సంపాదకీయం

ఊపిరాడని విద్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రభుత్వేతర సంస్థలు కొనసాగిస్తున్న విద్యా వ్యాపారంలో నిహితమై ఉన్న అక్రమాలకు ఇది మరో ఉదాహరణ మాత్రమే. పదిహేడు వం దల ప్రభుత్వేతర పాఠశాలల యాజమాన్యాలకు వ్యతిరేకంగా ‘సీబీఎస్‌ఈ’ వారు చర్య తీసుకోనున్నారట! అక్రమాన్ని ఏళ్ల తరబడి కొనసాగిస్తున్న ఈ ప్రభుత్వేతర పాఠశాలలు దేశమంతటా విస్తరించి ఉన్నాయి. ఈ పాఠశాలలు ‘సీబీఎస్‌ఈ’- సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్- కేంద్రీయ మాధ్యమిక విద్యామండలి-కి అనుబంధంగా నడుస్తున్నాయి. ఒక తరగతి ‘విభాగం’- సెక్షన్-లో విద్యార్థుల సంఖ్య నలబయికి మించి ఉండరాదన్నది ‘సీబీఎస్‌ఈ’ నిబంధన. ఈ నిబంధనను ఈ పదిహేడు వందల ప్రభుత్వేతర పాఠశాలల యజమానులు ఉల్లంఘించారన్నది ‘సీబీఎస్‌ఈ’ అధికారులు ఇప్పుడు పరిశోధించి కనిపెట్టిన నేరం. ఎన్ని సంవత్సరాలుగా ఈ విద్యా వ్యాపారులు ఇలా నిబంధనలను ఉల్లంఘించారన్నది మాత్రం వెల్లడి కాలేదు. ఒక్కొక్క ‘సెక్షన్’లో యాబయి, అరవైమంది పిల్లలను కుక్కి విద్యాబోధన అభినయాన్ని సాగిస్తున్న పాఠశాలలు దేశంలో ఇంకా ఎన్ని ఉన్నాయన్నది కూడ ఎప్పటికీ బయటపడదు. ఎందుకంటె ప్రభుత్వేతర విద్యాసంస్థల్లో ‘దోచుకునే స్వభావం’ నిహితమై ఉంది. ప్రభుత్వ యంత్రాంగంలో నిర్లక్ష్యం, అవినీతి నిహితమై ఉన్నాయి. అందువల్ల క్రూర నిర్లక్ష్య స్వభావులైన ప్రభుత్వ అధికారులు మన్నుతిన్న పాముల వలే కదలరు, మెదలరు. నిజాయితీగా విధులను నిర్వహించే ప్రభుత్వ విద్యాధికారుల సంఖ్య బహు తక్కువ. అలాగే పిల్లలను మంచి పౌరులుగా తీర్చి దిద్దాలన్న లక్ష్యంతో పాఠశాలలను నడిపిస్తున్న ప్రభుత్వేతర యజమానుల సంఖ్య చాలా తక్కువ. విద్యార్థులను మాతృభూమి పట్ల, మాతృ సంస్కృతి పట్ల మమకారం కల మానవులుగా తీర్చిదిద్దాలన్న లక్ష్యంతో పనిచేస్తున్న ప్రభుత్వేతర, స్వచ్ఛంద, జాతీయతా సంస్థలు కూడా ఉన్నాయి. అలాంటి సంస్థల సంఖ్య మరీ తక్కువ. వాటి ప్రభావం చాలా పరిమితం. విద్యాసంస్థలను వ్యాపార కేంద్రాలుగా మలచుకొని జనాన్ని దోపిడీ చేస్తున్న నీచ నికృష్ట స్వభావం కల యజమానుల సంఖ్య చాలా ఎక్కువ! ‘సెక్షన్’లో ఒక విద్యార్థి పెరిగినా చాలు అదనంగా సాలీనా వేల రూపాయలు దోచుకోవచ్చు.. అన్న వికృత చిత్తవృత్తి కల యజమానులు దేశమంతటా ఉన్నారు. నలబయికి మించిన విద్యార్థుల కోసం వీరు అదనపు విభాగాలను తెరవరు. అదనపు విభాగం-సెక్షన్- ఏర్పడితే అదనంగా బోధన సిబ్బందిని నియమించాలి, వారికి జీతాలు ఇవ్వాలి! సెక్షన్లలో సంఖ్యను పెంచి ‘బుడుతల’ను ఊపిరి సలుపని ఇరుకు గదుల్లో గంటలపాటు నిర్బంధిస్తున్నారు. ఇలా ‘సెక్షన్’లో నలబయి కంటె ఎక్కువ సంఖ్యలో బాలబాలికలను బందీలను చేస్తున్న కక్కుర్తి యాజమాన్యాలను ప్రభుత్వ అధికారులు, నిర్లక్ష్య స్వభావులు కనిపెట్టరు. కనిపెట్టిన ‘చురుకైన’ అధికారులలో అత్యధికులకు ప్రభుత్వేతర పాఠశాలల యాజమాన్యాల వారు లంచాలను మప్పడం కూడ వ్యవస్థలో భాగమైపోయింది. ఈ నిర్లక్ష్యాన్ని, అవినీతిని అతిక్రమంచి ఇప్పుడిలా పదిహేడు వందల విద్యాసంస్థలు పట్టుబడడమే మహా విషయం..
