను వారి దేశానికి తిరిగి పంపించే వ్యవహారం తమ అధికార, విధాన పరిధిలోనిదని ఈ విషయమై న్యాయస్థానాలకు ప్రమేయం లేదని గత ఏడాది సెప్టెంబర్‌లో కేంద్ర ప్రభుత్వం సర్వోన్నత న్యాయస్థానానికి నివేదించింది. మన దేశంలో తిష్ఠవేసి ఉన్న తమ పౌరులను వెనక్కు రప్పించుకోవడానికి తమ ప్రభుత్వం సిద్ధంగాఉందని బర్మా ప్రభుత్వ నిర్వాహకురాలు- స్టేట్ కౌన్సిలర్- అంగసాన్ సూచీ కూడ గత ఏడాది సెప్టెంబర్‌లో స్పష్టం చేసి ఉంది! నిజమైన శరణార్థులు విదేశాల నుంచి స్వదేశానికి తిరిగి వెళ్ళాలని కోరుకోవడం సహజం. మరి ఎందుకని ఈ నలబయి వేల మందిలో అత్యధికులు - తొంబయి ఐదు శాతం- మన దేశంలోనే శాశ్వతంగా ఉండిపోవాలని భావిస్తున్నారు? వీరిలో కొన్ని వేల మంది భారతీయ పౌరులుగా చెలామణి కావడానికి సఫలయత్నాలు చేశారు, విఫలయత్నాలూ చేశారు. నకిలీ గుర్తింపు కార్డులను, నకిలీ ‘ప్రయాణ అనుమతి’- పాస్‌పోర్ట్- పత్రాలను, చివరికి ‘ఆధార్’ గుర్తింపుపత్రాలను సైతం అనేకమంది పొందగలగడం మన దేశ భద్రతకు ప్రమాదంగా మారిన విపరిణామం. ఈ సంగతిని ప్రభుత్వం పదే పదే చెబుతోంది. నిజమైన శరణార్థులకు నీడనివ్వడం అనాదిగా భారతీయ స్వభావం. కానీ ‘రోహింగియాలు’ శరణార్థులు కారు, చొరబడినవారు! ‘రోహింగియాల’లో- మన దేశంలో తిష్ఠవేసి ఉన్న వారిలో- వందలాది మందికి ‘లష్కర్ ఏ తయ్యబా’, ‘ఇరాకీ సిరియా ఇస్లాం రాజ్యం’- ఐఎస్‌ఐఎస్- వంటి జిహాదీ బీభత్స సంస్థలతో సంబంధాలున్నాయన్నది ధ్రువపడిన వాస్తవం!!
బర్మాలో అత్యధిక శాతం ప్రజలు బౌద్ధులు. ‘అరకాన్’ ప్రాంతంలో మాత్రం ఇస్లాం మతస్థులు అధిక సంఖ్యలో ఉన్నారు. ‘అరకాన్’- రఖాయిన్- ప్రాంతాన్ని బర్మా నుంచి విడగొట్టి ప్రత్యేక స్వతంత్ర ఇస్లాం మతరాజ్యంగా ఏర్పాటుచేయాలన్నది ‘రోహంగియా’ జిహాదీలు 1948నుంచి సాగిస్తున్న కుట్ర!! 1947లో ‘అఖండ భారత్’నుంచి పాకిస్తాన్ విడిపోయి ఇస్లాం మత రాజ్యంగా ఏర్పడడం ఈ జిహాదీలకు ‘స్ఫూర్తి..’ కానీ బర్మాలో ఈ మతోన్మాద షడ్యంత్రం బెడిసికొట్టింది, బర్మా ప్రభుత్వం ‘జిహాదీ’లను కఠినంగా అణచివేసింది. ‘జిహాదీ’లకు వ్యతిరేకంగా బర్మా ప్రభుత్వం తీసుకున్న చర్య సామాన్య ముస్లింలకు వ్యతిరేకంగా జరిగిన ‘దమనకాండ’గా ప్రచారం కావడం వాస్తవాల వక్రీకరణకు పరాకాష్ఠ. లేని భయం ఉన్నట్టుగా అభినయిస్తున్న ‘రోహింగియా’లు, ఇరుగు పొరుగు దేశాలలోకి చొరబడడం దశాబ్దుల ప్రహసనం..