సంపాదకీయం

‘ఐఎస్‌ఐ’ కొత్త ఎత్తు..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మన దేశంలో బీభత్స కలాపాలను నిర్వహించడానికై సిక్కు యువకులను పాకిస్తాన్ ప్రభుత్వం ఉసిగొల్పుతుండడం ఆశ్చర్యకరం కాదు. పాకిస్తాన్ ప్రభుత్వం ‘బీభత్స వ్యవస్థ’- టెర్రరిస్ట్ రిజీమ్- అన్న వాస్తవానికి ఇది మరొక ధ్రువీకరణ మాత్రమే! మన దేశంలోకి చొరబడి మన ప్రజలను హత్యచేస్తున్న వివిధ బీభత్స‘తండా’లకు వౌలిక ‘స్ఫూర్తి’ కేంద్రం పాకిస్తానీ ‘ఇంటర్ సర్వీసెస్ ఇంటలిజెన్స్’- ఐఎస్‌ఐ-! పాక్ ప్రభుత్వ ‘గూఢచర్య విభాగం’గా చెలామణి అవుతున్న ‘ఐఎస్‌ఐ’ నిజానికి ప్రభుత్వ బీభత్స విభాగం. ఉగ్రవాద మూకలు వివిధ రకాల పేర్లతో చెలామణి అవుతున్నప్పటికీ అన్నింటినీ ఉసిగొల్పుతున్నది మాత్రం ‘ఐఎస్‌ఐ’. ఒక ‘ముఠా’ జరిపిన, జరుపుతున్న హత్యాకాండకు ప్రాధాన్యం తగ్గించడానికి, మన దృష్టిని మళ్లించడానికి వీలుగా పాకిస్తాన్ ప్రభుత్వం మరో ‘ముఠా’ను తయారుచేస్తోంది, ఉసిగొల్పుతోంది. ఇలా దశాబ్దుల తరబడి పాకిస్తాన్‌లోను, మన దేశంలోను పుట్టుకొచ్చిన పుట్టపగిలిన వివిధ రకాల హంతక ముఠాలను ‘ఐఎస్‌ఐ’ అనుసంధానం చేస్తోంది. ఇరుగు పొరుగు దేశాల్లోని ఉగ్రమూకల ముఠాలన్నింటినీ ‘ఐఎస్‌ఐ’ అనుసంధానం చేస్తుండడం దశాబ్దుల చరిత్ర. శ్రీలంకలోని ‘తమిళ ఈలం లిబరేషన్ టైగర్స్’- ఎల్‌ఇటిటిఇ-, నేపాల్‌లోని మావోయిస్టు బీభత్స ముఠా, అప్ఘానిస్తాన్‌లోని తాలిబన్, అల్‌ఖాయిదా తండాలు, బంగ్లాదేశ్‌లోని హుజి, బర్మాలోని ‘రోహింగియా’ విచ్ఛిన్నకారుల ముఠాలను, ఉగ్రమూకలను ఒకే తాటిపైకి తీసుకొని రావడం ‘ఐఎస్‌ఐ’ దశాబ్దుల తరబడి నిర్వహించిన ప్రధాన కార్యక్రమం. మన దేశంలో పుట్టిపెరిగిన వారిని సైతం మన దేశానికి వ్యతిరేకంగా ‘టెర్రరిస్టులు’గా తీర్చిదిద్దడం మరో అంశం! ఈ వ్యూహంలో భాగంగా మన దేశంలోని యువజనులను పాకిస్తాన్‌కు తరలించుకొనిపోతున్నారు, ‘తర్ఫీదు’నిచ్చి మళ్లీ మన దేశంలోకి తోలుతున్నారు. ఇలా రూపొందిన ‘తోడేళ్లు’ నకిలీ ‘ప్రయాణ పత్రాలు’- ‘ఫేక్ పాస్‌పోర్ట్’లు, నకిలీ ప్రవేశపత్రాలు ‘ఫేక్ వీసా’లు- నకిలీ గుర్తింపు పత్రాలతో పాక్ నుండి మన దేశానికి, మన దేశం నుండి వివిధ దేశాలకు యథేచ్ఛగా రాకపోకలు సాగిస్తున్నారు. బంగ్లాదేశ్, నేపాల్, బర్మా (మ్యాన్‌మార్) సరిహద్దుల్లో ఇలాంటి వారిని మన ‘నిఘా’ అధికారులు పట్టుకుంటూనే ఉన్నారు. అప్ఘానిస్థాన్ నుంచి పలాయనం చిత్తగించి యెమెన్ తదితర పర్షియా సింధుశాఖ దేశాలలోను, పశ్చిమ ఆసియా దేశాలలోను స్థావరాలను ఏర్పరచుకున్న తాలిబన్, అల్‌ఖాయిదా మూకలను ‘ఐఎస్‌ఐ’ ఓడదొంగలతో అనుసంధానం చేయగలిగింది. ఈ అనుసంధానం తరువాత సోమాలియా సముద్ర తీరంలోని ఓడదొంగలు అరేబియా సముద్రం, హిందూ మహాసాగర జలాలలోను విచ్చలవిడిగా అపహరణ కలాపాలకు పాల్పడుతున్నారు.