ఇలా పట్టుబడిన ప్రభుత్వేతర సంస్థల విద్యా వ్యాపారులకు- ప్రతి సెక్షన్‌లోని ప్రతి అదనపు విద్యార్థికి ఐదువందల రూపాయల చొప్పున- ‘సీబీఎస్‌ఈ’ వారు జరిమానా విధించనున్నారట! ఇది కనీసపుశిక్ష. ఇంకా ఎక్కువ మొత్తం కూడ జరిమానాగా విధించవచ్చునట! విద్యార్థికి వెయ్యి రూపాయల చొప్పున అయినా, ఇంకా ఎక్కువ అయినా కూడ ప్రభుత్వేతర విద్యా వ్యాపారులు జరిమానా చెల్లించగలరు. ఎందుకంటె విద్యార్థుల తల్లిదండ్రుల వద్ద ఈ దుర్మార్గపు పాఠశాలల యజమానులు శుల్కం-్ఫజు- రూపంలో అంతకు పదిరెట్లకు పైగా దండుకొని ఉంటారు. ‘సీబీఎస్‌ఈ’ నిర్థారిత పాఠ్య ప్రణాళికను బోధించే పాఠశాలల్లో తమ పిల్లలు చదివినట్టయితే వారు గొప్ప ప్రతిభావంతులు కాగలరన్నది తల్లిదండ్రుల విశ్వాసం. ఇది విశ్వాసం కావచ్చు.. కేవలం భ్రాంతి కావచ్చు. కొందరు విద్యార్థుల విషయంలో ఇది నిజం కావచ్చు. ఏమైనప్పటికీ ‘సీబీఎస్‌ఈ’ అనుబంధ పాఠశాలల్లో చదివించి తీరాలన్న తపన, తహతహ నానాటికీ పెరుగుతున్నాయి. దేశవ్యాప్తంగా దాదాపు ఇరవై రెండు వేల ప్రభుత్వేతర పాఠశాలలు ‘సీబీఎస్‌ఈ’కి అనుసంధానమై ఉండడానికి ఇదీ కారణం. అందువల్ల ‘డిమాండ్ అండ్ సప్లయ్’- గిరాకీ, లభ్యత- ప్రాతిపదికగా ధరలు నిర్ధారితవౌతున్న ‘స్వేచ్ఛా విపణి’- మార్కెట్ ఎకానమీ- మాయాజాలం విద్యారంగాన్ని కూడ ఆవహించిపోయింది. పెరుగుతున్న ‘గిరాకీ’ని సొమ్ము చేసుకుంటున్న విద్యా వ్యాపారులు ‘సీబీఎస్‌ఈ’ పాఠశాలల్లో ప్రవేశించే విద్యార్థుల నుంచి ‘శుల్కం’ మాత్రమే కాక రకరకాల ‘నిధుల’ పేరుతో భారీగా దండుకుంటున్నారు. తమ పిల్లలకు ‘సీబీఎస్‌ఈ’ అనుబంధ బడుల్లో ప్రవేశం లభిస్తే చాలని మురిసిపోతున్న మధ్య తరగతి తల్లిదండ్రులు ప్రభుత్వేతర యజమానులు కోరినంత సొమ్ము చెల్లిస్తున్నారు. లక్షల రూపాయలు బొక్కి బలిసిన విద్యా ‘బకాసుర’ యజమానులు సీబీఎస్‌ఈ విధించే జరిమానాలను సంతోషంగా చెల్లించగలరు. మరుసటి రోజు నుంచి మళ్లీ ‘సెక్షన్ల’లో వీలైనంత ఎక్కువ మంది విద్యార్థులను కూరేయగలరు..
