సంపాదకీయం

జీవ ‘వైరుధ్యం’!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భూమాతను ప్రభుత్వాలు ‘హరిత హారాల’తో అలంకరిస్తున్నాయి. నదుల అనుసంధానం కొనసాగుతోంది, గోదావరి జలాలు కృష్ణవేణీ ప్రవాహాన్ని మరింతగా పరుగులెత్తిస్తున్నాయి. నర్మదా నది పొడవునా నదికిరువైపులా చెట్లను పెంచుతున్నారట, హరిత ప్రాంగణాలు, ఆకుపచ్చని ఆటస్థలాలు, రాజపథాలు, రహదారులు రూపొందుతున్నాయి. ఎండిన చెఱువులను నిండించేందుకు ‘కాకతీయ’ వంటి ఉద్యమాలు నడుస్తున్నాయి. పశ్చిమ కనుమలలో ప్రకృతి అందాలను పదిలంగా ఉంచడానికి పథకాలు అమలు జరుగుతున్నాయి. యాబయి ఏడు వేల చదరపుకిలోమీటర్ల ప్రాంతంలో గడ్డిపోచను సైతం పెకలించడానికి వీలులేదన్నది కేంద్ర ప్రభుత్వం సరికొత్తగా రూపొందించిన పర్యావరణ పరిరక్షణ ముసాయిదా పత్రంలోని ప్రధాన అంశం! సిక్కిం ఇదివరకే సంపూర్ణ సర్వసమగ్ర సేంద్రియ వ్యవసాయ క్షేత్రంగా మారిపోయిందట. ఆంధ్రప్రదేశ్ కూడ సమగ్ర సేంద్రియ వ్యవసాయ హరిత ప్రాంగణంగా అలరారబోతోందట.. ప్రచారం జరుగుతోంది. 2029 నాటికి ఆంధ్రప్రదేశ్‌లోని మొత్తం భూమిలోని యాబయి శాతం ‘సతత హరిత సాంద్ర అరణ్యం’గా మారనున్నదట. మూసీనదికి మళ్లీ సుమధుర స్వచ్ఛ జలాలతో ప్రాణం పోయడానికి తెలంగాణ ప్రభుత్వం కటిబద్ధ అయి ఉంది. అనంతగిరి అడవులలోని ఓషధులతో కలసిన అమృత జలాలు ఈ ముచికుందలో మళ్లీ ప్రవహిస్తాయి.. పరీవాహ ప్రాంతంలోని ప్రజల- ప్రత్యేకించి భాగ్యనగర వాసుల- ఆరోగ్యాన్ని ఆయుర్దాయాన్ని పెంపొందించనున్నాయి. గంగోత్రి నుంచి ‘వంగ రత్నాకరం’- బే ఆఫ్ బెంగాల్- వరకూ గంగానది అన్ని ఋతువులలోను ‘అవిరళం’గా అంటే ఎడతెగకుండా ప్రవహించడానికి వీలైన పథకాన్ని కూడ కేంద్ర ప్రభుత్వం సిద్ధం చేసింది. ‘అవిరళ’గంగ స్ఫూర్తితో దేశంలోని అన్ని ప్రధాన నదులు కూడ మండు వేసవిలో సైతం ఎంతోకొంత నీటితో నిండి ఉండాలన్నది ‘అధికార ఆకాంక్ష’.. మరోవైపు జీవ వైవిధ్య పరిరక్షణ సమావేశాలు, పర్యావరణ సదస్సులు నిరంతరం జరుగుతూనే ఉన్నాయి. ప్రసంగాలు, పథకాలు, కార్యాచరణలు, ప్రగతి నివేదికలు పరస్పరం పోటీ పడుతున్నాయి. హైదరాబాద్‌లో ‘విత్తనాల సదస్సు’ విజయవంతమైంది, అంతర్జాతీయ ‘హరిత నిర్మాణాల సదస్సు’- గ్రీన్ బిల్డింగ్ కాంగ్రెస్- ఆరంభమైంది, నవంబర్ మూడవ తేదీవరకు జరుగుతుందట.. ఇదంతా ప్రకృతిలోని జీవ వైవిధ్యాలను పరిరక్షించడం కోసం, పెంపొందించడం కోసం జరుగుతున్న కృషి! ‘‘నమామి గంగే’’ పేరు- గంగానది నీటిని శుభ్రపరచడానికి కేంద్ర ప్రభుత్వం అమలు జరుపుతున్న పథకానికి పరాకాష్ఠ..
