సంపాదకీయం

క్రీడాస్ఫూర్తి ఆవిరి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లిచినా ఓడినా ఒకే రీతిలో స్పందించడమే క్రీడాస్ఫూర్తి. ‘పెద్దమనుషుల ఆట’ క్రికెట్‌లో దీనికే పెద్దపీట. కానీ, క్రీడాస్ఫూర్తిని మంటగలిపి, గెలడానికి ఎన్ని అడ్డదారులైనా తొక్కవచ్చన్న సరికొత్త సిద్ధాంతం క్రికెట్‌ను భ్రష్టుపట్టిస్తున్నది. దక్షిణాఫ్రికాతో జరిగిన మూడో టెస్టు మ్యాచ్ మూడో రోజు ఆటలో ఆస్ట్రేలియా ఆటగాడు కామెరాన్ బాన్‌క్రాఫ్ట్ బంతి ఆకారాన్ని మార్చడానికి ప్రయత్నించిన సంఘటనే ఇందుకు నిదర్శనం. అక్రమ పద్ధతుల్లో గెలవడానికి చేసే ప్రయత్నాలన్నింటిలోకీ అత్యంత ప్రమాదకరమైనది బాల్ ట్యాంపరింగ్. బ్యాట్స్‌మెన్‌ను త్వరగా ఔట్ చేయడానికి లేదా గాయపరచడానికి ఉద్దేశ పూర్వకంగా బంతి ఆకారాన్ని మార్చడమే బాల్ ట్యాంపరింగ్. క్రికెట్‌లో పెరుగుతున్న అతి ధోరణులకు ఈ పోకడలే నిదర్శనం. క్రికెటర్ల అనైతిక విధానాల కారణంగా వినోదం అటకెక్కింది. క్రీడాస్ఫూర్తి అడుగంటి పోయింది. ‘జంటిల్మన్ గేమ్’ తన పెద్దరికాన్ని కోల్పోయింది. కళాత్మక విలువలతో అంతులేని వినోదాన్ని పంచే ఉదాత్తమైన ఆశయాలు బుగ్గిపాలవుతున్నాయి. విలువలు పతనమవుతున్నాయి. అవాంఛిత ధోరణులు క్రికెట్ ఉనికికే ప్రమాదకరంగా మారాయి. మ్యాచ్ ఫిక్సింగ్‌లు, స్పాట్ ఫిక్సింగ్‌లు క్రికెట్ పరువును బజారుకీడిస్తే, ట్యాంపరింగ్ సంఘటనలు ఈ క్రీడపట్ల అభిమానులకు ఉన్న అపారమైన నమ్మకానికి నిలువుపాతర వేస్తున్నాయి. ప్రపంచ క్రికెట్‌లో తనకు తిరుగులేదని నిరూపించుకోవడానికి ఆస్ట్రేలియా ఎంతటి నీచానికైనా దిగజారగలదని తాజా ఉదంతం చాటింది. ప్రత్యర్థి ఆటగాళ్లను హేళన చేసి, వారి ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీసే ‘స్లెడ్జింగ్’కు పెట్టింది పేరైన ఆస్ట్రేలియా వికృత రూపం ట్యాంపరింగ్ కేసుతో మరోసారి ఆవిష్కృతమైంది. కోరల్లేని అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) తమాషా చూడడం తప్ప ఏమీ చేయలేకపోతున్నది. ప్రపంచ క్రికెట్‌ను శాసించాల్సిన ఐసీసీ కేవలం రెండుమూడు దేశాల గుప్పిట్లో చిక్కుకొని విలవిల్లాడుతూ, ప్రక్షాళన దిశగా అడుగులు వేయలేకపోతున్నది. అడ్డదారుల ఆస్ట్రేలియా అడ్డగోలుగా నిబంధనలకు గండికొడుతునే ఉంది.
