సంపాదకీయం

అఫ్ఘానీ అంతరంగం..?!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అఫ్ఘానిస్థాన్‌లో చైనా వారి వ్యూహాత్మక దురాక్రమణ వేగవంతం అవుతుండడం మన దేశానికి ‘‘ఆందోళన కలిగించవలసిన’’ విపరిణామం! అఫ్ఘానిస్తాన్ అమెరికా, సోవియట్ రష్యాల మధ్య నడచిన ప్రచ్ఛన్న యుద్ధానికి రంగస్థలం కావడం రెండు దశాబ్దులకు పూర్వం నడచిన చరిత్ర! నాలుగు దశాబ్దుల క్రితం సోవియట్ రష్యా సేనలు చొరబడడంతో ఈ ప్రచ్ఛన్న యుద్ధం మొదలైంది. రష్యా ఆధిపత్యాన్ని, అక్రమ ప్రమేయాన్ని తొలగించడం కోసం అమెరికా అమలు జరిపిన వ్యూహం ‘‘బెడిసికొట్టడం’’ కూడ చరిత్ర.. అయ్యవారిని చేయబోతే ‘అసురుడు’ అవతరించినట్టుగా ‘తాలిబన్’ల పాలనకు, ‘అల్‌ఖాయిదా’ మతోన్మాదానికి ఏళ్ల తరబడి అఫ్ఘానిస్తాన్ బలైపోయింది, మత సహిష్ణుతకు ఆనవాళ్లుగా మిగిలిన హైందవ చారిత్రక చిహ్నాలను, బుద్ధుని బొమ్మలను తాలిబన్లు ధ్వంసం చేయడం 1990 దశకం నాటి చరిత్ర. అదే సమయంలో సోవియట్ రష్యా కమ్యూనిస్టు సామ్రాజ్యం విచ్ఛిన్నమైపోవడం, సోవియట్ యూనియన్ పదిహేను దేశాలుగా విడిపోవడం వంటి పరిణామాల వల్ల ‘ప్రచ్ఛన్న యుద్ధం’ ప్రాధాన్యాన్ని కోల్పోయింది! అమెరికా ఏకైక అగ్రరాజ్యంగా అవతరించింది! రెండు దశాబ్దుల తరువాత ఇప్పుడు మళ్లీ ‘ప్రచ్ఛన్న యుద్ధం’ మొదలైపోయింది. కానీ ఇప్పుడు అమెరికా ‘‘సామ్రాజ్యవాదానికి’’ - ఇంపీరియలిజమ్ - ప్రత్యర్థి ‘సోవియట్ రష్యా’ వారి ‘‘విస్తరణ వాదం’’ - ఎక్స్‌పాన్షనిజమ్ - కాదు, ‘సోవియట్ రష్యా’ లేదు కూడ! సోవియట్ యూనియన్ విచ్ఛిత్తి తరువాత మిగిలిన రష్యా కొనే్నళ్లు అమెరికాకు ‘తోక’గా మారింది. బోరిస్ యెల్టిసిన్ రష్యా అధ్యక్షుడుగా ఉన్న సమయం అది. వ్లాదిమిర్ పుతిన్ పాలన ప్రారంభమైనప్పటి నుంచి రష్యా చైనాకు చేరువైంది, చైనాకు దాదాపు ‘తోక’గా మారి ఉంది. అందువల్ల ప్రస్తుతం అమెరికా రాజకీయ ఆర్థిక సామ్రాజ్యవాదానికీ, చైనా వ్యూహాత్మక, వాణిజ్య దురాక్రమణకూ మధ్య ప్రచ్ఛన్న యుద్ధం నడుస్తోంది. చైనా అఫ్ఘానిస్తాన్‌లో చొరబడిపోతుండడానికి ఈ రాజకీయ, వాణిజ్య, వ్యూహాత్మక ప్రచ్ఛన్న సమరం నేపథ్యం.. ఈ ‘సమరం’లో మన దేశం అమెరికాతో జట్టుకట్టడం అనివార్య పరిణామం. ఎందుకంటే చైనా ఆధిపత్య విస్తరణ విధానానికి వౌలిక లక్ష్యం మన దేశాన్ని బలహీన పరచడం. 1962 నాటి భౌతిక దురాక్రమణ తరువాత యాబయి ఐదు ఏళ్లుగా చైనా మన దేశానికి వ్యతిరేకంగా వ్యూహాత్మక, దౌత్య, వాణిజ్య, రాజకీయ దురాక్రమణను కొనసాగిస్తోంది. ఈ కొనసాగింపులో భాగం అఫ్ఘానిస్తాన్‌లో చైనా వారి వాణిజ్య ప్రమేయం పెరుగుతుండడం.. ‘చైనా - పాకిస్తాన్ ఆర్థిక వాటిక - చైనా పాకిస్తాన్ ఎకనమిక్ కారిడార్ - సిపిఇసి - ను అఫ్ఘానిస్తాన్‌కు విస్తరింప చేయాలన్న చైనా ప్రతిపాదన మన దేశాన్ని బలహీనపరచాలన్న వ్యూహంలో భాగం..
