సంపాదకీయం

‘అవిరళ’ గంగ..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గంగోత్రి నుంచి సాగర సంగమ స్థలి వరకు గంగానది నిరంతరం ప్రవహించడానికి వీలైన చర్యలను కేంద్ర ప్రభుత్వం చేపట్టడం పర్యావరణ పరిశుభ్రతకు దోహదం చేయగల పరిణామం. గంగోత్రి నుంచి హరి ద్వారం వరకు, హరి ద్వారం నుంచి కాన్పూర్ వరకు, పాట్నా వరకు, కలకత్తా వరకు, సముద్రం వరకు వివిధ ప్రదేశాలలో వివిధ ఋతువులలో గంగ అవిరళంగా ప్రవహించాలన్నది ప్రభుత్వ విధానమని నీటి వనరుల మంత్రి నితిన్ గడ్కరీ చెప్పిన మాట! మొత్తం గంగ నీటిలో కనీసం ఇరవై శాతం నిరంతరం ప్రవహిస్తూనే ఉండాలన్నది బుధవారం నాడు కేంద్ర ప్రభుత్వం ఆవిష్కరించిన అధికార విధానం. ఈ విధానానికి అనుగుణమైన ఆధికారిక కార్యాచరణ ప్రకారం- గంగానదిపై వెలసి ఉన్న ప్రతి జలాశయం నుండి కనీసం ఇరవై శాతం నీటిని దిగువకు వదలిపెడుతూనే ఉండాలి! ఇలా వదలిపెట్టే నీటి పరిమాణం వర్ష ఋతువులో కనీసం ముప్పయి ఐదు శాతం! పర్యావరణ పరిరక్షణకు నదీ ప్రవాహాలు దోహదం చేయగలవన్న వాస్తవం ఇలా పునరావిష్కృతమైంది. గంగానదీ ప్రవాహ పరిరక్షణ కోసం, నీటి స్వచ్ఛతను నిలబెట్టడం కోసం ధర్మాచార్యుడైన జ్ఞాన స్వరూపనంద స్వామి జీవన పరిత్యాగం చేయడం కేంద్ర ప్రభుత్వ నిర్ణయానికి సమాంతర పరిణామం. ఎనబయి ఆరు ఏళ్ల జ్ఞాన స్వరూపస్వామి 2011లో సన్యాసం స్వీకరించక పూర్వం వారి పేరు జి.డి.అగ్రవాల్. కాన్పూర్‌లోని ‘్భరతీయ స్థాపత్య విజ్ఞాన సంస్థ’- ఐఐటి-లో ఆచార్యుడుగా పనిచేసి పదవీ విరమణ చేసిన ఈ ధర్మాచార్యుడు గత జూన్ 22వ తేదీ నుంచి గంగానది పరిరక్షణ కోసం నిరవధిక నిరశన వ్రతం చేశాడు. కొన్ని చుక్కల తేనె, మంచినీరు మాత్రమే ఆయన ఈ వ్రత సమయంలో క్రోలాడు. మంగళవారం నీటిని తాగడం కూడ మానుకున్న స్వామిని హరిద్వారంలోని దీక్షా స్థలం నుంచి హృషీకేశంలో వైద్యశాలకు బలవంతంగా అధికారులు తరలించారట. గురువారం నాడు ఈ ధర్మాచార్యుడు శరీర పరిత్యాగం చేశాడు. బుధవారం ప్రభుత్వం గంగా పరిరక్షణ నియమావళిని ప్రకటించడం ఆయన సాధించిన విజయం! అవిరళ ప్రవాహమై అలరారడం నది సజీవత్వానికి నిదర్శనం. ‘‘అవిరళం’’గా- ఎడతెగకుండా- నీరు కదలుచున్నప్పుడే ‘ఏఱు’ జీవనది కాగలదు. గంగానది ప్రతీక మాత్రమే! గంగానది యుగయుగాలుగా అవిరళ ప్రవాహమై కొనసాగుతుండడం భారతదేశం అవని ప్రజలకు అన్నప్రదాత అయిన చరిత్రకు ప్రాతిపదిక, భారతదేశం అవనీతలంలో అన్నపూర్ణ కావడానికి ప్రధాన భూమిక. గంగానది మాత్రమే కాదు ఆమెతోపాటు దేశంలోని ప్రధాన నదులన్నీ నిరంతరం ప్రవహించిన సమయంలో మన దేశంలో తిండికి, స్వచ్ఛతకు కొరత ఏర్పడలేదు. ఈ దేశం పట్ల మాతృ మమకారం లేని విదేశీయ జిహాదీ బీభత్సకారులు, ఐరోపా దురాక్రమణకారులు దేశాన్ని కొల్లగొట్టిన అనేక శతాబ్దుల కాలంలో నదులు ఎండిపోయాయి, దేశంలోని పల్లెలు పట్టణాలు కరవుకాటకాలతో నిండిపోయాయి, అడవులు ధ్వంసమయ్యాయి! బ్రిటన్ వ్యతిరేక స్వాతంత్య్ర ఉద్యమ కవి ‘గరిమెళ్ల’ ఎలుగెత్తినట్టు-
‘‘పనె్నండు దేశాలు పండుచున్నా కానీ
పట్టడన్నమె లోపమండీ...