స్వయం కృషిపై నమ్మకం లేనప్పుడే కృత్రిమంగా సృష్టించుకున్న విధానాలతో గట్టెక్కే ప్రయత్నాలు చేస్తారు. ఆస్ట్రేలియా క్రికెటర్లు అనుసరిస్తున్న విధానం కూడా ఇదే. ఇంగ్లాండ్‌తో టెస్టు సిరీస్ ‘యాషెస్’ పోరుగా మారడానికి ఆస్ట్రేలియనే్ల కారణమన్నది వాస్తవం. యథేచ్ఛగా అక్రమ మార్గాలను అనుసరిస్తూ, క్రికెట్‌లో రారాజులమంటూ విర్రవీగడం ఆ జట్టుకే సాధ్యమైంది. క్రికెట్ మ్యాచ్‌ల్లో అక్రమాలు, అన్యాయాలు, అవాంఛనీయ ధోరణులను అడ్టుకోవడానికి ఐసీసీ ఎన్నో నిబంధనలను ప్రవేశపెట్టింది. కానీ, వాటిని అమలు చేయడంలోనే దారుణంగా విఫలమవుతున్నది. మరోవైపు ఈ నిబంధనల్లోని లొసుగులను తమకు అనుకూలంగా మార్చుకుంటూ, అడ్డదారులు తొక్కే క్రికెటర్లు పెరుగుతున్నారు. బాల్ ట్యాంపరింగ్ అంశాన్ని ఐసీసీ నిబంధనల్లోని 42.3 అధికరణ ప్రస్తావించింది. అన్ని కోణాల్లో అధ్యయనం చేసి, నిబంధనలను దుర్వినియోగం చేయకుండా జాగ్రత్త పడాలన్న కనీస ఆలోచన ఐసీసీకి లేకపోవడం ట్యాంపరింగ్ యథేచ్ఛగా కొనసాగడానికి ప్రధాన కారణం. బంతి మెరుపు తగ్గకుండా ఉండడానికి దానిని దుస్తులపై బలంగా రుద్దడం, లాలాజలాన్ని పూసి ‘షైనింగ్’కు ప్రయత్నించడం నిబంధనలకు విరుద్ధమేమీ కాదు. ‘కృత్రిమ పదార్థాన్ని’ బంతిపై రుద్దడానికి వీల్లేదని మాత్రమే ఐసీసీ నిబంధన చెప్తున్నది. ఇంతకీ ‘కృత్రిమ పదార్థం’ అంటే ఏమిటనే స్పష్టతనివ్వలేదు. ఫీల్డింగ్ చేస్తున్నప్పుడు దాహం వేయకుండా నమిలే చూయింగ్ గమ్ లేదా మింట్ కూడా కృత్రిమ పదార్థం కిందకే వస్తుందా? వీటిని తిన్నాక, లాలాజలాన్ని బంతిపై రుద్దవచ్చా? ఈ ప్రశ్నలకు ఐసీసీ వద్ద సమాధానం లేదు. ఒకవేళ లాలాజలం తప్ప ఇతరత్రా ఏదైనా కృత్రిమ పదార్థం కిందకు వస్తుదని అంటే, మైదానంలో ఎవరూ చూయింగ్ గమ్ నమలకూడదు, మింట్ తినకూడదు, కూల్ డ్రింక్స్ తాగకూడదు. స్నాక్స్ కూడా తప్పే. ఇది సాధ్యమా? టెస్టు మ్యాచ్‌లు ఆడుతున్నప్పుడు ఆటగాళ్లను రోజంతా మంచినీళ్లు మాత్రమే తాగాలని ఆదేశించగలుగుతారా? ఐసీసీ వద్ద వీటిలో ఏ ప్రశ్నకూ సమాధానం లేదు. ఒకవేళ ట్యాంపరింగ్‌పై స్పష్టతనిచ్చి, కఠినంగా వ్యవహరించడం ఆచరణ సాధ్యమా? ఐసీసీకి వచ్చే ఆదాయంలో ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, భారత్ సంయుక్త వాటా సుమారు 85 శాతం. ‘బిగ్ త్రీ’గా చెలామణి అవుతూ, ప్రపంచ క్రికెట్‌ను పరోక్షంగా శాసిస్తున్న ఈ మూడు దేశాలకు ముకుతాడు వేసే స్థితిలో ఐసీసీ లేదు. జరుగుతున్న పరిణామాలను చూసీచూనట్టు వదిలేయడం మినహా చేయగలిగింది కూడా ఏమీ లేదు.
