సంపాదకీయం

పులి ‘వేట’..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇది పైశాచిక కృత్యం, దారుణ హత్యాకాండకు నిదర్శనం’- అని మహిళా, శిశు సంక్షేమ వ్యవహారాల మంత్రి మేనకాగాంధీ వ్యాఖ్యానించడం వన్యమృగ హననాన్ని నిరోధించలేని ప్రభుత్వాలకు తీవ్రమైన అభిశంసన! ‘అవని’ అనే ఐదేళ్ల ఆడపులిని అస్ఘర్ అలీ అనే వేటగాడు కాల్చి చంపడం మేనకాగాంధీ నిరసనకు కారణం. మహారాష్టల్రోని యావత్‌మల్ జిల్లా రాలేగావ్ తహసిల్‌లోని బరోతీ గ్రామం సమీపంలో నవంబర్ మూడవ తేదీన ఈ హత్య జరిగింది. వన్యమృగ సంరక్షణ చట్టాలలోని నిబంధనలను నిర్భయంగా, నిర్లజ్జగా ఉల్లంఘించి ‘అవని’ని పొట్టనపెట్టుకున్న ఈ ‘నేరస్థుడి’ని ప్రభుత్వాలు ఇంతవరకు నిర్బంధించలేదు, న్యాయస్థానంలో నిలబెట్టలేదు. ఎందుకంటె మహారాష్ట్ర అటవీ అధికారుల సహకారంతోనే ఈ హత్య జరిగింది. ఈ అసఘర్ అలీ, ఈ ‘నేరస్థుని’ తండ్రి షఫాత్ అలీఖాన్ అనే ఇద్దరు వేటగాళ్లు లేదా కాల్పులు జరిపేవారు- షూటర్స్- హైదరాబాద్‌కు చెందినవారు. ‘అవని’ని ప్రాణాలతో పట్టుకొనడానికై నియుక్తుడైన అస్ఘర్ అలీ నిబంధనలకు వ్యతిరేకంగా పులిని చంపేశాడు. విధి లేని పరిస్థితులలో ఇలా చంపవలసి వచ్చిందన్న అస్ఘర్ అలీ వాదాన్ని యావత్‌మల్ అటవీ అధికారులు కూడ బలపరుస్తున్నారట! ‘మత్తు తూటాల’తో పులిని స్పృహ తప్పించి, ప్రాణాలతో పట్టుకోవాలన్నది చట్టంలోని నిబంధన. న్యాయస్థానాలు సైతం అనేకసార్లు ఈ సంగతిని స్పష్టం చేసి ఉన్నాయి. తాను ఈ పులిని ప్రాణాలతో పట్టుకొనడానికి యత్నించినట్టు, విధిలేక కాల్చి చంపినట్టు ‘నిందితుడు’ చెబుతున్నప్పటికీ ఈ వాదం విశ్వసనీయం కాదన్నది మేనకాగాంధీ అభిశంసన వల్ల ధ్రువపడిన వాస్తవం! పులిని హతమార్చడం పొరపాటున జరగలేదని, తన ‘ఘనత’ను చాటుకొనడానికై ఈ అస్ఘర్ బుద్ధిపూర్వకంగానే ఈ హత్యకు పాల్పడినాడని హైదరాబాద్‌కు చెందిన వన్యప్రాణి సంరక్షక ఉద్యమకారులు ప్రకటించడం నేరం జరిగిందనడానికి మరో ప్రాథమిక సాక్ష్యం! ఈ పులి ఇద్దరు పిల్లల తల్లి. ఈ పిల్ల పులుల వయస్సు తొమ్మిది నెలలట. ఇరవై నెలలు నిండే వరకూ పులి పిల్లలు ఆహారం కోసం ఆలన పాలన కోసం తల్లిపై ఆధారపడి ఉంటున్నాయి. తల్లి లేని ఈ పిల్లల జాడ తెలియడం లేదు. హత్య జరిగిన నాటికి ‘అవని’ కడుపు ఖాళీగా ఉందని మృతదేహ పరీక్షల వల్ల ధ్రువపడింది. తిన్న ఆహారం పులి జీర్ణించుకొనడానికి కనీసం నాలుగు రోజులు పడుతుందట! నాలుగు రోజులకు పూర్వం కూడ ఈ ‘శార్దూల కుటుంబం’ ఎన్ని రోజులపాటు తిండి లేక అలమటించాయన్నది తెలియదు. అందువల్ల తల్లిని కోల్పోయిన పులి పిల్లలు ఆకలితో నకనక లాడుతున్నాయన్నది స్పష్టం! వన్యమృగాలకు అడవులలో తిండి దొరకక పోవడం వల్ల మాత్రమే అవి జనావాసాలలోకి చొరబడుతున్నాయి. అడవుల విధ్వంసం వల్ల ఈ దుస్థితి ఏర్పడింది..
