సంపాదకీయం

పెరిగిన మన గరిమ..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అంతర్జాతీయ న్యాయస్థానం - ఇంటర్‌నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ -ఐసిజె - పదవికి జరిగిన హోరాహోరీ పోరాటంలో మనదేశం బ్రిటన్‌ను ఓడించగలగడం ఐక్యరాజ్య సమితిలో మన దేశానికి పెరిగిన పలుకుబడికి నిదర్శనం. మనదేశం ప్రతినిధి, అంతర్జాతీయ న్యాయమూర్తి దల్వీర్ భండారీ రెండవసారి ఎన్నికకావడం మనకు లభించిన చారిత్రక దౌత్య విజయం. ఐక్యరాజ్య సమితి ‘్భద్రతా మండలి’లో శాశ్వత సభ్యత్వం కలిగిన ‘అగ్రరాజ్యం’ బ్రిటన్ ప్రతినిధి చివరి ఘట్టంలో పోటీ నుంచి వైదొలగవలసి రావడం అంతర్జాతీయ సమాజ స్వరూప స్వభావాలలో ప్రస్ఫుటిస్తున్న పరివర్తనకు మరో నిదర్శనం. ఈ పరివర్తన ప్రజాస్వామ్య ప్రభావం పెరుగుతోందనడానికి నిదర్శనం. ప్రపంచ ప్రజాస్వామ్య వ్యవస్థ - వరల్డ్ డెమొక్రాటిక్ ఆర్డర్ - గురించి అమెరికా, ఐరోపా దేశాలు పదేపదే ఆర్భాటిస్తున్నాయి. కాని ఏడు దశాబ్దులకు పైగా ఐక్యరాజ్య సమితిలో ప్రజాస్వామ్య ప్రభావం వికసించడం లేదు. వికసించడం లేదన్నదానికి ‘ఐక్యరాజ్య సమితి’ ‘్భద్రతామండలి’ - సెక్యూరిటీ కౌన్సిల్ - నిర్మాణ పద్ధతి ప్రబల తార్కాణం. పదిహేను మంది సభ్యులున్న భద్రతామండలిలో ఐదు దేశాలకు - ఎన్నికలతో ప్రజాస్వామ్య ప్రక్రియతో నిమిత్తం లేకుండా - శాశ్వత సభ్యత్వం ఏర్పడి ఉంది. మిగిలిన పది స్థానాలకు నూట ఎనబయి ఎనిమిది దేశాలు పోటీ పడవలసి వస్తోంది! రెండవ ప్రపంచ యుద్ధం పరిసమాప్తం అయిన తరువాత ఏర్పడిన ఐక్యరాజ్య సమితి యుద్ధంలో గెలిచిన మిత్రరాజ్యాల -అల్లీడ్ నేషన్స్ - కూటమిలోని అగ్రరాజ్యాల ఆధిపత్యానికి ప్రతీకగా మారింది. అందువల్లనే ఈ ‘కూటమి’లోని ఐదు అగ్రదేశాలు అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్, సోవియట్ యూనియన్ - రష్యా- చైనాలకు ‘సమితి’ భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వం లభించింది. మిత్ర రాజ్యాల కూటమికి వ్యతిరేకంగా పోరాడి ఓడిన అక్షరాజ్యాల -యాక్సిస్ పవర్స్-కూటమి దేశాలలో ఒక్కదానికి కూడ ఈ శాశ్వత సభ్యత్వం లభించలేదు. జర్మనీ, జపాన్ దేశాలు ఓడిన ‘అక్షరాజ్య కూటమి’లోని ప్రధాన దేశాలు. రెండవ ప్రపంచ యుద్ధం ఆరంభమైనప్పుడు జర్మనీ, జపాన్‌ల కూటమిగా ఉండి సోవియట్ యూనియన్ - రష్యా- యుద్ధం ముగిసేనాటికి ‘బ్రిటన్’ ‘కూటమి’లో చేరిపోయింది. యుద్ధం ఆరంభంలో జర్మనీ నియంత అడాల్ఫ్ హిట్లర్‌తో చేతులు కలిపిన సోవియట్ రష్యా కమ్యూనిస్టు నియంత జోసెఫ్ స్టాలిన్ ఆ తరువాత బ్రిటన్ ప్రధాని విన్‌స్టన్ చర్చిల్‌కు, అమెరికా అధ్యక్షుడు ఫ్రాంక్లిన్ రూజ్‌వెల్ట్‌కు సన్నిహితుడయ్యాడు! యుద్ధం ఆరంభం నాటికి ఆధిపత్యంలో అగ్రగామి అయిన బ్రిటన్ యుద్ధం ముగిసే నాటికి అమెరికాను అనుసరించవలసిన దుస్థితి దాపురించింది!!