ఆస్ట్రేలియా వంటి దేశాల తీరు మారాలంటే, ముందుగా ఐసీసీ ప్రక్షాళన అవసరం. ఏదైనా సంచలన సంఘటన జరిగినప్పుడు గాఢనిద్ర నుంచి మేల్కోవడం, కఠిన చర్యలు తప్పవంటూ హెచ్చరికలు జారీ చేయడం, ఆ వెంటనే అన్నీ మరచిపోయి మళ్లీ సుసుప్తావస్థకు చేరుకోవడం ఐసీసీ ఆనవాయితీ. క్రికెట్ పెద్దన్నవన్నీ తాటాకు చప్పుళ్లే. ఐపీఎల్‌లో స్పాట్ ఫిక్సింగ్ కేసుపై సుప్రీం కోర్టు స్పందించి, ప్రక్షాళన చర్యలు తీసుకుంటున్నట్టే- ఐసీసీని సరైన దారిలో పెట్టడానికి క్రికెట్ ఆడే దేశాలన్నీ కృషి చేయాలి. ‘బిగ్ త్రీ’ దేశాలు బిగించిన సంకెళ్లను తెంచుకోవడానికి ఐసీసీ ప్రయత్నించాలి. సభ్య సంఘాలన్నీ మద్దతునివ్వాలి. క్రీడాస్ఫూర్తికి గండికొట్టే ఆటగాళ్లపై పక్షపాతం లేకుండా కఠినంగా వ్యవహరించేలా ఐసీసీ చట్టాల్లో మార్పులు రావాలి. ట్యాంపరింగ్‌ను చిన్న సమస్యగా తీసుకోకుండా, దోషులను కఠినంగా శిక్షించే జవసత్వాలను ఐసీసీ కూడగట్టుకోవాలి. ఆస్ట్రేలియాను అడ్డదారులు తొక్కకుండా నిలవరించాలి. క్రికెట్ స్టేడియంలు యుద్ధ భూములుగా మారడానికి, మ్యాచ్‌లు వ్యక్తిగత ప్రయోజనాల పోరాటాలుగా రూపుదిద్దుకోవడానికి కారణమైన ఆసీస్ పట్ల ఎప్పటి మాదిరిగానే ఉదాసీనతను ప్రదర్శిస్తే యావత్ క్రికెట్ ప్రపంచం భారీ మూల్యాన్ని చెల్లించుకోవాల్సి వస్తుంది. ఫిక్సింగ్ లేదా ట్యాంపరింగ్.. స్లెడ్జింగ్ లేదా బెట్టింగ్.. పేరు ఏదైనా ప్రతిదీ క్రికెట్‌కు పట్టిన చీడనే. దీన్ని సమూలంగా తుడిచేయాలి. ఆస్ట్రేలియా లేదా ఇంగ్లాండ్.. భారత్ లేదా దక్షిణాఫ్రికా.. దేశం ఏదైనా క్రికెట్ దోషులకు కఠిన శిక్షలు పడితీరాలి. ఐసీసీ ఎంత త్వరగా సంకెళ్లను తెంచుకొని, స్వయం ప్రతిపత్తితో నిర్ణయాలు తీసుకుంటుందో అంత వేగంగా అనేకాకనేక జాఢ్యాల నుంచి క్రికెట్ ప్రక్షాళన సాధ్యమవుతుంది. మిన్నువిరిగి నెత్తిన పడుతున్నా ఏ మాత్రం పట్టించుకోకుండా నిర్లక్ష్యం వహిస్తే మాత్రం క్రికెట్ పరువు పూర్తిగా బజారున పడుతుంది. తర్వాత దిద్దుబాటు చర్యలు తీసుకున్నా ఫలితం ఉండదు. ఈ మాత్రం ఇంగితం ఐసీసీకి ఉంటుందనే ఆశిద్దాం. క్రికెట్‌కు ‘జంటిల్మన్ గేమ్’ అన్న పేరు అతికినట్టు సరిపోవాలని కోరుకుందాం.