మాల్దీవుల్లో భారత వ్యతిరేక కలాపాలు పెచ్చుపెరగడం కూడ ‘ఐఎస్‌ఐ’ చేస్తున్న అనుసంధానంలో భాగం. పాక్‌లోని ‘ఐఎస్‌ఐ’ రహస్య శిబిరాల్లోను, ‘లష్కర్ ఏ తయ్యబా’వంటి ముఠాల బహిరంగ స్థావరాల్లోను శిక్షణ పొందిన జిహాదీ ఉగ్రవాదులు మాల్దీవుల పోలీసులను, సైనికులను, ప్రభుత్వ యంత్రాంగాన్ని, రాజకీయ కలాపాలను నిర్దేశిస్తున్నారు. జమ్మూ కశ్మీర్‌లో ‘అధీనరేఖ’- లైన్ ఆఫ్ కంట్రోల్- ఎల్‌ఓసి-వద్ద ‘ప్రచ్ఛన్న’ బీభత్సకారులైన పాక్ సైనికులు - రేంజర్లు- నిరంతరం కాల్పులు జరుపుతున్నారు. కశ్మీర్ లోయలో ప్రత్యక్ష బీభత్సకారులు రాళ్ళు రువ్వడం వంటి కలాపాలను మళ్లీ ఉద్ధృతం చేస్తున్నారు. పాకిస్తాన్‌లోని మన రాయబారి కార్యాలయంలోని సిబ్బందిని, ఇతర దౌత్య కార్యాలయాల్లోని సిబ్బందిని ‘ఐఎస్‌ఐ’ తదితర ప్రభుత్వ విభాగాలవారు వేధింపులకు గురిచేస్తున్నారు. ఈ దుశ్చర్యల్ని కప్పిపుచ్చుకునేందుకు పాక్ ప్రభుత్వం మన ప్రభుత్వానికి వ్యతిరేకంగా అబద్ధాలను ప్రచారం చేస్తోంది. ఢిల్లీలోని తమ రాయబారి కార్యాలయం సిబ్బందిని మన నిఘా విభాగాలు వేధింపులకు గురిచేస్తున్నారన్నది ఈ అసత్య ప్రచారం! అంతర్జాతీయ సమాజంలో తమ బీభత్సకాండ పట్ల నిరసన ధ్వనులు చెలరేగుతున్నందువల్ల పాక్ ఇలాంటి అసత్య ప్రచారానికి పూనుకొనడం దృష్టిని మళ్లించే పన్నాగంలో భాగం..
