సంపాదకీయం

విత్తనాల ‘సమృద్ధి’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రపంచానికి విత్తనాలను సమకూర్చగల స్థాయికి కర్నూలు జిల్లా ఎదగగలదని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మంగళవారం విశ్వాసం వ్యక్తం చేయడం ముదావహం. తెలంగాణ రాష్ట్రాన్ని విత్తనాల భాండాగారంగా తీర్చిదిద్దనున్నట్టు తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు రెండేండ్లకు పూర్వమే ప్రకటించి ఉన్నారు. ఈ రెండేండ్లలో వందల ఎకరాలలో శ్రేష్ఠమైన విత్తనాలు ఉత్పత్తి అయి ఉండవచ్చు! ఆంధ్రప్రదేశ్‌లో కూడా ఇదివరకే విత్తనాల పొలాలు- సీడ్ పార్క్స్ - విస్తరించిపోయాయన్నది జరిగిన ప్రచారం. అందువల్ల ఉభయ తెలుగు ప్రాంతాలు బీజ భాండాగారాలుగా అవతరించనున్నాయన్నది జనానికి కలుగుతున్న అభిప్రాయం. తెలంగాణ కానీ, ఆంధ్రప్రదేశ్‌కానీ దేశంలోని మరో ప్రాంతం కానీ ‘విత్తనాల’ ఉత్పత్తిలో స్వయం సమృద్ధిని సాధించడంతోపాటు విదేశాలకు ఎగుమతి చేయడం ఆదర్శ స్థితి... స్వయం సమృద్ధి ఆర్థిక స్వాతంత్య్ర పరిరక్షణకు ప్రాతిపదిక! కానీ మొదట మన దేశంలో విత్తనాలను కొంటున్న, దారుణమైన ధరలను చెల్లించి బహుళ జాతీయ వాణిజ్య సంస్థల దుకాణాలలోను పంపిణీ కేంద్రాలలోను విత్తనాలను కొంటున్న రైతులకు ఈ దోపిడీనుంచి విముక్తిని కలిగించడం ప్రభుత్వాల కర్తవ్యం! కర్నూలు జిల్లాలోని ‘తంగెడంచ’ వద్ద ఏర్పడనున్న ప్రపంచస్థాయి విత్తనాల పరిశోధన కేంద్రం వల్ల ఈ విముక్తి సాధ్యం అవుతుందా?? ఆరువందల ఇరవై మూడు ఎకరాలలో తంగెడంచ వద్ద ఏర్పడే విత్తనాల పరిశోధన కేంద్రం ప్రతి రైతు ‘విత్తనాల’ విషయంలో మళ్లీ స్వయం సమృద్ధిని సాధించడానికి దోహదం చేయగలదా? ప్రతి రైతు తమ పొలానికి కావలసిన విత్తనాలను తానే తయారు చేసుకోవడం వికేంద్రీకృత స్వయం సమృద్ధి! ఈ స్వయం ‘సమృద్ధి’ మన దేశంలో తరతరాలుగా కొనసాగుతూ వచ్చింది! రైతులు విత్తనాలు కొనలేదు. రాబోవు పంటకు కావలసిన విత్తనాలను రైతులు ప్రతీ పంటనుంచీ తయారు చేసుకునేవారు. కందులు మొదలు ఉలవల వరకు, వడ్లు మొదలు ‘సామలు’ వరకు, ఆవాలు మొదలు ఉల్లిగడ్డలవరకు, మిఱపకాయలు మొదలు మెంతికూర వరకు- ఇలా అనేక పంటలను పండించిన రైతు లు విత్తనాలు కొనలేదు. ఒక పంటనుంచి మరో పంట కు కావలసిన విత్తనాలు ఉత్పత్తి చేసుకున్న రైతుకు వాటిని కొనవలసిన అవసరం ఉండేది కాదు. ఈ పద్ధతి క్రమంగా అడుగంటిపోయింది. విత్తనాలు వేరు గా, ఆహార ధాన్యాలు వేరుగా ఉత్పత్తి అవుతున్నాయి. విత్తనాల ఉత్పత్తిని విదేశీయులు, బహుళ జాతీయ వాణిజ్య సంస్థలు నియంత్రిస్తుండడం ‘ప్రపంచీకరణ’...