ఉప్పు ముట్టుకుంటే దోషమండీ!
అయ్యో! కుక్కలతో పోరాడి
కూడు తింటామండి...
మాకొద్దీ తెల్లదొరతనము, దేవ...!’’
బ్రిటన్ తస్కరులు నిష్క్రమించిన తరువాత కూడ ఆ ముష్కరుల ‘విధాన వారసత్వం’ దశాబ్దుల తరబడి కొనసాగుతుండడం కాలుష్యాన్ని పెంచిన విపరిణామం! సర్వజన శ్రేయస్సును సాధించిన వికేంద్రీకృత ప్రగతి దేశమంతటా విస్తరించడం తరతరాల భారతీయత! ఈ వికేంద్రీకృత వ్యవస్థను ధ్వంసం చేసి ప్రగతిని కొన్ని నగరాలకు పరిమితం చేసిన ‘కేంద్రీకరణ’ను బ్రిటన్ దొరలు వ్యవస్థీకరించి పోయారు. ఈ కేంద్రీకృత వ్యవస్థ కాలుష్యాన్ని కేంద్రీకరించింది. ఈ కాలుష్యం భౌతికమైనది, మానసికమైనది. మానసిక కాలుష్యం మన జీవన స్వచ్ఛతను మలినపరచింది. మానసిక కాలుష్యం భౌతిక కాలుష్యానికి ప్రాతిపదిక.. ‘‘ఎప్పుడు ఎడతెగక పారు ఏఱు’’ఉన్న ఊరిలోనే జీవించాలన్నది సుమతీ శతకకారుడు ఆవిష్కరించిన భారతీయ జీవన సత్యం! ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం మళ్లీ ఈ ‘అవిరళ’- ఎడతెగని- ప్రవాహ ప్రభావాన్ని గుర్తించగలగడం హర్షణీయ పరిణామం! ‘అవిరళత’ ‘అమలినత’కు ప్రాతిపదిక! నీటి స్వచ్ఛత పర్యావరణ స్వచ్ఛత స్థాయికి గీటురాయి. ‘నదీ వేగేన శుద్ధ్యతే...’ - నదీ జలం ప్రవహించడం వల్ల పరిశుద్ధమవుతుంది. ఇలా సహజశుద్ధి ప్రక్రియ కొనసాగాలంటే నది నిరంతరం ప్రవహించాలి! ‘కానీ చుక్క నీరు కూడ సముద్రం పాలు కారాదు’ అన్న ప్రగతి భ్రమకు గురి అయిన కుహనా విజ్ఞానవేత్తలు, అయోమయం రాజకీయవేత్తలు ఆనకట్టల పేరుతో అడ్డకట్టలు కట్టి నదులను ఎక్కడికక్కడ ఎండ గట్టేశారు! పర్యావరణంలో వేడి పెరగడానికి ఇదీ ఒక కారణం! సేద్యపునీటి కోసం, మంచినీటి కోసం, జలవిద్యుత్ ఉత్పత్తికోసం నదులపై ఆనకట్టలు కట్టి జలాశయాలను నిర్మించవలసిందే! కానీ నిర్మాణాలు ‘దూడల’కు పాలను వదలి ఆవు‘పొదుగు’ను పితికే పద్ధతిలో సాగాలన్నది ప్రభుత్వం మళ్లీ గుర్తించిన నిజం. తరతరాల పర్యావరణ పరిరక్షణ సూత్రం!