ఇదంతా అంతర్జాతీయ ఆధిపత్య సమరంలో క్రమంగా వస్తున్న పరివర్తనకు ఉదాహరణ! ఈ పరివర్తన ప్రభావం దల్వీర్ భండారీ రెండవసారి ఎన్నిక కావడంతో మరోసారి ఫ్రస్ఫుటించింది! ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో నెలకొని ఉన్న అగ్రరాజ్యాల ఆధిపత్యం అంతర్జాతీయ న్యాయస్థానంలో కూడ కొనసాగుతోందనడానికి ‘బ్రిటన్’ ప్రాతినిధ్యం సాక్ష్యం. అంతర్జాతీయ న్యాయస్థానం ఏర్పడిన తరువాత డెబ్బయి ఒక్క ఏళ్లు గడిచాయి. ఈ ఏడు దశాబ్దులలోను బ్రిటన్‌కు చెందిన వారు అంతర్జాతీయ న్యాయస్థానం న్యాయమూర్తులుగా ఎన్నికవుతూనే ఉన్నారు. ఇలా ఒప్పందం ద్వారా భద్రతామండలిలోను ‘ఎన్నిక’ ద్వారా అంతర్జాతీయ న్యాయస్థానంలోను బ్రిటన్ ఆధిపత్యం అవిచ్ఛిన్నంగా కొనసాగింది, న్యాయస్థానంలో కూడ బ్రిటన్‌కు ‘‘శాశ్వత సభ్యత్వం’’ లభించింది. ఈ ఆధిపత్యాన్ని మనదేశం ఇప్పుడు తొలగించగలగడం, అందువల్ల చారిత్రక పరిణామం! ఏడు దశాబ్దుల చరిత్రలో మొదటిసారిగా బ్రిటన్ ప్రతినిధి లేని అంతర్జాతీయ న్యాయస్థానం ఏర్పడింది. పదిహేనుమంది న్యాయమూర్తులలో ప్రతి మూడేళ్లకోసారి మూడవ వంతు పదవినుండి వైదొలగుతున్నారు. అందువల్ల ప్రతి న్యాయమూర్తి తొమ్మిదేళ్లు పదవిలో ఉంటాడు! ఇప్పుడు మన ప్రతినిధి న్యాయమూర్తి దల్వీర్ భండారీ పదవీకాలం బ్రిటన్ ప్రతినిధి న్యాయమూర్తి క్రిష్ట్ఫర్ గ్రీన్ ఉడ్ పదవీకాలం ఒకేసారి ముగిశాయి. ఇద్దరూ రెండవసారి పోటీ చేశారు...
