సంపాదకీయం

వెలుగుల విజయం..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమలిన ప్రశాంత ప్రకృతి ప్రస్ఫుటించడం శరత్ కాల స్వభావం. శరదృతువు స్వచ్ఛతకు కొలమానం. వర్ష ఋతువు నీటితో నింగిని పరిశుభ్రం చేస్తోంది. భూమిని ప్రక్షాళనం చేస్తోంది. అందువల్ల వర్షఋతువు సమాప్తమై శరత్ ఋతువు ఉదయించే సమయానికి పర్యావరణం నిర్మలంగా ఉంటోంది, భూమి నుండి స్వచ్ఛమైన పరిమళాలు పుట్టుకొస్తున్నాయి, పంట పొలాల నుంచి ఈ పరిమళాలు స్వచ్ఛమైన గాలులతో కలసి మరింత స్వచ్ఛంగా ప్రకృతిని ముంచెత్తడం ‘దీపావళి’కి నేపథ్యం. ఆశ్వయుజ, కార్తిక మాసాలు శరదృతువు. శరదృతువు నడికొన్న వేళ ఆశ్వయుజ బహుళ చతుర్దశి నాడు ‘నరక చతుర్దశి’ సంభవిస్తోంది. మరుసటి రోజున అమావాస్య- దీపావళి! నదులలోని నీరు పరమ స్వచ్ఛతకు ప్రతీకగా పరుగులు తీసే సమయం ‘దీపావళి’ ఉత్సవం. ఇదంతా భౌతిక స్వచ్ఛత.. ఈ భౌతిక స్వచ్ఛతపై ‘కాలుష్య విష రసాయన’ రాక్షసులు దాడిచేయడం పునరావృత్తి.. ప్రాకృతిక స్వచ్ఛతను పరిమార్ప యత్నించేది వికృతి! కాలుష్యాన్ని కడిగివేసి ప్రకృతి యథావిధిగా యథాపూర్వంగా పరిశుభ్రతతో ప్రస్ఫుటించడం పరిమళించడం కూడ నిరంతర పునరావృత్తి.. ఈ పునరావృత్త స్వచ్ఛతకు శరత్ ఋతువు ప్రతీక... ‘దీపావళి’ పతాక! ఇదంతా భౌతికమైన స్వచ్ఛత.. మానసిక స్వచ్ఛత లేదా సంస్కార స్వచ్ఛత మానవ జీవన వికాస క్రమంలో మరింత ప్రధానమైనది, వౌలికమైనది. ప్రాకృతిక స్వచ్ఛత, మానవ జీవన స్వచ్ఛత పరస్పరం పరిపోషకాలు, సృష్టిగత సమన్వయ వ్యవస్థకు వౌలిక ప్రాతిపదికలు! ప్రాకృతిక స్వచ్ఛత పరిఢవిల్లడం ప్రకృతిలో సంచరించే ‘జీవజాలం’ పరిపుష్టికి దోహదం చేస్తోంది. జీవజాలం, ప్రకృతి విభిన్నం కాదు, వృక్షజాలంలోను జంతుజాలంలోను విస్తరించి ఉన్న ‘జీవం’ ప్రకృతి... చైతన్యం ప్రకృతి! ప్రకృతి స్వచ్ఛత పరిఢవిల్లడం మానవుని మానసిక స్వచ్ఛతపై ఆధారపడి ఉంది! ఈ మానసిక స్వచ్ఛత ‘వెలుగు’.. మానసిక కాలుష్యం చీకటి! ‘వెలుగు’ సృష్టి నిహితమైన శాశ్వత తత్త్వం. ‘చీకటి’ అపవాదం! వెలుగును దిగమింగడానికి చీకటి నిరంతరం యత్నించడం చారిత్రక పునరావృత్తి! వెలుగు వికసించి, విప్లవించి, విస్తరించి చీకటిని నిర్మూలించడం కూడ పునరావృత్తి.. ఈ పునరావృత్తి దీపావళి, అసంఖ్యాక స్వచ్ఛ మానస దీపాల వెలుగుల రూపావళి... మానవేతర జంతు జాలం కాని వృక్షజాలం కాని ప్రకృతిని గాయపరచడం లేదు. వాటి సహజ ప్రవృత్తి ప్రకృతి పరిరక్షణకు దోహదకరం. అందువల్ల మానవుని మానసిక ప్రవృత్తి మాత్రమే ప్రకృతిని పరిరక్షించగలదు, ప్రకృతిని గాయపరచగలదు. మానవుని మానసిక కాలుష్యం ప్రకృతిని గాయపరచింది, గాయపరుస్తోంది. మానవ మానసిక స్వచ్ఛతా పునరుద్ధరణ మాత్రమే ప్రకృతి స్వచ్ఛతను పరిరక్షించగలదు. ఈ మానసిక స్వచ్ఛత సంస్కృతి, సంస్కారాల సమాహారం! ఈ స్వచ్ఛతా పునరుద్ధరణకు కాలం నిర్మించిన కొలమానం ‘దీపావళి!’..