అటవీ రక్షణ మన దేశంలో అనాదిగా మానవ జీవన విధానం. ఈ విధానాన్ని విదేశీయ బీభత్సకారులు, బీభత్స పాలకులు ధ్వంసం చేసిపోయారు. పూర్వం మన దేశంలో వేటగాళ్లు అడవి పక్షులను, అడవి జంతువులను కేవలం తమ ఆహార అవసరాల కోసం వేటాడేవారు. ఐరోపా వారు ప్రత్యేకించి బ్రిటన్‌వారు ఈ ‘వేట’ను ‘వినోదం’గా మార్చారు. ‘తుపాకులు’ ‘లైసెన్సు’లు వచ్చాయి, ‘వేట’ వాణిజ్యమైంది. ఫలితంగా రెండు శతాబ్దులకు పైగా అటవీ విధ్వంసం జరిగింది. జంతుజాలం వృక్షజాలం కలసి జీవజాలం! ఈ జీవజాలం ధ్వంసం కావడంతో అడవులు అంతరించి పోయాయి. తమ ‘ఇంటిని’- అడవిని- ధ్వంసం చేసిన మానవులపై పగ సాధించడం కోసం అడవులలోని క్రూర జంతువులు కాని సాధు జంతువులు కాని జనావాసాలలోకి చొరబడడం లేదు. తిండి దొరకక ఆకలితో అల్లాడుతున్న వన్యమృగాలు కడుపునింపుకొనడానికి మాత్రమే ‘జనావాసాల’లోకి చొరబడుతున్నాయి. ఆకలి తీర్చుకొనడం మాత్రమే జంతువుల లక్ష్యం. పగ తీర్చుకొనడం, ప్రతిక్రియకు పూనుకొనడం గురించి ఈ వన్యప్రాణులకు తెలియదు. ‘‘జీవులకు జీవులే ఆహారం’’.- జీవో జీవస్య జీవనం- అన్నది సృష్టిస్థిత వాస్తవం, ప్రాకృతిక జీవన సూత్రం. మానవులకు, అత్యధిక జంతువులకు ‘స్థిర జీవులైన’ వృక్షజాలం, సస్యం- పంటలు, పండ్లు, కూరగాయలు, ఆకులు వంటివి- ఆహారం. అతికొద్ది జంతువులకు మాత్రమే ‘సంచార జీవులైన’ ఇతర జంతువులు ఆహారం. అడవులను హననం చేసిన ‘వేటగాళ్లు’ సంచార జీవులను- కుందేళ్లు, జింకలు వంటివి - సైతం చంపి భోంచేశారు. శతాబ్దుల ఈ వైపరీత్యం కారణంగా ఏనుగుల వంటి బృహత్ శాకాహార వన్యప్రాణులకు కాని, పులుల వంటి మాంసాహార ప్రాణులకు కాని అడవులలో ‘అన్నం’ లభించడం లేదు. ఈ ప్రాణులు ఒకవైపు అంతరించిపోతున్నాయి, మరోవైపు గ్రామాలలోకి, పంటలలోకి, తోటలలోకి చొరబడుతున్నాయి. చొరబడుతున్న ఈ ప్రాణులను ‘మత్తు తూటాల’తో నిద్రపుచ్చి మళ్లీ అడవులలోకి కాని, సంరక్షణ ప్రాంగణాలకు కాని పంపాలి. ఈ నిబంధన కూడ ఇప్పుడు ఉల్లంఘితమైంది.. ‘నితాంత అపార భూత దయ’అన్న భారతీయ జీవన సూత్రం భంగపడుతోంది!
