సంపాదకీయం

వెలుగుల శరాలు ఎన్ని?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భారతీయతను పరిమార్చడానికి విరుచుకుపడుతున్న చీకటి మూకలకు, భారతీయతను నిలబెట్టడానికి ఉద్యమిస్తున్న వెలుగుల శరాలకు మధ్య జరుగుతున్న సమరం వర్తమాన వాస్తవం. కాలుష్యపు నరకంపై స్వచ్ఛ్భారత నిర్మాణం కాంతివ్యూహం పోరాడుతున్న సమయమిది. మన దేశపు సరిహద్దుల చుట్టూ అభినవ నరక రక్కసుల దురాక్రమణ వ్యూహం బిగిసిపోతుండడం వెలుగుల పండుగకు విచిత్రమైన నేపథ్యం! పొరుగు దేశాలు ఉసిగొల్పుతున్న ‘జిహాదీ’ బీభత్సకారులు వేషం మార్చిన నరకాసురులు. వర్గ విద్వేషవాదులు చైనా మద్దతుతో కొనసాగిస్తున్న బీభత్సకాండ నరకాసుర వారసత్వం కొనసాగుతోందనడానికి మరో సాక్ష్యం. మతం మార్పిడులను కొనసాగించడం ద్వారా క్రమంగా భారతీయతాబద్ధులైన ప్రజల సంఖ్యను తగ్గించడానికి జరుగుతున్న విదేశీయ షడ్యంత్రం నరకాసుర స్ఫూర్తికి మరో వికృతముఖం... ‘ప్రపంచీకరణ’ పేరుతో భారతీయ సమాజపు స్వరూప స్వభావాలను చెరపివేయడానికి జరుగుతున్న కుట్ర ‘నరకుని’ నాలుగవ భంగిమ! ద్వాపరయుగం నాటి నరకుడు కేవలం ఆర్థిక బీభత్సకారుడు కాదు, భారతీయ సంస్కృతిని మట్టుపెట్టయత్నించిన బౌద్ధిక బీభత్సకారుడు! ఈ దేశంలో పుట్టి ఈ భూమిని ఈ మాతృభూమిపై వికసించిన సంస్కృతిని ద్వేషించిన అంతర్గత విద్రోహి నరకుడు! మహిళను మాతృశక్తిగా ఆరాధించడం భారతీయ సంస్కారం. ఈ సంస్కారాన్ని నరకుడు పరిమార్చాడు, అనేకమంది మహిళలను బానిసలుగా బంధించి ఉంచాడు. అందువల్లనే నరకునిపై సత్యభామాకృష్ణులు సాంస్కృతిక సమరం సాగించారు! సాంస్కృతిక విజయం సాధించారు! ఈ సంస్కృతి మళ్లీ ప్రమాదాలను ఎదుర్కొంటుండడం నడుస్తున్న చరిత్ర! ‘ప్రపంచీకరణ’ భారతీయ వికేంద్రీకృత ఆర్థిక వ్యవస్థను విధ్వంసం చేసింది. గ్రామీణులు ఉపాధిని కోల్పోయి పట్టణాలకు నగరాలకు తరలివస్తున్నారు. ‘నగరీకరణ’ కాలుష్యాన్ని కేంద్రీకరిస్తోంది! వర్షం కురిస్తే నగరాలు మురికి నీటి మడుగులు, వర్షాలు కురవనప్పుడు నగరాలు కాలుష్య వాయు వలయాలు! దీపావళి సమయంలో సంప్రదాయ పద్ధతిలో తయారైన ‘బాణసంచా’ పేల్చడం వల్ల పరిసరాలు పరిశుభ్రం అయ్యేవి, విషక్రిములు నశించేవి. కానీ ‘ప్రపంచీకరణ’ మొదలైన తరువాత విష రసాయనాలు నింపుకున్న ‘టపాకులు’, ‘పటాకులు’ కాలుష్యాన్ని పెంచుతున్నాయి! ఢిల్లీలో ఈ ‘మందుగుండు’ సామగ్రిని అమ్మరాదన్న న్యాయ నిర్ణయానికి ఇదీ- బహుశా - నేపథ్యం!!