పాకిస్తాన్‌లో చైనా నిర్మిస్తున్న ఈ ‘‘ఆర్థిక వాటిక’’ బలూచిస్థాన్ నుంచి సింకియాంగ్ వరకూ కొనసాగుతోంది. ‘పాకిస్తాన్ దురాక్రమిత కశ్మీర్’ - పాక్ ఆకుపయిడ్ కశ్మీర్ - పిఓకె - గుండా ఈ ‘వాటిక’ విస్తరించడం పట్ల మన ప్రభుత్వం చైనాకు పదేపదే నిరసనలను తెలిపింది. చైనా ఈ ‘నిరసనల’ను లెక్కచేయకుండా ‘పిఓకె’లో నిర్మాణాలను కొనసాగిస్తూనే ఉంది! దాదాపు పదమూడు వేల చైనా సైనికులు, పాకిస్తాన్ దురాక్రమిత కశ్మీర్‌లో తిష్ఠవేసి ఉన్నట్లు ఆరేళ్ల క్రితమే ప్రచారం జరిగింది. చైనా వాణిజ్య సంస్థలు, వ్యాపారవేత్తలు ఈ ఆర్థిక వాటికలోకి చొరబడుతుండడం గత రెండేళ్ల కథ. 1947 నుంచి ఎనబయి మూడు వేల చదరపు కిలోమీటర్ల జమ్మూ కశ్మీర్ ప్రాంతాలు పాకిస్తాన్ అక్రమ ఆక్రమణలో ఉన్నాయి. ఇందులో దాదాపు ఆరువేల చదరపు కిలోమీటర్ల ‘కారాకోరమ్’ ప్రాంతాన్ని పాకిస్తాన్ ప్రభుత్వం 1963లో చైనాకు కట్టబెట్టింది. ఈ ప్రాంతం గుండా చైనా రహదారులను నిర్మించింది, ఇప్పుడు రైలుమార్గాన్ని కూడ ఏర్పాటు చేయనున్నట్టు ప్రకటించింది! ఈ రైలు మార్గం టిబెట్ నుంచి సింకియాంగ్ - జింఝియాంగ్ - మీదుగా అప్ఘానిస్థాన్ వరకూ, ఇరాన్ ఇరాక్‌ల వరకూ కొనసాగించాలన్నది చైనా పథకం! ‘చైనా పాకిస్తాన్ ఆర్థిక వాటిక’లో అఫ్ఘానిస్థాన్‌ను కూడా చేర్చుకోవాలన్న ప్రతిపాదనకు ఇదీ నేపథ్యం.. మంగళవారం, చైనా రాజధాని బీజింగ్‌లో జరిగిన ‘చైనా అఫ్ఘానిస్థాన్ పాకిస్తాన్’ త్రైపాక్షిక సమావేశంలో చైనా ఈ ప్రతిపాదన చేసింది! అఫ్ఘానిస్థాన్ విదేశాంగ మంత్రి సలాహ్ ఉద్దీన్ రబ్బానీ పాకిస్తాన్ విదేశాంగ మంత్రి ఖావాజా ఆసిఫ్, చైనా విదేశాంగ మంత్రి వాంగ్ రుూ ఈ సమావేశంలో ఈ ప్రతిపాదనను చర్చించారు..