ఇలా సమస్యను జమ్మూ కశ్మీర్‌లో కేంద్రీకృతం చేసిన పాకిస్తాన్, మన దృష్టి కశ్మీర్‌లో జరుగుతున్న ప్రత్యక్ష, ప్రచ్ఛన్న బీభత్స కాండపై కేంద్రీకృతమైన వేళ పంజాబ్‌లోకి తన ఉగ్ర కలాపాలను విస్తరించడానికి పూనుకొంది. విదేశాలలో ఉన్న సిక్కులను వివిధ ప్రక్రియల ద్వారా ఆకర్షించి పాకిస్తాన్‌కు తరలించుకొని పోవడం ఇందులో భాగం. ఉపాధి లేని, నేరాలు చేసి జైళ్లలో ఉన్న, అసత్య ప్రచారాన్ని నమ్మి మాతృదేశం పట్ల విద్వేషం పెంచుకున్న సిక్కు యువకులను ‘ఐఎస్‌ఐ’ గుర్తిస్తోంది. ఇలాంటి వారికి పాక్‌లోని ‘ఐఎస్‌ఐ’ కేంద్రాల్లో భారత వ్యతిరేక భౌతిక, బౌద్ధిక శిక్షణను ఇస్తున్నట్టు ధ్రువపడింది. ఐరోపా దేశాలలోను, అమెరికాలోను, కెనడాలోను స్థిరపడిన సిక్కు కుటుంబాలపై ‘ఐఎస్‌ఐ’ అసత్య ప్రచార ప్రభావం పడుతున్నట్టు దేశ వ్యవహారాల మంత్రిత్వశాఖ అధికారులు నిర్ధారించారు. ఈ అధికారులు సమర్పించిన వివరాలను మురళీమనోహర్ జోషి అధ్యక్షతన ఏర్పడి ఉన్న ఉప సంఘం వారు ఇటీవల లోక్‌సభకు నివేదించారు! 1980వ దశకంలో పంజాబ్‌లో చెలరేగిన దేశ విద్రోహ విచ్ఛిన్నకాండను ప్రభుత్వం ఆ తరువాత అణచివేసింది. పంజాబ్‌ను మనదేశం నుండి విడగొట్టి ‘ఖలిస్థాన్’గా ఏర్పాటు చేయాలన్న విద్రోహలక్ష్యంతో ఈ విచ్ఛిన్నకాండ చెలరేగింది. ఈ విచ్ఛిన్న భావాలకు ప్రాతిపదిక 1947లో మత ప్రాతిపదికన జరిగిన అఖండ భారతదేశ విభజన. ఇస్లాం మతస్థులు అనాది హైందవ జాతిలో, అఖండ భారత్‌లో భాగం కాదని, ఇస్లాం మతస్థులు ప్రత్యేక జాతి అని మహమ్మదాలీ జిన్నా నాయకత్వంలోని ‘ముస్లిం లీగ్’ 1947వరకు సాగించిన అసత్య ప్రచారం దేశ విభజనకు ప్రాతిపదిక, పాకిస్తాన్ ఏర్పాటుకు ప్రాతిపదిక.
ఇస్లాం మతస్థులకు పాకిస్తాన్ లభించింది కాబట్టి క్రైస్తవ మతస్థులకు కూడ ప్రత్యేక దేశం కావాలన్న విద్రోహవాంఛ నాగాలాండ్, మిజోరమ్ వంటిచోట్ల దశాబ్దుల కల్లోలానికి కారణం. ఇదే రీతిలో సిక్కులకు ప్రత్యేక దేశం- ఖలిస్తాన్- కావలన్న విద్రోహ వాంఛ కూడ 1970వ, 1980వ దశకాలలో అంకురించి, అంతరించింది. అఖండ భారత్‌లో సిక్కులు ఎప్పుడూ ప్రత్యేక దేశాన్ని కోరలేదు. సిక్కు మతం పుట్టింది, పెరిగింది విదేశీయ మతోన్మాద బీభత్సకాండను ప్రతిఘటించడానికే. శతాబ్దుల తరబడి సిక్కులు అఖండ భారత సరిహద్దుల రక్షణకై, ప్రాదేశిక సమగ్రత పరిరక్షణకై తమ జీవితాలను సమర్పించారు. అలాంటి సిక్కులలో అతి కొద్ది మంది మాత్రమే ప్రత్యేక దేశం కావాలని కోరడానికి కారణం- పాకిస్తాన్ ఏర్పాటు! సిక్కులు ‘ఖలిస్తాన్’ వాదాన్ని తిరస్కరించారు.. సిక్కులు భరతమాత వజ్రాల బిడ్డలు..