న్యాయమూర్తి దల్వీర్ భండారీకి, న్యాయమూర్తి క్రిష్ట్ఫర్ గ్రీన్ ఉడ్‌కు మధ్య జరిగిన పోటీలో అనేకసార్లు ‘మతదానం’ -పోలింగ్ -జరిగింది. సమితి సర్వప్రతినిధి సభ - జనరల్ అసెంబ్లీ -లో మన ప్రతినిధికి ప్రతిసారీ మూడింట రెండు వంతుల ఆధిక్యం లభించడం ప్రపంచ దేశాల మధ్య మనకు పెరిగిన పలుకుబడికి నిదర్శనం. కాని భద్రతామండలి - సెక్యూరిటీ కౌన్సిల్-లోని పదిహేను మందిలో ఆరుగురు మాత్రమే మనకు మద్దతు పలికారు. అగ్రరాజ్యాల ‘పెత్తనం’ సర్వప్రతినిధి సభలో సన్నగిల్లిపోయినప్పటికీ భద్రతామండలిలో మాత్రం అగ్రరాజ్యాల ఆధిపత్యం ఇంకా కొనసాగుతోందనడానికి ఇది నిదర్శనం. ఈ ‘ఆధిపత్యం’ కారణంగానే ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యదర్శి పదవికి 2006లో పోటీ చేసిన మన ప్రతినిధి శశిథరూర్ అర్థాంతరంగా పోటీనుంచి తప్పుకోవలసి వచ్చింది. అగ్రరాజ్యాలు బలపరిచిన దక్షిణ కొరియా ప్రతినిధి బన్ కీ మూన్ ప్రధాన కార్యదర్శిగా ఎన్నికకాగలిగాడు. అందువల్ల నలుగురు న్యాయమూర్తులు ఏకగ్రీవంగా ఎన్నికయిన తరువాత ఐదవ స్థానం కోసం మన భండారీకి బ్రిటన్ ప్రతినిధికీ మధ్య పోటీ నెలకొనగానే 2006 ధరూర్ నాటి ‘కథ’ పునరావృత్తం అవుతుందేమోనన్న ఉత్కంఠ కూడా నెలకొనింది. కానీ ఇప్పుడు మన కథ సుఖాంతమైంది. ‘మండలి’లో శాశ్వత సభ్య దేశమైన బ్రిటన్ పదకొండుసార్లు ‘మతదానం’ జరిగిన తరువాత లాభం లేదనుకొని పోటీ నుంచి వైదొలగింది.. ప్రజాస్వామ్య ప్రభావం క్రమంగా ప్రస్ఫుటిస్తోంది! ఒకప్పటి బ్రిటన్ ఓడదొంగల దేశం. సముద్రాలలో ప్రయాణించిన వాణిజ్య నౌకలను బ్రిటన్ ప్రభుత్వమే కొల్లగొట్టించేది. క్రీస్తుశకం పదహారవ శతాబ్ది తరువాత బ్రిటన్ క్రమంగా దేశాలను కొల్లగొట్టింది. ఇరవై శతాబ్ది ఆరంభం నాటికి బ్రిటన్ రవి అస్తమించని వాణిజ్య రాజకీయ సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేసుకొంది. ఈ సామ్రాజ్యంలో మనదేశం ఒక ‘వలస’-కాలనీ- అయింది, దాస్యగ్రస్తమైంది. రెండవ ప్రపంచ యుద్ధం తరువాత బ్రిటన్ సామ్రాజ్యం క్రమంగా అంతరించిపోయింది... మనదేశ ప్రతినిధి బ్రిటన్ ప్రతినిధిని ఓడించడం అందువల్ల చారిత్రక శుభ పరిణామం...
ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి అంతర్జాతీయ న్యాయస్థానం వలె సమానత్వానికి వేదిక కావాలి! ప్రస్తుతం బ్రిటన్ అమెరికా ఫ్రాన్స్ రష్యా చైనాలకు శాశ్వత సభ్యత్వం ఉంది. నిర్ణాయిక నిరోధ అధికారం - వీటో పవర్- ఉంది. మిగిలిన దేశాలకు లేని ఈ ప్రత్యేకత ఈ దేశాలకుండడం ‘ప్రజాస్వామ్య వ్యవస్థ’కు విఘాతకరం. అందువల్ల ఈ ఐదు దేశాల శాశ్వత సభ్యత్వాన్ని, ‘వీటో’ అధికారాన్ని రద్దు చేయించడానికై ప్రవర్థమాన దేశాలతో కలసి మనదేశం ఉద్యమించాలి...