మొక్కను నాటడం మానసిక సంస్కారం, స్వచ్ఛత.. చెట్లను విచ్చలవిడిగా నరికి పారేయడం, బొగ్గుగా మార్చివేయడం విదేశాలకు దొంగ రవాణా చేయడం మానసిక వికృతి.. కాలుష్యం! ఈ ‘మన్వంతరం’ పేరు వైవస్వత మన్వంతరం. ‘మన్వంతరం’ ఆరంభ సమయంలో మనువు సముద్రతీరంలో సంచరించాడు. ‘‘అయ్యా! నేను చిట్టిచేపను.. నన్ను మొసళ్లు, పెద్దచేపలు మింగేస్తాయి.. రక్షించు!’’అని ఒక సముద్ర ప్రాణి ప్రార్థించింది. వైవస్వతుడు ఆ చిన్నిచేపను ‘కమండలం’లోకి తీసుకొని బావిలో వదిలాడు, చెఱువులో పెంచాడు.. పెరిగి పెద్దదైన చేపను మళ్లీ సముద్ర ప్రవేశం చేయించాడు! ఈ ‘నితాంత అపార భూతదయ’ మానసిక స్వచ్ఛత. ఈ సాంస్కృతిక స్వచ్ఛత పదిలంగా ఉన్నప్పుడు మంచి మానవుడు ప్రకృతిని, భౌతిక స్వచ్ఛతను రక్షిస్తాడు. నదులలోని, చెఱువులలోని నీటి స్వచ్ఛత దాన్ని కాపాడాలన్న మానసిక స్వచ్ఛతపై ఆధారపడి ఉంది. ‘ఈ కొలనులోని నీరు మంచి మనుష్యుని మనసువలె స్వచ్ఛంగా ఉంది..’- ‘‘అకర్దమం ఇదం తీర్థం సన్మనుష్య మనో యథా’’- అని ఆదికవి వాల్మీకి చెప్పడం మానవుని మానసిక స్వచ్ఛతపై ఆధారపడిన ప్రాకృతిక స్వచ్ఛతకు నిదర్శనం! ఈ మానసిక స్వచ్ఛతకు లేదా మానవీయ సంస్కారాలకు ‘చీకటి’ భంగం కలిగించినప్పుడల్లా ‘వెలుగులు’ చీకటిని పారద్రోలడం సాంస్కృతిక విజయం! ద్వాపర యుగం నాటి సత్యభామ, కృష్ణుడు ఈ ‘వెలుగులు’! నరకాసురుడు మానసిక వికృతికి, కాలుష్యానికి కారకుడైన చీకటి! వెలుగు జయించింది. సత్యభామాకృష్ణుల విజయం ఈ సంస్కార సమాహారానికి పునరుద్ధరణ! అందుకే ‘నరక చతుర్దశి’ మానవీయ సంస్కార మహోత్సవం...