కాలుష్య నిర్మూలన కార్యక్రమాలు ఇలా అమలు జరుగుతున్న సమయంలోనే, ఆకాంక్షలు కొన్ని సాకారం అవుతున్న తరుణంలోనే కాలుష్యం భయంకరంగా విస్తరిస్తుండడం సమాంతర పరిణామ క్రమం... మన దేశంలోని వ్యవసాయ భూమి జీవ వైవిధ్యాన్ని కోల్పోయిందన్నది ఈ విపరిణామ క్రమంలోని వర్తమాన ఆవిష్కరణ. వ్యవసాయ భూమి నిర్జీవమై నిస్సారమైపోతోందన్నది ‘ప్రపంచ ప్రకృతి నిధి’- వరల్డ్‌వైడ్ ఫండ్ ఫర్ నేచర్- సంస్థవారి నిర్ధారణ! తమిళనాడు వ్యవసాయ విశ్వవిద్యాలయం తదితర పర్యావరణ సంస్థల అధ్యయనాల ప్రాతిపదికగా ఈ ‘ప్రకృతి నిధి’ వారు ‘అంతర్జాతీయ భూసార వైవిధ్య’ నివేదికను రూపొందించారట. భూసారం కొట్టుకొనిపోవడం వల్ల, అడవుల విధ్వంసం వల్ల, విపరీతంగా కృత్రిమ రసాయనపు ఎఱువులను వేసి సాలీనా ఒకే భూమిలో మూడు పంటలను పండించడం వల్ల, ఇతర కాలుష్యాల వల్ల భూమి జీవ వైవిధ్యాన్ని కోల్పోయినట్టు ఈ ‘నివేదిక’లో నిర్ధారించారట. ప్లాస్టిక్ వినియోగం విస్తృతంగా విస్తరించడం, పారిశ్రామిక వ్యర్థపదార్థాలు నీటిలోను పర్యావరణంలోను కలసి భూమిలోకి ఇంకిపోవడం మన దేశపు భూగర్భ కాలుష్యాన్ని ఉపరితల కాలుష్యాన్ని పెంచుతున్న పరిణామాలు. ఈ కాలుష్యం కారణంగా భూమి నిర్జీవమైపోయి వ్యవసాయానికి పనికి రాకుండాపోయే ప్రమాదం దాపురించి ఉందన్నది నివేదికలోని నిర్ధారణ..
వ్యవసాయ భూమి కాలుష్యవంతం కావడానికి ఇతర కాలుష్యాలు దోహదం చేస్తున్నాయి. నీరు, పర్యావరణం కాలుష్యం కావడానికి ప్రధాన కారణాలు ప్లాస్టిక్ వ్యర్థాలు, పారిశ్రామిక వ్యర్థాలు, పనికిరాని పాడైపోయిన మందులు. ప్రపంచంలోని సముద్ర తీరాలలోను సముద్ర పరిసరాలలోను విస్తరిస్తున్న పక్షులలో తొంబయి శాతం ‘ప్లాస్టిక్’ను తింటున్నాయట- ఆహారంతో కలిసి. వాటి పొట్టల నిండా ‘ప్లాస్టిక్’ కణాలు పేరుకొనిపోతున్నాయి. ఫలితంగా అవి అకాల మరణం పాలవుతున్నాయి. గడ్డితోను మేతతోను కలసీ, విడిగానూ ‘ప్లాస్టిక్’ను మేస్తున్న ఆవులు, ఇతర పాడి పశువులు ఉదర వ్యాధులకు గురై అకాల మరణం పాలవుతున్నాయి. కొన్ని నగరాలలోను పట్టణాలలోను జీవకారుణ్య ఉద్యమకారులు ఆవుల పొట్టలకు శస్త్ర చికిత్సలుచేసి, చేయించి ‘ప్లాస్టిక్’ ముద్దలను బయటికి తీసి వాటిని బతికిస్తున్నారట... ప్రచారవౌతోంది! కానీ ఈ ఆవులు, పశువులు మళ్లీమళ్లీ ‘ప్లాస్టిక్’ను మేసి రుగ్మతకు గురి అవుతున్నాయి. వేల ఆవులు పశువులు ఇలా చికిత్సకు నోచుకున్నప్పటికీ చికిత్సకు నోచుకోని లక్షల పశువులు మరణిస్తున్నాయి. సముద్ర