పదిహేడు వందల ప్రభుత్వేతర పాఠశాలల గురించి సీబీఎస్‌ఈ ఈ ‘నియమోల్లంఘన’ సమాచారాన్ని సేకరించగలిగింది. మిగిలిన దాదాపు ఇరవై వేల పాఠశాలల్లో ఎంతమంది యజమానులు నియమాలను ఉల్లంఘిస్తున్నారన్నది ఎవరు కనిపెట్టగలరు? నియమాలను ఉల్లంఘించిన పాఠశాలల గుర్తింపును రద్దు చేసినట్టయితే అది మిగిలిన పాఠశాలల వారికి నేరనిరోధకం- ‘డిటరెంట్’-గా పనిచేయగలదు. కానీ అలాంటి తీవ్రమైన శిక్షలను అమలు జరుపగల కాలం చెల్లిపోయింది. ‘సంక్షేమ విపణి’- వెల్ఫేర్ ఎకానమీ- భారత జాతీయ జీవన వ్యవస్థకు ప్రాతిపదిక. ఈ వ్యవస్థ విస్తరించి ఉండిన వేల లక్షల ఏళ్లపాటు విద్యాబోధన మన దేశంలో వ్యాపారం కాలేదు. ఈ సంక్షేమ ఆర్థిక వ్యవస్థ కొనసాగాలన్నది మాత్రమే భారత రాజ్యాంగ స్ఫూర్తి! ప్రభుత్వ పాఠశాలలు విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా నిరంతరం విస్తరించాలి. బ్రిటన్ దురాక్రమణ కొనసాగిన సమయంలో యుగయుగాల నాటి ఉచిత విద్యాబోధన వ్యవస్థ అంతరించింది. ప్రభుత్వ పాఠశాలల్లోను, ఉన్నత విద్యాసంస్థల్లోను భారీగా ఫీజులను వసూలు చేశారు. ఫీజులు కట్టలేని నిరుపేదలు, మధ్య తరగతి వారు పాఠశాల, కళాశాల విద్యలకు దూరమయ్యారు. కానీ గ్రామీణ, పట్టణ ప్రాంతాలలో మాత్రం ప్రభుత్వేతర ‘సంప్రదాయ’ అధ్యాపకులు ఉచితంగానే ప్రాథమిక విద్యలను బోధించారు. అలాంటి అధ్యాపకులు, అయ్యవార్లు నిజానికి నిరుపేదలు. తాము కూడ తమ గురువుల వద్ద ఉచితంగా చదువుకొన్నవారు. అందువల్ల సమాజం పట్ల కృతజ్ఞతతో ఈ సంప్రదాయ పండితులు పిల్లలకు ఉచితంగానే చదువు చెప్పారు. అలాంటి నిరుపేదలైన, జీతాలు లేని ఉపాధ్యాయులను సమాజం-గ్రామం- సమష్టిగా పోషించింది. శరన్నవరాత్రుల సందర్భంలోను, ఇతర పండుగల సందర్భంలోను ఈ ఉపాధ్యాయులు విద్యార్థులతో కలసి గ్రామ సంచారం చేశారు. ప్రతి గృహస్థుడు స్వచ్ఛందంగా తన ఆర్థిక స్థాయిని బట్టి అధ్యాపకులకు ‘దక్షిణ’ సమర్పించేవాడు! ‘అయ్యవారికి చాలు ఐదు వరహాలు, పిల్లవాండ్లకు చాలు పప్పు బెల్లాలు..’ వంటి ‘సంచార’ గీతాల ఆలాపనకు తరతరాల ఈ ‘సంక్షేమ విపణి’ ప్రాతిపదిక! దీన్ని ‘నల్లని హృదయాల’ తెల్లని చర్మం వారు- బ్రిటన్ ముష్కరులు- ధ్వంసం చేసిపోయారు. ‘ప్రపంచీకరణ’ వల్ల ‘సంక్షేమ ఆర్థిక వ్యవస్థ’ను ‘స్వేచ్ఛా వాణిజ్యం’- మార్కెట్ ఎకానమీ- దిగమింగింది..
‘స్వేచ్ఛా విపణి’కి ప్రజల సంక్షేమం అక్కరలేదు. ‘లభ్యత’, ‘గిరాకీ’ ఆధారంగా ధరలను నిర్ణయించి దోచుకోవడం మాత్రమే ‘హృదయం లేని’ వాణిజ్య మేధకు తెలిసిన విజ్ఞానం.. ఒకప్పుడు సంపన్నులు స్వచ్ఛందంగా ‘విద్యల కోసం’ నిధులు సమర్పించారు. ఇప్పుడు ‘సంపన్నులు’ విద్యా వ్యాపారం చేసి దోచుకొని మరింత సంపాదన పెంచుకుంటున్నారు! ‘మథనం’ జరగాలి..