అఫ్ఘానిస్థాన్ ఈ ‘ఆర్థిక వాటిక’ పథకంలో చేరినట్టయితే ఆ దేశంతో మన స్నేహ సంబంధాలు సన్నగిల్లే ప్రమాదం ఉంది! ఈ ‘ఆర్థిక వాటిక’ వల్ల మనం ‘చైనా, పాకిస్తాన్’ కూటమితో తలపడవలసి వస్తోంది. జమ్మూకశ్మీర్ మొత్తం మన దేశంలో భాగం! ద్వైపాక్షిక చర్చల ద్వారా ‘పాకిస్తాన్ దురాక్రమిత కశ్మీర్’ మనకు లభించబోదు. ఎప్పటికైనా యుద్ధం చేయడం ద్వారా మాత్రమే ‘పాకిస్తాన్ దురాక్రమిత’ కశ్మీర్‌ను మనం మళ్లీ స్వాధీనం చేసుకోగలం. కానీ అలాంటి స్థితిలో మనం చైనా పాకిస్తాన్ ఉమ్మడి బలగాలతో తలపడవలసిన పరిస్థితి ఈ ‘ఆర్థిక వాటిక’ ద్వారా దాపురించి ఉంది! ఇదంతా అఫ్ఘానిస్థాన్ ప్రభుత్వానికి తెలుసు! అందువల్ల చైనా ప్రతిపాదనను అంగీకరించి ఈ ‘ఆర్థికవాటిక’ తమ దేశంలోకి విస్తరించడానికి అఫ్ఘానీ ప్రభుత్వం అంగీకరించినట్టయితే అది మన దేశం పట్ల అమిత్ర వైఖరి కాగలదు. తాలిబన్ల, అల్‌ఖాయిదా మూకల పెత్తనం కింద దశాబ్దిపాటు అఫ్ఘాన్ ఆర్థిక వ్యవస్థ ఛిన్నాభిన్నమైంది! పునర్ నిర్మాణంలో మన ప్రభుత్వం గత పదిహేను ఏళ్లుగా ప్రముఖ భూమికను పోషిస్తోంది. అఫ్ఘానిస్తాన్‌కు మన ప్రభుత్వం కొత్త పార్లమెంట్ భవనాన్ని నిర్మించి ఇవ్వడం ఈ పునర్ నిర్మాణ భాగస్వామ్యంలో ప్రముఖ ఘట్టం! తాలిబన్ల మతోన్మాద బీభత్స పాలన నుండి విముక్తమైన అఫ్ఘానిస్తాన్‌తో మొట్టమొదట ‘వ్యూహాత్మక భాగస్వామ్యపు ఒప్పందం’ కుదుర్చుకున్నది మనదేశమే! ఈ ఒప్పందం కింద అఫ్ఘానిస్తానీ సైనికులకు శిక్షణనిచ్చే కార్యక్రమాన్ని కూడ మన ప్రభుత్వం స్వీకరించింది. పాకిస్తాన్ ద్వారా కాక ఇరాన్ ద్వారా అఫ్ఘానిస్తాన్‌కు ఆహార ధాన్యాలను ఎగుమతి చేసే కార్యక్రమానికి కూడ మన ప్రభుత్వం శ్రీకారం చుట్టింది! ఇరాన్‌లోని చౌబహార్ ఓడరేవును మన ప్రభుత్వం ఆధునీకరించడంలో ఇదంతా భాగం..
అఫ్ఘానిస్థాన్‌లో బీభత్స కలాపాలను సాగిస్తున్న ‘హక్కానీ’ తదితర జిహాదీ ముఠాలను పాకిస్తాన్ ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది. ఈ బీభత్సకాండ అఫ్ఘానిస్థాన్‌లో మన రాయబార కార్యాలయాలకు, వాణిజ్య కలాపాలకు వ్యతిరేకంగా కూడ కొనసాగుతోంది! అయినప్పటికీ అప్ఘానిస్తాన్ ప్రభుత్వం పాకిస్తాన్‌తోను చైనాతోను చేతులు కలుపుతుండడం అంతుపట్టని వ్యవహారం. 2014లో అమెరికా నాయకత్వంలోని ‘నాటో’ - ఉత్తర అట్లాంటిక్ రక్షణ కూటమి - దళాలు తమ దేశం నుంచి నిష్క్రమించిన తరువాత అప్ఘానిస్థాన్ మనకు మరింత చేరువ కాగలదన్న ప్రచారం జరిగింది. కానీ అప్ఘానిస్తాన్ పాకిస్తాన్‌తోను చైనాతోను గట్టి జట్టు కడుతున్న నిదర్శనాలు గత మూడేళ్లుగా ప్రస్ఫుటిస్తున్నాయి.