జలాల నుండి తీరాలకు వందల తిమింగలాల మృతదేహాలు, వేలకొలదీ మరణించిన తాబేళ్లు, లక్షల కోట్ల చేపలు కొట్టుకొని వస్తుండడం కాలుష్య తీవ్రతకు ‘సూచికలు’! ప్లాస్టిక్ సీసాలలోని నీరు తాగడం వల్ల ప్లాస్టిక్ వ్యర్థాల దుష్ప్రభావానికి జనం గురి అవుతున్నట్టు సర్వేలు పదే పదే నిర్ధారించాయి. హైదరాబాద్ హైకోర్టు ప్రాంగణంలోని దుకాణాలలో అమ్మిన ‘సీసాల నీటి’లో కూడ కాలుష్యం చేరి ఉన్నట్టు ధ్రువపడింది. హిమాలయాలు కరిగిపోయి రాళ్లగుట్టలు బయటపడడానికి ‘ప్లాస్టిక్’ వేడి కారణం! అంతరిక్షం సైతం కోట్లకొలదీ ‘ప్లాస్టిక్’ ముక్కలతో నిండిపోయి ఉందన్నది నిర్ధారణ! ఇలా ‘ప్లాస్టిక్’ నీరు, పారిశ్రామిక వ్యర్థ రసాయన జలాలు భూమిలోకి ఇంకి విస్తరించడం వల్ల వ్యవసాయ క్షేత్రాలు ఊసర క్షేత్రాలుగా, మరుభూములుగా మారిపోతున్నాయి.... ‘ప్లాస్టిక్’ వినియోగాన్ని పాక్షికంగా నిషేధించడానికి గడువులను నిర్ధారించడం వల్ల కాలుష్యం నుండి విముక్తి లభించబోదు. అన్ని రూపాలలోని ‘ప్లాస్టిక్’ ఉత్పాదక కేంద్రాలను మూసివేయాలి, దిగుమతులను ఆపివేయాలి. పత్తి, నూలు, జనుపనార, కాగితం, వృక్ష నిర్వాసాల నుంచి తయారైన సంచులను ఇతర పరికరాలను వినియోగించడం అనివార్యం చేయాలి. గాజు, మట్టిపాత్రలు, సీసాలు, లోహపు పాత్రలు వాడి మందులను, శుద్ధి ఆహారాలను నిలువచేయాలి.. ఇదంతా జరిగేవరకు వ్యవసాయ జీవ వైవిధ్యానికి రక్షణ కలగడం అసంభవం...
వ్యవసాయ భూమి జీవ వైవిధ్యానికి చీమలు, వానపాములు, తూనీగలు, కప్పలు తదితర ‘్భసార పరిపోషక’ జంతుజాలం ప్రతీక. పొలాల గట్లపై గరికెగడ్డి, వందల రకాల లతలు పొదలు చెట్లు పెరగడం భూసార స్వచ్ఛతకు పరిపుష్టికి ధ్రువీకరణ. తేనెటీగలు విహరించడం తేనె పట్టులు విస్తరించడం వ్యవసాయ భూమి స్వచ్ఛతకు నిదర్శనం. పరిసరాలలో ఉడుతలు, పిచ్చుకలు సంచరించడం వ్యవసాయ జీవన వైవిధ్యం. ‘గరికె గడ్డిపువ్వులు పూచి మీరు నడిచే దారుల పక్కన పరిమళించు గాక’’- ‘‘అయనేతే పరాయణే దూర్వా రోహన్తి పుష్పిణీ’’- అన్నది యుగయుగాల భారతీయుల ఆకాంక్ష! ఇదంతా వ్యవసాయ భూ జీవ వైవిధ్యం. ఆకులను మట్టిని గో ఉత్పత్తులను ఎఱువులుగా వాడినంత కాలం ఈ జీవ వైవిధ్యం పరిఢవిల్లింది. కాని రసాయన విషాలను ఎఱువులుగా వాడడం మొదలైన తరువాత వానపాములు, చీమలు, తేనెటీగెలు పారిపోయాయి. క్రిమిసంహారపు రసాయనాలు జీవజాలాన్ని నిర్మూలించాయి, నిర్మూలిస్తున్నాయి. పరిష్కారం ప్రభుత్వాలకు తెలుసు.. అది సేంద్రియ వ్యవసాయం!