ఐరోపా వారు వన్యమృగాలను మాత్రమే కాదు ఆవులు వంటి పాడి పశువులను, చివరికి మానవులను సైతం వేటాడి చంపడం చరిత్ర. పదహారవ శతాబ్ది నుండి అమెరికా, ఆఫ్రికా, ఆస్ట్రేలియా ఖండాలలో ఐరోపా వారు ఇలా మానవులను, స్థానిక అనాది జాతులను వేటాడి నిర్మూలించడం చరిత్ర.. ఐరోపా వారు మన దేశంలో మాత్రం మానవులను వేటాడలేకపోయారు. కానీ తమ ‘వేటాడే’రోగాన్ని, ఆర్భాటపుక్రీడను మనకు కూడ అంటించిపోయారు! మన అడవులు అంతరించడానికి కొనసాగుతున్న ఈ హంతక చిత్తవృత్తి కారణం! దాదాపు నలబయి ఐదేళ్లక్రితం ‘రీడర్స్ డైజెస్ట్’- అన్న ఆంగ్ల మాస పత్రికలో ఓ కథనం ప్రచురితం అయింది. ‘ఓ మైదానంలో కారు జోరుగా వెళ్లింది, కారు నడుపుతున్న ‘షూటర్’ హఠాత్తుగా ‘రివల్వార్’ తీశాడు. ఒకటి.. రెండు.. వరుసగా ఆరు గుళ్లను పేల్చాడు.. ఒక్కొక్క గుండు తగిలి పచ్చిక మేస్తుండిన ఒక్కొక్క ఆవు నేలకొరిగింది.. ఎందుకు ఆరు ఆవులను చంపావు?- అని కారులో ప్రయాణిస్తుండిన సహచరుడు ‘షూటర్’ను అడిగాడు! గురి తప్పకుండా కాల్చడం అభ్యాసం చేస్తున్నాను- అని హంతకుడు సమాధానం చెప్పాడు!’’ యువ గోహంతకుడు ఆ తరువాత క్యూబా దేశపు నియంతగా పేరుమోసిన ఫైడల్ కాస్ట్రో.. ఐరోపా ప్రవృత్తికి ఇది ఒక మెతుకు మాత్రమే! ‘‘ది మాన్ ఈటర్ ఆఫ్ ది మాల్‌గుడి’’- మాల్‌గుడి మానవ భక్షకుడు- అన్న తన ఆంగ్ల నవలలో ప్రసిద్ధ రచయిత ఆర్.కె.నారాయణ్ ‘‘మానవునిలోని ఈ జంతు స్వభావాన్ని’’, అనవసర ఆర్భాటపు క్రూరత్వాన్ని నిరసించాడు. ‘ఘనత’ కోసం అహంకార ప్రదర్శన కోసం కుక్కలను పక్షులను కుందేళ్లను ఏనుగులను పులులను చంపడం ‘వాణిజ్యం’గా మార్చుకున్న హంతకుడు చివరికి హతుడు కావడం ఆ నవలలోని ఇతి వృత్తం...
మానవుడు జంతుకోటిలో భాగం.. ఇతర జంతువులకు సైతం మానవునితోపాటు భాగం ఉంది! ఇదీ యుగయుగాల భారతీయ జీవన ప్రవృత్తి! దాదాపు యాబయి ఏళ్లక్రితం ప్రయాగలోను ఇతరచోట్ల గంగానదీ తీరంలో జరిగిన ధార్మిక ఉత్సవాలలో ఒక సన్యాసి సంచరించేవాడు. ఆయన వెంట ఒక పులి ఉండేది, దాని మెడలో గొలుసు లేదు! పులి పెంపుడు కుక్కవలె ఆ సన్యాసి వెంట అనేక స్థలాలలో సంచరించింది, మానవులపై దూకలేదు, గాయపరచలేదు. నమ్మశక్యం కాని ఈ వాస్తవం ప్రాతిపదికగా ఆర్.కె.నారాయణ్ ‘ఏ టైగర్ ఫర్ మాల్‌గుడి’- మాల్‌గుడి పులి- అన్న నవలను వ్రాశాడు! ‘‘జంతువు హృదయం వికసించే మానవీయ ప్రవృత్తి’’ ఈ నవలలోని ఇతివృత్తం! పులికీ కథ ఉంది, పులికీ వ్యథ ఉంది... మహారాష్టల్రో పులి హత్యకు గురి అయిన మరుసటి రోజుననే ఉత్తరప్రదేశ్‌లో కొందరు దుండగులు ‘ధ్రువ’ సంరక్షణ ప్రాంగణంలోకి చొరబడి ఓ ఆడ పులిని కొట్టి చిత్రవధ చేసి చంపారు. మానవుల క్రూర నిర్లక్ష్యం వల్ల ఒరిస్సాలోని థెంకనాల్ జిల్లాలో ఒకేసారి ఏడు ఏనుగులు విద్యుత్ తీగలు తగిలి మరణించడం సమాంతర వైపరీత్యం..