ఇలా ద్వాపర యుగంలో సత్యభామ, యదుకుల కృష్ణుడు సాధించిన సాంస్కృతిక విజయం సృష్టిగత ప్రక్షాళనకు పునరావృత్తి! సత్యభామ మాతృమూర్తి, భూమాతకు ప్రతీక! కృష్ణుడు అనంతంగా అనాదిగా విస్తరించి ఉన్న అంతరిక్షానికి ప్రతీక! విస్తరించి ఉండడం విష్ణువు. అంతరిక్షం, ఆకాశం తండ్రి, భూమి తల్లి. ఇది సకల మానవాళికి మాత్రమే కాదు, సకల జీవకోటికి వర్తించే శాశ్వత సత్యం. ద్వాపర యుగంలోను పూర్వ యుగాలలోను సంభవించిన వికృతికి, విముక్తికి- నడుస్తున్న సమాజం పునరావృత్తి! మానసిక కాలుష్యగ్రస్తుడైన మానవుడు పంచభూతాలను, ప్రకృతిని కలుషితం చేస్తుండడం నడుస్తున్న చరిత్ర! ఫలితంగా జీవజాలం నష్టమైంది. వృక్షాలను నిర్మూలించిన మానవుడు జంతువులను కూడ నిర్మూలిస్తున్నాడు, ఈ అభినవ నరకాసుర ప్రవృత్తికి, చీకటి చిత్తవృత్తికి ప్రధాన కారణం భారతీయ సంస్కారాలు శతాబ్దుల తరబడి విదేశీయ వికృతులకు బలికావడం! ఆవులను హత్యచేశారు. రెండువందల రకాల ‘దేశవాలీ’ జాతుల ఆవులలో ఇరవై తొమ్మిది మాత్రం ఊపిరితో ఉన్నాయి. డెబ్బయి ఏళ్లక్రితం ఈ దేశం జనాభా ముప్పయి కోట్లు, గోసంతతి సంఖ్య నూట ఇరవై కోట్లు, ప్రస్తుతం జనాభా నూట ముప్పయి నాలుగు కోట్లు, గోసంతతి సంఖ్య పదిహేను కోట్లు! దీనివల్ల వ్యవసాయం కాలుష్యమైంది, పర్యావరణం కాలుష్యమైంది! ఆవులను మాత్రమే కాదు జంతువులను నిర్మూలిస్తున్న అభినవ నరకాసురులు దేశం నిండా ఉన్నారు. నిన్నమొన్న మహారాష్టల్రో ఒక ఆడపులిని చంపేశారు! ఈ పులి ఇద్దరు పిల్లల తల్లి. ఇదే సమయంలో ఉత్తరప్రదేశ్‌లోని ధ్రువ సంరక్షణ కేంద్రంలోని మరో ఆడపులిని కూడా కొట్టి చంపేశారట. ఎఱ్ఱగంధం చెట్లను నరికి చైనాకు తరలిస్తున్నవారు నరకుని వారసులు! గోపాలన- యదుకుల కృష్ణుడు, పశుహననం వన్యమృగ నిర్మూలన- నరకుడు! ఇదీ కాలుష్యం!
ఈ మానసిక కాలుష్యాన్ని నిర్మూలించడానికి వీలైన తీర్పులను న్యాయస్థానాలు ఇవ్వాలి, చట్టసభలు శాసనాలను రూపొందించాలి, ప్రభుత్వాలు అమలు జరపాలి! సంప్రదాయ పద్ధతిలో తరతరాలుగా తయారైన ‘విస్ఫోటన సామగ్రి’- ఆకుపచ్చని బాణసంచా-ని పేల్చడం వల్ల కాల్చడం వల్ల పర్యావరణం మరింత ప్రక్షాళితమైంది. కానీ ‘నాగరికం’ ముదిరి, విదేశీయత ప్రబలి, ఆర్భాటం బలిసింది! రసాయన విష విస్ఫోటన సామగ్రిని పేల్చడం వల్ల కాలుష్యం విస్తరించడంలో ఆశ్చర్యం లేదు. దేశవాలీ ఆవుల నెయ్యిని వాడి హోమం చేస్తే పర్యావరణ ప్రక్షాళన జరుగుతుంది, వాన కురుస్తుంది! ‘జర్సీ’ఆవుల నకిలీ నెయ్యిని వాడి హోమం చేస్తే ప్రకృతి పొగచూరిపోతుంది! ఇదీ అంతరం.. స్వచ్ఛతను పునరుద్ధరించడానికి వౌలిక సూత్రం! ‘స్వచ్ఛత’ వెలుగు.. వెలుగుల పండుగకు ఇదీ సనాతన ప్రాతిపదిక..