తిమిరంతో ఘన సమరం జరిపిన బ్రతుకే అమరం - అన్న మహాకవి దాశరథి మానవ జీవన స్వభావాన్ని మరోసారి ఆవిష్కరించాడు. చీకటి దుర్జన మూకల దుస్తంత్రం.. వెలుగు సజ్జన శక్తుల విజయవ్యూహం. వెలుగునకు సమాంతరంగా చీకటి కొనసాగుతుండడం ప్రాకృతిక వాస్తవం, విశ్వవ్యవస్థలో భాగం! సృష్టి ప్రస్ఫుటించడం వెలుగు, సృష్టి నశించడం చీకటి! అందువల్ల చీకటిలో వెలుగు తుదిమొదలు లేని యుద్ధం సాగిస్తుండడం విశ్వవ్యవస్థ వికాసక్రమం... ఈ వికాసక్రమంలో వెలుగు చీకటి పునరావృత్తం అవుతున్నాయి. చీకటి ఆవహించినప్పుడల్లా వెలుగు సంఘర్షణ సాగిస్తోంది, పొంచి ఉన్న చీకటి ప్రవేశించకుండా వెలుగు నిరోధిస్తోంది. చీకటి మూకలు వెనుదిరగడం లేదు, వెలుగుల శరాలు, వెలుగుల కరాలు, వెలుగుల కిరణాలు, వెలుగుల సరాలు చీకటిని తరిమికొట్టడం కూడ ఆగలేదు! ఈ నిరంతర సంఘర్షణలో తుది విజయం వెలుగులదేనన్నది సనాతన సత్యం. వెలుగు శాశ్వతం, అంటే తుది మొదలు లేని శాశ్వత వాస్తవం వెలుగు.. కొడిగట్టడం, గ్రహణగ్రస్తం కావడం, లయం కావడం తాత్కాలిక పరిణామాలు! చీకటికి ఈ శాశ్వతత్వం లేదు, అది పరిమితం... ఈ పరిమితులకు ఆవల ఈవల నలువైపుల వెలుగు విస్తరించి ఉండడం విశ్వ వ్యవస్థలో భాగం. అందువల్లనే, ‘‘లోకంబులు, లోకేశులు, లోకస్థులు తెగిన తుది, నలోకంబగు పెంచీకటి కవ్వల, ఎవ్వండేకాకృతి వెలుగు నతని నే సేవింతున్..’’ అన్నది భారతీయుని గమ్యమైంది. మహాకవి పోతన ఏనుగు మదిలో పలికించిన మాటలు లక్ష్యానికి అనుగుణం! వెలుగును కోరడం, వెలుగును చూడడం, వెలుగును కాపాడడం, వెలుగును రక్షించడం, వెలుగును పోషించడం, వెలుగును పంచిపెట్టడం అనాదిగా భారతీయుల స్వభావం..
భారతీయ సంస్కార దీపాలు కొడిగట్టి ఉండడం, విదేశీయ భావదాస్య అంధకారం కొలువుతీరి ఉండడం అధికాధిక విద్యావంతులకు, ప్రముఖులకు, రాజకీయవేత్తలకు, ప్రభుత్వ నిర్వాహకులకు ధ్యాసలేని వైపరీత్యాలు. మట్టి ప్రమిదలు సైతం చైనా నుండి దిగుమతి అవుతున్నాయి. పొయ్యిని వెలిగించే పరికరాలు - లైటర్లు - చైనా నుండి వస్తున్నాయి! మట్టి పరిమళాలు విస్తరించిన చోట ‘ప్లాస్టిక్’ బట్టీలు పుట్టుకొచ్చాయి! మన బొట్టు మాయమైంది, జుట్టు చెరగిపోయింది, ‘కట్టు’ మారిపోయింది, కట్టుబాటు సడలిపోయింది! అంగడిలో కొనితెచ్చిన నాసిరకం మిఠాయిలను మెక్కుతూ పగలంతా పనికిరాని కార్యక్రమాలను దృశ్యమాధ్యమాలలో తిలకిస్తూ గడపడమే పండగ సంబరమైపోయింది. అంగళ్లలోను కార్యాలయాలలోను మాత్రమే ఆర్భాటమైన పూజలు చేస్తున్నవారు ఇళ్లలో ఉదయం ఎనిమిది దాటిన తరువాత కానీ నిద్రల నుండి విముక్తులు కావడం లేదు! నరక చతుర్దశినాడైనా తెల్లవారుజామున స్నానం చేయాలన్న ధ్యాసలేనివారు, విద్యాధికులుగా చెలామణి అయిపోతున్నారు!! ఇదంతా ‘ప్రపంచీకరణ’ - గ్లోబలైజేషన్, స్వేచ్ఛావాణిజ్య వ్యవస్థ- మార్కెట్ ఎకానమీ - సృష్టించిన మారీచమృగ మాయాజాలం! ఇళ్లలో వంటలు చేయడం లేదు, వండిన భోజనాలను వాణిజ్య కేంద్రాల నుంచి కొనితెచ్చుకుంటున్నవారి సంఖ్య పెరిగిపోతోంది! సంస్కృతికి కేంద్ర బిందువైన ‘కుటుంబం’ ప్రాధాన్యం కోల్పోతుండడం సంస్కార దీపాలు కొడిగట్టాయన్న వాస్తవానికి ప్రబల నిదర్శనం!
భారతీయ సంస్కార ప్రభావ దీపాల కాంతి ప్రపంచమంతటా ప్రసరించిననాటి స్మృతులు సైతం చెరగిపోతున్నాయి. అచ్చపు చీకటిండ్ల పొరలాడుచునుండ ప్రపంచమెల్ల, ఈ పచ్చని తల్లి గుమ్మములపై వెలిగెన్ మణిదీపికల్ - అన్న మహాకవి కరుణశ్రీ భారతీయ సంస్కార దీపావళిని ఆవిష్కరించాడు! ‘యోగం’ ఇప్పుడు అంతర్జాతీయ సంస్కార దీపమైంది. ‘యోగ’ దీపాలు విస్తరిస్తుండడం హర్షణీయం. కానీ బౌద్ధిక, మానసిక, భౌతిక, ప్రాకృతిక కాలుష్యాంధకారాన్ని విస్తరింప చేస్తున్న విదేశీయ వ్యూహాత్మక దురాక్రమణ వ్యవస్థీకృతమైపోయింది! చీకటిపై యుద్ధానికి ఎన్ని దీపాలు సిద్ధమవుతున్నాయి??