ఇలా దేశ ప్రజల సర్వసమగ్ర స్వాతంత్య్ర ధ్యాసను వాణిజ్య ప్రపంచీకరణ దిగమింగుతుండడం నడుస్తున్న చరిత్ర... ప్రభుత్వ నిర్వాహకులు ఈ ధ్యాసకు దూరమై ఉండడం కూడ నడచిపోతున్న చరిత్ర. ‘ప్రగతి’ పేరుతో ప్రతి జీవన రంగాన్ని విదేశీయ భావజాలం ఆవహించి ఉంది. నిజానికి ‘ప్రగతి’ సాధిస్తున్నామన్న భ్రాంతికి ప్రభుత్వాలు, ప్రభుత్వేతరులు గురి అవుతుండడం ‘గుర్తింపునకు’ నోచుకోని వాస్తవం! వ్యవసాయ రంగం కూడ ఇలా ప్రగతిభ్రాంతికి బలి అవుతుండడం, గురి అవుతుండడం అందువల్ల ప్రభుత్వాల ధ్యాసకు నోచుకోవడం లేదు. విదేశీయుల కాలంలో నష్టభ్రష్టమైన వ్యవసాయ రంగం మళ్లీ ఊపిరిపోసుకునే సరికి స్వాతంత్య్ర భారతంలో దాదాపు రెండు దశాబ్దులు గడిచిపోయాయి. ఊపిరి పోసుకున్న తరువాత మూడు దశాబ్దులు గడవక పూర్వమే ‘ప్రపంచీకరణ’ సుడిగుండంలో వ్యవసాయ రంగం చిక్కుకొంది. ‘ప్రపంచీకరణ’ మొదలైన తర్వాత సంభవించిన అనేక వైపరీత్యాలలో ‘బహుళ జాతీయ వాణిజ్య సంస్థలు’ మన వ్యవసాయాన్ని అదుపు చేస్తుండడం ఒక అంశం. బహుళ జాతీయ సంస్థలు అధిక ధరలకు విత్తనాలను, ఎఱువులను, పురుగు మందులను, వ్యవసాయ పనిముట్లను రైతులకు అమ్మి సొమ్ము చేసుకుంటుండడం ‘ప్రపంచీకరణ’! భూమిని ఎద్దులతో, నాగళ్లతో దునే్న పద్ధతి అంతరించిపోవడం, యాంత్రికమైన పద్ధతులలో దున్నడం మొదలు కావడం భారతీయతను బలిగొంటున్న విపరిణామ క్రమం... కర్నూలు జిల్లాలో ‘ప్రపంచస్థాయి విత్తన పరిశోధన’ ప్రాంగణ నిర్మాణానికి మంగళవారం జరిగిన శంకుస్థాపనకు ఇదీ నేపథ్య వైపరీత్యం! ‘ప్రపంచస్థాయి‘ అన్న భ్రాంతి నెలకొన్న చోటల్లా ‘్భరతీయత’ బలి అయిపోతుండడం ప్రభుత్వాలు గమనించని ప్రమాదం, గమనించినప్పటికీ పట్టించుకోని ప్రమాదం...
విదేశాల సహకారం, సహాయం లేనిదే వ్యవసాయం చేసుకోలేమన్నది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మాత్రమేకాదు దేశంలోని దాదాపు అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలు ఆచరణకు తెచ్చిన విధానం. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శంకుస్థాపన చేసిన ఈ తంగెడంచ విత్తనాల పరిశోధన సంస్థను ఆచార్య ఎన్.జి.రంగా వ్యవసాయ విద్యాలయంలో నిర్వహించలేరా? అమెరికాలోని ‘అయ్యోవా’ విశ్వవిద్యాలయం వారి సహకారం ఎందుకు? మన వ్యవసాయ విశ్వవిద్యాలయాల సహకారంతో అమెరికాలో విత్తనాల పరిశోధన కేంద్రాలను అక్కడి వారు నెలకొల్పుతున్నారా?? వందలాది ఉపగ్రహాలను అంతరిక్షంలో భూసమాంతర కక్ష్యలో ప్రవేశపెట్టగలుగుతున్న స్వదేశీయ విజ్ఞాన పటిమ భూమి పండించగల విత్తనాలను తయారుచేసుకోలేదా? ‘‘నాణ్యమైన విత్తనం అని అంటే అన్నిరకాల చీడపీడలను తట్టుకోగల విత్తనం’’ అన్నది చంద్రబాబు నాయుడు చెప్పిన మాట. చీడపీడలు విరుచుకుని పడుతుండడానికి కారణం సంప్రదాయ సేంద్రీ య వ్యవసాయం మూలబడడం. ‘‘చీడపీడలు’’ ఆవుపేడను, గొర్రెల పేడను ఇతర పాడిపశువుల పేడను అటవీ ఉత్పత్తులతో కలిపి ఎఱువుగా వాడిన రోజులలో ఉండేవి కాదు! అడవులను, ఆవులను, పాడిపశువులను ధ్వంసం చేసిన వ్యవస్థలు స్థిరపడిన తర్వాతనే పంటలు రోగాలకు గురి కావడం మొదలైంది! సంకర జాతుల విత్తనాల-హైబ్రీడ్ సీడ్స్-, కృత్రిమ రసాయన విషాలు నిండిన ఎఱువులు, క్రిమిసంహారకాలు- ఇవన్నీ రైతులను దోపిడీ చేయడానికి అక్రమ వాణిజ్య వ్యవస్థ సృష్టించిన మారణాయుధాలు. ప్రపంచీకరణ నడికొన్న తరువాత ఈ దోపిడీ మరింత పెరిగింది. జన్యువుల మార్పిడి-జెనెటిక్ మోడిఫికేషన్- జిఎమ్- సాంకేతిక ప్రక్రియ ద్వారా రూపొందిన పత్తివిత్తనాల ద్వారా పండించిన పంటలకు కొత్త తెగుళ్లు వ్యాపించడం దేశమంతటా ఆవిష్కృతమవుతున్న దృశ్యాలు...
అందువల్ల సంప్రదాయ సేంద్రీయ వ్యవసాయాన్ని ప్రభుత్వాలు మళ్లీ విస్తరింప చేయడం ఉత్పత్తులు పెరగడానికి, చీడపీడలను నివారించడానికి మార్గం.. ఏదో ఒక వాణిజ్యసంస్థ పెద్దఎత్తున విత్తనాలను ఉత్పత్తి చేయడంవల్ల రైతులకు ఏమి లాభం... ప్రతి రైతు ‘విత్తనాల’ను ఉత్పత్తి చేసుకోగలగాలి... ప్రభుత్వాలు పరిశోధనలను, పథకాలను ఈ దిశగా కొనసాగించాలి!!