గంగానదిలో మాత్రమే కాదు దేశంలోని ప్రతి నదిలోను నిరంతరం నీరు ప్రవహించవలసిందే- అని మంచినీటి వ్యవహారాల మంత్రి ఉమాభారతి ప్రకటించడం ఈ పర్యావరణ పరిరక్షణక సూత్రానికి అనుగుణమైన పరిణామం.. సహజమైన జలప్రవాహాలు నదులుగా, ఉప నదులుగా, గిరిసీమలలోని ఝరులు- కొండ వాగులుగా, వనసీమలలోని ‘సరిత’- సెల ఏఱులుగా, జలపాతాలుగా భరతభూమిని అభిషేకించడం సనాతన చరిత్ర. వేదద్రష్టలు, ఇతర ఋషిమునులు, వనజనులు ఈ నదులలో సెలఏళ్లలో జలపాతాలలో స్నానం చేశారు, పానం చేశారు. నదీ జలప్రవాహాలు జాతీయ జీవన సాంస్కృతిక స్రోతస్వినికి సంస్కార జలాలను సమకూర్చిన చరిత్ర మనది. వేల మంది ఋషిమునులు కోట్లమంది వనజనులు, జాన పదులు, గ్రామీణులు సూర్యోదయం కంటె ముందు నిద్రలేచి ఈ జీవధారలలో జలకమాడిన దృశ్యాలు మన సంస్కార భూమికపై నిరంతరం ఆవిష్కృతమయ్యాయి. ‘సాయంతన సమయమైంది... ఆ బాటసారి ఆ కొండవాగులో స్నానం చేశాడు... సంధ్యావందనం చేశాడు...’’, ‘‘సాయంకాలమైంది, ఆ బాటసారుల కుటుంబం వారు ఆ సెలఏటి పక్కన విడిది చేశారు, విశ్రమించారు, వండుకున్నారు, పండుకున్నారు...’’ ఇలాంటి కథనాలు, ఘటనలు భారతీయ జనజీవన నిహితం కావడం యుగయుగాల ప్రస్థానం! ఈ నదులు, వాగులు, సెలఏళ్లు, జలపాతాల వల్ల అడవులలో కొండలలో అసంఖ్యాకంగా జలాశయాలు ఏర్పడినాయి. చెలమలు, మడుగులు, కొలనులు, గడుగులు, పడియలు, బుగ్గలు- ఇలా ఎక్కడికక్కడ జలాశయాలు ఏర్పడి ఉండడం చరిత్ర! అంతేకాదు, ప్రవాహ జలం వల్ల ప్రతి పల్లెలోను చెఱువులు, కుంటలు నిండాయి, భూగర్భజలాలు పుష్కలమై పంట బావులలోను ఇంటి బావులలోను నీరు సమృద్ధిగా లభించేది!
నీరు భూమిని పునీతం చేయాలి, పునీతమైన భూమి నన్ను, మమ్ములను పునీతం చేయాలి- ఆపఃపునన్తు పృథివీ, పృథివీ పూతా పునాతుమామ్’’- అన్న వేద వాక్యం పర్యావరణంలో నిహితమై ఉన్న సహజ ప్రక్షాళన ప్రక్రియకు అద్దం.. కానీ మైదాన ప్రాంతంలోని ‘సెలఏఱులు’ ఎండిపోయి దశాబ్దులైంది, ఒరిస్సాలోని నియాంగిరి, మహేంద్రగిరి ప్రాంతాలలో ‘బహుళ జాతీయ సంస్థల’- మల్టీ నేషనల్ కంపెనీస్- జరిపిన అక్రమ వాణిజ్య కలాపాల వల్ల, తవ్వకాల వల్ల కొండవాగులు ఎండిపోయాయి. వనవాసీ ప్రజలు నీటికి దూరమై నిర్వాసితులయ్యారు. కొండవాగులు, సెలఏళ్లు ఎండిపోవడం వల్ల వన్యప్రాణుల గొంతులెండిపోయాయి. పల్లెసీమలలో గొట్టపుబావుల వల్ల సహజ జలాశయాలు ఎండి పోయాయి.. పక్షులకు, ఉడుతలకు, పిచ్చుకలకు నీటి చుక్క దొరకని స్థితి నెలకొని ఉంది. ఇన్నాళ్లకు మళ్లీ ప్రభుత్వానికి నిజం గుర్తుకు రావడం జ్ఞాన స్వరూపస్వామి శరీర త్యాగ ఫలితం, నిరశన వ్రత ఫలితం. గంగానది మాత్రమే కాదు దేశంలోని అన్ని నదులు ఇకనైనా నిరంతరం జల వాహినులు కావాలి..